తిప్పి తిప్పి చూస్తే ఆమె వయసు 22 ఏళ్ళు మాత్రమే, అయినా ఇప్పటికే మూడునాలుగేళ్ళుగా ఆరోగ్య సమస్యలతో అలసిపోయుంది మీనూ సర్దార్. 2021 వేసవిలోని ఆమె ఆ ఉదయం వేళ నీరు తీసుకురావడానికి బయలుదేరినప్పుడు, ఏదో ఘోరం జరగబోతోందనే ముందస్తు హెచ్చరిక ఏమి రాలేదు. దయాపూర్ గ్రామంలోని చెరువుకు వెళ్లే మెట్టదారి కొన్నిచోట్ల పగిలిపోయింది. మీనూ మెట్ల మీద జారిపడి, దొర్లుకుంటూ వెళ్ళి బోర్లా పడిపోయింది.
"నా ఛాతీలో, కడుపులో విపరీతమైన నొప్పిగా ఉండింది," అని ఆమె బెంగాలీలో వివరించారు. “యోని నుండి రక్తస్రావం మొదలైంది. నేను బాత్రూమ్‌కి వెళ్లినప్పుడు, లోపలి నుండి ఏదో జారి నేలపై పడిపోయింది. నా నుండి ఒక మాంసం లాంటి పదార్ధం బయటకు వస్తుండటం గమనించాను. నేను దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించాను, కానీ మొత్తాన్ని తీయలేకపోయాను.”
సమీప గ్రామంలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌ను సందర్శించగా, గర్భస్రావం జరిగినట్లు నిర్ధారించారు. ఎన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ పొడుగ్గా, సన్నగా, చిరునవ్వుతో ఉండే మీనూ, అప్పటి నుండి తీవ్రమైన శారీరక నొప్పి, మానసిక క్షోభకు గురైంది. దానితో పాటు ఆమెకు బహిష్టులు కూడా సక్రమంగా రావడంలేదు.
పశ్చిమ బెంగాల్, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గోసాబా బ్లాక్‌లో ఉండే మీనూవాళ్ళ గ్రామంలో సుమారు 5,000 మంది జనాభా ఉన్నారు. విశాలంగా విస్తరించివున్న వరి పొలాలతో, సుందర్‌బన్లలోని మడ అడవులతో ఈ ప్రాంతమంతా పచ్చగా ఉంటుంది. గోసాబా బ్లాక్‌లో రోడ్డుకు అనుసంధానించబడి ఉన్న కొన్ని లోతట్టు గ్రామాలలో ఈ గ్రామం కూడా ఒకటి.
మీనూకి మెట్లమీంచి జారిపడిన తర్వాత నెల రోజులకు పైగా విరామం లేకుండా రక్తస్రావం అయింది. ఆమె బాధలు అంతటితోనే ముగియలేదు. "శారీరిక్ సంపొర్కో ఎతో వ్యథా కొరే [లైంగిక సంభోగం చాలా బాధాకరమైనది]," అని ఆమె చెప్పారు. “నేను రెండుగా చీలిపోతున్నట్లు అనిపిస్తుంది. మలాన్ని విసర్జించవలసి వచ్చినప్పుడు, ఒత్తిడిని కలిగించవలసి వచ్చినప్పుడు, లేదా బరువైన వస్తువులను ఎత్తినప్పుడు, నా గర్భాశయం క్రిందికి జారుతున్నట్లు నాకు తెలిసిపోతోంది.”











