" శాసన్ కా బరమ్ కదర్ కరత్ నాహీ ఆమ్‌చ్యా మెహనతీచీ (మా కష్టాన్ని ప్రభుత్వం ఎందుకు మెచ్చుకోవట్లేదు)?" అని ప్రశ్నిస్తున్నారు అంగణ్‌వాడీ కార్యకర్త మంగళ్ కర్పే.
" దేశాలా నిరోగీ, సుదృఢ్ ఠేవన్యాత్ ఆమ్‌చా మోఠా హాత్‌భార్ లాగ్తో (దేశాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి మేం చాలా కృషి చేస్తున్నాం)", బాలింతల, గర్భవతుల, వారి పసిబిడ్డల కోసం రూపొందించిన రాష్ట్ర పథకాలను అమలుచేస్తున్న తన వంటి అంగణ్‌వాడీ కార్యకర్తల గురించి ప్రస్తావిస్తూ అన్నారామె..
ముప్పై తొమ్మిదేళ్ళ మంగళ్ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా, రాహతా తాలూకా డోర్‌హాళే అనే ఊరిలో అంగణ్‌వాడీ కేంద్రాన్ని నడుపుతున్నారు. ఆమెలాగే రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మంది మహిళలు అంగణ్‌వాడీ కార్యకర్తలుగానూ సహాయకులుగానూ పని చేస్తున్నారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ఏకీకృత శిశు అభివృద్ధి సేవల (ఐసిడిఎస్) కింద మొత్తంగా ఆరోగ్య, పోషక, ప్రారంభ అభ్యాస సేవలను వీరు అమలుచేస్తున్నారు.
రాష్ట్రం వారి పట్ల చూపిస్తున్న ఉదాసీనతను నిరసిస్తూ, డిసెంబర్ ఐదవ తారీఖున ప్రారంభమైన మహారాష్ట్రవ్యాప్త నిరవధిక నిరసనలో వందల సంఖ్యలో అంగణ్‌వాడీ కార్యకర్తలు పాల్గొంటున్నారు.
"ఇంతకుముందు కూడా మేం చాలాసార్లు నిరసనలు చేపట్టాం," అంటారు మంగళ్. "మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కావాలి. నెలకి 26000 [రూపాయలు] వేతనంగా ఇవ్వాలి. పదవీ విరమణ తరువాత మాకు పింఛన్లు, ప్రయాణ, ఇంధన ఖర్చులు ఇవ్వాలి," అంటున్నారావిడ, నిరసనకారుల ముఖ్యమైన డిమాండ్ల జాబితాను వివరిస్తూ.
నిరసన మొదలై మూడవ రోజున, ఈ కథనాన్ని ప్రచురించే సమయానికి కూడా, ప్రభుత్వం స్పందించకపోయేసరికి వందలాదిమంది కార్యకర్తలు డిసెంబర్ 8, 2023న షిర్డీ పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఊరేగింపు చేశారు.
"గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వమని [వారిని] కోరుకోవడంలో మేమేమైనా తప్పు చేస్తున్నామా?" అంటారు 58 ఏళ్ళ అంగణ్‌వాడీ కార్యకర్త, మందా రుకారే. తనకు 60 ఏళ్ళ వయసు దగ్గరపడుతుండడంతో ఆవిడ ఆందోళనపడుతున్నారు: "నేను కొన్ని సంవత్సరాలలో రిటైర్ అయిపోతాను. శారీరకంగా పనులేమీ చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు నన్ను ఎవరు చూస్తారు?" రాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లాలోనే రూయీ అనే ఊరిలో గత 20 సంవత్సరాలుగా మందా అంగణ్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. "నేను చేసిన సేవకు బదులుగా నాకు ఏ రకమైన సామాజిక భద్రత లభిస్తుంది?" అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం అంగణ్‌వాడీ కార్యకర్తలకు నెలకు 10,000 రూపాయల గౌరవ వేతనం, సహాయకులకు రూ. 5,500 వస్తుంది. "నేనీ ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు, నాకు రూ. 1,400 వచ్చేవి. సంవత్సరాలు గడిచేకొద్దీ అప్పటి [2005) నుంచి కేవలం 8600 రూపాయలే పెరిగాయి," అని మంగళ్ పేర్కొన్నారు.
మంగళ్, గవ్హాణే వస్తీ అంగణ్‌వాడీ లో 50 మంది పిల్లలను చూసుకుంటారు. వీరిలో 20 మంది ౩-6 ఏళ్ళ వయసున్న పిల్లలు. "ప్రతిరోజు తప్పనిసరిగా పిల్లలంతా కేంద్రానికి వచ్చేలా చూసుకోవాలి." అందుకని ఆమె తరచుగా తానే తన స్కూటర్ మీద పిల్లలను తీసుకొస్తుంటారు.
కానీ అంతటితో అయిపోలేదు. "వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని కూడా ఆమే వండుతారు. వారు, ప్రత్యేకించి పోషకాహార లోపం ఉన్న పిల్లలు, సక్రమంగా తింటున్నారో లేదో చూసుకుంటారు." అంతేకాక, ప్రతి బిడ్డ గురించి POSHAN ట్రాకర్ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటారు. ఇది చాలా శ్రమతోనూ, సమయంతోనూ కూడుకున్న పని.
"డైరీ, ఇతర స్టేషనరీ సామాన్లు, POSHAN యాప్ కొరకు ఇంటర్నెట్ రీఛార్జి, ఇంటింటికి తిరగడానికి పెట్రోల్ ఖర్చులు అన్ని మా జేబులోంచే ఖర్చుపెట్టాలి," అంటారు మంగళ్. "వచ్చే డబ్బు లోంచి పెద్దగా మిగిలేదేమీ ఉండదు."
పట్టభద్రురాలైన ఆమె గత పద్దెనిమిదేళ్ళుగా ఈ పనిలోనే ఉన్నారు. యుక్తవయసులో ఉన్న తన పిల్లలు - కొడుకు సాయి(20), కూతురు వైష్ణవి(18)లకు తల్లి తండ్రి తానే అయ్యి ఇంటిని నడుపుతున్నారు. సాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వైష్ణవి NEET పరీక్షకు సిద్ధపడుతోంది. "నా పిల్లలు అత్యుత్తమ చదువులు చదవాలి. మా సంవత్సరానికి అయ్యే ఖర్చు వేలల్లో (రూపాయలు) ఉంటుంది. రూ. 10,000తో ఇంటి ఖర్చులను సర్దుబాటు చేసుకోవటం కూడా కష్టం అవుతోంది," అంటారావిడ.
అందువలన మంగళ్ డబ్బు సంపాదించడానికి ఇతర మార్గాలను కూడా వెతుక్కోవాల్సి వచ్చింది. "నేను ఇంటింటికి వెళ్ళి వారికి జాకెట్లను, డ్రెస్‌లను కుట్టిపెట్టాల్సిన అవసరం ఉందేమో అడుగుతాను. లేదా ఎవరికైనా చిన్న చిన్న వీడియోలను ఎడిట్ చేసి పెడతాను, ఆంగ్లంలో దరఖాస్తు పారాలను నింపడంలో సహాయం చేస్తాను. ఏ చిన్న పనైనా సరే. ఇంక వేరే దారి లేదు కదా?" తానెందుకు పనుల కోసం వెతుక్కుంటుందో వివరించారావిడ.
అంగణ్‌వాడీ కార్యకర్తల కష్టాలు, ఆశా(ASHA)ల కష్టాలు ఒకేలా ఉంటాయి. (చదవండి: ఆరోగ్య అనారోగ్య సమయాల్లోనూ గ్రామాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే ఆశాలు ). ఇరువురూ ఆరోగ్య సేవలు, ప్రసవం, రోగనిరోధకత, పోషకాహారం నుండి మొదలుకొని క్షయవ్యాధి, కోవిడ్-19 వ్యాధి వంటి ప్రాణాంతక వ్యాధులను నిర్వహించడం వరకు ఆరోగ్య సేవలనూ, సమాచారాన్నీ అందించే ప్రాథమిక ప్రదాతలుగా పనిచేస్తారు.
కరోనా వ్యాధి, పోషకాహార లోపాలకు వ్యతిరేకంగా పోరాడడంలో అంగణ్‌వాడీ కార్యకర్తల, సహాయకుల సేవలు 'కీలకమైనవి', 'ముఖ్యమైనవి' అని ఏప్రిల్ 2022లో సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పులో గుర్తించింది. అర్హులైన అంగణ్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు 'సంవత్సరానికి 10 శాతం సాధారణ వడ్డీతో గ్రాట్యుటీకి అర్హులని’ కోర్టు నిర్దేశించింది.
జస్టిస్ అజయ్ రస్తోగి తాను విడిగా చేసిన వ్యాఖ్యలలో 'నోరులేని వారి ఉద్యోగ స్వభావానికి అనుగుణంగా మెరుగైన సేవా పరిస్థితులను అందించే విధానాలను కనుగొనవలసింది’గా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు.
మంగళ్, మందా, ఇంకా లక్షలాదిమంది అంగణ్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు దీని అమలు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
"ఈసారి మేం ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీని కోరుకుంటున్నాం. అప్పటివరకు మా సమ్మెను ఆపకుండా కొనసాగిస్తూనే ఉంటాం. ఇది మాకు రావలసిన గౌరవానికి సంబంధించినది. ఇది మా అస్తిత్వానికి సంబంధించినది," అంటారు మంగళ్.
అనువాదం: మైత్రి సుధాకర్