“ఎవరు గెలుస్తారనేది ఏం ముఖ్యం? అది ఐపిఎల్ అయితే ఏంటి, ప్రపంచకప్ అయితే ఏంటి?’’
క్రికెట్ దాదాపు మతంగా ఉన్న దేశంలో, మదన్ ఈ ప్రశ్న చాలా అపచారం.
దానికి కొనసాగింపుగా ఆయన, “ కోయి భీ జీతే, హమేఁ కామ్ మిల్ జాతా హై (ఎవరు గెలిచినా మాకు పని దొరుకుతుంది),” అన్నారు. 51 ఏళ్ల మదన్, క్రికెట్ బంతులు తయారుచేస్తారు. మీరట్ నగరంలో మెరిసిపోయే ఎరుపు, తెలుపు బంతులను తయారుచేసే అనేక యూనిట్లలో అతనిదీ ఒకటి.
అది మార్చి నెల. అతని చుట్టూ దాదాపు 100 పెట్టెలు ఉన్నాయి, ఒక్కొక్క దానిలో ఆరు తోలు బంతులున్నాయి. నిర్విరామంగా జరగబోతోన్న పురుషుల క్రికెట్ సీజన్‌కు అవి సిద్ధంగా ఉన్నాయి. రెండు నెలల పాటు జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్‌లోని మొదటి బంతి మార్చి చివరిలో బౌలింగ్‌తో ప్రారంభమవుతుంది. దాని తర్వాత జూన్‌లో ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ జరుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్లలో జరిగే వన్డే ఇంటర్నేషనల్ (ఒడిఐ) ప్రపంచ కప్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
"బంతిని ఏ స్థాయిలో ఉపయోగిస్తారు, బంతితో ఎవరు ఆడతారు, ఎన్ని ఓవర్లు ఆడతారు అనేది (బంతి) నాణ్యతను బట్టి నిర్ణయిస్తారు," అని మదన్ చెప్పారు.
"పెద్దపెద్ద టోర్నమెంట్లు జరగబోయే ముందు, క్రీడా పరికరాలను చిల్లరగానూ టోకుగానూ అమ్మే వ్యాపారులు చాలా ముందుగానే మా దగ్గరకు వస్తారు," అంటూ అతను ఈ ఆటపై మొత్తం దేశానికంతా ఉన్న అతి అభిమానాన్ని గురించి నొక్కి చెప్తూ అన్నారు. "రెండు నెలల ముందు నుంచే భారీగా గిరాకీ పెరుగుతుంది, పెద్ద నగరాల్లో ఉండే దుకాణాలు కావాలనుకున్న సమయానికి బంతులను నిలువ ఉంచుకోవాలని కోరుకుంటాయి." ఆట ఎవరు ఆడుతున్నారు, ఎంత పందెం వేస్తున్నారు అనేదానిపై ఆధారపడి బంతి ధర రూ. 250 నుంచి రూ. 3,500 వరకు ఉంటుంది.
మదన్‌కి ముంబై, అహ్మదాబాద్, బరోడా, జైపూర్, బెంగళూరు, పుణేలోని క్రికెట్ అకాడమీలు, పంపిణీదారులు, చిల్లర వ్యాపారుల నుండి నేరుగా ఆర్డర్లు వస్తాయి. అతని యూనిట్లో తయారుచేసిన బంతులను ఆట దిగువ స్థాయిలో ప్రాక్టీస్‌లోనూ మ్యాచ్‌లలోనూ ఉపయోగిస్తారు.
మేం అతని కార్ఖానాలో ఉన్నాం, చిన్నగా, కొద్దిగా వంపు తిరిగిన డిస్ప్లే ఉన్న ఒక టివిలో క్రికెట్ మ్యాచ్ లైవ్‌లో వస్తోంది. దాని స్క్రీన్ నిశ్శబ్దంగా పనిచేసుకుంటున్న ఎనిమిది మంది కారీగర్ల (కార్మికులు) వైపుకు తిరిగి ఉంది. కానీ వాళ్ళు మ్యాచ్‌ను కేవలం వింటారంతే, వాళ్ళ కళ్ళన్నీ పని మీదే ఉన్నాయి: " హమేఁ అభీ బిల్కుల్ ఫుర్సత్ నహీ హై (మాకిప్పుడు కొంచెం కూడా ఖాళీ సమయం లేదు)," అని మదన్ చెప్పారు.
మధ్యస్థమైన నాణ్యత కలిగిన 600 రెండు-ముక్కల క్రికెట్ బంతుల ఆర్డర్ కోసం వాళ్ళు ఇనుప బందులపైకి వంగి, అమిత కష్టమైన కుట్టుపనిలో నిమగ్నమై ఉన్నారు. వాటిని కొనుగోలు చేస్తున్నది జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందినవారు, మూడు రోజుల్లో వారికి ఈ బంతులను పంపించేయాలి.
రవాణాకు సిద్ధంగా ఉన్న మెరిసే ఎర్రటి బంతుల్లోంచి ఒకదానిని మదన్ చేతిలోకి తీసుకున్నారు. “బంతి తయారీకి మూడు పదార్థాలు అవసరం. పై కవర్ కోసం పటికతో శుద్ధిచేసిన చర్మం, బెండుతో చేసిన లోపలి భాగం ( గోలా ), కుట్టడానికి నూలు దారం.” ఈ మూడూ మీరట్ జిల్లాలో స్థానికంగా అందుబాటులో ఉంటాయి. "కొనేవాళ్లు వాళ్ళకు ఎటువంటి నాణ్యత కలిగిన బంతులు కావాలో మాకు చెప్తారు, దానికి తగ్గట్లుగా మేం తోలునూ బెండునూ ఎంచుకుంటాం."
జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మరియు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రం (డిఐపిఇడిసి) అంచనా ప్రకారం మీరట్‌లో 347 క్రికెట్ బంతులను తయారుచేసే యూనిట్లు పనిచేస్తున్నాయి. వాటిలో పారిశ్రామిక ప్రాంతాలలో ఉన్న పెద్ద కర్మాగారాలు; మీరట్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ నివాస ప్రాంతాలలో ఉన్న చిన్న ఉత్పత్తి యూనిట్లు కూడా ఉన్నాయి.
అయితే, ఈ లెక్కలో అనేకచోట్ల చెల్లాచెదురుగా ఉన్న అసంఘటిత ఉత్పత్తి కేంద్రాలను, మొత్తం బంతులను తయారుచేసే, లేదా ఒక పనిని అవుట్సోర్స్ చేసే గృహ యూనిట్లను కలపలేదు. వీటిలో మీరట్ జిల్లావ్యాప్తంగా ఉన్న జంగేఠి, గగౌల్, భావన్‌పుర్ వంటి గ్రామాలు ఉన్నాయి. " ఆజ్ గాఁవోఁ కే బినా బిల్కుల్ పూర్తి నహీఁ హోగీ మీరట్ మే (ఈ రోజు గ్రామాలే లేకుంటే మీరట్‌లో క్రికెట్ బంతుల సరఫరా ఎంతమాత్రం ఉండదు)," అని మదన్ అన్నారు.
"క్రికెట్ బంతులను తోలుతో తయారుచేస్తారు కాబట్టి గ్రామాలలోని చాలామంది కారీగర్లు , నగరంలోని పెద్ద కర్మాగారాల్లో కూడా జాటవలే వీటిని తయారుచేస్తారు," అని అతను వివరించారు. 1904 జిల్లా గెజిటీర్ ప్రకారం, మీరట్‌లోని తోలు పరిశ్రమలో జాటవ లేదా చమార్ (ఉత్తర్ ప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉంది) సముదాయానికి చెందినవారే ఎక్కువగా పనిచెస్తున్నారు. "జనాలకు క్రికెట్ బాల్ రూపంలో ఉండే తోలుతో సమస్య లేదు, కానీ ఆ తోలుతో పనిచేయాల్సివస్తే మాత్రమే సమస్య ఉంటుంది," అని అతను చెప్పారు.
మదన్ కుటుంబానికి శోభాపుర్‌లో చర్మశుద్ధి కర్మాగారం ఉంది. ఇక్కడ మాత్రమే క్రికెట్ బంతుల తయారీ పరిశ్రమ కోసం చర్మాన్ని పటికతో శుద్ధిచేయడం జరుగుతుంది (చదవండి: ఇంకా పట్టు కొనసాగిస్తోన్న మీరట్ చర్మకారులు ). "పటికతో శుద్ధిచేసిన తోళ్ళకు పెరుగుతున్న గిరాకీని చూసి, క్రికెట్ బంతులకు ఎప్పటికీ గిరాకీ తగ్గదని నేను గ్రహించాను," అని అతను చెప్పారు. ఆశాజనకంగా ఉన్న మార్కెట్ అతన్ని 20 సంవత్సరాల క్రితమే మెస్సర్స్ బి.డి. అండ్ సన్స్‌ని ప్రారంభించడానికి పురికొల్పింది. ఆ ప్రాంతంలో ఉన్న రెండు క్రికెట్ బంతుల తయారీ యూనిట్లలో ఇది ఒకటి.
బంతిని తయారుచేయడంలో అనేక ప్రక్రియలు ఉన్నందువల్ల, ఒక బంతిని చేయడానికి ఎన్ని గంటల సమయం అవసరమో ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని మదన్ చెప్పారు. సీజన్‌ని బట్టి, తోలు నాణ్యతను బట్టి కూడా దానికి పట్టే సమయం ఆధారపడివుంటుంది. " దో హఫ్తే లగ్తే హైఁ ఏక్ గేంద్ కో తయ్యార్ హోనే మేఁ కమ్ సే కమ్ (ఒక బంతిని తయారుచేయడానికి కనీసం రెండు వారాలు పడుతుంది)," అని అతను చెప్పారు.
మదన్ యూనిట్‌లోని కార్మికులు మొదట పటికతో చర్మాన్ని శుద్ధిచేస్తారు. దానికి ఎరుపు రంగు వేసి, ఎండలో ఆరబెట్టి, దానికి మైనం లేదా జంతువుల కొవ్వును పట్టించి, ఆపై దానిని మెత్తగా చేయడానికి చెక్క సుత్తితో బాదుతారు. “తెల్లని బంతులు చేయడానికి పటికతో శుద్ధిచేసిన చర్మం అప్పటికే తెల్లగా ఉంటుంది కాబట్టి వాటికి రంగులు వేయాల్సిన అవసరం ఉండదు. ఆవు పాలతో చేసిన పెరుగు వాటికి గ్రీజుగా ఉపయోగపడుతుంది," అని మదన్ వివరించారు.
" లైన్ సే కామ్ హోవే హై ఔర్ ఏక్ కారీగర్ ఏక్ హీ కామ్ కరే హై (పనులు వరుసగా ఉంటాయి, ఒక్కో కార్మికుడు ప్రత్యేకించి ఒక పని మాత్రమే చేయాలి)," అని ఆయన వివరించారు. ఆ ప్రత్యేకమైన పనికి కేటాయించిన కారీగర్ తోలును రెండు గుండ్రని ముక్కలుగా గానీ, లేదా నాలుగు అండాకారంలోని ముక్కలుగాగానీ కత్తిరిస్తారు. క్రికెట్ బంతులను రెండు లేదా నాలుగు తోలు ముక్కలతో తయారుచేస్తారు.
"ఈ ముక్కలన్నీ ఒకే మందంతో ఉండాలి, వెంట్రుకల కణాలు కూడా ఒకే విధంగా ఉండాలి," అని మదన్ చెప్పారు. " ఇస్ వక్త్ ఛాంట్నే మేఁ గల్తీ హో గయీ, తో సమఝ్లో కి గేంద్ డీషేప్ హోగా హీ (ఈ దశలో వర్గీకరించడంలో పొరపాటు జరిగితే, ఖచ్చితంగా బంతి ఆకారం చెడిపోతుందని అర్థంచేసుకోవాలి)," అన్నారతను.
బంతి తయారీ ప్రక్రియలో అత్యంత నైపుణ్యం అవసరమైన పని ఏమిటంటే, తోలు ముక్కల చివరలకు నూలు దారంతో చేతి కుట్టు వేయడం. ఈ దారాలకు చివర బిరుసుగా ఉండే పంది వెంట్రుకలు అతికించి ఉంటాయి. "పంది వెంట్రుకలకు వంగే గుణం ఉంటుంది, బలంగా ఉంటాయి, తోలును చింపేంత పదునుగా ఉండవు కాబట్టి సూదులకు బదులుగా వాటిని ఉపయోగిస్తారు," అని మదన్ చెప్పారు. "అవి పొడవుగా ఉంటాయి, సులువుగా పట్టుచిక్కుతాయి, కుట్టేవాళ్ళ వేళ్ళకు కూడా ఎటువంటి గాయాలు కావు."
“ లేకిన్ సిర్ఫ్ ఇసీ చీజ్ కీ వజహ్ సే హమారే ముసల్మాన్ భాయ్ యే కామ్ నహీఁ కర్ సక్తే. ఉన్కో సువర్ సే దిక్కత్ హోతీ హై నా (కేవలం ఈ కారణం వల్లనే మా ముసల్మాన్ సోదరులు ఈ పనిని చేయరు. వారికి పందులతో సమస్య ఉంది కదా)," అని అతను చెప్పారు.
"నాలుగు ముక్కలతో బంతిని తయారుచేయడానికి అవసరమయ్యే మూడు రకాల కుట్లు వేయడంలో నైపుణ్యం సాధించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది" అని మదన్ యూనిట్లో బంతులను తయారు చేయడంలో అత్యంత అనుభవజ్ఞుడైన ధరమ్ సింగ్ చెప్పారు. 50 ఏళ్ళ వయసున్న ఆయన జమ్ము-కశ్మీర్‌కు చెందిన క్లయింట్ ఆర్డర్లో భాగంగా చేస్తున్న బంతులపై వార్నిష్‌ను పూస్తున్నారు. " కారీగర్ ఒక రకమైన కుట్టు నుంచి మరొక నైపుణ్యమైన కుట్టుని నేర్చుకున్నప్పుడు, అతని కూలీ రేటు కూడా పెరుగుతుంది," అన్నారు ధరమ్. నైపుణ్యమైన ప్రతి కుట్టుకు ప్రత్యేకమైన సాంకేతికత, ప్రత్యేక పనితీరు అవసరం .
మొదట, రెండు అండాకారపు తోలు ముక్కలను లోపలి కుట్టు వేసి కలిపి, ఒక అర్ధగోళంగా లేదా కప్పులా తయారు చేస్తారు, దీనిని స్థానికంగా పీస్ (ముక్కలు) జుడాయి (జోడించడం) అంటారు. మొదటి కుట్టును సాధారణంగా అప్పుడప్పుడే పని నేర్చుకుంటున్నవాళ్ళు కుడతారు. వాళ్ళు కుట్టిన ప్రతి అర్ధగోళానికి రూ. 7.50 సంపాదిస్తారు. "పీస్ జుడాయి తర్వాత ఆ కప్పుల లోపల లప్పే అని పిలిచే సన్నని తోలు ముక్కలతో బలంగా ఉండేలా చేస్తారు," అని ధరమ్ వివరించారు. అలా బలంగా చేసిన తోలు అర్ధగోళాలను గోళాయ్ యంత్రం అచ్చులో వేసి గుండ్రంగా చేస్తారు.
బంతిలా తయారుకావడానికి మధ్యలో బాగా అణచిపెట్టిన గుండ్రని బెండును ఉంచి, రెండు వైపుల నుండి ఏకకాలంలో కుట్లు వేసి రెండు అర్ధగోళాలను కలుపుతారు. దీనిని కప్ జుడాయి అంటారు. కప్ జుడాయి చేసినందుకు వేతనం రూ. 17-19 ఉంటుంది. రెండు ముక్కల బంతులకు కూడా కప్ జుడాయి చేతి కుట్లు వేస్తారు.
"రెండో కుట్టు పూర్తయ్యాకే, బంతి ( గేంద్ ) అనే పదాన్ని ఉపయోగిస్తారు," ధరమ్ చెప్పారు. " పహలీ బార్ చమ్రా ఏక్ గేంద్ కా ఆకార్ లేతా హై (తోలు మొదటిసారిగా బంతి ఆకారాన్ని తీసుకుంటుంది).
ధరమ్ సుమారు 35 సంవత్సరాల క్రితం సూరజ్ కుండ్ రోడ్‌లోని ఒక కర్మాగారంలో బంతులను తయారుచేసే కళను నేర్చుకున్నారు. అక్కడ 1950లలో క్రీడా వస్తువుల తయారీ ప్రారంభమైంది. విభజన తరువాత సియాల్కోట్ (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) నుండి వచ్చిన నిర్వాసితులు, మీరట్‌లోని సూరజ్ కుండ్ రోడ్, విక్టోరియా పార్క్ చుట్టూ ఉన్న క్రీడా కాలనీలలో పునరావాసం పొంది, క్రీడా పరికరాల పరిశ్రమను స్థాపించారు. "మీరట్ చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు నగరానికి వెళ్లి, ఆ కళను నేర్చుకుని, దానిని గ్రామాలకు తీసుకువెళ్ళారు. "
నాలుగు ముక్కల బంతి తయారీలో మూడవ దశ కుట్టు చాలా కీలకం. బంతి పైన నాలుగు సమాంతర వరుసల బంతికుట్లు ( గేంద్ సిలాయి ) చిక్కగా కుట్టడం అవసరం. "మంచి రకం బంతుల్లో సుమారు 80 కుట్లు ఉంటాయి," అని అతను చెప్పారు. కుట్ల సంఖ్యను బట్టి ఒక కార్మికుడు బంతికి రూ. 35-50 సంపాదిస్తాడు. రెండు ముక్కల బంతులపై యంత్రంతో కుట్లను వేస్తారు.
" స్పిన్నర్ హో యా ఫాస్ట్ బౌలర్, దోనోఁ సీమ్ కే సహారే హీ గేంద్ ఫేఁక్తే హై (స్పిన్నర్ అయినా, ఫాస్ట్ బౌలర్ అయినా, బంతిని వదలడానికి ఇద్దరూ బంతికుట్ల సహాయాన్ని తీసుకుంటారు)," అని ధరమ్ చెప్పారు. బంతి కుట్లు పూర్తయిన తర్వాత, బంతిపై పొడుచుకు వచ్చిన ఆ కుట్లను చేతితో నొక్కుతారు, ఆపై బంతికి లక్క పూత పూసి, దానిపై ముద్రవేస్తారు. “ ఖిలాడీ క్యా పహచాన్‌తే హై? సిర్ఫ్ చమక్తీ హుయీ గేంద్, సోనే కీ ముహర్ కే సాథ్ (ఆటగాడు ఏం గుర్తిస్తాడు? బంగారు రంగు ముద్రతో మెరుస్తున్న బంతిని మాత్రమే).”
“ క్రికెట్ బాల్ కీ ఏక్ ఖాస్ బాత్ బతాయియే (క్రికెట్ బంతుల ప్రత్యేకత ఏమిటో చెప్పండి?)” అని మదన్ అడిగారు.
"రూపాలు మారిన ఏకైక ఆట ఇదొక్కటే," అని అతను చెప్పారు, " లేకిన్ బనానేవాలా ఔర్ బనానే కీ తక్నీక్, తరీకా ఔర్ చీజేఁ బిల్కుల్ నహీ బద్లీఁ (కానీ బంతులను తయారుచేసేవాళ్ళు, సాంకేతికత, ప్రక్రియ, వాటి ఉత్పత్తికి ఉపయోగించే పదార్థాలు మాత్రం మారలేదు).
మదన్‌తో పనిచేస్తున్న కారీగర్లు సగటున రోజుకు 200 బంతుల వరకు తయారుచేస్తారు. ఒక బంతిని లేదా ఒక బ్యాచ్ బంతులను తయారుచేయడానికి దాదాపు 2 వారాలు పడుతుంది. చర్మాన్ని శుద్ధి చేయడం దగ్గర నుండి మొదలుకొని బంతిని పూర్తిచేయడం వరకు, "11 మంది క్రికెటర్లు కలిస్తే ఒక జట్టు తయారైనట్లే, కనీసం 11 మంది కారీగ ర్ల నైపుణ్యాలు ఒక బంతి తయారీకి అవసరం," అంటూ మదన్, తాను తెచ్చిన సామ్యానికి తానే నవ్వారు.
" పర్ ఖేల్ కా అస్లీ కారీగర్ తో ఖిలాడీ హీ హోవే హై (కానీ క్రీడలో నిజమైన పనిమంతుడిగా పరిగణించేది కేవలం ఆటగాడిని మాత్రమే)," అంటూ జోడించారు.
ఈ కథనానికి తమ అమూల్యమైన సహకారాన్ని అందించిన భారత్ భూషణ్‌కు రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) నుండి ఒక ఫెలోషిప్ మద్దతు ఉంది.
అనువాదం: రవి కృష్ణ