“అదిగదిగో! అక్కడ చూడు, మ్యాజిక్ బైక్! కూరల సంచీ నడిపిస్తున్న బైక్” తన బైక్ తీసి చంద్ర కూరగాయలు రవాణా చేసినప్పుడల్లా ఆ ఊరిలో కుర్రాళ్ళు వేళాకోళంగా అనే మాటలవి. మేలక్కాడు గ్రామంలో తన పొలం నుంచి కూరగాయలను సంచుల్లో నింపి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివగంగై మార్కెట్ కి తన మోపెడ్ మీద తీసుకుని వెడుతుంది. “నేను మోపెడ్ మీద ముందు, వెనకా కూరల సంచులు పెట్టుకుంటా కదా. బండి ఎవరు నడుపుతున్నారో కనిపించదు. అందుకని వాళ్ళు అలా వేళాకోళం చేస్తారు,” అంటుంది చంద్ర.
వరండాలో, మోపెడ్ పక్కనే ఒక జనప నార నవారు మంచం మీద కూర్చుని ఉండగా చూస్తే నిజంగానే చంద్ర చాలా చిన్న ఆకారంగా కనిపిస్తుంది. సన్నగా, పీలగా పద్దెనిమిది ఏళ్ళ యువతిలా అనిపించే చంద్రకు ఇరవై ఎనిమిదేళ్ళ వయస్సు. ఇద్దరు పిల్లల తల్లి ఆమె. చురుకుగా వ్యవసాయం చేసుకునే రైతు అయిన చంద్ర, వితంతువని ఊరిలో పెద్దవాళ్ళు జాలి చూపిస్తే సహించలేదు. “నేను ఏమయిపోతానా అని మా అమ్మతో సహా ఊరిలో వారందరికీ ఆందోళన. నిజమే. నాకు 24 ఏళ్ళ వయసులోనే నా భర్త చనిపోయాడు. కానీ, నేను బతుకు సాగించాలని అనుకుంటున్నాను. నన్ను కుంగదీయకండి అని వాళ్లకి చెప్తుంటాను."
చంద్ర దగ్గర ఉండడం అంటే దిగులుకి దూరంగా ఉండడమే. చిన్న చిన్న విషయాలకి, ముఖ్యంగా తన గురించి తానూ చిటుక్కున నవ్వేస్తుంటుంది చంద్ర. పేదరికంలో మగ్గిపోయిన బాల్యం జ్ఞాపకాలని తన హాస్యంతో మెత్తబరచి చెప్తుంది ఆమె. "ఒక రోజు రాత్రి మా నాన్న మమ్మల్ని నిద్ర లేపారు. నాకప్పుడు పదేళ్ళు కూడా లేవు. చందమామ చూడండి, గుండ్రంగా, తెల్లగా ఉన్నాడు. ఆ వెన్నెల్లో మనం పంట కోత వేద్దాం పదండి, అన్నారు ఆయన. తెల్లవారుతోందేమొలే అని మా అన్న, అక్కా, నేనూ నాన్నతో పాటు పొలానికి వెళ్లాం. నాలుగు గంటలపాటు మేము అలా వరి కోతలు కోశాం. అప్పుడు నాన్న మమ్మల్ని ఆపి, ఇంక పదండి, కొంచెం సేపు నిద్రపోతే తర్వాత లేచి స్కూల్ కి వెళ్ళచ్చు అని ఇంటికి తీసుకుని వచ్చారు. అప్పుడు తెల్లవారుజాము మూడు గంటలయ్యింది అంతే. నిజంగా నమ్ముతారా? రాత్రి పదకొండు గంటలకి నాన్న మమ్మల్ని పొలానికి లాక్కుపోయారు?"
చంద్ర తన పిల్లలతో మాత్రం ఎప్పుడూ అలా చేయదు. తన పిల్లలకు తనే సర్వస్వం అయినా ఎనిమిదేళ్ళ ధనుష్ కుమార్ కి, అయిదేళ్ళ కూతురు ఇనియాకి చదువు చెప్పించాలని కృతనిశ్చయంతో ఉంది. దగ్గరలో ఉన్న ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వాళ్ళు చదువుకుంటున్నారు. ఆ పిల్లల కోసమే చంద్ర తానూ రైతు కావాలని నిర్ణయించుకుంది.
“నాకు పదహారేళ్ళ వయసులో మా అత్త కొడుకుతో పెళ్లి అయింది. నా భర్త సుబ్రమణ్యన్, నేనూ తిరుప్పూరులో ఉండేవాళ్ళం. ఒక దుస్తుల కంపెనీలో తను టైలర్ గా పని చేసేవాడు. నేను కూడా కొన్నాళ్ళు అక్కడ పని చేశాను. నాలుగేళ్ల క్రితం మా నాన్న ఒక రోడ్ ప్రమాదంలో చనిపోయారు. నా భర్త దానితో దుఃఖంలో మునిగిపోయాడు. నలభై రోజుల తర్వాత తను కూడా ఉరి వేసుకుని చనిపోయాడు. మా నాన్న అంటే అంత ప్రేమ ఆయనకు. అంతా మా నాన్నే,"
చంద్ర తన గ్రామానికి తిరిగి వచ్చి అమ్మతో కలిసి ఉండడం మొదలు పెట్టింది. మళ్ళీ టైలర్ పని చేసేందుకు ఆమె వెనుకాడింది. అలా అని చదువుకోవడం తేలిక అనిపించలేదు. రెండు పనులూ కష్టమే. ఉద్యోగం చేస్తే పిల్లలకు రోజంతా దూరంగా ఉండాలి. పోనిలే డిగ్రీ చదువుకున్దామా అంటే ముందు 12 వ తరగతి పరీక్ష పాస్ కావాలి. "నేను డిగ్రీ తెచ్చుకునేంత వరకు, నా పిల్లలను ఎవరు చూసుకుంటారు? మా అమ్మ పాపం చాలా సహాయపడుతుంది.. అయినా కూడా..."
మాటల్లో అనకపోయినా వ్యవసాయం కొంచెం వెసులుబాటు ఉన్న వృత్తి అని చంద్ర అభిప్రాయం. తన పొలం ఇంటి వెనకాలే ఉండడంతో హాయిగా నైటీలోనే తన పెరట్లోనే పని చేసుకోవచ్చు అని సంబరపడుతుంది ఆమె. చంద్ర తండ్రి మరణించగానే, తల్లి, 55 సంవత్సరాల చిన్నపొన్ను ఆర్ముగం తనకున్న పన్నెండు ఎకరాల పొలాన్ని తన ముగ్గురు పిల్లల మధ్య పంచింది. ఇప్పుడు తల్లీ కూతుళ్ళు ఇద్దరూ కలిసి కూరగాయలు, వరి, చెరుకు, మొక్కజొన్న పండిస్తున్నారు. చిన్న పొన్ను క్రితం సంవత్సరం చంద్ర కోసం ఒక ఇల్లు కూడా కట్టించింది. చిన్నదైనా గట్టిగానే ఉంది ఆ ఇల్లు. కానీ అందులో మరుగుదొడ్డి లేదు. “ఇనియా పెరిగి పెద్దయ్యేలోపు నేను తప్పకుండా టాయిలెట్ కట్టిస్తా,” చంద్ర హామీ ఇచ్చింది.
ఇలాంటి పెట్టుబడులకీ, పిల్లల స్కూల్ ఫీజు, యూనిఫాం వంటి ఖర్చులకీ చంద్ర తన చెరుకు పంట మీద ఆధారపడుతుంది. వరి పంట నుంచి మూడు నెలలకొకసారి వచ్చే ఆదాయం, రోజూ కూరలు అమ్మగా వచ్చే కొన్ని వందల రూపాయలు ఇల్లు నడపడానికి ఉపయోగపడతాయి. ఈ సంపాదన కోసం ఆమె రోజులో పదహారు గంటలు కష్టపడుతుంది. ఇంటిపని, వంట, పిల్లల టిఫిన్ డబ్బా కట్టేందుకు ఆమె ఉదయం నాలుగు గంటలకు లేచి పని ప్రారంభిస్తుంది.
ఆ తర్వాత ఆమె పొలానికి వెళ్లి వంకాయలు, బెండకాయలు, సొరకాయలు కోస్తుంది. ఆ మీదట ధనుష్ నీ, ఇనియాని తయారు చేసి స్కూల్ కి నడిపించి తీసుకువెడుతుంది. “పిల్లలను దింపేటప్పుడు సరిగ్గా దుస్తులు వేసుకుని రావాలని స్కూల్ వాళ్ళు పట్టుపడతారు. అందుకే నైటీ మీద చీర కట్టుకుని వెడతా,” చంద్ర నవ్వుతూ చెప్తుంది. వెనక్కి వచ్చి ఆమె మధ్యాహ్నం వరకు పొలంలో పని చేస్తుంది. “ఒక అరగంట ఏమైనా విశ్రాంతి తీసుకుంటా కానీ పొలంలో ఎప్పుడూ పని ఉంటుంది. ఎప్పుడూ!”
మార్కెట్ కి వెళ్ళాల్సిన రోజుల్లో చంద్ర కూరగాయల మూటలను తన మోపెడ్ మీదకి ఎక్కిస్తుంది. శివగంగై మార్కెట్ కి తీసుకువెడుతుంది. “చిన్నప్పుడు, నేను ఒక్కత్తినీ ఎక్కడకీ వెళ్లేదానిని కాదు. నాకు అసలు ఎంత భయమో. ఇప్పుడో? రోజుకి నాలుగుసార్లు టౌన్ లోకి వెడుతుంటా.”
విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనేందుకు చంద్ర శివగంగై వెడుతుంటుంది. “స్కూల్లో క్రిస్మస్ కి ఏదో కార్యక్రమం ఉందని ఇనియా నిన్న కొత్త డ్రెస్ కావాలని పట్టుపట్టింది. అది కూడా ఇప్పుడే కావాలి అని,” బిడ్డని తలచుకుని చంద్ర మురిపెంగా నవ్వుతుంది. వరి సీజన్లో పొలంలో తనకు సహాయపడే వారికి ఇచ్చే కూలితో సహా ఆమెకు రోజూ అయ్యే ఖర్చులు మొత్తం కూరగాయల అమ్మకం నుంచి వస్తాయి. “కొన్ని వారాలు, 4,000 రూపాయలు సంపాదిస్తాను. ధరలు బాగా పడిపోయినప్పుడు అందులో సగం కూడా రాదు.” చిన్న రైతు అయిన చంద్ర తానూ స్వయంగా పండించిన కూరగాయలు అమ్మేందుకు గంటల కొద్దీ మార్కెట్లో కూర్చుంటుంది. తనే అమ్మడం వల్ల టోకు వ్యాపారులు చెల్లించే దాని కంటే కిలోకు దాదాపు ఇరవై రూపాయల వరకు ఆమెకు ఎక్కువగా లభిస్తుంది.
పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చే సమయానికి సాధారణంగా ఆమె మార్కెట్ నుంచి తిరిగి వచ్చేస్తుంది. అమ్మ పని చేస్తుండగా పిల్లలు కొంచెం సేపు పొలంలో ఆడుకుంటారు. ఆ తర్వాత ధనుష్, ఇనియా హోమ వర్క్ చేసుకుంటారు. కొంత సేపు టీవీ చూస్తారు. కుక్క పిల్లలతో, గిన్ని పిగ్స్ తో ఆడుకుంటారు. “ఈ గిన్నిపిగ్స్ చూస్తే మా అమ్మకి చిరాకు. వాటి బతుకు వ్యర్థం అంటుంది. ఇవి పందికొక్కులే, ఎలకలు అంటుంది. నేను మేకలు పెంచడం లేదని కోప్పడుతుంది,” చంద్ర నవ్వుతుంది. బొద్దుగా ఉన్న ఒక గినీ పిగ్ ని పంజరంలో నుంచి తీసి, ముద్దు చేస్తుంది. “కానీ మొన్న వారం నేను వీటి కోసం మార్కెట్ లో క్యారెట్లు కొంటుంటే ఎవరో అడిగారు అమ్ముతావా అని.” బాగా లాభం వస్తే వాటిని అమ్మవచ్చనే అనుకుంటోంది చంద్ర.
అదీ చంద్ర నైజం. దురదృష్టంలో కూడా ఏదో ఒక మంచి వెతుక్కునే తత్త్వం. సరదాగా, చమత్కారంగా మాట్లాడుతూనే, ఎంతో వివేకం, అనుభవం కనబరచే వ్యక్తిత్వం. కొబ్బరి చెట్ల పక్కన నుంచి నడచి వెడుతుంటే, చంద్ర అలా జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంది. “ఈ మధ్య చెట్లు ఎక్కడం లేదు,” అంటుంది. “ఎలా ఎక్కుతాను? ఇప్పుడు నేను ఎనిమిదేళ్ళ పిల్లాడి తల్లిని.” ఆ మరుక్షణమే ఆమె ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే వారి గురించి, చెన్నైలో వరదల గురించి, రైతులంటే బొత్తిగా గౌరవం లేకపోవడం గురించి మాట్లాడుతుంది. “నేను ఏదన్నా ఆఫీస్ లేదా బ్యాంకుకి వెడితే నన్ను ఒక మూల వెయిట్ చేయమంటారు.” మీ ఆహారం పండించే వారికి కనీసం కుర్చీ ఏది, అని అడుగుతుంది చంద్ర.
అతి చిన్న రైతు, అతి విశాల హృదయం, అద్భుతాల
బైక్. స్లైడ్ షో
.
అనువాదం: ఉషా తురగా-రేవెల్లి