“నాకు వీలయితే ఆసుపత్రికి అసలు వెళ్ళేదాన్నే కాదు.” ఆమె ఖచ్చితంగా చెప్పింది. “మమ్మల్ని అక్కడ జంతువుల్లా చూస్తారు. అక్కడ డాక్టర్లు వారంతట వారు వచ్చి మమ్మల్ని చూడరు, పైగా అక్కడ నర్సులు, ‘వీళ్లెలా బతుకుతారో, ఇంత కంపుకొట్టే మనుషులు ఎక్కడ నుండి వస్తారు?’, అంటారు”, అన్నది సుదామ. సుదామ వారణాసి జిల్లాలోని అన్నియ గ్రామానికి చెందిన ఆదివాసి. ఆమె తన మొదటి ఐదుగురు బిడ్డలను ఆసుపత్రిలో కాక ఇంట్లోనే ఎందుకు ప్రసవించిందో చెబుతోంది.
సుదామకు గత 19 ఏళ్లలో తొమ్మిది మంది పిల్లలు కలిగారు. 49 ఏళ్ళు చేరినా ఆమె ఋతు చక్రం ఇంకా ఆగలేదు.
ఆమె ఠాకూర్లు, బ్రాహ్మలు, గుప్తాలు వంటి పెద్ద కులాలు ఉండే బరాగావ్ బ్లాక్ లో, ఒక మూలనున్న ముసహర్ బస్తిలో 57 కుటుంబాల మధ్య నివసిస్తుంది. ఆ బస్తిలో ఇంకొన్ని ముస్లింల ఇళ్లు, కొన్నిచమార్, ధర్కార్, పాసి వంటి షెడ్యూళ్ల కులాలకు చెందిన వారి ఇళ్లు కూడా ఉన్నాయి. ఆ బస్తి వీరి వర్గాన్ని గురించి సాధారణంగా ఉన్న వివక్ష పూరిత అపోహలను నిజం చేసేటట్లే ఉంటుంది - సరిగ్గా బట్టలు వేసుకోకుకండా, దుమ్ము పట్టిన పిల్లలతో, వారి బక్కచిక్కిన మొహాలకి అంటుకున్న ఆహరం చుట్టూ చేరిన ఈగలతో, అసలు పరిశుభ్రత లేకుండా ఉంటుంది. కానీ దగ్గరగా చూస్తే ఇంకో విషయం కూడా తెలుస్తుంది.
ఉత్తరప్రదేశ్ లో షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న ఈ ముసాహారులు ఎలుకలు పట్టగల నైపుణ్యం ఉన్నవారు. ఈ ఎలుకలను వదిలేస్తే ప్లేగ్ వ్యాధి ప్రబలుతుంది. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ, వారి వృత్తి పై చిన్న చూపు పెరిగి, వారిని ఎలుకలు తినేవారిగా చూడడం మొదలు పెట్టారు. ఆ విధంగానే వారికి ముసాహారులు(ఎలుకలోళ్లు) అన్న పేరు వచ్చింది. ఈ వర్గాన్ని అందరూ వెలివేస్తారు, అవమానిస్తారు. మిగిలిన సామాజిక వర్గాలు, ప్రభుత్వాలు వీరిని నిర్లక్ష్యం చేస్తాయి. వీరు విపరీతమైన లేమితో బతుకుతుంటారు. పక్కనే ఉన్న బీహార్ రాష్ట్రంలో వీరిని మహాదళితులుగా వర్గీకరించారు- మహాదళితులు, షెడూల్డ్ కులాలలోనే అందరికన్నా ఎక్కువగా వివక్షను ఎదుర్కొనే పేదవారు.








