జామ్‌నగర్ జిల్లా, లాల్‌పుర్ తాలూకాలోని సింగాచ్ గ్రామానికి చెందిన కుటుంబం మాది. రాయడం నాకు కొత్త. కరోనా సమయంలోనే మొదలుపెట్టాను. సంచార జాతులతో పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థలో కమ్యూనిటీ మొబిలైజర్‌గా పనిచేస్తున్నాను. మా సామాజికవర్గంలో చదువుపట్ల అవగాహనను, ఆసక్తినీ కలిగించేందుకు నేను గడచిన తొమ్మిది నెలలుగా గుజరాతీని ప్రధాన సబ్జెక్టుగా తీసుకొని ఒక బయటి విద్యార్థిగా బి.ఎ. కోర్సు చేస్తున్నాను. మా సామాజికవర్గంలోని స్త్రీలలో విద్యా స్థాయి చాలా ఆందోళనకర స్థాయిలో ఉంది. చదువుకున్న మహిళలు చాలా తక్కువమంది ఉంటారు.
చారణులు, భార్వారులు, అహీర్‌ల మాదిరిగా మేం కూడా సంచారజాతులుగా గొర్రెల పెంపకం చేపట్టి జీవించేవాళ్ళం. యిప్పుడు మాలో చాలామంది సంప్రదాయ వృత్తులను వదిలి పొలాల్లోనూ, పెద్దపెద్ద కంపెనీల్లోనూ దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. కర్మాగారాల్లోనూ, పొలాల్లో కూలీలుగానూ పనిచేసే మహిళలు కూడా ఉన్నారు. సమాజం ఈ స్త్రీలనూ, వారి పనినీ అంగీకరిస్తుంది కానీ ఒంటరిగా పని చేసే నాలాంటివారికి సామాజిక ఆమోదం లభించడం చాలా కష్టం.



