"ఇదుగో నీ బహుమతి," స్థానిక 'లబ్ధిదారు కమిటీ' సభ్యుడైన బిహారి లక్రా గుమ్లా జిల్లా, తెత్రా గ్రామ సర్పంచ్ తెరేసా లక్రాతో అన్నాడు. అలా అంటూ ఒక రూ. 5,000ను ఆమె చేతిలో కుక్కాడు. ఆ ‘బహుమతి’ 5000 రూపాయలని తెరేసాకు తెలియదు, ఆమె ఆ డబ్బును పొందనూ లేదు. ఎందుకంటే, అదే సమయంలో రాంచీ నుంచి వచ్చిన ఒక అవినీతి నిరోధక శాఖ బృందం ఆ సర్పంచ్‌ని సమీపించి, అవినీతి నివారణ చట్టం 1988 కింద, 'చట్టవిరుద్ధమైన లబ్ధి' ని అపేక్షించినందుకు ఆమెను అరెస్టు చేసింది.

ఈ చర్య ఉరాఁవ్ ఆదివాసీ తెగకు చెందిన 48 ఏళ్ళ తెరేసానూ, ఆమె పంచాయితీ ఉన్న బసియా బ్లాక్‌లోని 80,000 మందికి పైగా ప్రజలనూ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ప్రదేశానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంచీ నుంచి ఒక ఎసిబి బృందం - ఒక 5000 రూపాయల లంచం తీసుకున్నారనే కారణంతో అరెస్టు చేయడానికి - అక్కడికి రావటంలోని అసంబద్ధత గురించి ఎవరికీ ఆలోచన వచ్చినట్టు లేదు. ఒక ఎస్‌యువిలో అక్కడికి చేరడానికి నాకు రెండుగంటలకు పైనే పట్టింది. ఆ ఎసిబి బృందానికి ఆ ప్రదేశానికి వచ్చి పోవడానికి కనీసం 5 గంటల సమయం పట్టివుంటుంది. మిగిలిన ఖర్చులన్నీ పక్కనబెట్టినా ఆ లంచం సొమ్ములో కనీసం సగమైనా వారికి ఇందుకు ఖర్చయివుంటుంది.

అలాగే తోటి గ్రామ పంచాయతీ సభ్యులకు తెరేసాను తీసుకువెళ్ళిన ప్రదేశం - బసియా బ్లాక్ పంచాయితీ కార్యాలయం - ఆసక్తి ని కలిగించలేదు. ఆ తర్వాత వారే ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. తెరేసాను అరెస్టు చేసిన బృందం గురించి "నన్ను బసియా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళలేదు," అని ఆమె ఎత్తి చూపడం కూడా తక్కువ విచిత్రమేమీ కాదు. ఈ డ్రామా అంతా జరిగిన బ్లాక్ పంచాయతీ కార్యాలయం ఎదురుగానే కేవలం కొన్ని మీటర్ల దూరంలో పోలీస్‌స్టేషన్ ఉంది. అయినా, "వారు నన్ను అక్కడికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామ్‌దారా బ్లాక్‌లోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు."

ఇదంతా జరిగింది 2017 జూన్ నెలలో.

వెనక్కి తిరిగి చూసుకుంటే, 12వ తరగతి ఉత్తీర్ణురాలైన తెరేసాకు, “బసియా పోలీస్ స్టేషన్‌లో అందరికీ నేను తెలుసు. నేను నేరస్తురాలిని కాదని వాళ్ళందరికీ తెలుసు.” అని అర్థమయింది. ఆ తర్వాత ఆమె కేసు రాంచీలోని ప్రత్యేక కోర్టు ముందుకు వచ్చింది.

Teresa Lakra, sarpanch of the Tetra gram panchayat in Gumla district of Jharkhand
PHOTO • P. Sainath

ఝార్ఖండ్ రాష్ట్రం, గుమ్లా జిల్లాలోని తెత్రా గ్రామ పంచాయతీ సర్పంచ్ తెరేసా లక్రా

బెయిల్‌పై తిరిగి ఇంటికి రావటానికి ముందు తెరేసా లక్రా రెండు నెలల 12 రోజులపాటు జైలులో ఉన్నారు. ఆమె అరెస్టయిన మూడు రోజులలోనే ఆమెను సర్పంచ్ (ఝార్ఖండ్‌లో ముఖియా అని పిలుస్తారు) పదవి నుంచి సస్పెండ్ చేశారు. అదే సమయంలో పంచాయతీ పరిపాలనా అధికారం ఉప సర్పంచ్‌గా ఉన్న గోవింద బరాయిక్‌కు బదిలీ అయింది. తెరేసాను బసియా పంచాయితీ కార్యాలయానికి అత్యవసరంగా రమ్మని పదే పదే ఫోన్ చేసి పిలిచింది ఈ ఉప సర్పంచే.

ఆమె జైలులో ఉన్నకాలంలోనే అనేక లీజులపై, ఒప్పందాలపై సంతకాలయ్యాయి. అయితే అవి దేనికి సంబంధించినవనేది స్పష్టంగా లేదు.

*****

ఈ డ్రామా, ఆమె అరెస్టు తెరేసాకు, ఆమె భర్తకు, ఆమె ఇద్దరు కూతుళ్ళకు చాలా వేదనను కలిగించాయి. "మా పెద్దమ్మాయి సరిత (25)కు పెళ్ళయింది. ఆమె 12వ తరగతి వరకూ చదువుకుంది," అని తెరేసా మాతో చెప్పారు. ఇప్పుడు 12వ తరగతిలో ఉన్న చిన్నమ్మాయి ఏంజెలా (18) ఇంకా పై చదువులు చదవాలని అనుకుంటోంది. ఆ కుటుంబంలో తెరేసా భర్త రాజేశ్ లక్రా ఒక్కరే కాలేజీ చదువులు చదివారు. బి.కామ్. విద్యార్హత ఉన్నప్పటికీ, నగరానికి వలసపోకుండా తెత్రా గ్రామంలోనే వ్యవసాయం చేసుకోవాలని ఆయన, తెరేసా నిర్ణయించుకున్నారు.

పదవి నుంచి తొలగించడం, జైలుకు వెళ్ళటం ఎంతో బాధాకరమైనప్పటికీ ముఖియా పదవిని పోగొట్టుకున్న తెరేసా తన పోరాటాన్ని వదులుకోలేదు. "నేను సర్వనాశనమయ్యాను. చాలా విచారపడ్డాను," అన్నారామె. అయితే తనపై కుట్ర జరిగిందనే ఆమె నమ్మకం, జైలు నుంచి బయటికొచ్చాక ఆమెని దృఢంగా నిలబెట్టింది.

"చట్టవిరుద్ధంగా నన్ను పదవి నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ నేను పోరాడాను," అంటూ తెత్రా గ్రామంలో అదే పేరుతో ఉన్న గ్రామ పంచాయతీలో ఆమె నాతో చెప్పారు. తీర్పు ఇవ్వటం అటుంచి, కోర్టు కార్యకలాపాలు కూడా ఇంకా మొదలవ్వకముందే ఆమెను పదవి నుంచి తప్పించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందుకు తన సమస్యను తీసుకువెళ్ళిన తెరేసా, తనను చట్టవిరుద్ధంగా తప్పించడాన్ని ప్రతిఘటిస్తూ రాంచీలోని అధికార యంత్రాంగాన్ని ఎదుర్కొన్నారు.

"నెలల తరబడి ఎస్ఇసి, ఇంకా ఇతర కార్యాలయాలకు 12-14 సార్లు తిరిగాను. అందుకు నాకు చాలా డబ్బు ఖర్చయింది," అన్నారు తెరేసా. అయితే, ఎప్పటిలా ఆలస్యం అయినప్పటికీ, కనీసం ఆమెకు జరిగిన విషాదం కోణంలో చూసినా, న్యాయం మాత్రం జరిగింది. ఇది జరగడానికి ఆమెకు ఏడాదికి పైగా పట్టింది, కానీ తన ముఖియా పదవిని తిరిగి పొందేలా ఉత్తర్వులు వచ్చాయి. ఆమె జైలులో ఉన్న సమయంలో అధికారాన్ని చెలాయించిన గోవింద బరాయిక్ స్థాయిని కిందికి తగ్గించేశారు.

ఇందుకు అయిన ఖర్చులన్నిటినీ ఐదెకరాల వర్షాధార భూమి ఉన్న ఆ కుటుంబమే భరించింది. ఆ భూమి ద్వారా వారికి ఏడాదికి 2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం రాదు. మార్కెట్‌లో అమ్మ డం కోసం వారు తమ పొలంలో ధాన్యం, రాగి, మినుములు పండిస్తారు. ఇవి కాక వేరుసెనగ, మొక్కజొన్న, బంగాళాదుంపలు, ఉల్లిపాయలను తమ సొంత వాడకానికి పండిస్తారు.

Lakra has fought the bribery allegations with her own limited resources.
PHOTO • P. Sainath
Lakra has fought the bribery allegations with her own limited resources. With her are other women (right) from Tetra village, gathered at the village middle school building
PHOTO • Purusottam Thakur

లంచం తీసుకున్నారని తనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా లక్రా తమకున్న పరిమితమైన వనరులతోనే పోరాడారు. తెత్రా గ్రామంలోని మాధ్యమిక పాఠశాల భవనం వద్ద ఆమెతో ఆ గ్రామ మహిళలు (కుడి)

అయితే ఆమె అక్రమ తొలగింపు జరిగి ఏడాదికి పైగా అయిన తర్వాత ఎస్ఇసి నుండి ఉత్తర్వులు తెచ్చుకోవటం నిజంగా ఒక విజయమే.

"ఈ ఉత్తర్వులపై బసియా బ్లాక్ అభివృద్ధి అధికారి (బిడిఒ) చాలా వేగంగా చర్యలు తీసుకున్నారు. ఎస్ఇసి ఉత్తర్వుల ప్రకారం ఒక వారంలోపే నేను ముఖియా పదవిలోకి తిరిగి వెళ్ళాను," అన్నారు తెరేసా చిన్న చిరునవ్వుతో. ఇది 2018, సెప్టెంబర్ ప్రాంతాల్లో జరిగింది.

వాస్తవానికి ఈ కుట్రనుంచి బయటపడిన తెరేసా మొత్తమ్మీద సుమారు ఏడేళ్ళ పాటు ముఖియా పదవిలో ఉన్నారు. కోవిడ్-19 విరుచుకుపడే సమయానికి ఆమె ఐదేళ్ళ పదవీకాలం ముగియబోతోంది. కోవిడ్ సమయంలో పంచాయతీ ఎన్నికలు నిలిచిపోవడంతో సుమారు ఐదువేలమంది జనాభా కలిగిన తెత్రా గ్రామ పంచాయతీకి ముఖియా గా ఆమె పదవీకాలం మరో రెండేళ్ళు పెరిగింది. మధ్యలో ఏడాదిపాటు రాజకీయంగా ఆమె చిక్కుల్లో ఉన్నప్పటికీ, ఏడేళ్ళపాటు ముఖియా గా ఉన్న వ్యక్తిగా ఆమె పేరు అధికారిక రికార్డుల్లో నమోదైంది.

తన పంచాయతీలోని సొలాంగ్‌బిరా గ్రామం దగ్గరలో ఉన్న ఒక కొండను పలుగురాళ్ళ కోసం పగులగొట్టి నాశనం చేసేందుకు లీజును కోరుతూ ఒక పెద్ద కాంట్రాక్టర్ తనకు ఇవ్వజూపిన 10 లక్షల రూపాయల లంచాన్ని తిప్పికొట్టినదానిగా తెరేసా ఆ పంచాయతీ మొత్తంగా తెలుసు. కానీ ఆమె 5000 రూపాయలు లంచంగా తీసుకున్నదనే ఆరోపణలపై కొన్నాళ్ళు జైలులో ఉన్నారు.

*****

తెరేసా అరెస్టులో కుతూహలం కలిగించే ఎన్నో విషయాలున్నాయి. అది ముందే నిర్ణయించుకున్న వ్యూహం కానట్లయితే, లంచం ఇవ్వాలనుకున్నవాడు బాహాటంగా డబ్బు ఎందుకివ్వాలనుకుంటాడు? ఎక్కడో వేరేచోట పనిలో తలమునకలుగా ఉన్న ఆమెను వెంటనే బ్లాక్ పంచాయత్ కార్యాలయానికి రమ్మని ఉప సర్పంచ్ గోవింద బారాయక్‌తో సహా ఆమెతోటి పంచాయతీ సభ్యులు, ఆమెకు అన్నిసార్లు ఎందుకు కాల్ చేశారు? అని ఆమె అడుగుతున్నారు.

అయితే, ఈ ‘లంచం’ దేనిగురించి?

"ఇక్కడ చాలా ఘోరమైన స్థితిలో ఉన్న ఒక అంగన్‌వాడీ (గ్రామీణ తల్లుల పిల్లల కేంద్రం) ఉండేది. నిధులు కేటాయించి ఉండటం చూసి, దానికి మరమ్మత్తులు చేయించాను," అన్నారు తెరేసా. ఇటువంటి అన్ని విషయాలతో, ఈ అంగన్‌వాడీ మరమ్మత్తుల ప్రాజెక్ట్ చుట్టూ ఒక 'లబ్దిదారు కమిటీ' వచ్చి చేరింది. "ఈ బిహారీ లక్రా ఆ కమిటీలో ఒక సభ్యుడు. మరమ్మత్తులు పూర్తయాక ఇంకా మిగిలిన 80,000 రూపాయలను అతను మాకు తిరిగి ఇవ్వాల్సివుంది. బసియా బ్లాక్ పంచాయతీకి వెంటనే రావాల్సిందిగా గోవింద్ బరాయిక్ నాకు ఎడతెగకుండా ఫోన్లు చేయటంతో నేను అక్కడికి వెళ్ళాను."

డబ్బులను తెత్రా గ్రామపంచాయతీలో కాకుండా బసియా బిపి కార్యాలయంలో  తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేగాక, బిహారీ లక్రా తనను సమీపిస్తున్నపుడు ఆమె కార్యాలయం లోపలికి కూడా ప్రవేశించలేదు. ఆ విధంగానే వేలిముద్రలు పడటానికి వీలుగా పౌడర్ చల్లిన 5,000 రూపాయలను ఆమె చేతిలో కుక్కటమనే నాటకం మొదలయింది. ఇక అప్పటినుంచి తెరేసా పీడకల ప్రారంభమైంది.

Teresa is known across the panchayat for having turned down a 10-lakh-rupee bribe from a big contractor seeking to lease and destroy a nearby hillock in Solangbira village in her panchayat for rock chips
PHOTO • Purusottam Thakur

తన పంచాయతీలోని సొలాంగ్‌బిరా గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక కొండను పలుగురాళ్ళ కోసం పగులగొట్టి నాశనం చేసేందుకు లీజును కోరుతూ ఒక పెద్ద కాంట్రాక్టర్ తనకు ఇవ్వజూపిన 10 లక్షల రూపాయల లంచాన్ని తిప్పికొట్టినదానిగా తెరేసా ఆ పంచాయతీ మొత్తంగా తెలుసు

ఏది ఏమైనప్పటికీ, ఆ 'లంచం' కుంభకోణం మరొక పట్టని లంచానికి దారితీసినట్టుగా కనిపిస్తోంది.

తాను ఇంతకుముందు ఆ పెద్ద కంట్రాక్టర్ నుంచి భారీ మొత్తం లంచాన్ని తిరస్కరించిన సంఘటన ఇప్పటి ఈ సంఘటనకు నేపథ్యంగా ఉన్నట్టు తెరేసా గుర్తించారు. తన తోటి పంచాయత్ సభ్యులను ఈ విషయంలో ఆమె తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా పలుకుబడి ఉన్న చాలా శక్తివంతుడైన రాజకీయ నాయకుడితో ఆ కాంట్రాక్టర్‌కున్న సంబంధాలు ఆమె మరిన్ని వివరాలు చెప్పకుండా జాగ్రత్తపడేలా చేస్తున్నట్టుంది.

"అప్పుడు రోడ్లు వేయటం వంటి పెద్ద ప్రాజెక్ట్ ఉండేది. మా ప్రాంతంలోని ఒక కొండను వాళ్ళు పలుగురాళ్ళ కోసం పగులగొడుతుండటంతో, అందుకు వ్యతిరేకంగా నేను ప్రజలను కదిలించాను. అలా చేయకపోయినట్లయితే, ఆ కొండ మొత్తాన్నీ వాళ్ళు నాశనంచేసి ఉండేవాళ్ళు. నేనలా జరగనివ్వలేను," అన్నారు తెరేసా. ఒక సమయంలో వాళ్ళు తాము గ్రామ సభ నుంచి అనుమతి తీసుకున్నట్లుగా చూపించే ఒక పత్రాన్ని పట్టుకొని ఆమె దగ్గరకు వచ్చారు కూడా.

"ఆ పత్రాల మీద బోలెడన్ని సంతకాలున్నాయి. అందులో కొన్ని చదువురానివారివి, తమ పేరును సంతకంగా పెట్టడం కూడా రానివారివి," నవ్వుతూ చెప్పారామె. అది మొత్తంగా ఒక అబద్ధపు దస్తావేజు. కానీ మాకు ఆశ్చర్యంవేసింది. ముఖియా లేకుండా వాళ్ళు గ్రామ సభ ను ఎలా నిర్వహించగలిగారు? ఆమె కదా సభను పిలవాల్సింది?

అప్పుడు ఆ ప్రాంతాలలో పనిచేసే సన్నీ అనే ఒక సంఘసేవకుడు మేం PESA  ప్రదేశంలో ఉన్నామనే విషయాన్ని గుర్తుచేశారు. అంటే షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయితీ విస్తరణ చట్టం, 1996 (Panchayat Extension to Scheduled Areas Act, 1996) పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో ఉన్నామని. "ఇక్కడ గ్రామ సభ ను గ్రామ సంప్రదాయపు పెద్ద పిలవవొచ్చు." అని అతను పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ అది  దొంగ పత్ర మని తెరేసా దాన్ని తిరస్కరించారు.

ఆ తర్వాత వచ్చింది, ఆ పెద్ద కాంట్రాక్టర్ అనుచరుల నుండి పది లక్షల రూపాయల నిజమైన లంచం ప్రతిపాదన. తెరేసా దానిని తిప్పికొట్టడంతో, ఆమెను కొనెయ్యగలమనే తమ ఆలోచన పారనందుకు వారు ఖంగుతిన్నారు.

అది జరిగిన మూడు నాలుగు నెలలకే ఈ 'లంచం' కుంభకోణం తెరపైకి వచ్చింది. ఇదంతా ముగిసేసరికి, ఆ కాంట్రాక్టర్ రెండు కొండల్లో తాను కోరుకున్న కొండను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, నిరాడంబరమైన లేదా సంప్రదాయ స్వభావం కలిగిన బహుమతిని తాను స్వీకరించి ఉండేదాన్నని తెరేసా ఒప్పుకున్నారు. "నేనెప్పుడూ డబ్బును కోరలేదు. ఇక్కడ ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లలో, ఈ బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడమనేది ఉంది. నేను కూడా అలాంటిదాన్ని అంగీకరించి ఉండేదాన్ని," అని ఆమె పూర్తి నిజాయితీతో చెప్పారు. ఇది కేవలం ఝార్ఖండ్‌లోనే అని కాదు, అలాంటి బహుమతులతో లావాదేవీలు ముడిపడి ఉంటాయి. బహుమతి స్వభావం మారవచ్చు, కానీ దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఈ ఆచారం ఉంది. ఏ రకమైన బహుమతులను అంగీకరించని ముఖియాలు , పంచాయతీ సభ్యులు ఉన్నారు. కానీ అటువంటివారు ఎక్కువమంది ఉండరు.

తనను కుట్రతో ఇరికించినవారిపై ఆమె చేసిన పోరాటాన్ని అటుంచితే, తెరేసా లక్రా సమస్యలు ఇంకా సమసిపోలేదు. ఆమెను ఇరికించిన ఆరేళ్ళ తర్వాత కూడా ఆమె వనరులనూ శక్తినీ ఖాళీ చేస్తూ ఈ లీగల్ కేసు కొనసాగుతూనే ఉంది. ఆమెకు సహాయం అవసరం. అయితే, అది ఎక్కడినుంచి వస్తుందనే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం.

బహుమతులతో వచ్చే కాంట్రాక్టర్ల పట్ల జాగ్రత్తగా ఉండటం ఆమె నేర్చుకోవాలి.


ముఖచిత్రం: పురుషోత్తం ఠాకూర్

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

P. Sainath

ପି. ସାଇନାଥ, ପିପୁଲ୍ସ ଆର୍କାଇଭ୍ ଅଫ୍ ରୁରାଲ ଇଣ୍ଡିଆର ପ୍ରତିଷ୍ଠାତା ସମ୍ପାଦକ । ସେ ବହୁ ଦଶନ୍ଧି ଧରି ଗ୍ରାମୀଣ ରିପୋର୍ଟର ଭାବେ କାର୍ଯ୍ୟ କରିଛନ୍ତି ଏବଂ ସେ ‘ଏଭ୍ରିବଡି ଲଭସ୍ ଏ ଗୁଡ୍ ଡ୍ରଟ୍’ ଏବଂ ‘ଦ ଲାଷ୍ଟ ହିରୋଜ୍: ଫୁଟ୍ ସୋଲଜର୍ସ ଅଫ୍ ଇଣ୍ଡିଆନ୍ ଫ୍ରିଡମ୍’ ପୁସ୍ତକର ଲେଖକ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ପି.ସାଇନାଥ
Photographs : P. Sainath

ପି. ସାଇନାଥ, ପିପୁଲ୍ସ ଆର୍କାଇଭ୍ ଅଫ୍ ରୁରାଲ ଇଣ୍ଡିଆର ପ୍ରତିଷ୍ଠାତା ସମ୍ପାଦକ । ସେ ବହୁ ଦଶନ୍ଧି ଧରି ଗ୍ରାମୀଣ ରିପୋର୍ଟର ଭାବେ କାର୍ଯ୍ୟ କରିଛନ୍ତି ଏବଂ ସେ ‘ଏଭ୍ରିବଡି ଲଭସ୍ ଏ ଗୁଡ୍ ଡ୍ରଟ୍’ ଏବଂ ‘ଦ ଲାଷ୍ଟ ହିରୋଜ୍: ଫୁଟ୍ ସୋଲଜର୍ସ ଅଫ୍ ଇଣ୍ଡିଆନ୍ ଫ୍ରିଡମ୍’ ପୁସ୍ତକର ଲେଖକ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ପି.ସାଇନାଥ
Photographs : Purusottam Thakur

ପୁରୁଷୋତ୍ତମ ଠାକୁର ୨୦୧୫ ର ଜଣେ ପରି ଫେଲୋ । ସେ ଜଣେ ସାମ୍ବାଦିକ ଏବଂ ପ୍ରାମାଣିକ ଚଳଚ୍ଚିତ୍ର ନିର୍ମାତା । ସେ ବର୍ତ୍ତମାନ ଅଜିମ୍‌ ପ୍ରେମ୍‌ଜୀ ଫାଉଣ୍ଡେସନ ସହ କାମ କରୁଛନ୍ତି ଏବଂ ସାମାଜିକ ପରିବର୍ତ୍ତନ ପାଇଁ କାହାଣୀ ଲେଖୁଛନ୍ତି ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ପୁରୁଷୋତ୍ତମ ଠାକୁର
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Sudhamayi Sattenapalli