బసంత్ బింద్ కొన్ని రోజుల కోసం మాత్రమే సెలవు తీసుకుని ఇంటికి వచ్చాడు. రోజువారి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న అతను, జహానాబాద్ జిల్లాలోని తన స్వగ్రామమైన సలేమాంపుర్‌కు కొన్ని గంటల ప్రయాణ దూరంలో ఉన్న పట్నాకు దగ్గరలోని పొలాలలో గత కొన్ని నెలలుగా పనిచేస్తున్నాడు.

సంక్రాంతి పండుగ అయిన మరుసటి రోజు, అంటే 2023 జనవరి 15న, అతడు తిరిగి తన పనిలో చేరవలసి ఉంది. ఆరోజు పక్క గ్రామమైన చంధరియా నుండి మరికొందరు కూలీలను జత చేసుకోవడానికి వెళ్ళాడు, తద్వారా వారంతా కలిసి బిహార్ రాజధానికి వెళ్ళవచ్చు - కూలీలు ఎక్కువగా ఉంటే పని దొరికే మార్గం సులభం అవుతుంది.

అతడు ఇతర కూలీలతో మాట్లాడుతూ ఉండగానే పోలీసు, ఎక్సైజ్ శాఖకు చెందిన అధికారులతో కూడిన వాహనం ఒకటి అక్కడికి వచ్చి ఆగింది. వారు బిహార్ రాష్ట్ర మద్యపాన వ్యతిరేక మరియు ఎక్సైజ్ (సవరణ) చట్టం, 2016 కు చెందిన మద్యపాన వ్యతిరేక దళానికి చెందినవారు. 'బిహార్ రాష్ట్రంలో సంపూర్ణంగా మద్యపాన, మత్తు పదార్థాల నిషేధాన్ని అమలుపరచటం, అమలుచేయడాన్ని ప్రోత్సహించటం…' వీరి పని.

పోలీసులను చూసి అక్కడున్నవారంతా పరిగెత్తడం మొదలుపెట్టారు. బసంత్ కూడా పరుగందుకున్నాడు అయితే "నా కాలులో స్టీల్ కడ్డీ ఉండటం వల్ల నేను వేగంగా పరిగెత్తలేను." దురదృష్టవశాత్తు మరో నిమిషంలోనే "ఎవరో నా చొక్కా కాలర్ పట్టుకుని వాహనంలోకి తోసేశారు," అని ఈ 27 ఏళ్ల యువకుడు చెప్పాడు.

మద్యం కోసం తనను, తన ఇంటిని సోదా చెయ్యమని అతను ఆ బృందాన్ని కోరాడు, కానీ వారు ఆ పని చేయలేదు. అయితే ఎక్సైజ్ శాఖకు తీసుకువెళ్లిన తర్వాత తనని వదిలిపెట్టేస్తామని చెప్పటంతో అతను కాస్త స్థిమితపడ్డాడు.

కానీ వారంతా పోలీస్ స్టేషన్‌కు చేరే సమయానికే బసంత్ వద్ద 500 మి.లీ. మద్యం దొరికినట్టుగా అధికారికంగా నమోదు చేసివున్నట్టు అతనికి తెలిసింది. అతని వద్ద మద్యం ఉన్నట్లుగా మద్య నిషేధ చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. మొదటిసారి నేరం చేసినవారైతే ఈ అపరాధానికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, లక్షరూపాయలకు తగ్గకుండా జరిమానా ఉంటుంది.

PHOTO • Umesh Kumar Ray
PHOTO • Umesh Kumar Ray

బసంత్ బింద్ పట్నా చుట్టుపక్కల ఉండే పొలాల్లో రోజువారి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగ తరువాత పనిలోకి తిరిగి వెళుతున్న సమయంలో బిహార్‌లోని చంధరియా గ్రామంలో మద్యపాన వ్యతిరేక దళం అతడిని అరెస్టు చేసింది

"నేను రెండు గంటలకు పైగా వాదించాను. దర్యాప్తు చేసుకోమని వాళ్ళతో చెప్పాను," అయితే అతడి వాదనలను వారు వినిపించుకోలేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జిల్లా న్యాయస్థానంలో తనను ప్రవేశపెట్టినప్పుడు, "నేను జడ్జిగారితో మా కుటుంబంలో ఎవరూ మద్యం అమ్మరు, నన్ను విడుదల చేయండి," అని మొరపెట్టుకున్నట్టుగా బసంత్ చెప్పాడు. న్యాయస్థానం దర్యాప్తు అధికారిని పిలవగా, ఆయన మరొకచోట సోదా చేసే పనిమీద వెళ్లారని ఎక్సైజ్ అధికారులు చెప్పారని బసంత్ చెప్పాడు. అప్పుడతన్ని కాకో జైలుకి తరలించారు. నాలుగు రోజులు జైలులో గడిపిన తర్వాత బంధువులు ఇచ్చిన హామీపై అతన్ని జనవరి 19, 2023న విడుదల చేశారు. జామీను కోసం అతడి తల్లి తన భూమిని, అతడి తల్లివైపు బంధువు తన మోటార్ సైకిల్‌ని తాకట్టుపెట్టారు.

*****

జహానాబాద్ జిల్లాలో ఉన్న ఆరు పోలీస్ స్టేషన్లలోని హులాస్‌గంజ్, పాలీ, బరాబర్ పర్యాటక స్టేషన్లలో నమోదైన కేసులను చూస్తే అక్కడ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదైన 501 కేసుల్లో 207 కేసులు ఒక్క ముసహర్ సముదాయానికి చెందినవారిపైనే నమోదయ్యాయి. వీరు రాష్ట్రం మొత్తం మీద అత్యంత పేద, అట్టడుగు వర్గాలకు చెందినవారు. మిగతా ఎఫ్ఐఆర్‌లలో అత్యధిక ఆరోపణలు రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసి)గా వర్గీకరించిన బింద్, యాదవ్ సముదాయాలవారిపై నమోదైనవి.

"అరెస్ట్ అయినవారిలో అత్యధికులు దళితులు లేదా వెనుకబడిన వర్గాలకు చెందినవారే, అందులోనూ ముసహర్లే ఎక్కువ," అని వెనుకబడిన వర్గాలవారికి న్యాయ సహాయం అందజేసే ప్రభుత్వేతర సంస్థ అయిన లా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. “పోలీసులు వాహనాల్లో బస్తీల కు వచ్చి ఎటువంటి ఆధారాలు లేకుండా పురుషులను, మహిళలను, పిల్లలను అరెస్టు చేసి జైల్లో పెడతారు. వీరికి న్యాయవాదులను నియమించుకునే స్తోమత లేని కారణంగా నెలల తరబడి జైల్లో మగ్గుతుంటారు," అని చెప్పారాయన.

బసంత్ స్వగ్రామం సలేమాంపుర్‌లో ఉన్న 150 కుటుంబాల్లో (జనగణన 2011) అతి తక్కువమందికి మాత్రమే వ్యవసాయ భూమి ఉంది, మిగతావారంతా కూలీ పని చేసి పొట్టపోసుకుంటారు. 1242 మంది జనాభా గల ఈ గ్రామంలో అత్యధికంగా బింద్, ముసహర్, యాదవ్, పాసీ, ముస్లిమ్ కుటుంబాలున్నాయి.

"ఇది మా ఇల్లు. నన్ను చూడండి, నేనసలు మద్యం అమ్మేవాడిలా కనిపిస్తున్నానా? మా కుటుంబం మొత్తంలో ఎవరూ ఇలాంటి పని చేయరు," తనపై తప్పుడు కేసు పెట్టినందుకు కోపంతో మండిపడుతూ బసంత్ అన్నాడు. మామూలుగా నెమ్మదస్తురాలయిన బసంత్ భార్య కవితాదేవి తన భర్తపై అర లీటర్ మద్యాన్ని కలిగి ఉన్నాడన్న ఆరోపణ వచ్చిందని విని, "ఆయన మద్యం ఎందుకు అమ్ముతారు? ఆయన అసలు తాగరు," అని కోపంగా అంది.

PHOTO • Umesh Kumar Ray

సలేమాంపుర్‌లోని తమ ఇంటి వద్ద ఎనిమిది సంవత్సరాల కొడుకు, రెండు సంవత్సరాల కూతురుతో బసంత్ బింద్, అతని భార్య కవితాదేవి

PHOTO • Umesh Kumar Ray
PHOTO • Umesh Kumar Ray

వారి ఇల్లు (ఎడమ) 30 అడుగుల వెడల్పు ఉన్న కాలువ (కుడి) గట్టుపై ఉంది. అక్కడ నివసించేవారు అవతలి వైపుకు వెళ్ళాలంటే కాలువపై అడ్డంగా వేసిన రెండు కరెంటు స్తంభాల మీదుగా నడవాల్సిందే

ఇటుకలు, పూరి కప్పుతో కట్టిన వీరి ఇల్లు 30 అడుగుల వెడల్పు ఉన్న ఒక కాలువ గట్టుపై ఉంది. అడ్డంగా వేసిన రెండు కరెంటు స్తంభాలు ఈ కాలువ దాటటానికి వంతెనలా పనిచేస్తాయి. వర్షాకాలంలో కాలువ నిండి పొంగిపొర్లుతున్నప్పుడు ఈ స్తంభాల మీదుగా కాలువను దాటడం ప్రమాదంతో కూడిన పని. వారి ఎనిమిది సంవత్సరాల కొడుకు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు, ఐదు సంవత్సరాల పెద్ద కూతురు అంగన్‌వాడీ కి వెళుతుంది, చిన్న కూతురి వయసు కేవలం రెండు సంవత్సరాలే.

"ఈ మద్య నిషేధం మాకు ఏ విధంగా సహాయపడుతుందో నాకు అర్థం కావడంలేదు. దీనివల్ల మేం బాధలు పడుతున్నాం," అని 25 సంవత్సరాల కవిత చెప్పింది.

నేరం చేసినట్లుగా అభియోగానికి గురైన కారణంగా బసంత్ దీర్ఘకాలం పాటు చిక్కులతో నిండిన, ఖర్చుతో కూడిన న్యాయపోరాటం జరపవలసి ఉంటుంది. "డబ్బున్నవారి ఇంటికి నేరుగా మద్యం సరఫరా అవుతుంది. వారిని ఎవరూ ఇబ్బంది పెట్టరు," అని నిస్పృహగా చెప్పాడు బసంత్.

ఇప్పటికే లాయర్ ఫీజు, బెయిల్ కోసం రూ. 5000 ఖర్చు కాగా బసంత్‌కు మరింత ఖర్చు పెట్టవలసిన అవసరం కనిపిస్తోంది. పనికి వెళ్లలేని కారణంగా కూలీ డబ్బులు కూడా నష్టపోతున్నాడు. " హమ్ కమాయేఁ కి కోర్ట్ కా చక్కర్ లగాయేఁ (నేను పనికే వెళ్లాలా లేక కోర్టు చుట్టూ తిరగాలా)?" అన్నాడతను.

*****

"మీరు నా పేరు రాయొద్దు. పోలీసులకు తెలిస్తే నన్ను ఏమైనా చేస్తారు... నేనేం చేయగలను, నా పిల్లలతో కలిసి నేను ఇక్కడే బ్రతకాలి," అన్నారు దిగాలుగా సీతాదేవి (అసలు పేరు కాదు).

వీరి కుటుంబం జహానాబాద్ రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలోని ముసహరి గ్రామంలో నివాసముంటోంది. వీరు రాష్ట్రంలోని అతిపేదవర్గాలకు చెందిన మహాదళితులుగా వర్గీకరించిన ముసహర్ సముదాయానికి చెందినవారు.

ఆమె భర్త రాంభూవల్ మాంఝీ (అసలు పేరు కాదు) పై మద్యనిషేధ చట్టం ద్వారా నమోదైన అభియోగాలన్నీ ఎత్తివేసి ఒక సంవత్సరం కావస్తున్నా ఆమెనింకా భయం వీడలేదు.

PHOTO • Umesh Kumar Ray
PHOTO • Umesh Kumar Ray

బసంత్ ఇప్పటికే లాయర్ ఫీజు, బెయిల్ కొరకు రూ. 5000 ఖర్చు చేశాడు, కాగా మరింత ఖర్చు పెట్టవలసివస్తోంది. "ఈ మద్య నిషేధం మాకు చేసిన సాయం ఏమిటి?” అని అతని భార్య కవిత ప్రశ్నిస్తోంది

రెండేళ్ళ క్రితం రాంభూవల్ మాంఝీపై మద్యం కలిగి ఉన్నట్లుగా మద్యనిషేధ చట్టం ద్వారా అభియోగం మోపారు. "మా ఇంట్లో అసలు మద్యం దొరకలేదు. అయినా పోలీసులు ఆయన్ను తమతో తీసుకెళ్లారు. మేం మద్యం తయారుచేయటం, అమ్మటం లాంటి పనులు చెయ్యం. నా భర్త అసలు మద్యం తాగడు," అని సీతాదేవి చెప్పారు.

కానీ ఎఫ్ఐఆర్‌లో మాత్రం '2021 నవంబర్ 24వ తేదీన ఉదయం 8 గంటలకు పోలీసులు వారి ఇంట్లో మహువా (ఇప్ప పూలు), గూర్ (బెల్లం)తో చేసిన 26 లీటర్ల చులాయీ అనే దేశీ మద్యం దొరికినట్టు'గా నమోదు చేశారు. అంతేకాక రాంభూవల్ అక్కడి నుంచి పారిపోగా, దాదాపు ఒక నెల తర్వాత, అంటే 2021 డిసెంబర్ 24న అతడిని అతని ఇంటి వద్ద అరెస్టు చేసినట్లుగా పోలీసుల చెప్పుకొచ్చారు.

భర్త జైల్లో ఉండటంతో ఒక సంవత్సరం పాటు సీతాదేవి వేదన అనుభవించింది. తన పిల్లలు -18 సంవత్సరాల కూతురు, 10, 8 సంవత్సరాల ఇద్దరు కొడుకులను తాను ఒక్కతే చూసుకోవలసి వచ్చింది. రాంభూవల్‌ను కలుసుకోవడానికి జైలుకు వెళ్ళినప్పుడల్లా వారిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఏడ్చేవారు. "ఆయన నన్ను మేం ఎలా ఉన్నామో, ఏం తింటున్నామో అని అడిగేవాడు. మా పిల్లలు ఎలా ఉన్నారనేది ఆయన చింత. నేను మా కష్టాల గురించి చెప్పుకున్నప్పుడు ఆయన ఏడ్చేవాడు, ఆయన్ని చూసి నాకూ ఏడుపొచ్చేది," సీతాదేవి తన కన్నీటిని దాచుకునేందుకు ప్రయత్నిస్తూ చెప్పారు.

తనను, తన పిల్లలను పోషించుకోవటానికి సీతాదేవి వ్యవసాయ కూలీగా పని చేస్తూ, ఇరుగుపొరుగుల వద్ద డబ్బు అప్పుగా తీసుకునేవారు. "నా తల్లిదండ్రులు బటైయా (కౌలు) రైతులు. వారు మాకు బియ్యం, పప్పులు పంపేవారు. అలాగే ఇంకొందరు బంధువులు కూడా కొంత ధాన్యం పంపేవారు. నాకు ఇప్పుడు ఒక లక్షకు పైగా అప్పు ఉంది," అని చెప్తూ ఆమె మౌనంగా ఉండిపోయారు.

తప్పుడు కేసుల్లో ఎప్పుడైతే ఐదుగురు సాక్షులైన ఒక ఇన్‌ఫార్మర్, ఇంకొక మద్యం ఇన్స్‌పెక్టర్, మరొక ఇన్స్‌పెక్టర్, సోదాకు వచ్చిన ఇద్దరు దళ సభ్యులు ఉంటారో- అప్పుడు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం చాలా కష్టం. అయితే అదృష్టవశాత్తు రాంభూవల్ కేసు కోర్టుకు వచ్చినప్పుడు ఇద్దరు సాక్షులు అతని ఇంట్లో ఎలాంటి మద్యం దొరకలేదని చెప్పటంతో న్యాయస్థానం ఆ కేసులో ఉన్న తీవ్రమైన అవకతవకల్ని తప్పుపట్టింది.

జహానాబాద్ ఎగువ జిల్లా మరియు సెషన్స్ న్యాయస్థానం రాంభూవల్ మాంఝీని అన్ని అభియోగాల నుండి తప్పించి, 2022 నవంబర్ 16న విడుదల చేశారు.

PHOTO • Umesh Kumar Ray

బీహార్ రాష్ట్ర మద్య నిషేధం మరియు ఎక్సైజ్ (సవరణ) చట్టం, 2016 క్రింద అరెస్టు అయిన కారణంగా బసంత్ దీర్ఘకాలం, ఖర్చుతో కూడిన న్యాయపోరాటం జరపవలసి ఉంటుంది

" సుఖల్ ఠట్ఠర్ నికలే థే జేల్ సే (ఆయన జైలు నుంచి బయటికి వచ్చినప్పుడు బక్కచిక్కిపోయి ఉన్నాడు)," అని సీతాదేవి చెప్పారు.

విడుదలైన పది రోజులకే రాంభూవల్ జహానాబాద్ నుండి వేరే చోటకు పని కోసం వలస వెళ్ళారు. "రెండు మూడు నెలలు భోజనం సరిగ్గా చేసేటట్టు చూద్దామనుకున్నాను, కానీ ఆయనను పోలీసులు మళ్లీ అరెస్టు చేస్తారేమోననే భయం వెంటాడుతూనే ఉంది. అందుకే చెన్నై వెళ్లిపోయాడు," అని 36 ఏళ్ల అతని భార్య చెప్పారు.

అతని కథ ఇంతటితో ముగియలేదు.

ఒక కేసులో విడుదలైన రాంభూవల్‌పై 2020లో మద్యవ్యతిరేక చట్టం క్రింద మరో రెండు కేసులు నమోదైవున్నాయి. మద్య నిషేధం మరియు ఎక్సైజ్ శాఖల సమాచారం మేరకు ఏప్రిల్ 2016 నుండి 14 ఫిబ్రవరి 2023 వరకు ఈ చట్టం క్రింద 7.5 లక్షల అరెస్టులు జరిగాయి. అరెస్టయినవారిలో 1.8 లక్షల మంది దోషులుగా నిర్ధారణ అయితే, వారిలో 245 మంది మైనర్లు ఉన్నారు.

తన భర్తను మళ్ళీ విడుదల చేస్తారో లేదోనని సీతకు సందేహంగా ఉంది. మధ్య నిషేధం వారికి ఏ విధంగానైనా తోడ్పడిందా అని అడిగినప్పుడు, " కోచీ బుఝాయేగా హమ్ కో? హమ్‌తో లంగ్టా హో గయే (మీరు నాకు దాని గురించి ఎలా వివరించగలరు? మేం మాకున్నదంతా పోగొట్టుకున్నాం) మా అమ్మాయి పెద్దదవుతోంది, దాని పెళ్లి గురించి ఆలోచించాలి. ఎలా చేస్తామో మాకు తెలియటంలేదు. రోడ్డు మీద పడి అడుక్కుతినటం తప్ప మాకు మరో మార్గం లేదు," అని అన్నారామె.

2021లో రాంభూవల్ తమ్ముడు తెలియని అనారోగ్యంతో మరణించిన కొన్ని నెలలకే, నవంబర్ 2022లో అతడి భార్య కూడా చనిపోయింది. ఇప్పుడు సీతాదేవి తన పిల్లలతో పాటు తన మరిది పిల్లలిద్దరినీ కూడా చూసుకోవాల్సి వస్తోంది.

"దేవుడు మాకు పుట్టెడు దుఃఖాన్ని ఇచ్చాడు. అందుకే బాధలు పడుతున్నాం."

ఈ కథనానికి బిహార్ రాష్ట్రంలో అణగారిన ప్రజల పోరాటాలకు చేయూతనందించిన ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడి జ్ఞాపకార్థం ఇచ్చిన ఫెలోషిప్ మద్దతు ది.

అనువాదం: నీరజ పార్థసారథి

Umesh Kumar Ray

उमेश कुमार राय साल 2022 के पारी फेलो हैं. वह बिहार स्थित स्वतंत्र पत्रकार हैं और हाशिए के समुदायों से जुड़े मुद्दों पर लिखते हैं.

की अन्य स्टोरी Umesh Kumar Ray
Editor : Devesh

देवेश एक कवि, पत्रकार, फ़िल्ममेकर, और अनुवादक हैं. वह पीपल्स आर्काइव ऑफ़ रूरल इंडिया के हिन्दी एडिटर हैं और बतौर ‘ट्रांसलेशंस एडिटर: हिन्दी’ भी काम करते हैं.

की अन्य स्टोरी Devesh
Translator : Neeraja Parthasarathy

Neeraja Parthasarathy is a teacher, translator and eclectic reader in both English and Telugu.

की अन्य स्टोरी Neeraja Parthasarathy