రైతు సునందా సూపే జూన్ నెల గురించి, ఆ తర్వాత వచ్చే వర్షాకాలపు నెలల గురించీ కూడా భయపడుతుంటారు. ఏడాదిలో ఈ నెలలలోనే, స్థానికంగా మోథే గోగల్ గై అని పిలిచే ఈ భారీ ఆఫ్రికా నత్తలు దరక్‌వాడీ గ్రామంలో ఉన్న ఆమె ఎకరం పొలాన్ని నాశనం చేస్తున్నది.
"మనం ఏమి విత్తినా, అవి తినేస్తాయి - వరి, సోయాబీన్, వేరుశెనగ, కాళా ఘేవ్డా (నల్ల చిక్కుళ్ళు), కిడ్నీ బీన్స్ - ఏవైనా," అని చెప్పారామె. మామిడి, చికూ (సపోటా), బొప్పాయి, జామ వంటి పండ్లకు కూడా వాటి నుండి రక్షణ లేదు. "మనం ఈ నత్తలను వేల సంఖ్యలో చూడవచ్చు," అని 42 ఏళ్ళ ఈ రైతు చెప్పారు
మహారాష్ట్రలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసిన మహదేవ్ కోళీ సముదాయానికి చెందిన ఈమె తన తల్లి, సోదరుడితో కలిసి చాస్‌కమాన్ ఆనకట్ట పక్కనే నివసిస్తున్నారు. ఆమె ఇల్లు, పొలం ఆనకట్టకు చెరోవైపునా ఉన్నాయి. ఆమె ఇంటి నుంచి పొలానికీ, పొలం నుంచి ఇంటికీ చేరాలంటే చెరో అరగంటా పడవ నడుపుతూ ప్రయాణించాలి.
ఈ భారీ ఆఫ్రికా నత్తలు ( అకటీనా ఫూలికా ), భారతదేశంలోకి చొచ్చుకువచ్చిన జాతి అని గ్లోబల్ ఇన్వేసివ్ స్పీసీస్ డేటాబేస్ పేర్కొంది. ఇవి వివిధ రకాల పంటలను తింటాయని తెలుస్తోంది. వర్షాకాలంలో, జూన్ నుండి సెప్టెంబర్ వరకు, తివై కొండకు దిగువన ఉన్న పొలాలను ఈ నత్తలు ఆక్రమిస్తాయి. కొన్నిసార్లు అవి మరికొన్ని నెలల పాటు అక్కడే ఉంటాయి. సునంద, 2022 చివరిలో ఈ విలేఖరితో మాట్లాడుతూ, తాను ఇప్పుటికి మూడేళ్ళుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నానని చెప్పారు
"అవి మొదట ఎలా వచ్చాయో నేను చెప్పలేను" అని నారాయణ్‌గావ్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం నోడల్ అధికారి డాక్టర్ రాహుల్ ఘడ్గే చెప్పారు. "ఒక నత్త ఒక రోజులో ఒక కిలోమీటరు దూరం ప్రయాణించగలదు. పొదగడం ద్వారా అవి సంతానాన్ని వృద్ధిచేసుకుంటాయి" అని ఆయన చెప్పారు. అవి జనవరిలో నిద్రాణస్థితిలోకి వెళ్లి, వాతావరణం వెచ్చగా మారినప్పుడు వాటి గుల్లల నుండి బయటకు వస్తాయని ఆయన గమనించారు. "అవి మనుగడ సాగించగలిగినంత ఉష్ణోగ్రత అప్పటికి సక్రియం అవుతుంది," అని ఆయన చెప్పారు.
“నేను పొలంలో నల్ల చిక్కుళ్ళు, రాజ్మా విత్తుకున్నాను. నత్తలు వాటన్నిటినీ నాశనం చేసేశాయి” అని సునంద చెప్పారు. "50 కిలోగ్రాముల పంట వస్తుందని ఆశించాను, కానీ ఒక్క కిలో మాత్రమే వచ్చింది." రాజ్మా ఒక కిలో రూ. 100కు అమ్ముడుబోతుంది. సునంద పండిస్తోన్న నల్ల రాజ్మాను కానీ, నాటిన వేరుశనగ గింజలను కూడా నత్తలు విడిచిపెట్టలేదు. ఒక్క వేరుశెనగ పంటకే తనకు వచ్చిన నష్టం దాదాపు రూ 10,000 అని ఆమె అంచనా వేశారు.
"మాకు రెండు పంట కాలాలు ఉన్నాయి- ఋతుపవనాల సమయంలో ( ఖరీఫ్ ), దీపావళి తర్వాత ( రబీ ),” అని ఆమె చెప్పారు. గత సంవత్సరం, నత్తలు దాడి చేయడం వల్ల వర్షాకాలం తర్వాత రెండు నెలల పాటు పొలాన్ని బీడుగా వదిలేయాల్సి వచ్చింది. "చివరికి డిసెంబర్‌లో మేం హర్ బరా (ఆకుపచ్చ శనగలు), గోధుమలు, వేరుశెనగ, ఉల్లిపాయలను విత్తగలిగాం," అన్నారామె.
మహారాష్ట్రలో ఐదు నుండి 10 శాతం వ్యవసాయ భూములు నత్తల వల్ల ప్రభావితమయ్యాయని డాక్టర్ ఘడ్గే అంచనా వేశారు. "అవి (నత్తలు) మొలకల దశలలోని మొక్కల మృదువైన కాండం పట్ల ప్రత్యేక ఇష్టాన్ని కలిగి ఉంటాయి. అందువలన ఇది నష్టాన్ని మరింత పెంచుతుంది. వీటి వల్ల రైతులు నిజంగా నష్టపోతున్నారు.
దరక్‌వాడీకే చెందిన 35 ఏళ్ళ రైతు నితిన్ లగడ్ ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, అందుకు కారణంగా ఆయన నత్తలను నిందిస్తున్నారు: “ఈ సంవత్సరం 70 నుండి 80 బస్తాలు (దాదాపు 6,000 కిలోలు) సోయా బీన్స్ వస్తాయని ఆశించాం, కానీ కేవలం 40 బస్తాలు మాత్రమే (2,000 కిలోలు) వచ్చాయి."
అతను సాధారణంగా తన 5.5 ఎకరాలలో మూడుసార్లుగా పంటలు వేస్తారు. ఈ సంవత్సరం నత్తలు చేసిన విధ్వంసం కారణంగా ఆయన రెండవ పంటగా ఏమీ విత్తలేకపోయారు. “నాలుగు నెలలు పొలాన్ని అలానే ఖాళీగా వదిలేశాం. ఇప్పుడు కూడా, అది జూదమేనని తెలిసీ, ఉల్లిని విత్తుకున్నాం” అంటారు నితిన్.
మొలాస్కిసైడ్ వంటి వ్యవసాయిక రసాయనాలు వీటి పైన ప్రభావవంతంగా పనిచేయటంలేదు. “మేం నేల మీద మందు వేస్తాం, కాని నత్తలు నేల క్రింద ఉంటాయి కాబట్టి మందు పనిచేయదు. మీరు వాటిని పట్టుకుని మందు వేస్తే, అవి వాటి గుల్ల లోపలికి ముడుచుకుపోతాయి,” అంటూ నితిన్ వివరించారు. "ఈ మందు అస్సలు సహాయం చేయలేదు."
వేరే దారి లేకపోవడంతో తాము చేతితోనే నత్తలను ఏరివేస్తున్నట్లు దరక్‌వాడీలోని రైతులు చెప్పారు. ప్లాస్టిక్ సంచులను చేతులకు తొడుగులుగా వేసుకొని, వాటిని ఎత్తి ఉప్పునీటితో నింపిన డ్రమ్ములో వేస్తారు. ఆ నీరు నత్తలను ముందు అచేతనంగా చేసి, ఆపైన చంపేస్తుంది.
“అవి (డ్రమ్ నుంచి) బయటికి వస్తూనే ఉంటాయి. వాటన్నిటినీ మళ్ళీ మళ్ళీ లోపలికి తోస్తూనే ఉండాలి. మేం వాటిని ఐదుసార్లు లోపలికి నెట్టవలసి వచ్చింది. అప్పుడే అవి (చివరకు) చనిపోయాయి” అని సునంద చెప్పారు.
కొద్దిమంది స్నేహితులతో కలిసి నితిన్, తన 5.5 ఎకరాల పొలంలో ఒకేసారి 400 - 500 నత్తలను పట్టుకునేవారు. ఉల్లిపాయలు విత్తడానికి ముందు, అతను నత్తలతో నిండిన మట్టిని తనకు సాధ్యమైనంత ఉత్తమంగా శుభ్రం చేసి వదిలించుకున్నారు, కానీ అవి ఇప్పటికీ కనిపిస్తుంటాయి. తన పొలంలో దాదాపు 50 శాతాన్ని నత్తలు ధ్వంసం చేశాయని నితిన్ పేర్కొన్నారు
"మేం ఒక్క రోజులో వందల కొద్దీ నత్తలను పట్టుకుని నేలలోని ప్రధాన భాగాలను శుభ్రం చేస్తాం. అయినా మరుసటి రోజు మళ్ళీ అదే సంఖ్యలో నత్తలను చూస్తాం" అని సునంద చెప్పారు.
"జూన్ నెలలో, నత్తలు (మళ్ళీ) రావడం మొదలెడతాయి," అని ఆమె భయపడుతూ చెప్పారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి