ఒక తెల్లవారుజామున, అమ్రోహా నుండి ఢిల్లీ వెళ్ళేందుకు కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్ రైలెక్కిన అయినుల్ దిగులుగా కూర్చున్నారు. “నేను చాలా భయపడ్డాను. మా ఉరి నుండి దూరంగా, బంబైకి వెళ్తున్నాను అన్న ఆలోచన పదే పదే నన్ను వెంటాడింది. అక్కడివాళ్ళు నాతో ఎలా ప్రవర్తిస్తారు? నేనెలా బ్రతకగలను?” ఈ ఆందోళన ఆ రాత్రంతా జనరల్ లేడీస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసిన 17 ఏళ్ల అయినుల్ను నిద్రపోనీయలేదు.
అదే రైలులో ఆమె మామగారైన ఆలిమ్ కూడా ప్రయాణించారు. ఢిల్లీలో మరో రైలు ఎక్కి, వాళ్ళు ముంబై బాంద్రా టెర్మినస్‌లో దిగారు. ఆ తరువాత, మాహిమ్ లోని నయీ బస్తీ స్లమ్ కాలనీలో ఉన్న ఒక ఇంట్లో అయినుల్ని దిగబెట్టి, అతను మఖ్దూమ్ అలీ మాహిమి దర్గా బయట భిక్షాటన కొనసాగించడానికి వెళ్ళిపోయారు.
మూడేళ్ల తర్వాత, అయినుల్ షేక్ కూడా కొంతకాలం భిక్షాటన చేయాల్సి వచ్చింది. అలా వచ్చిన డబ్బు, ఏదో గుర్తుతెలియని వ్యాధితో సెంట్రల్ ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్ లో చేర్చిన తన 18 నెలల కొడుకు చికిత్సకు ఎంతగానో పనికొచ్చాయి. “నాకు అప్పుడు ఎవరూ (మెడికల్ బిల్లుల కోసం) ఋణం ఇవ్వలేదు. ఆ డబ్బు తిరిగి చెల్లించలేమని కాబోలు,” అని ఆమె వాపోయారు.
ముంబై వచ్చేటప్పుడు, రైలు ప్రయాణంలో ఆమెలో నెలకొన్న భయాందోళనలన్నీ ఒక విధంగా నిజమయ్యాయని చెప్పొచ్చు!
ఆ రోజు ట్రైన్ లో, ఒక బట్టల సంచిని మాత్రమే అయినుల్ తన వెంట తెచ్చుకున్నారు. మెట్టినింటికి తీసుకెళ్లేందుకు, పెళ్ళికి ముందే ఒక్కొక్కటిగా ఆమె కొన్న పాత్రలన్నీ అమ్మకానికిపోయాయి. చిన్నతనం నుండే ఆవిడ వేరేవాళ్ళ ఇళ్లలో గిన్నెలు తోముతూ, ఇల్లు శుభ్రం చేస్తూ, పొలాల్లో కూలిపని చేస్తూ చాలా కష్టపడ్డారు. “పని చేసినందుకు నాకు అన్నం పెట్టేవారు లేదా కొద్దిగా డబ్బులిచ్చేవారు. సంపాదించిందంతా పెట్టెల్లో దాచుకుంటూ నా పెళ్ళికి డబ్బులు పోగేశాను. అలా కర్తే కర్తే (చేస్తూ చేస్తూ) నేను ఓ రూ.5,000 వరకు ఆదా చేశాను. కుదిరినప్పుడల్లా వంట సామాన్ల షాపులకెళ్ళి, ఇత్తడి బాటీలు (ఒక రకమైన కుక్కర్), థాలీలు (కంచాలు), గరిటెలు, రాగి డేగ్చీ (గిన్నె) కొన్నాను.”







