సగం తయారయిన గుర్రం బొమ్మని దిండుగా పెట్టుకుని రోడ్డుపక్క పడుకున్న జుఆరా రాం దగ్గరలో కారు ఆగడంతో మేలుకున్నారు. ఈ 60 ఏళ్ళ కళాకారుడు కారులో కూర్చున్న వ్యక్తి దగ్గరకి పరుగున వెళ్ళి, తన బొమ్మ గుర్రం ఎంత గట్టిదో చూపించటానికి దాని మీద కూర్చున్నారు. అది 300 రూపాయిలు. తప్పనిసరిగా రావలసిన బేరం. ఆ కొనుగోలుదారు 200 రూపాయిల కంటే ఎక్కువ ఇవ్వనన్నాడు. అలా జురారాంకి ఆ రోజుకి మొదటి అమ్మకం సాయంత్రం 4 గంటలకి అయింది - ఆ రోజుకు బహుశా అదే చివరిదేమో.
జురారాం విశ్రాంతి తీసుకుంటున్న చోటుకి దగ్గరగా వెదురు కర్రల మీద టార్పాలిన్, ప్లాస్టిక్ పట్టాలతో కప్పిన గుడిసె ఉంది. అందులోనే ఆయన భార్య బుగ్లీ బాయి, వారి ఇద్దరు కొడుకులు, వారి భార్యలు పిల్లలతో నివాసం ఉంటున్నారు. వారి గుడిసె, అలాగనే ఉన్న 40-50 గుడిసెల సమూహంలో వంతెనకు దగ్గరగా, అమానిషాహ్ కాలవ మీద, అంబారీ దర్గా దగ్గర పడమటి జైపూర్ లో ఉంది. ఇక్కడ నివసించే ఈ కుటుంబాలు భట్(రాజస్థాన్ లో ఒ.బి.సి క్రిందకి వస్తారు) కులానికి చెందిన వారు. వీరు ఎండు గడ్డితో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు వంటి అలంకరణ వస్తువులు తయారు చేస్తారు.
"ఏ సంవత్సరమో నాకు గుర్తు లేదు, కానీ మా నాన్నగారు నాగ్పూర్ జిల్లాలోని దిద్వాన పట్టణం నుండి జైపూర్ కి వచ్చారు." అని జురారామ్ చెప్పారు. బొమ్మల తయారీ క్రమంలో గడ్డి నమూనా చేయటం ముఖ్యమైన పని. నమూనా చేస్తున్నప్పుడు ఆకారానికి ఆసరాగా సన్నని వెదురు పుల్లలు అక్కడక్కడ దూర్చి ఉంచి, ఆ ఎండు గడ్డి నమూనాని వైరుతోను, తాడుతోను కట్టి రూపం తీసుకువస్తారు. అప్పుడు దాన్ని బుగ్లిబాయి కి ఇస్తే, ఆవిడ ఎరుపు ముఖమల్ గుడ్డతో బొమ్మ మొత్తం కుట్టి, బంగారు రంగు లేసుతో అలంకరిస్తారు. ఈ విధంగా ఒక బొమ్మ చేయటానికి వారికి రెండు నుండి మూడు గంటలు పడుతుంది.
ఏ గుడిసె ముందైతే వాళ్ళు కూర్చుని బొమ్మలు తయారు చేస్తున్నారో అదే వారి ఇల్లు, అదే వారు పనిచేసే చోటు, అదే వారి 'గోదాము' కూడా. ఈ తాత్కాలిక ఇంటిని ఇప్పటికి నాలుగు సార్లు పైనే కదప వలసి వచ్చింది, ప్రతీసారి పోలీసులు, జైపూర్ పట్టణ అధికారులు ఈ తాత్కాలికమైన ఆవాసాలని అక్రమ కట్టడాలు అని నేలమట్టం చేసిన తరువాత మళ్ళీ ఇంటిని కట్టుకోవలసి వస్తుంది. వీళ్ళు ప్రస్తుతం ఉన్న చోట నీళ్లు లేవు, నీటి కోసం టాంకర్ల మీద చుట్టు పక్కల దుకాణాల మీద ఆధారపడుతున్నారు. మరుగు దొడ్లు లేవు. వాటి కోసం పబ్లిక్ మరుగు దొడ్లు, అమనిషాహ్ కాలువ దగ్గర స్థలాలు వాడుతున్నారు. కరెంటు కోసం చాలా కుటుంబాలు బ్యాటరీతో ఛార్జ్ చేసిన ఎల్ఈడీ దీపాలు వాడతారు.
జుఆరారాం కుటుంబానికి కూడా అక్కడ వంతెన దగ్గరగా ఉంటున్న అందరి లాగా, స్వంతంగా కొద్దిపాటి పొలమంటూ ఎప్పుడూ లేదు. వీరిలో చాలా మంది రాజస్థాన్ లోని జోధపూర్, నాగపూర్ జిల్లాలలోని పల్లెల నుండి వచ్చారు. వీరి వంశ పారంపర్యక వృత్తి చెక్క బొమ్మలు చేసి, ప్రదర్శనలు ఇవ్వటం అని ఆయన చెప్పారు, కానీ ప్రస్తుతం వీరు ప్రధానంగా ఎండు గడ్డి, ముఖమల్ గుడ్డతో అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు.








