“బడికి పోయే ముందే నేనీ పనులన్నీ చేయాలి. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు?” తల్లి పాలు తాగటానికి దూడను వదులుతూ 15 ఏళ్ల కిరణ్ అడిగింది. అప్పుడు సమయం పొద్దున్నే 5 గంటలు. అనారోగ్యంగా ఉన్న ఆమె తల్లి, ఆమె తమ్ముడు రవి, వారి ఒంటిగది ఇంట్లో ఇంకా నిద్రపోతూనేవున్నారు. ఇల్లు శుభ్రం చేసుకునే ముందు ఆమె దూడను మళ్ళీ కట్టేశాక, ఆమె తాత వచ్చి ఆవు పాలు పిండుతారు.
కిరణ్ రోజూలాగే పెందలాడే నిద్ర లేచింది. కానీ ఈ రోజు పని చేయటానికి కానీ, బడికి వెళ్లటానికి కానీ ఆమె సిద్ధంగా లేదు. అలసట ఎక్కువగా ఉండే రోజుల్లో ఒకటైన బహిష్టు మొదటి రోజు అది. మరీ ముఖ్యంగా కోవిడ్ ప్రారంభం అయినప్పటి నుండి ఆమెకు కడుపులో కండరాలు తిమ్మిరిపట్టేయడం ఇంకా అధ్వాన్నం అయింది. అలా ఉన్నాకూడా ఆమె తన పనులను తప్పనిసరిగా ఉదయం 6:30కల్లా ముగించేసేయాలి. “ఉదయపు ప్రార్థన 7 గంటలకు మొదలవుతుంది. బడికి నడిచి వెళ్లటానికి నాకు 20-25 నిమిషాలు పడుతుంది,” అంటుందామె.
కిరణ్ దేవి 11వ తరగతి చదువుతున్న ప్రభుత్వ బడి ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ జిల్లా కర్వీ తెహసిల్ లో ఉన్న ఆమె ఇంటి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె, తన తమ్ముడు రవి, 40 సంవత్సరాల తల్లి పూనమ్ దేవి, 67 సంవత్సరాల తాత ఖుషీరామ్తో కలిసి అక్కడ జీవిస్తోంది. ఇంటి వెనుకనే ఉన్న 800 చదరపు అడుగుల పొలాన్ని వాళ్ల తాత చూసుకొంటారు. ఆ స్థలంలో వాళ్లు గోధుమ, శనగ, ఒక్కోసారి ఆయా కాలాల్లో పండే కూరగాయలను పండిస్తారు. పూనమ్‌కు మణికట్టులో, మోకాళ్ళలో విపరీతమైన నొప్పి ఉంది. ఆ నొప్పి ఆమెను ఇంటిపనులు చేయనివ్వదు. అందువలన కిరణ్ ఎక్కువ బాధ్యతలతో తలమునకలు అవుతోంది.
కిరణ్ రోజువారీ చేసేపని ఇప్పుడు నొప్పి కలిగించే కసరత్తుగా మారింది. “ఈ చిన్న చిన్న పనులు చేయటానికి నాకు అభ్యంతరం లేదు. కానీ బహిష్టు కండరాల తిమ్ముర్లు వచ్చినపుడు మాత్రం సమస్య అవుతుంది.”
ఉచిత సానిటరీ నాప్కిన్స్ పొందటానికి అర్హత ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని కోటిమంది ఆడపిల్లల్లో కిరణ్ ఒకటి. కోవిడ్ -19 విజృంభించిన కాలంలో కిశోరి సురక్ష యోజనా పథకం ఆగిపోయాక ఈ కోటిమంది ఆడపిల్లలు ఇబ్బంది పడ్డారు. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకూ చదువుతున్న అమ్మాయిలకు ఉచితంగా నాప్కిన్స్ ఇచ్చే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకమే కిశోరి సురక్ష యోజన (KSY). 2015లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రారంభించిన రాష్ట్ర పథకం లో భాగంగా, ప్రతి ఆడపిల్లా నెలకు 10 సానిటరీ నాప్కిన్స్ అందుకోవాల్సి ఉంది. .
ఈ పథకం కింద ఉత్తరప్రదేశ్‌లో ఎంతమంది ఆడపిల్లలు నిజంగా సానిటరీ నాప్కిన్లు అందుకొంటున్నారో తెలుసుకోవటం దాదాపు అసాధ్యం. అసలు సంఖ్యలో పదోవంతు తీసుకున్నా, ఒక పది లక్షల మంది పేద కుటుంబాల అమ్మాయిలు కోవిడ్ వచ్చిన తరువాత సంవత్సరంన్నరగా ఉచిత సానిటరీ నాప్కిన్లను పొందలేకపోయారు .
అంతేకాదు, విజయవంతంగా ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించామని చెప్పుకుంటోన్న వాదనలు కూడా నమ్మటానికి లేదు. కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని పునరుద్ధరించినా, కిరణ్‌కు ఇప్పటికీ ఉచిత సానిటరీ నాప్కిన్లు దొరకటం లేదు. లాభార్జనే ధ్యేయంగా ఉన్న సంస్థలు అమ్మే నాప్కిన్లను కొనే స్థోమత ఆమెకు లేదు. అలా కొనలేని వేలాదిమందిలో కిరణ్ కూడా ఒకరు..
కిరణ్ ఇంటినీ, పశువుల పాకనూ, ప్రధాన రహదారికి దారి తీసే ఇంటి ఆవరణ మొత్తాన్నీ చిమ్మటం పూర్తిచేసింది. అల్మరా మీద పెట్టిన పాత గడియారాన్ని చూడటానికి ఇంట్లోకి పరిగెత్తి వెళ్ళి, “ఓహ్, 6:10 అయిపోయింది” ఉలిక్కిపడుతూ అంది. “అమ్మా, తొందరగా నాకు జడలు వేయాలి, నేనిప్పుడే వచ్చేస్తా,” అంటూ కేకపెట్టి, ఇంటి బయట దాదాపు రోడ్డువారగా ఉన్న ప్లాస్టిక్ టాంకు దగ్గరలోని బహిరంగ స్థలంలో స్నానం చేయటానికి వెళ్ళింది.
బాత్రూమ్ గురించి నేనడిగిన ప్రశ్నకు ఆమె ముసిముసి నవ్వులు నవ్వింది. “ఏం బాత్రూమ్? మాకు మరుగుదొడ్డిలో వాడకానికే కావల్సినన్ని నీళ్ళు లేవు. ఇంకా బాత్రూమ్ ఎక్కడ నుండి వస్తుంది? మరుగుదొడ్డినే నేను విడిచిన బట్టలు మార్చుకోవటానికి వాడుకుంటాను,” చెప్పిందామె. కోవిడ్-19 వచ్చిన తర్వాత, మొదటి లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి, ఆమెకు బడి నుండి వచ్చే నాప్కిన్లు అందటం ఆగిపోవడంతో, తాను కాటన్ బట్టను వాడుతున్నానని చెప్పటానికి ఆమె సందేహించింది. కోవిడ్ కాలం అయిపోయిన రెండు సంవత్సరాల తరువాత కూడా, ఉత్తరప్రదేశ్‌లోని చాలా జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలలు నాప్కిన్ల పంపిణీ పథకాన్ని తిరిగి ప్రారంభించలేకపోయాయి
“క్లాసులు జరుగుతుండగానే రక్తస్రావం మొదలవడంతో మా క్లాసులోని ఒకమ్మాయి ఒక నాప్కిన్ కోసం టీచర్‌ను అడిగింది. ఇంకా సరుకు రాలేదని టీచర్ చెప్పారు. అప్పుడామెకు మా ఇంకో స్నేహితురాలు తన చేతిరుమాలును వాడుకోమని ఇచ్చింది,” చెప్పింది కిరణ్. “ఇంతకుముందు మాకు నాప్కిన్లు కావాల్సి వచ్చినపుడల్లా టీచర్లను అడిగేవాళ్లం. తరువాత లాక్డౌన్ వచ్చింది, బడులు మూతపడ్డాయి. ఇదంతా అయ్యి, బడులు మళ్లీ తెరిచాక, నాప్కిన్లు లేవు. బడికి ఇక సరఫరా లేదని మాతో చెప్పారు,” కొనసాగింపుగా చెప్పింది కిరణ్
కిరణ్ బహిష్టు సమయాలు బాధాకరంగా మారటం మొదలయ్యింది. కోవిడ్ మొదలైన గత రెండు సంవత్సరాలలో, బహిష్టు మొదటి రోజున ఆమెకు తీవ్రమైన కండరాల తిమ్మిరులు వస్తున్నాయి. ఆమె కుటుంబంలో ఎవరికీ కోవిడ్ పాజిటివ్ రానప్పటికీ, చిత్రకూట్ జిల్లా అంతా కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితం అయ్యింది. ఆమె ఇరుగుపొరుగువారిలో చాలామందికి అది సోకింది. వారిలో కొంతమందిని అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు కూడా.
కోవిడ్-19 ప్రత్యక్ష ప్రభావం తీవ్రమైన, నొప్పితో కూడుకున్న బహిష్టు రక్తస్రావాన్ని కలగచేస్తుండగా, “వత్తిడి, ఆందోళన, పోషకాహార లేమి, నిద్రలో, భౌతిక కసరత్తులలోని మార్పులవంటివి ప్రత్యుత్పత్తి ఆరోగ్యాన్ని, బహిష్టు కాలచక్రాన్ని పరోక్షంగా ప్రభావితం చేస్తాయ” ని ఒక యూనిసెఫ్(UNICEF) కీలక పత్రం ప్రకటించింది. అక్టోబర్ 2020లో విడుదలైన ఈ పత్రానికి “రుతు సంబంధమైన ఆరోగ్యం మీదా, వ్యక్తిగత పరిశుభ్రత మీదా కోవిడ్-19 ప్రభావాలను తగ్గించటం” అని పేరు పెట్టారు. ఈ పత్రం “కోవిడ్ మొదలవక ముందుకంటే, అయిన తరువాత బహిష్టు వైపరీత్యాలు చాలా సాధారణం అయ్యాయి” అని సూచించింది
కిరణ్ ఇంటి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో నివసించే ఫూల్వతియాకు పాఠశాల నుండి నాప్కిన్లు రావటంలేదు. “కోవిడ్ మొదలై బడి మూసివేశాక, నేను మళ్లీ బట్టను వాడటం, ఆ ముక్కలను ఉతుక్కోవటం, ఇంటి లోపల వాటిని ఆరబెట్టుకోవటం మొదలుపెట్టాను,” అని 2020లో తనని కలిసిన PARIతో చెప్పిందామె . గ్రామీణ చిత్రకూట్‌కు చెందిన ఆమెకూ, ఇంకా వేలాదిమంది అమ్మాయిలకూ సానిటరీ నాప్కిన్ల డొనేషన్ల రూపంలో అప్పుడు సహాయం అందింది. అది 3-4 నెలలు మాత్రమే ఉండింది. అప్పటి నుంచి గత రెండు సంవత్సరాలుగా ఫూల్వతియా మళ్లీ గుడ్డను ఉపయోగిస్తోంది. “బడిలో పాడ్స్ ఇవ్వటం లేదు కాబట్టి నేను కపడా (గుడ్డ)ను మాత్రమే వాడుతున్నాను. ఆ సదుపాయం ఇంక మాకు ముగిసిపోయినట్టే అనుకుంటున్నాను,” అని చెప్పిందామె.
అయితే లక్నో జిల్లాకు చెందిన కాకొరి బ్లాక్, సరోసా భరోసాలోని కాంపొజిట్ స్కూల్ టీచర్ శ్వేతా శుక్లా మాత్రం రాష్ట్ర రాజధానిలో పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పుకొచ్చారు. “మా బడిలో పిల్లలకు క్రమం తప్పకుండా ప్రతి నెలా పాడ్స్ అందుతున్నాయి. మేం తప్పనిసరిగా ఒక రిజిస్టర్‌ను నిర్వహించాలి, మాకు సరఫరా చేసిన పాడ్స్‌ను ఉపయోగించుకోవాలి,” ఆమె చెప్పింది. ఉత్తరప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న పరిస్థితిని విని ఆమేమీ ఆశ్చర్యపోలేదు. “ప్రభుత్వ బడుల్లో ఇలాంటి పరిస్థితులు సాధారణమే కదా, దానికి మనమేమీ చేయలేం. మరీ ముఖ్యంగా మనం ప్రైవేట్ బడులకు పోలేనపుడు, మన పిల్లలకు చదువుకోవడానికి ఇంతకన్నా మంచి వాతావరణం కల్పించలేకపోయినపుడు,” అంటూ ఆమె కొనసాగించింది.
పూనమ్ దేవి, ఆమె భర్తా తమ పిల్లలైన కిరణ్, రవిలను ప్రైవేట్ బడులకు పంపాలని ఎప్పుడూ కలలుకనేవారు. “మా పిల్లలు చదువులో మంచిగుంటారు. కేంద్రీయ విద్యాలయ లాంటి బడికి మా పిల్లలను పంపాలంటే నాకేదైనా మార్గం ఉందా?” అని ఆమె అడుగుతారు. “మాకు ఎక్కువ డబ్బు లేకపోయినా, మా పిల్లలు ఎప్పుడూ మంచి బడికి వెళ్లాలని వాళ్ల నాన్న కోరుకున్నాడు. అలా చదువుకుంటే వాళ్లు నగరాలకు వెళ్లగలుగుతారు. పని చేయగలుగుతారు. సౌకర్యవంతంగా జీవించగలుగుతారు,” కొనసాగింపుగా అన్నదామె. కానీ దాదాపు 10 సంవత్సరాల క్రితం, కిరణ్‌కు కేవలం 5 సంవత్సరాల వయసున్నప్పుడు, ఎలక్ట్రీషియన్ అయిన ఆమె తండ్రి పనిచేస్తున్న దగ్గరే చనిపోయారు. పూనమ్ జబ్బున పడటంతో పరిస్థితులు మారటం మొదలయ్యాయి. ఇంటి పొలం నుండి వచ్చే ఆదాయం ఎప్పుడూ సరిపోదు. అలాంటి పరిస్థితులలో, బహిష్టు సమయంలో ఆమె వ్యక్తిగత పరిశుభ్రత అవసరాన్ని బడిలో పట్టించుకోవటమే ఒక అదృష్టం.
అయితే కిరణ్ లాంటి వేలాదిమంది అమ్మాయిలు బహిష్టు సమయంలో తిరిగి వ్యక్తిగత పరిశుభ్రత లేని ఆచరణలకు మరలుతున్నారు. విద్యా ప్రణాళిక మరియు పరిపాలన జాతీయ సంస్థ 2016-17 మధ్య ఇచ్చిన నివేదిక, భారతదేశంలో పాఠశాల విద్య సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకూ 10. 86 మిలియన్ల అమ్మాయిలు చదువుతున్నారు. ప్రతి నెలా బహిష్టు సమయంలో తరగతులను కోల్పోతున్న విద్యార్థినులకు సహాయం చేయటానికి ఈ సానిటరీ నాప్కిన్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2015లో ఈ సంఖ్య రాష్ట్రంలో 28 లక్షలు. ఇప్పుడీ పథకం మటుమాయం అవటంతో, ఉత్తరప్రదేశ్‌లో మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత స్థితిగతుల గురించి సందేహం కలుగుతోంది.
చిత్రకూట్ జిల్లా మేజిస్ట్రేట్ శుభ్రాంత్ కుమార్ శుక్లాగారికి ఈ పరిస్థితి పట్ల ఒక మామూలు అభిప్రాయం ఉంది. “కోవిడ్ తరువాత కొన్ని సరఫరా సమస్యలు వచ్చాయనుకొంటాను,” అన్నాడతను, “లేకపోతే అమ్మాయిలకు నాప్కిన్స్ అందేవే. అయితే సత్వర పరిష్కారం కోసం, అవసరం అయిన ప్రతి అమ్మాయి దగ్గరలో ఉన్న అంగన్వాడి కేంద్రానికి వెళ్ళి సానిటరీ నాప్కిన్స్ తీసుకోవచ్చు. అక్కడ వాళ్లకు ఫోలిక్ యాసిడ్ మాత్రలు కూడా లభ్యమౌతాయి.” కిరణ్కూ, ఆమె ఇరుగు పొరుగు స్నేహితులకూ దీని గురించి ఏమీ తెలియదు. చిత్రకూట్‌లో అంగన్వాడీల దగ్గర సానిటరీ నాప్కిన్స్ ఉన్నా, సీతాపూర్‌లోని అంగన్వాడీ కార్యకర్త చెప్పినదాని ప్రకారం అవి కొత్తగా తల్లులయిన వారికోసం మాత్రమే ఉద్దేశించబడినవి.
2020లో ఎర్రకోట నుండి చేసిన తన స్వాతంత్ర్య దిన ఉపన్యాసంలో మహిళా ఆరోగ్య సంరక్షణ గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తన ప్రభుత్వం " జనౌషధి కేంద్రాల వద్ద ఒక్క రూపాయికే సానిటరీ పాడ్స్ అందచేసే భారీ ధర్మాన్ని నిర్వహించింద”ని చెప్పారు . కొద్ది కాలంలోనే “6000 జనౌషధి కేంద్రాల నుంచి ఈ పేద మహిళలకు 5 కోట్ల కంటే ఎక్కువ సానిటరీ పాడ్స్ సరఫరా జరిగిందని” ఆయన అన్నారు.
ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషాధి పరియోజన కింద ఈ జనౌషధి కేంద్రాలు అందుబాటు ధరలలో జనరిక్ మందులను అందచేస్తాయి. రసాయనాలు మరియు ఎరువుల కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్పినదాని ప్రకారం ఆగస్టు 2021 నుండి దేశవ్యాప్తంగా 8,012 జనౌషధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. అవి 1,616 రకాల మందులనూ, 250 శస్త్ర చికిత్స పరికరాలను అమ్ముతాయి.
కానీ కిరణ్ ఇంటికి 5 కిలోమీటర్ల దరిదాపులో ఎక్కడా జనౌషధి కేంద్రం లేదు. ఆమె సానిటరీ నాప్కిన్స్ కొనుక్కోగలిగిన ఒకే ఒక చోటైన ఒక మందుల దుకాణం ఆమె ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఆమె ఒక పాకెట్టుకు కనీసం 45 రూపాయలు చెల్లించాలి. అది ఆమెకు అందుబాటులో లేని ధర.
సానిటరీ నాపికిన్స్ అందుకునే శక్తి లేకపోవటమే కాకుండా, బహిష్టు అయిన యువతులకు బడులలో లభించే సౌకర్యాలు ఘోరంగా ఉంటాయి. “బడిలో ఎలాంటి చెత్తబుట్టలు లేకపోవటం వలన నేను నాప్కిన్ మార్చుకోవాలంటే ఇంటికి వచ్చేదాకా వేచి ఉండాల్సిందే. బడిలో ఉండగా ఎప్పుడైనా నాప్కిన్ తడిచిపోయి నా యూనిఫార్మ్ మీద మరకలు పడతాయి. అయినా స్కూలు అయిపోయేదాకా నేనేమీ చేయలేను కూడా,” చెప్పిందామె. మరుగుదొడ్లు కూడా శుభ్రంగా ఉండవు. “ఆదివారాల్లోనే వాటిని శుభ్రం చేస్తారు. కాబట్టి మాకు సోమవారాల్లో మాత్రమే శుభ్రమైన మరుగుదొడ్లు లభిస్తాయి. రోజులు గడిచేకొద్ది అవి మురికి అయిపోతాయి,” అని ఆమె చెప్పింది.
లక్నో నగరంలోని బస్తీల్లో నివాసముండే యువతుల బహిష్టు సంబంధిత సవాళ్ల గురించి వచ్చిన ఒక పత్రికా వ్యాసం , ఈ సవాళ్లు అనేక స్థాయిల్లో - వ్యక్తిగతంగా, సామాజికంగా, వ్యవస్థాపరంగా ఉంటాయని వివరించింది. “వ్యక్తిగత స్థాయిలో తీసుకొంటే అమ్మాయిలకు అవగాహన ఉండదు. సామాజిక పరిధిలో తీసుకొంటే యువతులు బహిష్టును ఆవరించి ఉన్న అపోహలతో ఉంటారు. దాని గురించి చర్చించే అవకాశాలు ఉండవు. బహిష్టు సమయంలో వాళ్ల కదలికలకు, ఇతర పనులకు పరిమితులు ఉంటాయి. వ్యవస్థాపరంగా తీసుకొంటే, ఉదాహరణకు బడిలో - మరుగుదొడ్లు అశుభ్రంగా ఉండటం, తలుపులు విరిగిపోయి ఉండటం వంటివాటి వలన అమ్మాయిలకు బహిష్టు సమయంలో ఆసరాగా ఉండే వనరులు చాలా తక్కువ ఉంటాయి,” అని ఆ వ్యాసం చెబుతున్నది.
ఉత్తర ప్రదేశ్ బడుల్లో అసలు సమస్య పారిశుధ్య సిబ్బందే తప్ప తక్కువశ్రేణి నిర్వహణ కాదని లఖింపూర్ జిల్లా రాజాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రీతూ అవస్థి అంటారు. “ఇక్కడ అమ్మాయిలకు సానిటరీ నాప్కిన్స్ ఇస్తారు. మరుగుదొడ్లలో వాటిని కాల్చే యంత్రాలు కూడా ఉన్నాయి. కానీ పారిశుధ్య సిబ్బంది వలన పరిస్థితులు బాగా లేవు. పాఠశాల పనుల కొరకు నియమించిన సిబ్బంది గ్రామ్ ప్రధాన్ (గ్రామ పెద్ద) కింద ఉంటారు. కాబట్టి వాళ్లు అతని మాటే వింటారు. బడుల్లో రోజూ శుభ్రం చేయాలి. కానీ వారానికి రెండుసార్లు మాత్రమే అది జరుగుతుంది,” అన్నారామె.
ఉదయ కిరణాలు కొన్ని కిరణ్ ఇంటిలోకి ప్రవేశించి, ఇంట్లో ఉన్న మూడు చెక్క మంచాల మీదుగా ప్రసరించేటప్పటికి - తన పనులన్నీ ముగించుకొని ఆమె తయారయ్యింది. పూనమ్ తన కూతురు జుత్తును దువ్వి రెండు ముద్దొచ్చే జడలు వేసి, వాటిని మంచి రంగు రిబ్బన్లతో అలంకరించారు. “కిరణ్, జల్దీ ఆ జా. మై యహీ రుకీ హూ. (కిరణ్, త్వరగా రా. నేనిక్కడ ఎదురు చూస్తున్నాను),” రీనా సింగ్ బయట నుండి అరుస్తోంది. ఆమె కిరణ్ సహ విద్యార్ధినీ, బడికి తోడుగా వెళ్లే ప్రయాణికురాలు కూడా. కిరణ్ బయటకు పరిగెత్తింది. ఇద్దరమ్మాయిలు స్కూలు వైపు త్వరత్వరగా అడుగులువేస్తున్నారు.
ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా జిజ్ఞాసా మిశ్రా ప్రజారోగ్యం, పౌర హక్కులపై నివేదిస్తున్నారు. ఈ నివేదికలోని విషయంపై ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఎటువంటి సంపాదకీయ నియంత్రణను కలిగి ఉండదు.
అనువాదం: రమాసుందరి