“ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోదు. ఇది పెద్ద కంపెనీల వైపునే ఉంది. ఎ. పి. ఎం. సి ని కూడా వారికే/ఆ కంపెనీలకే ఇస్తున్నారు. వారు రైతులకు సహాయం చేయకుండా వీరికెందుకు సహాయం చేస్తున్నారు?” అని ఉత్తర కర్ణాటకలోని బెలగావి జిల్లాకు బెలగావి తాలూకాకు చెందిన వ్యవసాయ కూలి, శాంతా కాంబ్లే అడిగారు.
మధ్యాహ్నం సమయంలో నగరం యొక్క నడిబొడ్డైన మెజెస్టిక్ ప్రాంతంలోని బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్ డివైడర్ మీద కూర్చుని, ఆమె ‘కేంద్రా సర్కారా దిక్కారా’ (మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము) అనే నినాదాలు వింటోంది.
రైతుల గణతంత్ర దినోత్సవ నిరసన ర్యాలీలో పాల్గొనడానికి శాంతా (50) జనవరి 26 ఉదయం బస్సులో బెంగళూరు చేరుకున్నారు. ఆ రోజు ఉదయం, కర్ణాటక నలుమూలల నుండి రైతులు మరియు వ్యవసాయ కూలీలు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్రీడమ్ పార్కుకు వెళ్ళడానికి రైళ్లు మరియు బస్సుల ద్వారా మెజెస్టిక్ చేరుకున్నారు అంతేగాక మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల ట్రాక్టర్ పరేడ్‌కు మద్దతుగా జరిపిన ఒక సమావేశానికి హాజరవ్వాలనుకున్నారు.
తన ఊరిలో శాంతా, బంగాళాదుంప, పప్పుధాన్యాలు మరియు వేరుశనగ వంటి పంటలను నాటడం, వ్యవసాయ భూమిలో కలుపు తీయడం వంటి పనులకు ఒక రోజు పనికి 280 సంపాదిస్తుంది. వ్యవసాయ పని లేనప్పుడు ఆమె MGNREGA పనులు చేస్తుంది. ఆమె కుమారులు, 28 మరియు 25 సంవత్సరాల వయస్సు గలవారు, MGNREGA స్కీం కింద భవన నిర్మాణ పనులు చేస్తారు.
"[కోవిడ్ -19] లాక్డౌన్ సమయంలో మాకు సరైన తిండి, నీరూ లేదు" అని ఆమె చెప్పింది. “ప్రభుత్వం మా సంగతి పట్టించుకోదు.” అన్నది.
రైల్వే స్టేషన్ యొక్క పార్కింగ్ ప్రాంతంలోని రైతుల బృందం, “మాకు ఎపిఎంసి కావాలి. కొత్త చట్టాలను రద్దు చేయాలి.” అని నినదిస్తున్నారు.
గతేడాది ప్రభుత్వం నడుపుతున్న ఎపిఎంసి (అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ) 50 ఏళ్ల కృష్ణ మూర్తికి సహాయం చేసింది. అస్తవ్యస్తమైన వర్షాల కారణంగా, బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకా బనాపురా గ్రామానికి చెందిన రైతు తన పంటలలో(పత్తి, మొక్కజొన్న, రాగి, కొత్తిమీర మరియు కంది) కొంత భాగాన్ని కోల్పోయాడు -. అతను తన 50 ఎకరాల వ్యవసాయ భూమిలో మిగిలి ఉన్న వాటిని తీసుకొని ఎపిఎంసిలో విక్రయించాడు. "చాలా డబ్బు వ్యవసాయంలోకి వెళుతుంది" అని మూర్తి అన్నారు. "మేము ఎకరానికి దాదాపు లక్ష [రూపాయలు] ఖర్చు చేస్తాము కానీ ఖర్చు చేసే దానిలో సగం మాత్రమే తిరిగి సంపాదిస్తాము."
భారతదేశం అంతటా రైతులను ఏకం చేసిన మూడు వ్యవసాయ చట్టాలు- ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం , 2020; ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 పై రైతు (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం ; మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020 . ఇవి మొదట జూన్ 5, 2020 న ఆర్డినెన్స్‌లుగా ఆమోదించబడ్డాయి, తరువాత సెప్టెంబర్ 14 న పార్లమెంటులో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టబడ్డాయి ప్రస్తుత ప్రభుత్వం అదే నెల 20 న వీటిని చట్టాలుగా ప్రవేశపెట్టింది.
రైతులు ఈ చట్టాలను వారి జీవనోపాధికి జరిగే పెద్ద హానిగా చూస్తారు, ఎందుకంటే వీటివలన పెద్ద కార్పొరేట్‌లకు రైతులపై, వారి వ్యవసాయంపై మరింత అధికారం పెరుగుతుంది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి), వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఎపిఎంసి), రాష్ట్ర సేకరణ ఇలాంటి మరిన్నో సాగుదారునికి మద్దతు ఇచ్చే ప్రధాన రూపాలను కూడా ఈ చట్టాలు బలహీనపరుస్తాయి. ఆర్టికల్ ని 32 ని బలహీనం చేస్తూ, పౌరులందరికీ వాజ్యం వేసే చట్టబద్దమైన హక్కును వారు నిలిపివేస్తున్నందున ఇవి ప్రతి భారతీయుడిని ప్రభావితం చేస్తాయని విమర్శించబడ్డాయి.
‘ఒపోడిల్లా! ఒపోడిలా! ’(మేము దీన్ని అంగీకరించము) బెంగళూరులో రైతులు పదేపదే నినదించారు.
"మూడు కఠినమైన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని మేము కోరుతున్నాము" అని కర్ణాటక రాజ్య రైత సంఘ (కెఆర్ఆర్ఎస్) రాష్ట్ర కార్యదర్శి పి. గోపాల్ అన్నారు. ఈ నిరసనలలో రాష్ట్రంలో దాదాపు 25 నుంచి 30 సంస్థలు పాల్గొంటున్నాయి. కర్ణాటక నలుమూలల నుండి 50 వేలకు పైగా రైతులు, రైతుకూలీలు వస్తున్నారు. పంజాబ్ మరియు హర్యానా రైతులు మాత్రమే నిరసన తెలుపుతున్నారని కేంద్ర ప్రభుత్వం చేసిన వాదన పూర్తిగా తప్పు,” అన్నారాయన.
“ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ కూడా కర్ణాటకలో ముఖ్యమంత్రి బి.ఎస్. యెడియరప్ప స్పష్టంగా కార్పొరేట్‌ల పక్షాన ఉన్నారు. ఆయన పెద్ద సంస్థలకు అనుకూలంగా [2020 లో] భూ సంస్కరణల చట్టాన్ని సవరించారు.అంతేగాక ఆవు వధ బిల్లును ఏకపక్షంగా ప్రవేశపెట్టాడు,” అని గోపాల్ అన్నారు.
రైల్వే స్టేషన్ వెలుపల మహిళల బృందంతో నిలబడి, హవేరి జిల్లాలోని షిగ్గావ్ తాలూకాకు చెందిన 36 ఏళ్ల రైతు ఎ. మమతా ఉన్నారు. ఆమె తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి, రాగి మరియు వేరుశనగ పండిస్తారు. “మాకు కార్పొరేట్ మండీలు వద్దు. దానికి బదులుగా ప్రభుత్వం ఎపిఎంసిలను బలోపేతం చేసి మధ్యవర్తులను నిర్మూలించాలి. వారు రైతుల నుండి నేరుగా పంటలను కొనుగోలు చేసే సమర్థవంతమైన మార్గాలను ప్రవేశపెట్టాలి, ”అని ఆమె అన్నారు.
ఆమె చుట్టూ, ప్రేక్షకులు, "కొత్త చట్టాలు అదానీ, అంబానీల కోసం." అని నినదించారు.
రైల్వే స్టేషన్ యొక్క పార్కింగ్ ప్రాంతానికి మూలగా, ప్రయాణించే నిరసనకారులకు పేపర్ ప్లేట్లలో వేడి ఆహారాన్ని అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్త సంస్థ, ట్రాన్స్ జెండర్ల సంస్థ అయిన ‘కర్ణాటక మంగళముఖి ఫౌండేషన్ (కెఎంఎఫ్)’ సభ్యులు వేడివేడి రైస్ పులావ్‌ను తయారు చేశారు. “ఇది మా కర్తవ్యం. రైతులు పండించిన ఆహారంతోనే మేము పెరిగి పెద్దయ్యాము. వారు పండించిన బియ్యాన్ని మేము తింటున్నాము ”అని కెఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి అరుంధతి జి. హెగ్డే అన్నారు.
చిక్కమగళూరు జిల్లాలోని తారికెరే తాలూకాలో కెఎమ్‌ఎఫ్‌కు ఐదు ఎకరాల భూమి ఉంది, ఇక్కడ ఈ సంస్థ వరి, రాగి, వేరుశనగను సాగు చేస్తుంది. “మేమంతా రైతు కుటుంబాల నుంచి వచ్చాం. కాబట్టి ఈ నిరసన ఎంత ముఖ్యమో మాకు తెలుసు. ఈ పోరాటంలో మేము ఇక్కడ మా వంతు కృషి చేస్తున్నాము, ”అని అరుంధతి అన్నారు.
కానీ జనవరి 26 న, మధ్యాహ్నం 1 గంటకు, పోలీసులు మెజెస్టిక్ ప్రాంతానికి బారికేడ్లు వేసి, నిరసనకారులు సమావేశం కోసం ఫ్రీడమ్ పార్కుకు వెళ్ళకుండా అడ్డుకున్నారు.
“ఈ ప్రజాస్వామ్య నిరసనలకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం. అసమ్మతిని అరికట్టడానికి ఇది పోలీసులను ఉపయోగిస్తోంది, ”అని కేఆర్ఆర్ఎస్ నాయకుడు గోపాల్ అన్నారు.ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులు మరియు కార్మికులు కూడా తమ సంఘీభావం తెలిపేందుకు నగరానికి వచ్చారు.
ఇంతటి తీవ్ర చర్యలు బళ్లారికి చెందిన గంగా ధన్వర్కర్ అనే రైతుకు కోపం తెప్పించాయి. " మా ఇళ్ళు, కుటుంబాలు మరియు పొలాలను విడిచిపెట్టి, ఎటువంటి కారణం లేకుండా నిరసన తెలపడానికి ఇక్కడకు రావడానికి మేమేమి మూర్ఖులం కాదు. ఢిల్లీలో జరిగిన నిరసనల్లో 150 మందికి పైగా రైతులు మరణించారు. వారు అక్కడ ఎముకలు కొరికే చలిలో, నడివీధులలో, పిల్లలతో కలిసి గుడారాలలో నివసిస్తున్నారు.” అని బాధపడ్డారు.
నిరసనకు ఆమె చెప్పే కారణం ఏమిటంటే, “ఈ చట్టాలు ప్రజలకు, రైతులకు లేదా కూలీలకు కాదు. అవి కంపెనీలకు మాత్రమే. ”
కవర్ ఫోటో: అల్మాస్ మసూద్
అనువాదం: అపర్ణ తోట