మధ్యాహ్నమవుతోంది. చక్కగా తయారైవున్న నర్తకి గొలాపి గోయరి, ఇంట్లో వేచి ఉన్నారు. బడి ఈడు అమ్మాయిలు ఎనిమిది మంది ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె తన దేహానికి చుట్టుకొన్న పసుపు చారల దొఖోనాను సర్దుకుంటున్నారు. ఆ అమ్మాయిలంతా అస్సామ్‌లోని బోడో సముదాయానికి చెందిన సంప్రదాయక దొఖోనాలను, ఎరుపు రంగు అర్నాయి (స్టోల్స్)లను ధరించారు.
"నేను ఈ చిన్నపాపలకు మా బోడో నృత్యాలను నేర్పుతున్నాను," అని బోడో సముదాయానికే చెందిన గొలాపి చెప్పారు. ఆమె బక్సా జిల్లా, గోల్‌గాఁవ్ గ్రామంలో నివసిస్తున్నారు.
బోడోలాండ్‌లోని బక్సాతోపాటు కోక్రాఝర్, ఉదాల్‌గురి, చిరంగ్ జిల్లాలను అధికారికంగా బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ (బిటిఆర్) అంటారు. స్వయంప్రతిపత్తి కలిగిన ఈ ప్రాంతంలో ఇతర మూలవాసులతో పాటు ప్రధానంగా అస్సామ్‌లో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసిన బోడో ప్రజలు నివసిస్తారు. బిటిఆర్ భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ పర్వత పాదాల దిగువన, బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది.
"వారు స్థానికంగా జరిగే పండుగలు, కార్యక్రమాలలో కూడా ప్రదర్శనలు ఇస్తారు," అని ముప్ఫై ఏళ్ళు నిండిన గొలాపి చెప్పారు. 2022 నవంబర్‌లో ఉపేంద్ర నాథ్ బ్రహ్మ ట్రస్ట్ (UNBT) ద్వారా 19వ యుఎన్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డును పొందిన PARI వ్యవస్థాపక సంపాదకుడు, పాత్రికేయుడు పి. సాయినాథ్ గౌరవార్థం ఒక ప్రదర్శనను నిర్వహించడానికి ఆమె తన ఇంటిని ఇచ్చారు.


