లక్షిమాదేవికి తేదీ సరిగా గుర్తు లేదు కానీ, ఆ శీతాకాలపు రాత్రి మాత్రం స్పష్టంగా జ్ఞాపకం ఉంది. "గోధుమ పంట చీలమండల ఎత్తుకు పెరిగి ఉన్నప్పుడు, నా ఉమ్మనీరు కారుతూ, ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. అది డిసెంబర్ లేదా జనవరి (2018/19) అయి ఉండొచ్చు," అని ఆమె తెలిపారు.
వెంటనే లక్షిమాదేవి కుటుంబ సభ్యులు, ఆమెను బారాగాంవ్ బ్లాక్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీఎచ్సీ) తరలించేందుకు ఒక టెంపోను అద్దెకు తీసుకొచ్చారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో, వారు నివసించే అశ్వరి గ్రామం నుండి ఆ పీఎచ్సీ దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. "మేము పీఎచ్సీకి చేరుకునే సమయానికి నాకు నొప్పులు ఎక్కువయ్యాయి," అని 30 ఏళ్ల లక్షిమా గుర్తు చేసుకున్నారు. ఆమె ముగ్గురు పిల్లలు – రేణు, రాజు, రేషమ్ ఇప్పుడు 5 నుండి 11 సంవత్సరాల వయసుకు వచ్చారు – ఆ రాత్రి వారు ఇంట్లోనే ఉండిపోయారు. "కానీ ఆస్పత్రి సిబ్బంది ఒకరు నన్ను చేర్చుకోడానికి నిరాకరించాడు. నేను గర్భవతిని కానని, అనారోగ్యం కారణంగా నా కడుపు ఉబ్బిందని అతను మాతో వాదనకు దిగాడు."
లక్షిమాదేవి అత్త హీరామణి ఎంత ప్రాధేయపడినా పీఎచ్సీ సిబ్బంది ఒప్పుకోకపోవడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో, అక్కడే పురుడు పోద్దామని ఆమె తన కుటుంబ సభ్యులతో అన్నారు. "కానీ ఆఖరి ప్రయత్నంగా, నన్ను వేరే చోటికి తీసుకెళ్లేందుకు, నా భర్త ఆటో కోసం వెతకడం మొదలుపెట్టారు. అప్పటికే నేను ప్రసవ నొప్పులు తట్టుకోలేక చాలా బలహీనంగా ఉండడంతో, ఆ ఆస్పత్రి బైటున్న ఒక చెట్టు కింద కూర్చున్నాను," అని లక్షిమా గుర్తు చేసుకున్నారు.
60 ఏళ్ల హీరామణి, లక్షిమా పక్కన కూర్చొని, ఆమె చేతిని నిమురుతూ, దీర్ఘ శ్వాస తీసుకోమని సలహా ఇస్తూ, పురుడు పోయడానికి ప్రయత్నం చేశారు. దాదాపు ఒక గంట తర్వాత, అర్ధరాత్రి సమయంలో, ఆమె ప్రసవించింది. అదీ గడ్డకట్టే చలిలో!








