అంబాపాణీ నివాసితులు ఔత్సాహిక పార్లమెంటు సభ్యులు ఒకరికో లేదా ఇద్దరికో ఆతిథ్యం ఇచ్చే అవకాశం వస్తే చాలా గొప్పగా ఆస్వాదిస్తారు; వారికి ఇంటి విసుర్రాయి ద్వారా విసిరిన తాజా పిండితో చేసిన మొక్కజొన్న భాకరీల నో లేదా సరదాగా చెట్టుపైకి దూసుకుపోయి పిల్లలు కోసుకు తెచ్చే తీపి చరోళీ పండ్లనో తినిపిస్తారు.

అయితే, చెప్పుకోదగ్గ రాజకీయ ప్రతినిధులెవ్వరూ వారిని సందర్శించలేదు - ప్రజలు మొదటిసారి వెదురు, మట్టి, పేడతో తమ ఇళ్ళను నిర్మించుకున్నప్పటి నుండి గడిచిన ఐదు దశాబ్దాలలో ఒక్కసారి కూడా అలా జరగలేదు. కఠినమైన రాళ్ళతో నిండిన సాత్పురా పర్వతాల చెల్లాచెదురు వాలుల వరుసలో ఉన్న ఈ కుగ్రామం, మోటారు వాహనాలు నడిచే సమీప రహదారి నుండి 13 కిలోమీటర్ల ఎత్తులో ఉంది.

818 మంది జనాభా (జనగణన 2011) ఉండే అంబాపాణీ గ్రామానికి రహదారి లేదు, విద్యుత్ లేదు, నీటి సరఫరా లేదు, మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ లేదు, చౌక ధరల దుకాణం లేదు, ప్రాథమిక వైద్య కేంద్రం లేదు, అంగన్‌వాడీ కేంద్రం కూడా లేదు. ఇక్కడ నివాసముండేవారంతా రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగగా గుర్తింపు పొందిన పావరా ఆదివాసీ సముదాయానికి చెందినవారు. ఇక్కడి 120 కుటుంబాలలోని చాలామంది తమ వంశావళి మధ్యప్రదేశ్‌లో మూలాలు కలిగి ఉన్న నాలుగు లేదా ఐదు పెద్ద గోత్రాల నుండి ఉద్భవించిందని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఇక్కడికి ఉత్తరాన కేవలం 30 కి.మీ కాకివేటు దూరంలో ఉంది.

నెట్‌వర్క్ దరిచేరని ప్రాంతంలో ఉండటం వలన ఇక్కడ టెలివిజన్ సెట్‌లు లేదా స్మార్ట్‌ఫోన్‌లు లేవు. మహిళల మంగళసూత్రాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన హెచ్చరికల నుంచి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న కాంగ్రెస్‌ ప్రబోధాల వరకు, 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన చురుకైన ఉపాఖ్యానాలు (ఎపిసోడ్‌లు) ఏవీ కూడా అంబాపాణీ ఓటర్లకు చేరలేదు.

ఆకర్షణీయమైన ఎన్నికల వాగ్దానం ఏమై ఉంటుందని అడిగినప్పుడు, "బహుశా ఒక రహదారి," అన్నారు ఉంగ్యా గుర్జా పావరా. 56 ఏళ్ళ ఉంగ్యా ఈ కుగ్రామంలో అసలైన స్థిరనివాసులలో ఒకరి వంశానికి చెందినవారు. దాదాపు ఒక దశాబ్దం క్రితం ఈయన తన ఇంటి కోసం ఒక స్టీల్ అల్మైరా కొనేందుకు డబ్బును ఆదా చేసినప్పుడు, నలుగురు వ్యక్తులు 75 కిలోల ఆ అల్మైరాను "ఒక స్ట్రెచర్ లాగా" ఎత్తుకుని పైకి తీసుకెళ్ళారు.

ఇక్కడికి 13 కిలోమీటర్ల దిగువన ఉన్న మొహరాళే బజారుకు తమ వ్యవసాయ ఉత్పత్తులను వీరు ద్విచక్ర వాహనాల మీద చేరవేస్తుంటారు. ఒక్కో తడవకు గరిష్టంగా ఒక్కో క్వింటాల్ చొప్పున ప్రమాదకరమైన వాలుల గుండా, ఎత్తుకుంటూ దించుకుంటూ, మూల మలుపులను దారి మళ్ళింపులను దాటుకుంటూ, జారిపోయే కంకర మీదుగా, పర్వత ప్రవాహాలను దాటుకుంటూ, అప్పుడప్పుడూ ఎదురుపడే ఎలుగుబంట్లను తప్పించుకుంటూ, కిందకు చేరవేస్తారు.

"ఏదేమైనా మరోవైపు చూస్తే, ఒక రహదారి వలన కలప అక్రమ రవాణా పెరుగుతుందేమో అనే సంగతి కూడా ఆలోచించాలి," సాలోచనగా అన్నారు ఉంగ్యా.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

ఎడమ: అంబాపాణీలోని తమ ఇంటి ముందు తన కుటుంబంతో ఉంగ్యా పావరా. కుడి: కట్టెలను కొట్టడానికి వాడే చిన్నగొడ్డలి ఆమె కాలు మీద పడడంతో ఉంగ్యా భార్య, బాధీబాయి బొటనవేలు దాదాపుగా తెగిపోయింది. లోతైన ఆ గాయానికి చికిత్స చేయడానికి సమీపంలో ఎలాంటి వైద్యశాల లేదు

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

గ్రామంలోని ఉంగ్యా పావారా ఇల్లు (ఎడమ). ఆయన ఆ గ్రామానికి చెందిన అసలైన స్థిర నివాసుల వారసుడు. ఉంగ్యా, బాధీబాయిల కుమార్తె రెహెందీ పావరా అత్తవారింటి బయట ఉన్న చరోళీ చెట్టు. ఆ చెట్టును ఎక్కి తియ్యని దాని పండ్లను కోయటం ఆ గ్రామంలోని పిల్లలకు చాలా ఇష్టమైన ఆట

కట్టెలు కొడుతుండగా చేతిగొడ్డలి ఆమె కాలి బొటనవేలుపై పడటంతో ఉంగ్యా భార్య బాధీబాయి నెల రోజులుగా కుంటుతూ తిరుగుతున్నారు. గాటు లోతుగా ఉంది, కానీ ఆమె కట్టు కట్టలేదు. " మొహరాళా కిన్వా హరిపురాపర్యంత్ జావే లాగ్తే [నేను మొహరాళే లేదా హరిపురాకు వెళ్ళవలసి ఉంటుంది]," ఆమె తన గాయాన్ని ఎందుకు పట్టించుకోలేదో, దాని గురించి చెప్పారు. "ఏ పార్టీ అయినా మాకు ఇక్కడ మంచి దవాఖానా [వైద్యశాల] ఇస్తుందా?" అంటూ ఆమె నవ్వేశారు

అంబాపాణీలో ఒక కుటుంబంలో కనీసం ఒక శిశువుకైనా పోషకాహార లోపం ఉన్నట్లు నిర్ధారణ అయింది, అయితే ఆ చిన్నారి ఎంత తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతూవుందో ఆ కుటుంబానికి తెలియదు. దాదాపు పదేళ్ళ క్రితమే అనుమతులు వచ్చినా అంగన్‌వాడీ మాత్రం లేదని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇందుకు బదులుగా, మొహరాళేకి చెందిన ఒక అంగన్‌వాడీ కార్యకర్త అంబాపాణీకి అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. లబ్దిదారులైన పిల్లల కోసం గర్భిణీల కోసం ఇంటికి తీసుకువెళ్ళే రేషన్ ప్యాకేజీలను, అలాగే గర్భిణీల కోసం ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను సరఫరా చేయడం కోసం ఆ అంగన్‌వాడీ కార్యకర్త ప్రతి కొన్ని వారాలకు ఒకసారి ఇక్కడకు కష్టతరమైన ప్రయాణం చేస్తారు. "మాకు ఇక్కడే ఒక అంగన్‌వాడీ ఉంటే, కనీసం చిన్న పిల్లలైనా అక్కడికి వెళ్ళి ఏదైనా నేర్చుకునేవారు," అన్నారు బాధీబాయి. అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తోన్న సమగ్ర శిశు సంక్షేమ సేవా పథకం (ఐసిడిఎస్) ద్వారా లబ్ది పొందే అర్హత ఉన్న ఆరేళ్ళ వరకూ వయస్సున్న పిల్లలు గ్రామంలో 50 మందికి పైగా ఉన్నారని ఉంగ్యా చెప్పారు.

ఇటీవలి సంవత్సరాలలో కొంతమంది యువతులు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొహరాళే లేదా హరిపురాలోని వైద్యశాలలకు వెళ్తున్నప్పటికీ, సాంప్రదాయికంగా ఇళ్ళల్లోనే శిశువులను ప్రసవిస్తున్నారు.

ఉంగ్యా, బాధీబాయిలకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో పాటు ఇంకా ఎంతోమంది మనవసంతానం ఉన్నారు. చదువుకోని ఆ దంపతులు తమ కుమారులను బడిలో చేర్చడానికి ప్రయత్నించారు, కానీ రహదారి లేకపోవడంతో అది సాధ్యం కాలేదు.

రెండు దశాబ్దాల క్రితం ఒక పాఠశాల 'భవనం' ఉద్భవించింది, కానీ వెదురు, గడ్డితో నిర్మించిన ఆ గది బహుశా గ్రామంలో ఉన్న అన్ని నిర్మాణాలలోనే అత్యంత దుస్థితిలో ఉన్న నిర్మాణం అనుకోవచ్చు.

"వాస్తవానికి ఒక ఉపాధ్యాయుడిని ఇక్కడ నియమించారు, కానీ తహసీల్‌ లోని మరెక్కడి నుండైనా ఎవరైనా ప్రతిరోజూ ఇక్కడకు వస్తారని మనం ఆశించగలమా?" అని అంబాపాణీ నివాసి, అంబాపాణీకి చెందిన మరొక అసలైన స్థిరనివాసి బాజ్‌ర్యా కాండ్ల్యా పావరా కుమారుడు రూప్‌సింగ్ పావరా అడుగుతారు. అతడికి ఇద్దరు భార్యల ద్వారా 15 మంది పిల్లలు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. నిష్ణాతులైన బైకర్లు, స్థానికులు మాత్రమే ఈ 40 నిమిషాల సవారీని చేపట్టే సాహసం చేస్తారు. ఈ సవారీ పిరికివాళ్ళ కోసం కాదు, అటవీ శాఖ గార్డులు కూడా దారితప్పిపోతారని అతను చెప్పారు.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

అంబాపాణీకి రెండేళ్ళ క్రితమే ఒక బడి భవనం (ఎడమ) వచ్చింది కానీ, ఒక ఉపాధ్యాయుడు మాత్రం ఇంకా రావలసే ఉంది. 'వాస్తవానికి ఇక్కడి కోసం ఒక ఉపాధ్యాయుడిని నియమించారు (బడిలో), కానీ ఈ తహసీల్‌లో ఎక్కడినుంచైనా ఎవరైనా ఇక్కడి వరకూ ప్రతిరోజూ సవారీ చేసుకుంటూ రాగలరని ఎవరమైనా ఆశించగలమా?' అనడుగుతారు ఈ గ్రామానికే చెందిన రూప్‌సింగ్ పావరా (కుడి)

PHOTO • Kavitha Iyer

జల్‌గాఁవ్ జిల్లా, యవల్ తాలూకాలోని అంబాపాణీ గ్రామానికి ప్రమాదకరమైన 40 నిమిషాల మోటర్‌బైక్ సవారీ ద్వారా పైకి వెళ్ళటానికి ఈ మట్టి దారి ఒక్కటే మార్గం

బాధీబాయి మనవళ్ళలో ఒకరైన బార్‌క్యా, పొరుగున ఉన్న చోప్డా తహసీల్‌ , ధనోరాలోని ఆశ్రమ శాల (ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగలు, సంచార తెగలకు చెందిన పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఆశ్రమ పాఠశాలలు) నుండి వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చాడు. మరో మనవడు వేరొక ఆశ్రమ శాల లో చేరాడు

అంబాపాణీలో మాకు స్టీలు చెంబుల్లో నది నీటిని, చిన్న పింగాణీ కప్పుల్లో పాలు కలపని తేనీటిని ఇచ్చారు. వాటిని మాకు అందించిన నలుగురు అమ్మాయిలు తామెన్నడూ బడికి వెళ్ళలేదని చెప్పారు.

బాధీబాయి కుమార్తె రెహెందీ అత్తవారిల్లు అక్కడికి దాదాపు ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పావరా మనుషులు స్వయంగా నిర్మించిన తిరుగుడుగా ఉండే ఈ మట్టి దారి, ఒక కొండవాలు వైపు నుండి క్రిందికి దిగి, మళ్ళీ మరో కొండ పైకి వెళుతుంది.

కుల ధృవీకరణ పత్రం పొందే ప్రభుత్వ ప్రక్రియలను సులభతరం చేయవచ్చా అని కొంతమంది ఓటర్లు ఆలోచించవచ్చని రెహెందీ చెప్పారు. గ్రామంలో దాదాపు 20 నుంచి 25 శాతం మందికి రేషన్ కార్డులు లేవని అక్కడ గుమిగూడి ఉన్న ఇతరులు చెబుతున్నారు.

రేషన్ దుకాణం (ప్రజా పంపిణీ వ్యవస్థ) మొహరాళేకి మరింత దక్షిణంగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్పావలీ గ్రామంలో ఉంది. ఆరు సంవత్సరాల వయస్సు వచ్చినా పిల్లలు తరచుగా జనన ధృవీకరణ పత్రం కోసం నమోదు కావడంలేదు. పిల్లలు ఇళ్ళల్లో పుట్టడం వలన, చిన్న వయసు కుటుంబసభ్యుల కోసం రూపొందించిన ఆధార్ కార్డులను పొందడానికి, లేదా కుటుంబ రేషన్ కార్డులో వారిని లబ్ధిదారులుగా చేర్చడానికి కుటుంబాలు కష్టపడుతున్నాయి.

రాజకీయ నాయకులను అడిగేవాటిలో నీటి సదుపాయం కోసం అడగటం అత్యంత ప్రధానమని మహిళలు చెప్పారు.

గ్రామంలో బావులు గానీ, బోరుబావులు గానీ, చేతి పంపులు గానీ పైపులైనులు గానీ లేవు. గ్రామస్థులు తాగు, సాగు నీటి కోసం వర్షాకాలంలో పారే వాగుల పైనా, దక్షిణానికి ప్రవహించే తాపీ నది ఉపనదుల పైనా ఆధారపడతారు. నీటి ఎద్దడి చాలా అరుదు గానీ, వేసవికాలం వస్తుండగానే ఆ నీటి నాణ్యత తగ్గిపోతుంటుంది. "కొన్నిసార్లు మేం మోటార్ బైకుల మీద నీళ్ళు తీసుకురమ్మని మా మగవాళ్ళకు డబ్బాలు ఇచ్చి పంపిస్తాం," అన్నారు రెహెందీ. ఎక్కువగా మహిళలు, బాలికలు రోజులో చాలాసార్లు గాడిపడిన మార్గాల్లో తరచుగా చెప్పులు లేకుండా నడుస్తూ నీటిని కుండలతో ఇళ్ళకు మోసుకువెళతారు.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

ఒక సాధారణ పైప్‌లైన్ ద్వారా ప్రవహిస్తోన్న అంబాపాణీ పర్వతాల స్వచ్ఛమైన నీరు. గ్రామంలో బావులు, బోర్‌బావులు, చేతి పంపులు, పైపులైన్లు లాంటివేవీ లేవు

పాఠశాల భవనం వైపుకు వెళ్ళే మట్టి దారి వెంట, కమల్ రహంగ్యా పావరా ఒక సాల్ చెట్టు బెరడును చూస్తూ, శంఖాకారపు లోహపు కప్పు పదునైన అంచులతో బెరడును గీస్తున్నాడు. సాల్ చెట్టు ( షోరియా రోబస్టా ) నుంచి తీసిన సుమారు మూడు కిలోల బరువైన సువాసనగల జిగురు (రెసిన్‌) నింపిన ఒక జీర్ణమైపోయిన రెక్సిన్ సంచి సన్నని అతని శరీరం మీద వేలాడుతోంది. అది సంగమ సమయం, కిందటి రోజు మధ్యాహ్నం గరిష్టంగా ఉన్న 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఈ రోజు వేడిమి అధిగమించేట్టు కనిపిస్తోంది

అందుబాటులో ఉన్న జిగురును కొంచం కూడా వదలకుండా సేకరించడంపై దృష్టి సారించిన కమల్, దీని ధర హరిపుర మార్కెట్‌లో కిలోకి సుమారు రూ.300 పలకవచ్చని అనుకొంటున్నట్లు చెప్పాడు. అతను దాదాపు ఐదు గంటలపాటు ఈ రెసిన్‌ను సేకరించి, నాలుగు రోజుల్లో ఆ సంచిని నింపాడు. మహారాష్ట్రలో శీతాకాలంలో ప్రసిద్ధి చెందిన రుచికరమైన వంటకం డింక్ లడ్డూలలో ఉపయోగించే తినదగిన బంక కానప్పటికీ, స్థానికులు ఈ రెసిన్‌ను ' డింక్ ' అనే పిలుస్తారు. ఈ రెసిన్ చెక్కవాసనతో కూడిన కస్తూరి సువాసనను కలిగి ఉంటుంది. ఇది సాంబ్రాణి కడ్డీల తయారీదారులు కోరుకునే ముడి పదార్థం.

ఈ జిగురును సేకరించడానికి, చెట్టు కాండం పైన ఉండే బెరడు పైపొరను, నేలకు సుమారు ఒక మీటరు ఎత్తులో తొలుస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రదేశంలో జిగురు స్రవిస్తుంది. దానిని సేకరించిన తరువాత, బెరడు పైపొరను మరొక చోట తిరిగి తొలుస్తారు.

చెట్టు మొదలుని కాల్చడం ద్వారా రెసిన్‌ని సేకరించటం వలన - జిగురు ఏర్పడేలా ప్రేరేపించే మరొక పద్ధతి - జరుగుతోన్న అటవీ నిర్మూలన కొత్తగా వస్తోన్న సమస్య అని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అయితే అంబాపాణీలో డింక్ సేకరించేవారు సంప్రదాయ బెరడును తొలిచే పద్ధతినే ఎంచుకున్నారని కమల్ చెప్పాడు. "మా ఇళ్ళు అదే ప్రాంతంలో ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఎవరూ మంటలు వెలిగించరు," అని అతను చెప్పాడు.

చెట్ల జిగురు, సాల్ చెట్ల ఆకులు, బేరీ పండ్లు, బీడీ ఆకులు, మహువా పువ్వులతో సహా అటవీ ఉత్పత్తుల సేకరణ ఏడాది పొడవునా చేసే వృత్తి కాదు, లాభదాయకంగా కూడా ఉండదు. కమల్ లాంటివాళ్ళు ఏడాదికి సుమారు రూ. 15,000 – రూ.20,000 వరకు రెసిన్ ద్వారా, ఇతర అటవీ ఉత్పత్తుల ద్వారా కూడా ఇంతే మొత్తాన్ని సంపాదిస్తారు.

షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సంప్రదాయ అటవీ నివాసుల (హక్కుల గుర్తింపు) చట్టం , 2006 కింద అంబాపాణీలోని ఇరవై నాలుగు కుటుంబాలు భూమి పట్టాలను పొందాయి. కానీ నీటిపారుదల సౌకర్యం లేకపోవటంతో, ఎండా కాలంలో భూమి బీడుగా పడివుంటుంది.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

సాల్ చెట్టు నుంచి జిగురును సేకరించే కమల్ పావరా, అక్కడికి 13 కిలోమీటర్ల దూరాన ఉన్న హరిపురా మార్కెట్‌లో దానిని కిలో రూ. 300 చొప్పున అమ్ముతాడు

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

జిగురు బంకను సేకరించేందుకు అతను సాల్ చెట్టు బెరడుపై ఒక శంఖాకారపు లోహపు కప్పుతో (ఎడమ) తొలుస్తాడు. అతను ఒంటికి తగిలించుకున్న పాతదైపోయిన రెక్సిన్ సంచిలో (కుడి) మూడు కిలోగ్రాముల వరకూ సువాసన జిగురు ఉంటుంది

సుమారు ఒక దశాబ్దం క్రితం, కుటుంబాలు పెరిగి, భూమిపై ఆధారపడి నిలకడగా జీవించడం కుదరకపోవటంతో, అంబాపా ణీ పావరాలు చెరకు కోత కూలీలుగా పనిచేసేందుకు ప్రతి ఏటా వలసపోవడం ప్రారంభించారు. "ఇప్పుడు ప్రతి సంవత్సరం, దాదాపు 15 నుండి 20 కుటుంబాలు కర్ణాటకకు ప్రయాణం కడుతున్నాయి," అని కేలర్సింగ్ జామ్సింగ్ పావరా అనే ఒక కార్మిక సబ్-కాంట్రాక్టర్ చెప్పాడు. అతను పంట కోతలకోసం ఒప్పందం చేసుకునే ప్రతి ' కోయ్‌తా 'కు రూ. 1,000 కమిషన్‌గా సంపాదిస్తాడు.

నిజానికి ‘ కోయ్‌తా ’కు అసలైన అర్థం కొడవలి. మహారాష్ట్రలోని చెరకు పొలాల్లో ఒక కార్మిక యూనిట్‌ని - భార్యాభర్తల జంట - ఈ పేరుతో పిలుస్తారు. చెరకు కార్మికులుగా అనుభవం లేనివారు కావటంతో, పావరాలకు తక్కువ మొత్తాన్ని, ఒక కోయ్‌తా కు సుమారు రూ.50,000ని, ఏకమొత్తంగా చెల్లిస్తారు. ఇది చెరకు తోటల్లో పనిచేసే ఇతరులకు చెల్లించే దానికంటే తక్కువ.

"ఇతర పనులేవీ అందుబాటులో లేవు," కేలర్సింగ్ కారణాలు చెప్తాడు. నెలకు సుమారు రూ. 10,000 చెల్లిస్తే, ఒక జంట రోజుకు 12-16-గంటలు పని చేస్తుంది. చెరకు గడలను నరికి, ముక్కలు చేసి, కట్టలుగా కట్టి, వాటిని ట్రాక్టర్‌లకు ఎత్తి, చెరకు కర్మాగారానికి తరలిస్తారు, కొన్నిసార్లు తెల్లవారుజామున కూడా పనిచేస్తారు.

అంబాపాణీ నుంచి చెరకు కోతకు వెళ్ళిన ఇద్దరు కార్మికులు మరణించినట్టు రూప్‌సింగ్ అంటాడు. "అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బులు కొన్ని రోజుల్లోనే అయిపోతాయి," అంటారతను. "ఇంకా వైద్య సహాయం గానీ, బీమా సౌకర్యం గానీ, ప్రమాదాలు, ప్రాణ నష్టం జరిగితే వాటికి పరిహారం కూడా ఉండదు.”

ఇంటికి దగ్గరగా ఉపాధి దొరికితే తాము చెరుకు కోత పని చేయమని రెహెందీ ఇంటి వద్ద గుమిగూడినవాళ్ళు చెప్పారు. భాషాపరమైన సమస్యలు, పంట కోతల కాలంలో మహిళలు, చిన్నారులు చెరుకు పొలాల దగ్గర గుడారాలు వేసుకుని బతకడంలో కష్టాలు, లారీలు, ట్రాక్టర్ల వల్ల జరిగే ప్రమాదాలను వారు ఉదహరించారు. "పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, కానీ ఏకమొత్తంగా అడ్వాన్స్ ఇంకే పనికీ చెల్లించరు కదా?" అని కేలర్సింగ్ అడుగుతాడు

అంబాపాణీకి చెందిన సుమారు 60 శాతం మంది మగవాళ్ళు చెరకు కోత కూలీలుగా పనిచేశారని అతను చెప్పాడు.

పెద్ద మొత్తంలో ముందస్తు చెల్లింపు జరగటం చిన్నపాటి ఇంటి మరమ్మతులకు లేదా బైక్ కొనుక్కోవడానికి మాత్రమే కాకుండా, పావరా వరులు, కాబోయే వధువుల తల్లిదండ్రులకు తప్పనిసరిగా చెల్లించాల్సిన ఓలిని ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఓలి మొత్తాన్ని పావరా పంచాయతీ చర్చలు జరిపి నిర్ణయిస్తుంది.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

అనేకమంది అంబాపాణీ వాసులు చెరకు కోత కూలీలుగా పని చేయడానికి వలసపోతారు. కేలర్సింగ్ జామ్సింగ్ పావరా (ఎడమ) కర్ణాటకలో చెరకు పంట కోసం తాను ఏర్పాటు చేసిన ప్రతి భార్యాభర్తల జంటకు రూ. 1,000 కమీషన్‌ను పొందుతాడు. గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది చెరకు కోత ప్రయాణం(కుడి)లో ఉన్నారు. ఇంటికి దగ్గరగా ఉపాధి దొరికితే తాము చెరుకు కోత కూలీలుగా పని చేయబోమని వారు చెబుతున్నారు

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

ఎడమ: గ్రామంలో వెదురు, గడ్డితో నిర్మించిన పాఠశాల గదిలోనే EVMను ఉంచటం తప్పనిసరి. కుడి: పాఠశాల వెలుపల ఉన్న విరిగిపోయిన టాయిలెట్ బ్లాక్

పావరా తెగలోని సామాజిక, వైవాహిక సంబంధాలను నియంత్రించే నిబంధనలు ప్రత్యేకమైనవి. వివాహ వివాదాలపై పంచాయితీ ఎలా వ్యవహరిస్తుందో రూప్‌సింగ్ వివరించాడు. చర్చల సమయంలో ఇరుపక్షాలు ఒకదానికొకటి కొన్ని డజన్ల గజాల దూరంలో కూర్చుంటాయి, ఈ ప్రక్రియను ఝగడా అని పిలుస్తారు. అప్పుడప్పుడు, పెళ్ళయిన కొద్ది రోజుల తర్వాత వధువును ఇజ్జత్ అని పిలిచే చెల్లింపుతో పాటు ఆమె తల్లిదండ్రుల వద్దకు తిరిగి పంపిస్తారు, కానీ ఆమె మరొక వ్యక్తితో పారిపోతే, వధువు కుటుంబం తీసుకున్న ఓలికి రెండింతలు సమానమైన పరిహారం చెల్లించాల్సివుంటుంది.

"అంబాపాణీ నిజంగా ఒక విలక్షణమైన గ్రామం" అని జళగాఁవ్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ చెప్పారు. డిసెంబర్ 2023లో తమను కలుసుకోవడానికి 10 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి వచ్చిన మొదటి జిల్లా కలెక్టర్ ఇతనేనని స్థానికులు చెబుతున్నారు. "గ్రామానికి దాని నైసర్గిక స్వరూపం కారణంగా ప్రత్యేకమైన సవాళ్ళున్నాయి. అయితే మేం మెరుగైన సేవలను అందించే ప్రక్రియను ప్రారంభించాం." వాస్తవానికి అటవీ భూమిపై స్థిరపడి ఉన్నప్పటికీ ఈ గ్రామాన్ని రెవెన్యూ డిపార్ట్‌మెంట్ గుర్తించకపోవడం ఒక ముఖ్యమైన న్యాయపరమైన సమస్య. "అంబాపాణీని గావ్‌థన్‌ గా మార్చే పని ప్రారంభమైంది. ఇంకా మరిన్ని ప్రభుత్వ పథకాలు దీన్ని అనుసరిస్తాయి," అని ప్రసాద్ చెప్పారు.

ప్రస్తుతానికి ఆ పాఠశాల గది, దాని వెలుపల విరిగిన టాయిలెట్ బ్లాక్- ఇక్కడే 300 మందికి పైగా ఓటర్లు మే 13న తమ ఓటు వేయనున్నారు. అంబాపాణీ జళగాఁవ్ జిల్లాలోని రావెర్ పార్లమెంటరీ నియోజకవర్గం కిందకు వస్తుంది. EVM, మిగతా అన్ని వోటింగ్ సామాగ్రిని కాలినడకన, మోటర్‌బైక్‌ల మీద ఆ ఎత్తు ప్రదేశానికి తీసుకువెళతారు

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ బూత్‌లో సగటున 60 శాతం పోలింగ్ నమోదైంది. అంబాపాణీ తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడానికి అవసరమైన ప్రతిదీ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య ఫలాలు రావడం మాత్రమే ఆలస్యం అవుతుంది

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Kavitha Iyer

कविता अय्यर, पिछले 20 सालों से पत्रकारिता कर रही हैं. उन्होंने 'लैंडस्केप्स ऑफ़ लॉस: द स्टोरी ऑफ़ ऐन इंडियन' नामक किताब भी लिखी है, जो 'हार्पर कॉलिन्स' पब्लिकेशन से साल 2021 में प्रकाशित हुई है.

की अन्य स्टोरी Kavitha Iyer
Editor : Priti David

प्रीति डेविड, पारी की कार्यकारी संपादक हैं. वह मुख्यतः जंगलों, आदिवासियों और आजीविकाओं पर लिखती हैं. वह पारी के एजुकेशन सेक्शन का नेतृत्व भी करती हैं. वह स्कूलों और कॉलेजों के साथ जुड़कर, ग्रामीण इलाक़ों के मुद्दों को कक्षाओं और पाठ्यक्रम में जगह दिलाने की दिशा में काम करती हैं.

की अन्य स्टोरी Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

की अन्य स्टोरी Sudhamayi Sattenapalli