కమల నాలుగోసారి గర్భవతి అయ్యి బిడ్డని వద్దు అనుకున్నప్పుడు ముందుగా వెళ్ళింది తనుండే గూడెం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి కాదు. తను కేవలం ఇంటికి దగ్గరలో వారం వారం ఉండే హాట్ కి మాత్రమే ముందు వెళ్ళింది, ‘నాకు ఈ ప్రదేశం గురించి తెలీదు. నా భర్త తర్వాత కనుగొన్నాడు’ అంటుంది తను.
ముప్ఫయిల వయసులో ఉన్న కమల, ఆమె భర్త రవి, 35, (పేర్లు మార్చబడ్డాయి ), ఇద్దరూ గోండ్ తెగకి చెందినవారే, ముందుగా తమ గుడానికి దగ్గర్లో ఉన్న స్థానిక 'వైద్యుడిని' కలిశారు. 'ఒక మిత్రుడు మాకు అతని గురించి చెప్పాడు,' అని చెప్పింది ఆమె. కమల తన ఇంటి దగ్గర్లో చిన్న స్థలంలో కూరగాయలు పండించి ప్రతి వారం జరిగే హాట్ లో అమ్ముతుంది, తన భర్త రవి స్థానిక మండిలో కూలీగా చేస్తాడు, అలాగే అతని ఇద్దరు సోదరులతో కలిసి మూడెకరాల్లో గోధుమలు, జొన్న పండిస్తాడు. కమల చెప్తున్న క్లినిక్, రహదారి నుంచి సులభంగానే కనిపిస్తుంది. ఆస్పత్రిగా చెప్పుకునే ఆ ప్రదేశంలో 'డాక్టర్' అనే బోర్డు లేదు, కానీ ప్రహరీ గోడ మీద ఫ్లెక్సీలపై మాత్రం అతని పేరుకి ముందు ఆ శీర్షిక ఉంది.
ఆ 'డాక్టర్' కమలకి ఐదు మాత్రలు ఇచ్చి అవి మూడు రోజుల పాటు వేసుకోమని చెప్పి 500 తీస్కొని తర్వాతి పేషెంట్ ని రమ్మన్నాడని కమల చెప్పింది.. ఆ మాత్రల గురించి గానీ, వాటి వల్ల ఉండే రియాక్షన్లు గానీ, మరీ ముఖ్యంగా ఎప్పుడు ఎలా గర్భస్రావం అవుతుందో ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
ఆ మందు తీసుకున్న కొన్ని గంటలకి కమలకి రక్తస్రావం మొదలయ్యింది. “నేను కొన్ని రోజుల పాటు ఆగి చూసాను, ఐనా అది ఆగలేదు, అందుకే మళ్ళీ ఆ మందు ఇచ్చిన డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్లాం. అతను మమ్మల్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి 'సఫాయి' చేయించుకోమని చెప్పాడు.” అన్నది కమల. అతను సూచించేది వాక్యూమ్ తో గర్భాశయాన్ని శుభ్ర పరిచే ప్రక్రియ గురించి.
లేత శీతాకాలపు ఎండలో బేనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బయట ఒక బెంచి మీద కూర్చుని ఉన్న కమల మెడికల్ టెర్మినేషన్ అఫ్ ప్రెగ్నన్సీ (MTP ) ప్రక్రియ చేయించుకోవడానికి తన వంతు కోసం ఎదురు చూస్తుంది, ఈ ప్రక్రియ నిర్వహించడానికి సుమారు 30 నిముషాలు పడుతుంది, కానీ చేయించుకోడానికి ముందు, తరువాత మూడు నుంచి నాలుగు గంటల పాటు విశ్రాంతి అవసరం. తప్పనిసరిగా చేయించుకోవాల్సిన రక్త, మూత్ర పరీక్షలు మునుపటి రోజే అయిపోయాయి.
ఛత్తీస్గఢ్ లోని నారాయణ్ పూర్ జిల్లాలోని ఈ PHC 2019 చివర్లో పునరుద్ధరించబడింది. అందులో ఆరోగ్యవంతమైన పిల్లలు, సంతోషంగా ఉన్న తల్లుల రంగురంగుల పెయింటింగులు ఉన్నప్రత్యేకమైన ప్రసూతి గదులు, ఒక పది పడకల వార్డు, మూడు పడకల లేబర్ రూమ్, ఆటోక్లేవ్ మెషీన్, ప్రసవం అవ్వబోయే నిండు గర్భిణీలు ఉండడానికి నివాస సౌకర్యం కాక ఒక కిచెన్ గార్డెన్ కూడా ఉంది. ఆదివాసీలు ఎక్కువగా ఉండే బస్తర్ లోని ఈ ప్రాంతంలో ప్రజారోగ్య సేవల గురించి ఇది ఒక ఆశాజనకమైన చిత్రాన్ని కనబరుస్తుంది.












