ఈ ఏడాది మే నెలలో ఒక తీవ్రమైన వేసవి మధ్యాహ్నం గొట్టం హనిమి రెడ్డి గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామం నుంచి 105 కిలోమీటర్లు ట్రక్కులో ప్రయాణించి గుంటూరుకి వచ్చారు. తన ఐదెకరాల పొలంలో తను పండించిన ఎనిమిది క్వింటాళ్ల మిరపకాయలు అమ్ముకునేందుకు ఆయన ఈ ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇది ఆ సీజన్ కి చివరి పంట. అంతకు ముందు ఏప్రిల్ లో మూడు సార్లు మార్కెట్ కి వచ్చి రెడ్డి,  మిరపకాయలను క్వింటాల్ కు ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల మధ్య అమ్ముకున్నారు. మిరపకాయ రకం -  మిర్చి LCA334 లేదా గుంటూరు సన్నం రకం బట్టి - ధర లభించింది.

ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు పట్టణంలో NTR వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుకు వచ్చిన హనిమి రెడ్డి, ధరలు పెరిగితే తన మిరప పంట అమ్మాలని మూడు రోజుల నుంచి నిరీక్షిస్తున్నారు. 2017-18 వ్యవసాయ సీజన్ కి మిర్చి అమ్మకాలు ముగుస్తున్న రోజు, మార్కెట్లో రైతుల మెస్ బయట కూర్చున్నారు హనిమి రెడ్డి. “ఈరోజు ధరలు ఇంకా పడిపోయాయి. కమీషన్ ఏజెంట్లు క్వింటాల్ కి 4200 రూపాయలే ఇస్తున్నారు. వాళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడతారు. ఇంక వాళ్ళ ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తారు," అన్నారు రెడ్డి.

దిక్కుతోచని పరిస్థితి వచ్చేసరికి రెడ్డి ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి. వచ్చిన ధరకి తక్కువ ధరకి అమ్ముకోవడమా, లేదా ఇంటికి వెనక్కి తీసుకునివెళ్ళి శీతల గిడ్డంగిలో పెట్టుకోవడమా? . “ఏసీ ఖర్చు భరించడం నా వల్ల కాదు. పైగా ఒక క్వింటాల్ - అంటే 50 కిలోల సంచులు రెండు రవాణా చేయాలంటే ఒక వైపు వెయ్యి రూపాయలు చార్జీలు," తక్కువ ధరకి ఎందుకు అమ్ముకోవాల్సి వస్తోందో వివరిస్తున్నారు. ఒక్క క్షణం ఆగి, మెల్లిగా "బ్రోకర్లూ, కోల్డ్ స్టోరేజ్ వాళ్ళూ కుమ్మక్కయ్యారని అందరికీ తెలుసు. ఈ పరిస్థితిలో ఇద్దరికీ లాభమే," అని చెప్పారు.

విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల కోసం రెడ్డి ఎకరానికి దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇవన్నీ కాక తానూ, భార్యా కూడా పొలంలో కష్టించి పని చేశారు. ఈ పెట్టుబడితో 2017-18 మిర్చి సీజన్లో, అక్టోబర్ మర్చి కాలంలో, ఎకరానికి 20 క్వింటాళ్ల పంట వచ్చింది. మొత్తం పది లక్షల రూపాయలు విలువచేసే 100 క్వింటాళ్లు. అంతకు ముందు ఏళ్లలో ఇది కొంచెం లాభసాటిగానే ఉండేది. – 2015-16 లో క్వింటాల్ కి ధర Rs. 12,000-15,000 ఉన్నాయి. (అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల అని భావించారు).  మిగిలిన సంవత్సరాల్లో  క్వింటాల్ కు కనీసం 10,000 రూపాయలు ఉండడంతో రైతులకి గిట్టుబాటైంది.
Gottam Hanimi Reddy showing the bills he got from the middlemen. The bills show the quantity sold and the price offered apart from other details like commission, debts and dues
PHOTO • Rahul Maganti
Mohammad Khasim, 24 from Tripuranthakam village in Prakasam district.
PHOTO • Rahul Maganti

గొట్టం హనిమి రెడ్డి (ఎడమ) అతి తక్కువ ధరకు తన మిరప పంట అమ్మవలసి వచ్చింది. మొహమద్ ఖాసిం (కుడి) నిరసనగా తన పంటలో కొంత భాగం దగ్ధం చేశారు. ఫోటో: రాహుల్ మాగంటి

“ఈ ఒక్క ఏడాదే నాకు ఎంత నష్టం జరిగి ఉంటుందో చెప్పగలరా?" రెడ్డి అడిగారు. “క్రితం ఏడాది [2016-17], నాకు నాలుగు లక్షల నష్టం జరిగింది. ఇప్పుడు నాకు 9 లక్షల అప్పు ఉంది. (అందులో కొన్ని బ్యాంకు రుణాలు, అధిక శాతం 36 శాతం వడ్డీరేటుతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి.)"

మొన్న 2016-2017 వ్యవసాయ సీజన్లో, మార్కెట్లో  వరదలా వచ్చి పడింది.  అంతకు ముందు ఏడాది  2015-16లో లాగా అధిక ధరలు వస్తాయని ఆశపడి చాలా మంది రైతులు మిర్చి పంట వేశారు. పైపెచ్చు పత్తి పంటకి గులాబీ పురుగు పట్టడంతో, ఆ రైతులు కూడా మెరుగైన పంట కోసం మిర్చికి మారారు. కానీ, ధరలు మునుపెన్నడూ లేనంత తక్కువగా క్వింటాల్ కు 1,500-3000 రూపాయలకు పడిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక పత్రికల్లో 10మందికి పైగా మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. (See Mirchi is not so hot anymore in Penugolanu ).
"గత పదేళ్లలో వ్యవసాయ ఖర్చులు ఎకరానికి 30,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలకు పెరిగినా, ధరలు మాత్రం అంతే ఉన్నాయి," అని చెప్తున్నారు విజయవాడకి చెందిన అఖిల భారత కిసాన్ సభ ఉద్యమకర్త, నాగబోయిన రంగారావు.

తక్కువ ధరల కారణంగా రైతులు ఇతర పంటలు సాగుచేసుకోవాల్సి వస్తోంది. గుంటూరు మార్కెట్ యార్డు ఇచ్చిన గణాంకాల ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ లో 2016-17లో మొత్తం 4.65 లక్షల ఎకరాల్లో మిర్చి దిగుబడి 93 లక్షల టన్నులు ఉండగా, 2017-18లో కేవలం  2.5 లక్షల ఎకరాల్లో మాత్రమే మిర్చి సాగు జరిగింది. సీజన్ ముగిసే సమయానికి కేవలం 50 లక్షల టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది.

“గత ఏడాది సరఫరా ఎక్కువగా ఉండి, తక్కువ డిమాండ్ ఉండడంతో ధరలు పడిపోయాయని బ్రోకర్లు, అధికారులు గత ఏడాది చెప్పారు. కానీ ఈ ఏడాది సరఫరా తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉన్నా, ధరలు పెద్దగా పెరగలేదు," ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గ్రామానికి చెందిన 24 సంవత్సరాల రైతు మొహమ్మద్ ఖాసీం చెప్పారు. 2017 మార్చిలో ఖాసీం గుంటూరు మార్కెట్ యార్డ్ ఎదుట నిరసనగా తన పంటలో కొంత భాగాన్ని దగ్ధం చేశారు.
Januboina Ankalamma separating the mirchi according to grade in the farm of Rami Reddy
PHOTO • Rahul Maganti
Mirchi being dried up in the Guntur market yard
PHOTO • Rahul Maganti

జానుబోయిన అంకాళమ్మ వంటి వ్యవసాయ కార్మికులు కూడా తక్కువ ధరల వల్ల ప్రభావితమయ్యారు. కుడి: గుంటూరు మార్కెట్ యార్డులో కంటికింపుగా కనిపించే ఈ పంటకి మంచి ధర వస్తుందని నమ్మకం లేదు. ఫోటో: రాహుల్ మాగంటి

రైతులే నష్టాల్లో పంట సాగు చేస్తుంటే, వారు పనికి పెట్టుకునే వ్యవసాయ కార్మికులు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతారు. మిరప ఎక్కువ పని ఉండే పంట. విత్తనాలు నాటినప్పుడు, కలుపు తీసేటప్పుడు, పంట కొత్త, వివిధ రకాల పంట వేర్పాటు సమయంలోనూ మూడు, నాలుగు సార్లు వ్యవసాయ కూలీలను పనిలో పెట్టుకోవాల్సి వస్తుంది. మొదటి రెండు పనులూ ఎక్కువగా మహిళలే చేస్తారు. పురుషులు కోతలకు వస్తారు. దీనికే ఎకరం పంటలో మిరపకాయలు కోసేందుకు రెండు రోజులపాటు 300  పని చేయడానికి లక్షన్నర రూపాయలు ఖర్చవుతుంది," అంటారు కృష్ణా జిల్లాలోని గంపలగూడెం మండలంలోని మేడూరు గ్రామంలో రెండు ఎకరాల రైతు అల్టూరి రామిరెడ్డి.

ఆ పక్కన తిరువూరు మండలంలోని గానుగపాడు గ్రామంలో రామిరెడ్డి పొలంలో పని చేసే జానుబోయిన అంకాళమ్మ, ట్రాక్టర్లో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. “మా కూలీలు పెంచమని, మగవాళ్ళతో సమానంగా మా 150 రూపాయలను 250 రూపాయలు చేయమనీ రైతుని అడిగినప్పుడల్లా, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తున్నామని వాళ్ళు విసుక్కుంటారు. మిరపకాయ్ సరైన ధర పలకక తామే నష్టాల్లో ఉన్నామని వాళ్ళు చెప్తారు. రైతులకి సజావైన, లాభసాటి అయినా ధర వచ్చేలా ప్రభుత్వం చూస్తే, రైతు కూడా మా కూలీలు పెంచే అవకాశం ఉంది," అంటారు ఆమె.

గుంటూరు యార్డు ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ యార్డ్. అక్కడ 400 మందికి పైగా కమీషన్ ఏజెంట్లు, రైతులకీ. కొనుగోలుదారులకీ లేదా ఎగుమతి దారులకీ మధ్య బ్రోకర్లుగా వ్యవహరిస్తుంటారు. రైతుకి వచ్చిన ప్రతి వంద రూపాయల్లో వారికి 3 నుంచి 5 రూపాయలు లభిస్తాయి. రైతుకి ఇచ్చే తుది మొత్తం నుంచి కమీషన్ తగ్గించుకుంటారు. “వారిలో సగం మందికి లైసెన్స్ లు కూడా లేవు కానీ రాజకీయ నాయకులతో వాళ్లకున్న సాన్నిహిత్యం కారణంగా ఇక్కడ పని చేస్తుంటారు. అధికారులు, బ్రోకర్లు, రాజకీయ నాయకులూ కుమ్మక్కు కావడంతో ధరలు తక్కువగా ఉండి, రైతులు ప్రతి రోజూ లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు," AIKS ఉద్యమకర్త నాగబోయిన రంగారావు చెప్తారు. ఈ కార్టెల్ వ్యవస్థ, తక్కువ ధరలకు వ్యతిరేకంగా AIKS గతంలో అనేక ఉద్యమాలు నడిపింది.


2018 ఫిబ్రవరి 1న గుంటూరులో మిర్చి యార్డు eNAM (ఎలెక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్స్)తో డిజిటల్ మార్కెట్ గా రూపాంతరం చెందింది. దీని వల్ల దేశంలో ఎక్కడినుంచైనా కొనుగోలుదారులు ఉత్పత్తులను కొనుగోలు చేయగలుగుతారు. దేశంలో ఈ వ్యవస్థను ప్రయోగప్రాతిపదికన అమలు చేస్తున్న 585 వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ యార్డుల్లో గుంటూరు మార్కెట్ కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్ 2016 ఏప్రిల్ 16వ తేదీన ప్రారంభమైంది. వ్యవసాయ ఉత్పత్తులకు జాతీయ సమీకృత మార్కెట్ ను ఆన్ లైన్ కల్పించేలా APMC మార్కెట్లను అనుసంధానం చేసే లక్ష్యంతో ఏర్పాటైన అఖిల భారత పోర్టల్ ఇది. సక్రమంగా అమలైతే ఈ వ్యవస్థ స్థానికంగా ఉన్న కూటములు విచ్చిన్నం చేసి, కొనుగోలుదారుల మధ్య పోటీ పెంచి, రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పిస్తుందన్నది ప్రభుత్వ యోచన.

Mirchi being stuffed in jute bags by the workers in the yard
PHOTO • Rahul Maganti
Jute bags stuffed with mirchi for sale to the exporters in Guntur Mirchi yard
PHOTO • Rahul Maganti

ఎండుమిర్చిని జనపనార సంచుల్లో నింపుతున్న కార్మికులు. సంచులను ట్రక్కుల్లో టెంపోలలో ఎగుమతిదారులకు అమ్మేందుకు మార్కెట్ కి తీసుకునివెడతారు. ఫోటో: రాహుల్ మాగంటి

గుంటూరులో బ్రోకర్లు డిజిటీకరణను వ్యతిరేకించి రైతులు యార్డుకు తీసుకొచ్చిన పంటను కొనుగోలు చేసేందుకు నిరాకరించారు. రైతులు కూడా ఈ ఏడాది మార్చిలో బ్రోకర్లు కొనుగోళ్లు చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. “మేము తెచ్చిన సరుకు వెనక్కి తీసుకువెళ్లడం సాధ్యంకాదు. అందుకనే యార్డు పక్కన చిలకలూరిపేట రోడ్డు బ్లాక్ చేసాం. మార్కెట్ యార్డు అధికారులు eNAM కొంత సేపు నిలుపు చేసేలా చేశాము," ఖాసీం చెప్పారు.

ఏప్రిల్ లో గుంటూరులో e-నామ్ తిరిగి ప్రారంభమైంది. "ఈనాం అయితే వచ్చింది కానీ, ఈ మార్కెట్ ని దేశంలో ఇతర మార్కెట్లతో అనుసంధానం చేయలేకపోయాము," అని చెప్పారు మార్కెట్ యార్డ్ కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి. ఫలితంగా, డిజిటీకరణ వాళ్ళ మిర్చి ధర పెరగలేదు.  “మార్కెట్ల అనుసంధామ్ అయితేనే eNAM ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే బయట కూటమిగా పని చేసే స్థానిక ఏజెంట్లు ఇప్పుడు ఆన్లైన్ కూటమి ఏర్పాటు చేస్తారు," AIKS అఖిల భారత ఉపాధ్యక్షుడు, హైదరాబాద్ కి చెందిన సారంపల్లి మళ్ళా రెడ్డి హెచ్చరించారు. “పైపెచ్చు, eNAM అనేది వ్యవసాయాన్ని కార్పొరేటించడంలో, వ్యవసాయరంగంలోకి పెద్ద కార్పొరేట్ సంస్థలకు ప్రవేశం కల్పించేందుకు మరొక అడుగు," ఆయన చెప్పారు. అంటే, ఏజెంట్ల అధీనంలో పని చేసే కూటముల నుంచి విడదీసి, పెద్ద కంపెనీల దోపిడీకి అవకాశం కల్పిస్తున్నట్లు అన్న మాట.

“నిజానికి ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అంటే, రైతులు చిరకాలంగా డిమాండ్ చేస్తున్నట్లు కనీస మద్దతు ధర ప్రకటించాలి,"  మల్లారెడ్డి వివరించారు. “మార్కెటింగ్ ప్రక్రియలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్యకు, జాతీయ వ్యవసాయ సహకా అమలు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలూ లేనప్పుడు రైతులపైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని రుద్దడం ఎందుకు?" గతంలో, ఈ సమాఖ్యలు రైతుల నుంచి ఉత్పత్తి కొనుగోలు చేసేవి, తద్వారా బఫర్ గా ఉంది కమీషన్ ఏజెంట్ల ప్రమేయాన్ని తగ్గించేసేవి.

డిజిటీకరణ వల్ల వరాలు, సమస్యలు పక్కన పెడితే, హనిమి రెడ్డి వంటి రైతులు మాత్రం మార్కెట్ యార్డులో రోజుల తరబడి పడిగాపులు పడి ఫలితంలేక నిఆర్షతో ఇంటికి తిరిగి పోకుండా, తమ ఉత్పత్తిని సరసమైన ధరకు అమ్ముకునే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

అనువాదం: ఉషా తురగా-రేవెల్లి

Rahul Maganti

राहुल मगंती आंध्र प्रदेश के विजयवाड़ा में स्थित एक स्वतंत्र पत्रकार हैं।

की अन्य स्टोरी Rahul Maganti
Translator : UshaTuraga-Revelli

Usha Turaga-Revelli is a journalist, broadcaster, activist, PARI volunteer and a dabbler in anything that appeals to her heart.

की अन्य स्टोरी UshaTuraga-Revelli