2011లో నేను వాళ్ళకి చెప్పాను. మీ యూనివర్సిటీ కొంతభాగం వరకు ఒక గ్రామంలో ఉంది. దీని నివాసితులు చాలాసార్లు స్థానభ్రంశం చెందారు. అది ఏ విధంగానూ మీ తప్పు లేదా బాధ్యత కాదు. కానీ వారిని గౌరవించండి.
ముందు ఈ విషయం వారిని కుదిపివేసినా, వారు గౌరవంగానే ఉన్నారు. వీరంతా ఒడిశా కోరాపుట్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఉత్సాహవంతులైన విద్యార్థులు. వారిలో ఎక్కువమంది జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగాల నుండి వచ్చారు. చికాపూర్ కథ వారిని కలవరపెట్టింది. ఈ గ్రామాన్ని అభివృద్ధి పేరుతొ మూడు సార్లు ఏకపక్షంగా నిర్ణయించి స్థానభ్రంశం చేశారు.
నా మనసు 1993 చివర, 1994 మొదలులోకి వెళ్ళింది. అప్పట్లో గదాబా ఆదివాసీ అయినా ముక్త కదమ్(పైన ఉన్న ఫొటోలో మనవడితో పాటు ఉన్నది), 1960ల్లో భోరున కురిసిన వర్షపు రాత్రి వారిని ఎలా ఖాళీచేయించారో ఒక చెప్పింది. ఆమె తన ఐదుగురు పిల్లలను ఒక చోట చేర్చి, వారి నెత్తి మీద సామానులు పెట్టి, చీకటిగా ఉన్న అడవిలో, వర్షం పడుతుండగా తీసుకువెళ్ళింది. “మాకు ఎక్కడికి వెళ్లాలో తెలీదు. సాబ్ మమ్మల్ని వెళ్లమన్నాడు కాబట్టి వెళ్లాము. చాలా భయమేసింది.”
వారు హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)కు MIG ఫైటర్ ప్రాజెక్ట్ కోసం ఖాళీ చేయవలసి వచ్చింది. ఒడిశాలో ఆ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా రాలేదు, అక్కడ పని కూడా జరగలేదు. కానీ ఆ నేలను వారికి ఇప్పటిదాకా ఇవ్వలేదు. పరిహారమో?”మా కుటుంబానికి 60 ఎకరాల భూమి ఉండేది,” చెప్పారు జ్యోతిరామోయ్ ఖోరా. ఇతను దళితుడు, ఉద్యమకారుడు. చికాపూర్ స్థానభ్రంశం చెందడం గురించి ఇప్పటికి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాడు. “ఆ తరవాత చాలా కాలానికి మాకు 60 ఎకరాల స్థలానికి పూర్తి పరిహారంగా - 15,000 రూపాయిలు లభించాయి.” ఖాళీచేసిన గ్రామస్తులు మళ్లీ తమకు నూతన గ్రామాన్ని నిర్మించుకున్నారు, ఇది కూడా వారి స్వంత భూమిలోనే, ప్రభుత్వానిది కాదు. ఈ కొత్త గ్రామానికి, పాత గ్రామాన్ని గుర్తుచేసుకుంటూ చికాపూర్ అన్న పేరును పెట్టుకున్నారు.
చికాపూర్ కి చెందిన గదాబాలు, పరోజాలు, దోంలు(దళిత వర్గం) పేదవారేమి కాదు. వారి వద్ద చెప్పుకోదగిన ఆస్థి అయిన భూమి, పాడి ఉన్నాయి. కానీ వీరిలో ప్రధానంగా ఆదివాసీలు, మరికొందరు మాత్రం దళితులు ఉన్నారు. ఆదివాసీలు, అభివృద్ధి కోసం బలవంతపు స్థానభ్రంశం చాలా వరకు భరించారు. 1951 మరియు 1990 మధ్య భారతదేశం అంతటా 25 మిలియన్లకు పైగా మానవులు ‘ప్రాజెక్ట్‌ల’ ద్వారా స్థానభ్రంశం చెందారు. (అదీగాక, 90వ దశకంలో జాతీయ విధానం ముసాయిదా ప్రకారం వారిలో దాదాపు 75 శాతం మంది “ఇంకా పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారని” అంగీకరించారు.)
అప్పట్లో ఆదివాసీలు 7 శాతం మంది దేశంలో ఉండినా, ప్రాజెక్టుల కోసం స్ధానభ్రంశం చెందిన వారిలో 40 శాతం వీరే ఉన్నారు. 1987లో ముక్త కదం వంటి చికాపురి వాసులకు, ఇంకా ఘోరం జరిగింది. 1987లో, నావెల్ మ్యూనిషన్స్ డిపో, అర్బన్ కోలాబ్ ప్రాజెక్టుల కోసం వారిని రెండవ చికాపూర్ నుండి కూడా తరిమేశారు. “ఈసారి, నేను నా మనవలను పట్టుకుని అక్కడ ప్రదేశాన్ని వదిలాను,” అన్నది ముక్త.
నేను తరవాత 1994లో అక్కడకి వెళ్లి ఉన్నప్పుడు, వారికి మూడో ఎవిక్షన్ కు నోటీసు వచ్చింది. ఇది పౌల్ట్రీ ఫార్మ్ కోసం అయినా అయుండొచ్చు లేదా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ డిపో కోసం అయినా అయుండొచ్చు. దీనితో బహుశా ప్రపంచంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ తో ఎదుర్కొని ఒడిపోయిన గ్రామం ఇదొక్కక్కటే అయింది.
చాలా వరకు HAL కోసం తీసుకున్న భూమి, అధికారికంగా వారు చెప్పిన పని కోసం ఎన్నడూ ఉపయోగించలేదు. కానీ అందులో కొన్ని స్థలాలను వేరే పనులకు వినియోగించారు - వారి యజమానులకు తిరిగి అప్పగించడం తప్ప. అందులో కొన్ని భాగాలు, 2011 ఒడిశా సెంట్రల్ యూనివర్సిటీ కి ఇచ్చారని తెలుసుకున్నాను. జ్యోతిర్మయికోరా న్యాయం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాడు, స్థాన భ్రంశం అయిన వారి కుటుంబ సభ్యులకు HALలో చిన్న ఉద్యోగం అయినా దొరుకుతుందేమో అని చూస్తున్నాడు.
ఈ కథనాన్ని ఇంకా వివరంగా రెండు భాగాలలో రాశాను. ఇది నా పుస్తకమైన ‘ ఎవ్రిబడి లవ్స్ ఎ గుడ్ డ్రాట్’ లో ఉన్నది, కానీ అందులో కథ 1995 వరకే ఉంది.
అనువాదం అపర్ణ తోట