రక్తంతో తడిసిన స్ట్రెచర్‌ను చూడగానే శ్రీకృష్ణ బాజ్‌పేయి భయాందోళనలకు గురయ్యారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సీతాపుర్ జిల్లాలో, ఫిబ్రవరి నెల, చలి తీవ్రంగా ఉన్నఒక రోజు మధ్యాహ్నం తన ఇంటి బయట చలి కాచుకుంటూ, 70 ఏళ్ళ శ్రీకృష్ణ ఇలా గుర్తు చేసుకున్నారు: “మా కోడలి ప్రసవం కష్టమవుతుందని, ఎంతో ప్రమాదంతో కూడుకున్నదని ఆశా కార్యకర్త మమ్మల్ని ముందే హెచ్చరించింది.”
ఈ సంఘటన సెప్టెంబర్ 2019 లో జరిగినా, అది నిన్ననే జరిగినంత బాగా గుర్తుంది శ్రీకృష్ణకు. “(వరద) నీరు అప్పుడే తగ్గుముఖం పట్టింది కానీ, రోడ్లు బాగా దెబ్బ తిన్నాయి. అందువల్ల అంబులెన్స్ మా ఇంటి వరకు రాలేదు.” శ్రీకృష్ణ నివసించే టాండా ఖర్ద్ కుగ్రామం, లహర్‌పుర్ బ్లాక్ లో, శారదా-ఘాఘ్రా నదీ తీరాల దగ్గర్లో ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాలలో తరచుగా ఆకస్మిక వరదలు సంభవిస్తుండడంతో, అత్యవసర పరిస్థితుల్లో రవాణాను ఏర్పాటు చేసుకోవడం ఇక్కడి ప్రజలకు కష్టతరంగా మారింది.
ప్రసవ వేదనలో ఉన్న ఏ స్త్రీకైనా, టాండా ఖర్ద్ నుండి సీతాపుర్ లోని జిల్లా ఆసుపత్రికి, అంటే 42 కిలోమీటర్లు ప్రయాణం చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని; అటువంటిది, ద్విచక్ర వాహనంపై కూర్చొని, ఐదు కిలోమీటర్ల దూరం జారే రోడ్లపై ప్రయాణించాల్సి రావడం ఊహాతీతం. “అంబులెన్స్ వరకు వెళ్ళడానికి మేము అలా ప్రయాణించాల్సి వచ్చింది. కానీ, మేము జిల్లా ఆసుపత్రికి చేరుకునే సమయానికి తీవ్ర సమస్యలు తలెత్తాయి,” అని శ్రీకృష్ణ వివరించారు.
శ్రీకృష్ణ కోడలు మమత ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ ప్రసవం అయిన తరువాత కూడా ఆమెకు రక్తస్రావం ఆగలేదు. అయినా, అంతా మంచే జరుగుతుందని అతను ఆశించారు. “ఇది ఊహించనిదేమీ కాదు. సమస్యలు తలెత్తుతాయని మాకు తెలుసు. కానీ వైద్యులు ఆమెను కాపాడతారని అనుకున్నాము.”
అయితే, మమతను వార్డుకు తరలిస్తుండగా, స్ట్రెచర్ పై ఉండే తెల్లటి దుప్పటి శ్రీకృష్ణకు కనిపించలేదు. “ఆ దుప్పటి రక్తంతో తడిసిపోయింది. అది చూసిన నాకు కడుపంతా తిప్పుతున్నట్లు అనిపించింది. రక్తం ఏర్పాటు చేసుకోమని డాక్టర్లు మాకు చెప్పారు. మేము త్వరత్వరగా బ్లడ్ బ్యాంక్ కు వెళ్ళి, రక్తం తీసుకొని ఆస్పత్రికి తిరిగి వచ్చే సరికి మమత మరణించింది.”
ఆమె వయసు కేవలం 25 సంవత్సరాలు!









