ఎస్. ముత్తుపేచి ఆమె కష్టాలన్నీ వరసగా ఏకరువు పెడుతోంది. సాంప్రదాయ కళ అయిన కరాగాట్ట నృత్యం ఆమెకు బ్రతుకు తెరువు. దీనికి రాత్రంతా నృత్యం చేసే నైపుణ్యం, బలం ఉండాలి. ఇంత కష్టపడినా ప్రదర్శనకారులని చాలా చిన్నచూపు చూస్తారు. పైగా వారికి డబ్బులు కూడా సరిగ్గా రావు. నలభైనాలుగేళ్ల ఈ కళాకారిణి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది.
పదేళ్ల క్రితం భర్త మరణించి ఆమె ఒంటరిదయింది. అయినా ముత్తుపేచి కష్టపడి ఇంటిని సంభాళించుకుంటూ తన సంపాదనతో ఇద్దరు కూతుర్లకు పెళ్ళి చేసింది. కానీ అప్పటికి కోవిడ్ మహమ్మారి వచ్చింది.
ఆమె గొంతులో కోపం, దుగ్ధ వినిపిస్తాయి. “పళ పోనా కరోనా (మాయదారి కరోనా)” అని ఆ జబ్బు ని శపిస్తుంది. “ప్రదర్శనలు ఏమి లేకపోవడం వలన ఆదాయం కూడా లేదు. నా కూతుర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవలసిన ఖర్మ పట్టింది.” అన్నది.
“పోయిన ఏడాది ప్రభుత్వం 2000 రూపాయిలు ఇస్తామని చెప్పింది. కానీ మాకు 1000 రూపాయిలు మాత్రమే వచ్చాయి. మేము మధురై కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నాము. కానీ ఇప్పటి వరకు ఏమి రాలేదు.” అని చెప్పింది ముత్తుపేచి. 2020 ఏప్రిల్- మే లలో తమిళనాడు ప్రభుత్వం, రాష్ట్ర జానపద కళాకారుల సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్న కళాకారులకు 1000 రూపాయిలు ప్రత్యేకంగా ఇస్తామని రెండుసార్లు చెప్పింది.
మధురై జిల్లాలో ఉన్న 1200 పైగా కళాకారులు, మహమ్మారి మొదలైన దగ్గరనుంచి పనులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు, అని పేరుపొందిన కళాకారుడు, జానపద కళల గురువైన మధురై గోవిందరాజ్ చెప్పారు. దాదాపు 120 కరగాట్టం ప్రదర్శనకారులు అవనీయపురం పట్టణం లోని అంబేద్కర్ నగర్ చుట్టుపక్కల ఉంటున్నారు. ఇక్కడే నేను ముత్తుపేచిని మే నెలలో కలిసాను.
చాలా పెద్ద పల్లెనృత్యరూపకం అయిన కరగాట్టం ప్రదర్శనలను పండుగలప్పుడు గుడులలో, సాంస్కృతిక ప్రదర్శనలలో, పెళ్లిళ్లలో, దినకర్మలలో ఏర్పాటు చేసేవారు. కళాకారులు ఆది ద్రావిడ కులానికి చెందినవారు, దళితులు. వారు తమ జీవికకు కళ మీద మాత్రమే ఆధారపడతారు.
కరగాట్టం అనేది మగవారు, ఆడవారు- అందరూ కలిసి చేసే ఒక బృంద నృత్యం. వారు నృత్యం చేసేటప్పుడు నెత్తి మీద ఒక కుండ(కరగం) పెట్టుకుని దానిని తల మీదే నిలుపుతూ నృత్యం చేస్తారు. చాలాసార్లు వారు రాత్రంతా, అంటే రాత్రి 10 నుంచి పొద్దుట 3 గంటల వరకు నృత్యం చేస్తారు.













