తన మూడో బోరుబావి కూడా ఎండిపోవడంతో డి. అమర్‌నాథ్‌రెడ్డి తన భూమికి నీరందించేందుకు మళ్లీ వర్షాలపై ఆధారపడవలసి వచ్చింది. ఈ 51 ఏళ్ల రైతు ఆంధ్రప్రదేశ్‌లోని కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో టమోటాలు పండిస్తాడు. ఆ ప్రాంతంలో వర్షాలు ఎప్పుడొస్తాయో చెప్పలేము. అందుకని చిత్తూరు జిల్లా ముదివేడు గ్రామంలో తన మూడెకరాల పొలంలో బోర్‌వెల్‌పై రూ.5 లక్షలు ఖర్చుపెట్టాడు. డ్రిల్లింగ్‌కు ఆర్థికసాయం కోసం ప్రైవేట్ రుణదాతల నుంచి అప్పు తీసుకున్నాడు. మొదటి బావి విఫలమైన తర్వాత, అతను మళ్లీ ప్రయత్నించాడు. మూడవసారి, అతని అప్పు పెరిగింది కానీ భూమిలో నీటి నిలవ అంతు చిక్కలేదు.
ఏప్రిల్-మే 2020లో తన పంటను అందుకుని, తన రుణాలలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించాలని అమర్‌నాథ్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు.అతనికి 10 లక్షల అప్పు ఉంది. ఈ పది లక్షలు అతను బోరెవెల్ వేయడం కోసం, అతని పెద్ద కుమార్తె పెళ్లికి కోసం, పంట రావడం కోసం ఖర్చు పెట్టాడు. అయితే గత ఏడాది మార్చి 24న ప్రధాని ప్రకటించిన ఆకస్మిక లాక్‌డౌన్ వలన అతను అనుకున్నట్టు జరగలేదు. ఇటువంటి సమయంలో టమోటా పంట అమ్మడం సాధ్యం కాదు, అతను మొక్కల మీద ఉన్న కాయలు, పక్వానికి చేరి కుళ్ళిపోవడాన్ని చూస్తూ ఉండిపోయాడు.
"మహమ్మారి సమయంలో పరిస్థితులు మెరుగుపడవని అతను భావించి, ఆశలన్నీ కోల్పోయాడు" అని అమర్‌నాథ్ భార్య డి. విమల, సెప్టెంబర్ 17, 2020న అతను ఎందుకు విషం తీసుకున్నాడో వివరించడానికి ప్రయత్నిస్తూ. “దానికి 10 రోజుల ముందు కూడా అతను తన ప్రాణాలను తీసుకోవడానికి ప్రయత్నించాడు. మేము అతనిని రక్షించడానికి బెంగళూరులోని ఒక పెద్ద ఆసుపత్రికి [180 కిలోమీటర్ల దూరంలో] తీసుకెళ్లాము. దీనికోసం మేము అప్పుడు లక్ష రూపాయిలు ఖర్చుపెట్టవలసి వచ్చింది,” అని విమల చెప్పింది, మళ్ళీ అలా చేయవద్దని అమర్‌నాథ్‌ని వేడుకుంది.
చిత్తూరులో రైతుల ఆత్మహత్యలకు బోర్‌వెల్ విఫలమవడం ప్రధాన కారణాల్లో ఒకటి. మిగిలినవి టమోటా పంట వలన అయిన వ్యవసాయ అప్పులు. కుటుంబాలకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఉత్తర్వు మరిన్ని కారణాలను సూచిస్తుంది: “ఇటువంటి ఆత్మహత్యలకు కారణాలు బోర్‌వెల్‌ల వైఫల్యం, అధిక సాగు ఖర్చుతో వాణిజ్య పంటలను పెంచడం, పంటకు సరైన ధర అందకపోవడం, కేవలం మాట ద్వారా పొందే కౌలు, బ్యాంకు రుణాలు పొందేందుకు అనర్హత, అధిక వడ్డీ రేట్లతో ప్రైవేట్ రుణాలు, ప్రతికూల కాలానుగుణ పరిస్థితులు, పిల్లల విద్య, అనారోగ్యం, వివాహాల కోసం చేసిన భారీ వ్యయం.”
చాలా మందికి, గత సంవత్సరం ప్రణాళిక లేని లాక్‌డౌన్ కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. 2020లోనే, చిత్తూరు జిల్లాలో 34 మంది రైతులు తమ ప్రాణాలను తీసుకున్నారు- ఇది 2014 నుండి జరిగిన రైతుల ఆత్మహత్యలలో అత్యధిక సంఖ్య. ఇందులో 27 మంది ఏప్రిల్- డిసెంబర్ మధ్య మరణించారు.







