ఇంకాసేపట్లో, ఆహ్మదాబాద్ లో ఉన్న వెయ్యి రన్ వేల నుండి అవన్నీ ఒకేసారి టేక్ ఆఫ్ అవుతాయి. ఇంకెక్కడా కనిపించనన్ని బ్రహ్మాండమైన రంగులు ఆకాశంలో ఒక్కసారిగా ఎగురుతాయి. కానీ గర్వం అతిశయిస్తున్న వీటి పైలెట్లు మాత్రం వీటిని నేలపై నిలబడే నడుపుతారు. కానీ ఈ ఎగరవేస్తున్న వారందరికీ, ఎనిమిది మంది కార్మిక సమూహాలు సంవత్సరమంతా కష్టపడి ఈ పరిశ్రమను గాలిలో సృష్టిస్తారని తెలియదు. ఈ కార్మికులలో ఎక్కువమంది ఆడవారే ఉంటారు, ఎక్కువగా చిన్ననగరాలలో, లేక గ్రామాలలో. కాని వీరి జీవితాలు మాత్రం ఎప్పటికి పైకి ఎగరలేని.
ఇది మకర సంక్రాంతి సమయం, ఈ హిందూ పండుగను పురస్కరించుకుని నగరంలో ఎగరవేయబడే కాలిడోస్కోపిక్ రంగులలో కనపడే అనేక గాలిపటాలను అహ్మదాబాద్‌లో, గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలోని ఖంభాట్ తాలూకాలో - ముస్లిం, ఇంకా పేద హిందూ చునారా వర్గాలకు చెందిన మహిళలు తయారు చేశారు. ఐతే సహజంగానే, ఈ గాలిపటాలను ఎక్కువ ఎగరవేసేది హిందువులే.
ఈ మహిళలు సంవత్సరానికి 10 నెలలకు పైగా గాలిపటాల తయారీ పని చేస్తారు - ఇందులో చాలా తక్కువ రాబడి వస్తుంది - ముఖ్యంగా జనవరి 14న ఆకాశాన్ని అలంకరించే రంగురంగుల గాలిపటాలకు చాలా తక్కువ రాబడి వస్తుంది. ఈ తయారీలో నిమగ్నమైన రూ. 1.28 లక్షల మందిలో, ప్రతి 10 మందిలో 7 మంది మహిళలే పని చేస్తున్నారు. ఇది గుజరాత్‌లో 625 కోట్ల ఖరీదు చేసే పరిశ్రమ .
40 ఏళ్ల సబిన్ అబ్బాస్ నియాజ్ హుస్సేన్ మాలిక్ మాట్లాడుతూ, “ పతంగ్ [గాలిపటం] సిద్ధమయ్యే ముందు ఏడు జతల చేతుల గుండా వెళ్లాలి. మేము ఖంభాట్ లాల్ మహల్ ప్రాంతంలోని ఒక చిన్న సందులో అతని 12 x 10 అడుగుల ఇల్లు-అంగడి లోపల కూర్చున్నాము. అతను బయటకు అందంగా కనపడే పరిశ్రమలో ఉన్న పనిని, అంతగా తెలియని మాకు తెలియచెబుతున్నాడు. వెనుకే నిగనిగలాడే వెండి పాకేజ్లో గాలిపటాలు, అమ్మకందారులకు పంపడానికి సిద్ధంగా కట్టిపెట్టి ఉన్నాయి.
రంగురంగుల ప్యాక్ చేయని గాలిపటాలు అతని ఒక గది ఇంటిలో సగానికి పైగా నేలను ఆక్రమించాయి. అతను మూడవ తరం కాంట్రాక్ట్ తయారీదారు, మకర సంక్రాంతికి సామాగ్రిని సిద్ధం చేయడానికి 70 మంది హస్తకళాకారుల సైన్యంతో సంవత్సరం పొడవునా పని చేస్తున్నాడు. ఆ గాలిపటాలను నిర్వహిస్తున్న ఎనిమిదో జత చేతులు అతనివే అని మీరు చెప్పవచ్చు.
విశ్వసించే వారికి, మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిచక్ర చిహ్నంలోకి వెళ్లడాన్ని సూచిస్తుంది. ఇది అస్సాంలోని మాగ్ బిహు, బెంగాల్‌లోని పౌష్ పర్బోన్ తమిళనాడులోని పొంగల్ వంటి విభిన్న సంప్రదాయాలు, పేర్లతో భారతదేశం అంతటా జరుపుకునే పంట పండుగ. గుజరాత్‌లో దీనిని ఉత్తరాయణం అంటారు, ఇది శీతాకాలపు సమయంలో సూర్యుని ఉత్తరం వైపు ప్రయాణాన్ని సూచిస్తుంది. ఈ రోజుల్లో ఉత్తరాయణం అంటే గాలిపటాలు ఎగరేసే పండుగకు పర్యాయపదంగా మారింది.
అహ్మదాబాద్‌లోని పాతబస్తీలోని ఇళ్లలోనే ఎత్తైన భవనమైన మా పూర్వీకుల ఇంటి డాబాపై మొదటిసారి గాలిపటం ఎగురవేసినప్పుడు నాకు ఆరేళ్లు. గాలి బాగానే ఉన్నప్పటికీ, నా గాలిపటాన్ని గాలిలోకి తీసుకెళ్లడానికి నాకు ఆరు అదనపు చేతులు అవసరమైనాయి. మొదటి రెండు చేతులు మా నాన్నవి, అతను కిన్నా(కడ్డీ) కట్టాడు. రెండవ జత చేతులు మరింత ఓపికగలవి, మాంజా (రంగు దారం)తో ఫిర్కీ (చరఖా )ని స్థిరంగా పట్టుకునే నా తల్లివి. చివరి రెండు చేతులు పొరుగు భవనంపై ఉన్న నాకు తెలియని మంచి మనిషివి. నా గాలిపటాన్ని రెండు క్షితిజ సమాంతర చివర్లలో పట్టుకుని, అతని టెర్రస్ చివరి మూల వరకు నడిచి - చేతులు ఆకాశం వైపు చాచి- సన్నని గాలి పలుచని కాగితాన్ని చుట్టుముట్టే వరకు వేచి ఉన్నాయి, అప్పుడు నేను నా గాలిపటాన్ని గాలిలోకి లాగగలిగాను.
పాత అహ్మదాబాద్‌లో పెరిగిన వ్యక్తి ఎప్పుడూ పతంగుల ను మామూలు విషయంగానే చూస్తారు. అవి అనేక పరిమాణాలు, ఆకారాలలో ఉండే చిన్న కాగితపు పక్షులు, ఇవి ఉత్తరాయణంలో ఆకాశాన్ని నింపడానికి రోజుల ముందు అటకపై దాచిన పాత ట్రంక్‌ల నుండి ఎగిరి వచ్చాయి, లేదా రద్దీగా ఉండే పాత నగర మార్కెట్ల నుండి కొనుగోలు చేయబడ్డాయి. గాలిపటం చరిత్రను లేదా దానిని తయారు చేసే హస్తకళను, ఇక దాని తయారీదారుల జీవితాలను గురించి ఎవరు ఆలోచించరు - ఈ అదృశ్య సిబ్బంది మన పతంగ్ లను కొద్దిసేపు గాలిలో ఉంచడానికి ఏడాది పొడవునా పని చేస్తారు.
ఈ కాలంలో పిల్లలు పిచ్చెక్కినట్లు గాలిపటాలు ఎగురవేస్తారు. కాని గాలిపటాల తయారీ మాత్రం చిన్న పిల్లల వ్యవహారం కాదు.
*****
"ప్రతి పనిని వేరే కరిగర్ [హస్తకళా కార్మికుడు] చేస్తారు," అని సబిన్ మాలిక్ వివరించాడు. “ఒక వ్యక్తి కాగితాన్ని కట్ చేస్తారు, మరొకరు పాన్ ను [గుండె ఆకారంలో ఉన్న కట్-అవుట్] అతికిస్తారు, మూడవవారు డోరీ [గాలిపటంకి అతికించిన అంచు]ని, నాల్గవ వ్యక్తి ధద్ధో [వెన్నెముక]ను అంటిస్తారు. తరువాత, మరొక కరిగర్ కమ్మన్ [అడ్డంగా ఉండే ముక్క]ను పెడతారు, ఇంకొకరు మోర్ , చిపా , మాతా జోడి , నీచి జోడి [ బలానికోసం వివిధ భాగాలపై అతికించే ప్రదేశాలు] అంటిస్తాడు, ఒకరు గాలిపటానికి అతికించే ఫుడాడి [తోక]ని తయారు చేస్తారు.
మాలిక్ నా ముందు గాలిపటం పట్టుకుని, తన వేలితో ఒక్కో భాగాన్ని చూపిస్తూ వివరిస్తున్నాడు. అర్థం చేసుకోవడానికి నా నోట్‌బుక్‌లో ఒక స్కెచ్ గీశాను. ఈ సాధారణ-క్లిష్ట పని వాస్తవానికి ఖంభాట్‌లోని అనేక ప్రాంతాలలో జరుగుతుంది.
"సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న షకర్‌పూర్‌లో, మేము డోరీ సరిహద్దులో ఒకే ఒక పనిని పూర్తి చేసాము," అని సబిన్ మాలిక్ తన కున్న పరిచయాలను వివరిస్తూ చెప్పాడు. “అక్బర్‌పూర్‌లో వారు పాన్ / సంధా [డిజైన్ జాయింట్లు] మాత్రమే చేస్తారు. సమీపంలోని దాడిబాలో వారు దద్ధా [వెన్నెముకలను] అంటిస్తారు. మూడు కిలోమీటర్ల దూరంలోని నగారా గ్రామంలో వారు కమ్మను అంటిస్తారు, మటన్ మార్కెట్‌లో వారు పట్టి కామ్ చేస్తారు [బలానికి టేపులను వేస్తారు]. అక్కడ ఫుడాడీ లు కూడా చేస్తారు.”
గుజరాత్‌లోని ఖంభాట్, అహ్మదాబాద్, నదియాడ్, సూరత్, ఇంకా ఇతర ప్రాంతాల్లో గాలిపటాల తయారీలో ఉన్న ప్రతి ఒక్కరి కథా ఇదే.
60 ఏళ్ల మునావర్ ఖాన్ అహ్మదాబాద్‌లో ఇదే వ్యాపారంలో నాల్గవ తరానికి చెందినవాడు. అహ్మదాబాద్‌లోని బెల్లార్‌పూర్ ఇండస్ట్రీస్, కోల్‌కతాలోని త్రిబేని టిష్యూస్ అనే తయారీదారుల పేర్లతో బెల్లార్‌పూర్ లేదా త్రిబేని అనే గాలిపటాల కాగితాలను తెప్పించడంతో అతని పని ప్రారంభమవుతుంది. వెదురు కర్రలు అస్సాం నుండి వస్తాయి, కోల్‌కతాలో వీటిని వివిధ పరిమాణాలలో కత్తిరిస్తారు. కొనుగోలు చేసిన పేపర్ రీమ్‌లను వివిధ రకాల పరిమాణాలు, ఆకారాలలో కత్తిరించడానికి అతను వర్క్‌షాప్‌కి వెళ్తాడు.
వాటిని ఒక్కొక్కటి 20 షీట్‌ల చక్కని కట్టలుగా ఉంచి, పెద్ద కత్తిని ఉపయోగించి గాలిపటం పేపర్‌లకు అవసరమైన సైజుల్లో కుప్పను చీల్చడం ప్రారంభిస్తాడు. కత్తిరించిన కాగితాలను పేర్చి, ఆ తరవాత హస్తకళా కార్మికుడికి అందజేస్తాడు.
ఖంభాట్‌లో, 41 ఏళ్ళ రాజ్ పతంగ్‌వాలా అదే పని చేస్తాడు. "నాకు అన్ని పనులు తెలుసు," అన్నాడు. అతను మాట్లాడుతూ తన గాలిపటాల కోసం ఆ కాగితాలను తేలికైన ఆకారాలలో కత్తిరించాడు. "కానీ నా అంతటా నేను ఇంత పనిని చేయలేను. మాకు ఖంభాట్‌లో చాలా మంది కార్మికులు ఉన్నారు, కొందరు పెద్ద గాలిపటాలపై పని చేస్తారు, కొందరు చిన్న వాటిపై పని చేస్తారు. ప్రతి పరిమాణానికి మా వద్ద 50 రకాల గాలిపటాలు ఉన్నాయి.”
మా టెర్రేస్ నుండి దాదాపు మూడు మీటర్ల దూరంలో ఉన్న ఘెన్‌షియో (దిగువ భాగంలో టాసెల్ ఉన్న గాలిపటం) నా చేతికి అందే సమయానికి, అనేక ఆకృతుల వివిధ రంగుల గాలిపటాలు ఆకాశంలో అద్భుతమైన యుద్ధాలు చేస్తూ ఉంటాయి. ఆకాశమంతా చీల్స్ (పొడవాటి రెక్కలతో కూడిన పక్షి ఆకారంలో ఉండే ఫైటర్ కైట్‌లు), చందేదార్లు (వృత్తాలతో కూడిన గాలిపటం), పట్టేదార్లు (ఒకటి కంటే ఎక్కువ రంగులలో వికర్ణ లేదా క్షితిజ సమాంతర చారలతో) మరెన్నో రకాల గాలిపటాలతో నిండి ఉంటుంది.
గాలిపటం రూపకల్పన, రంగు, ఆకృతి ఎంత క్లిష్టంగా ఉంటే, దానిలోని అనేక భాగాలను ఒకదానితో ఒకటి సరిచేయడానికి అంతటి నైపుణ్యం అవసరమవడమే గాక, శ్రమ కూడా పడవలసి ఉంటుంది. 40 ఏళ్ల కౌసర్ బాను సలీంభాయ్, ఖంభాట్‌లోని అక్బర్‌పూర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా వారు ఈ పని చేస్తున్నారు.
ఆమె రంగురంగుల ఆకృతులను గాలిపటాల కవర్‌లకు సరిపోల్చింది. ఈ డిజైన్‌ను పూర్తి చేయడానికి వాటిని వాటి అంచుల వద్ద జిగురు తో అంటించింది. "మేమంతా ఇక్కడ ఈ పని చేస్తున్న మహిళలం," కౌసర్ బాను గుమిగూడిన వారిని చూపిస్తూ చెప్పింది. "పురుషులు కర్మాగారాల్లో కాగితం కత్తిరించడం లేదా గాలిపటాలు అమ్మడం వంటి ఇతర పనులు చేస్తారు."
కౌసర్ బాను ఉదయం, మధ్యాహ్నం, ఇంకా తరచుగా రాత్రి పూటలు కూడా పని చేస్తుంది. “నేను చేసే వెయ్యి గాలిపటాలకు చాలాసార్లు 150 రూపాయలు వస్తాయి. అక్టోబర్ నవంబర్‌లలో, డిమాండ్ పెరిగినప్పుడు, అది 250 రూపాయలు కూడా వస్తాయి,” అని ఆమె వివరించింది. "మేము ఆడవారిని ఇంట్లో పనిచేస్తాము, వంట కూడా చేస్తాము."
సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ 2013లో జరిపిన అధ్యయనం ప్రకారం పరిశ్రమలో 23 శాతం మంది మహిళలు రూ. నెలకు 400 కన్నా తక్కువ సంపాదిస్తున్నారు. వారిలో ఎక్కువ భాగం రూ. 400 నుండి రూ. 800 వరకు సంపాదిస్తున్నారు. కేవలం 4 శాతం మంది నెలకు రూ.1,200 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.
అంటే, వారిలో ఎక్కువ మంది సంపాదన, వెయ్యి రూపాయిలు ఖరీదు చేసే ఒక పెద్ద డిజైనర్ గాలిపటం అమ్మకం కంటే తక్కువుంటుంది. చవుకైన గాలిపటం కొనాలనుకుంటే 150 రూపాయలకు ఐదు గాలిపటాలను ఎంచుకోవాల్సి వస్తుంది. ఇన్ని శ్రేణుల ధరలు, ఆకారాలు పరిమాణాల వలన అయోమయంగా ఉంటుంది. ఇక్కడ అతి చిన్న గాలిపటాలు 21.5 x 25 అంగుళాలు ఉంటాయి. అతిపెద్దవి చిన్నవాటి పరిమాణం కన్నా రెండు నుండి మూడు రెట్లు పెద్దగా ఉంటాయి.
*****
నా గాలిపటం కొద్దిపాటి దూరం మాత్రమే ఎగిరి మళ్లీ కింద పడుతుండగా దూరం నుండి చూస్తున్న ఒకతను “ధద్ధో మచద్! ” (“మధ్యలో ఉన్న వెదురు వెన్నెముకను మెలితిప్పండి”) అన్నాడు. అందుకని నా చిన్న చేతులతో గాలిపటాన్ని పై చివర, క్రింది చివర పట్టుకుని దాని వెన్నెముకను తిప్పాను. వెన్నెముక మృదువుగా ఉండాలి కానీ మెలితిప్పినప్పుడు విరిగిపోయేంత బలహీనంగా ఉండకూడదు.
దశాబ్దాల తర్వాత, ఖంభాట్‌లోని చునర్వాడ్‌లో 25 ఏళ్ల జయబెన్ వెదురు వెన్నెముకను గాలిపటానికి అతికించడాన్ని చూస్తున్నాను. ఆమె ఉపయోగించే జిగురు ఇంట్లోనే ఉడికించిన సాబుదానా (సగ్గుబియ్యం)తో తయారు చేయబడింది. ఆమెలాంటి కళాకారిణికి ఇలా వెయ్యి వెన్నెముకలను అతికించినందుకు 65 రూపాయిలు అందుతాయి. ఈ తయారీ గొలుసులో తదుపరి కార్మికుడు గాలిపటానికి కమ్మన్ (అడ్డ ముక్క)ను అమర్చాలి.
అయితే ఉండండి, కమ్మన్ ను పాలిష్ చేసి మృదువుగా చేయాలి. చునర్వాడ్‌కు చెందిన ఆషాబెన్ (36) కొన్నేళ్లుగా ఆ వెదురు కర్రలను చీల్చి తయారు చేస్తోంది. ఆమె ఇంట్లో కర్రల కట్ట, సైకిల్-ట్యూబ్ రబ్బరు ముక్కను తన చూపుడు వేలికి చుట్టుకుని, పదునైన రేజర్ కత్తితో వాటిని చీలుస్తోంది. "అలాంటి వెయ్యి కర్రలను చీల్చినందుకు నాకు 60 నుండి 65 రూపాయలు లభిస్తాయి" అని అషాబెన్ చెప్పింది. “ఈ పని చేయడం వల్ల మా వేళ్లు చాలా గరుకుగా అవుతాయి. పెద్ద బద్దలను చీల్చినప్పుడు రక్తం కూడా కారవచ్చు.”
ఇప్పుడు కమ్మన్ మృదువుగా తయారైంది, ఇక ఇది బాండింగ్ కు వెళ్ళాలి. 60 ఏళ్ళ జమీల్ అహ్మద్ కు అహ్మదాబాద్‌లోని జమాల్‌పూర్ ప్రాంతంలో ఒక చిన్న దుకాణం ఉన్నది. ఇప్పటికీ కమ్మన్‌ల కోసం కొన్ని రకాల బ్యాండింగ్‌లు చేస్తూనే ఉన్నాడు. అతను ఎనిమిది బర్నర్లు ఉన్న కిరోసిన్ ల్యాంప్ బాక్స్ మంటల మీదుగా వెదురు కర్రలను పోనిచ్చాడు. ఇలా చేయడం వలన వెదురు కర్రలపై నల్లని పట్టీ గుర్తులు కనపడతాయి.
జమీల్ తన కమ్మన్‌లను సరైన స్థలంలో అతికించడానికి ప్రత్యేకమైన జిగురును ఉపయోగిస్తాడు. "గాలిపటం తయారీలో మీకు మూడు నుండి నాలుగు రకాల జిగురులు అవసరం, ఒక్కొక్కటి వేర్వేరు పదార్థాల నుండి తయారు చేసినవి. ఇవి వేర్వేరుగా పనిచేస్తాయి." అతను మోర్ థూ థు అని పిలిచే కోబాల్ట్ పిగ్మెంట్లతో కలిపి మైదాతో తయారు చేయబడిన లేత నీలం రంగు జిగురును ఉపయోగిస్తున్నాడు. ప్రతి వేయి కమ్మన్లను ఫిక్సింగ్ చేసినందుకు అతనికి 100 రూపాయిలు అందుతాయి.
అహ్మదాబాద్‌లోని జుహాపురాలో 35 ఏళ్ల షహాబియా, డోరీ అంచు పనికి ఉపయోగించే జిగురు, జమీల్ వాడే జిగురుకి భిన్నంగా ఉంటుంది. ఆమె ఇంట్లో వండిన అన్నం నుండి ఈ జిగురును తయారు చేస్తుంది. ఎప్పటి నుండో దీన్నే జిగురుగా వాడుతున్నానని, సీలింగ్ నుండి తన తలపై వేలాడుతున్న మందపాటి దారపు పోగులలోంచి ఒక దారపు తీగెను లాగుతూ ఆమె చెప్పింది. ఆమె గాలిపటం అంచు చుట్టూ ఆ దారాపు పోగును వేగంగా అంటిస్తూ పోతుంది, తన వేళ్లకు అంటుకున్న సన్నని జిగురు పొరను దారం మీదకు మారుస్తుంది. ఆమె పని డెస్క్ కింద ఒక గిన్నె నిండా లై (బియ్యం జిగురు) దాగి ఉంది.
“నా భర్త ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ పని చేయలేను. నేను ఇదంతా చేస్తుంటే అతనికి కోపం వస్తుంది.” ఆమె చేసే పని గాలిపటానికి బలాన్ని ఇస్తుంది, అంచులు చిరిగిపోకుండా కాపాడుతుంది. ఇలా ఆమె వెయ్యి గాలిపటాలు చేస్తే ఆమ్మెకు రూ. 200 నుంచి రూ. 300 వరకు వస్తాయి. ఆ తర్వాత, వేరే స్త్రీలు ప్రతి గాలిపటం వెన్నెముకను బలోపేతం చేయడానికి, దాని అడ్డకర్ర ముక్క, అంచుని పట్టుకుని ఉండేట్టుగా చిన్న చిన్న కాగితాలను అతికిస్తారు. ఇలా చేసిన ప్రతి వెయ్యి గాలిపటాలకు 85 రూపాయిలు అందుకుంటారు.
42 ఏళ్ళ ఫిర్దోస్ బాను, కట్టివేసి ఉంచిన ఇంద్రధనుసులను తన చేతి నుండి మా ముందుకు వేలాడదీసి చూపిస్తోంది. ప్రకాశవంతంగా, రంగురంగులుగా ఉన్న గాలిపటం కాగితం-కుచ్చులు (లేదా తోకలు) కలిపి, ఒకే గుత్తిలో 100 దాకా ఉన్నాయి. అక్బర్‌పూర్‌లోని ఈ ఆటోడ్రైవర్ భార్య గతంలో ఆర్డర్‌పై పాపడ్ ను తయారు చేసేది. “కానీ అది చాలా కష్టంగా ఉంది, పాపడ్‌లను ఆరబెట్టడానికి మాకు స్వంత డాబా లేదు . ఈ పని కూడా అంత తేలికైనదేమి కాదు, నాకు ఆదాయం కూడా చాలా తక్కువగా వస్తుంది," అని ఫిర్దోస్ బాను చెప్పారు, "కానీ నాకు వేరే పని తెలియదు."
గాలిపటం డిజైన్, రంగు, ఆకృతి క్లిష్టంగా ఉంటే, దాని అనేక భాగాలను సరిచూసి ఒకటిగా చేయడానికి తగిన నైపుణ్యమూ శ్రమ అవసరం
పొడవాటి పదునైన కత్తెరతో, ఆమె తాను తయారు చేస్తున్న కుచ్చుల పరిమాణాన్నిబట్టి కాగితాన్ని ఒక వైపు నుండి స్ట్రిప్స్‌గా కత్తిరిస్తుంది. ఆ తర్వాత ఆమె కత్తిరించిన కాగితాన్ని ఆమె కుమార్తెలు 17 ఏళ్ళ దిల్షాద్ బాను, 19 ఏళ్ళ మహేరా బానులకు అందజేస్తుంది. వారు కత్తిరించిన కాగితాన్ని తీసుకుని - ముందుగా తయారు చేసిన లై లో కొద్దిగా కాగితం మధ్యలో పూస్తారు.ఆమె బొటనవేలు చుట్టూ చుట్టబడిన గుత్తి నుండి ఒక దారాన్ని లాగి దానిని ఒక ఖచ్చితమైన ఫుడాడీ గా మారుస్తుంది. ఈ గాలిపటం తయారీ గొలుసులోని తరువాతి కార్మికులు గాలిపటానికి తోకను కట్టినప్పుడు అది ఎగరడానికి యోగ్యమైనదిగా మారుతుంది. ముగ్గురు మహిళలు కలిసి ఇటువంటి వెయ్యి తోకలను చేస్తే, వారికి 70 రూపాయిలు వస్తాయి.
“లాప్పెట్…! ” [“చరఖాని తిప్పు”] – ఈసారి కేకలు దూకుడుగా ఉన్నాయి. ఆకాశం నుండి మంఝా, బరువుగా కుంటుతూ, డాబాల మీదుగా పడిపోయింది. అవును, దశాబ్దాల తర్వాత, నేను ప్రేమించిన ఆ గాలిపటాన్ని కోల్పోవడం నాకు ఇంకా గుర్తుంది.
నేను ఇప్పుడు గాలిపటాలు ఎగరేయను. కాని ఈ వారం అంతా తరవాత తరాల పిల్లలు పైపైకి గాలిపటాలను ఎగురవేయడం కోసం, అంతులేని శ్రమ పడి, మనకు మకర సంక్రాంతి రంగులను ఇచ్చేవారిని వారిని కలిసాను .
కథను నివేదించడంలో సహాయం చేసిన హోజెఫా ఉజ్జయిని, సమీనా మాలిక్ జానీసార్ షేక్‌లకు రచయిత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
కవర్ ఫోటో: ఖమ్‌రూమ్ నిసా బాను ప్రస్తుతం ప్రాచుర్యం పొందిన ప్లాస్టిక్ గాలిపటాలపై పని చేస్తుంది. ఫోటో తీసినది ప్రతిష్ఠ పాండ్య.
అనువాదం: అపర్ణ తోట