హర్యానా- ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద నిరసన తెలుపుతున్న 23 ఏళ్ల యువతి, విశవ్‌జోట్ గ్రెవాల్ మాట్లాడుతూ “ఈ చట్టాలను తిప్పికొట్టాలని మేము కోరుకుంటున్నాము. మాకు మా భూమి తో చాలా అనుబంధం ఉంది. దానిని ఎవరైనా మా నుండి లాక్కుంటే మేము సహించలేము" అన్నది. ఈమె కూడా రైతుల కుటుంబానికి చెందినది. గత సెప్టెంబర్‌లో పార్లమెంటులో ఈ మూడు చట్టాలు ఆమోదించబడిన  సమయం నుంచి  ఈమె తమ గ్రామమైన  పమల్(లూధియానా జిల్లా) లో నిరసన కార్యక్రమాలను నిర్వహించడానికి సహాయం చేస్తోంది.

గ్రామీణ భారతదేశంలో కనీసం 65 శాతం మంది మహిళల లానే(సెన్సస్ 2011 గమనికలు) ఆమె కుటుంబంలోని మహిళలు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు. వారిలో చాలా మందికి భూమి లేదు, కానీ వారు వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. విత్తనాలు, నాట్లు, కోత, నూర్పిడి, పొలం నుండి ఇంటికి పంట రవాణా, ఫుడ్ ప్రాసెసింగ్, పాడిపరిశ్రమ ఇటువంటి పనులలోనే వారి శ్రమ ఎక్కువగా ధారపోసేది..

అయినప్పటికీ, జనవరి 11 న, భారత సుప్రీంకోర్టు మూడు వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసినప్పుడు, ప్రధాన న్యాయమూర్తి కూడా మహిళలను, వృద్ధులను నిరసన స్థలాల నుండి తిరిగి వెళ్ళడానికి ‘ఒప్పించాలి’ అని చెప్పారు. కానీ ఈ చట్టాల పతనం మహిళలను (మరియు వృద్ధులను) కూడా ప్రభావితం చేస్తుంది.

రైతులు నిరసన తెలిపే చట్టాలు రైతు (సాధికారత మరియు రక్షణ) ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 ; రైతు ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020 ; మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020 . భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ను బలహీనం చేస్తూ, పౌరులందరికీ చట్టబద్దమైన హక్కును నిలిపివేస్తున్నందున, ఈ చట్టాలు ప్రతి భారతీయుడిని ప్రభావితం చేస్తాయని విమర్శించబడ్డాయి.

ఈ చట్టాలు మొదట జూన్ 5, 2020 న ఆర్డినెన్స్‌లుగా ఆమోదించబడ్డాయి, తరువాత సెప్టెంబర్ 14 న పార్లమెంటులో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టబడ్డాయి. మళ్లీ అదే నెల 20 న చట్టాలుగా ఆమోదించబడ్డాయి. పెద్ద కార్పోరేట్లు  వ్యవసాయంపై మరింత అధికారాన్నిపెంచుకోవడం వలన రైతులు ఈ చట్టాన్ని తమ జీవనోపాధికి జరిగే పెద్ద హానిగా చూస్తారు.  అంతేగాక రాష్ట్రం సాగుదారునికి మద్దతు ఇచ్చే ముఖ్యవిషయాలైన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి), వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలను (ఎపిఎంసిలు) కార్పోరేట్లు బలహీనపరుస్తాయి.

"కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ఎక్కువగా బాధపడేది మహిళలే. వ్యవసాయంలో ఎంత ఎక్కువగా పాల్గొన్నా, వారికి నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ఉదాహరణకు ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టంలో మార్పుల  వలన ఆహార కొరత వస్తుంది. దాని వలన జరిగే నష్టాలు మహిళలే ఎదుర్కొంటారు ”అని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియం ధవాలే చెప్పారు.

ఢిల్లీ మరియు చుట్టుపక్కల ఉన్న రైతుల నిరసన స్థలాల వద్ద చిన్నాపెద్దా మహిళలు చాలా మంది అక్కడే ఉండి నిరసనలో పాల్గొనాలని  నిశ్చయించుకున్నారు. అలానే రైతులు కాని వారెందరో కూడా తమ మద్దతును తెలియపరచడానికి అక్కడకు వస్తున్నారు. ఇదేకాక చాలామంది వస్తువులను అమ్మడానికి, పని చేసి రోజు వేతనాలు సంపాదించడానికి, లేదా లాంగర్లలో సమృద్ధిగా అందే భోజనం తినడానికి కూడా అక్కడికి వచ్చి ఉన్నారు.

PHOTO • Shraddha Agarwal

62 ఏళ్ల బిమ్లా దేవి (ఎర్రటి శాలువలో) డిసెంబర్ 20 న సింఘు సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ నిరసన తెలిపిన ఆమె సోదరులు, కుమారులు ఉగ్రవాదులు కారని మీడియాకు చెప్పారు. హర్యానా సోనిపట్ జిల్లాలోని ఖార్ఖోడా బ్లాక్‌లోని సెహ్రీ గ్రామంలో ఉన్న ఆమె కుటుంబం తమకున్న రెండు ఎకరాల్లో గోధుమ, జొన్న, చెరకు సాగు చేస్తుంది. "మా కుమారులు గూండాలు అని టివిలో విన్నాము. వారు రైతులు, ఉగ్రవాదులు కాదు. నా కొడుకుల గురించి మీడియా ఎలా మాట్లాడుతుందో చూసి నేను ఏడుపు మొదలుపెట్టాను. మీరు రైతుల కంటే పెద్ద మనసున్న వ్యక్తులని కనుగొనలేరు, ”అని చెప్పింది..

PHOTO • Shraddha Agarwal

"నా హక్కుల కోసం, నా భవిష్యత్తు కోసం పోరాడటానికే నేను ఇక్కడ ఉన్నాను" అని 14 ఏళ్ల , 9 వ తరగతి విద్యార్థి ఆలంజీత్ కౌర్ చెప్పింది. ఆమె తన చెల్లెలు, అమ్మమ్మ , తల్లిదండ్రులతో  సింఘు నిరసన స్థలంలో ఉంది. వీరంతా పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ బ్లాక్‌లోని పిప్లి గ్రామం నుండి వచ్చారు. అక్కడ ఆమె తల్లి నర్సుగా ,ఆమె తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈ కుటుంబం వారి ఏడు ఎకరాల వ్యవసాయ భూమిలో గోధుమలను, వరిని పండిస్తుంది. "నేను చాలా చిన్న వయస్సు నుండి నా తల్లిదండ్రులకు వ్యవసాయానికి సహాయం చేస్తున్నాను" అని ఆలంజీత్ చెప్పింది. "వారు నాకు రైతుల హక్కుల గురించి చెప్పారు.మా హక్కులు మాకు వచ్చేవరకు మేము వెనక్కి వెళ్ళము. ఈసారి మేమే గెలుస్తాము.

PHOTO • Shraddha Agarwal

డిసెంబర్ 22 న ఒక చిన్న వ్యాన్‌లో బంధువులతో పాటుగా సింఘుకు వచ్చిన 23 ఏళ్ల యువకుడు విశావ్‌జోట్ గ్రెవాల్ "ఈ [వ్యవసాయ] చట్టాలను వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము," అని చెప్పారు. ఇతని కుటుంబానికి లూధియానా జిల్లాలోని పమల్ గ్రామంలో 30 ఎకరాల భూమి ఉంది, అక్కడ వారు ప్రధానంగా గోధుమలు, వరి, బంగాళాదుంపలను సాగు చేస్తారు. "మాకు  మా భూమితో చాలా అనుబంధం ఉంది . దానిని ఎవరైనా మా దగ్గర నుంచి లాక్కుంటే మేము సహించలేము. మన రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు మనకు ఉందని రాశారు. ఇది చాలా శాంతియుత నిరసన. లాంగర్ నుండి వైద్య సహాయం వరకు, ప్రతియొక్కటి ఉంది ఇక్కడ.”

PHOTO • Shraddha Agarwal

“నేను నా రైతులకు మద్దతుగా ఇక్కడికి వచ్చాను. అయితే ఈ చట్టాలు రైతులకే అనుకుంటారు గాని ప్రతి వ్యక్తికి హాని కలిగిస్తాయి. “ అన్నది పంజాబ్ యొక్క ఫరీద్కోట్ జిల్లాలోని ఫరీద్కోట్ తహసీల్ లోని కోట్ కపురా గ్రామానికి చెందిన ఇరవైయెనిమిదేళ్ళ మణి గిల్. మణికి ఎంబీఏ డిగ్రీ ఉంది. ఈమె కార్పొరేట్ రంగంలో పనిచేస్తుంది. "మేము గెలుస్తామని ఖచ్చితంగా అనుకుంటున్నాను," అని ఆమె చెబుతుంది. “ఢిల్లీ లో ఒక చిన్న పంజాబ్ ని  చూడటం చాలా బావుంది . పంజాబ్ లోని అన్ని గ్రామాల ప్రజలను మీరు ఇక్కడ చూడగలరు. ” మణి సోషల్ మీడియాలో రైతుల సమస్యలపై అవగాహన కల్పిస్తుంది. ఈ సోషల్ మీడియా వేదికను కొందరు యువకులు నడిపిస్తున్నారు.  "మూడు కొత్త వ్యవసాయ చట్టాల గురించే కాకుండా, రైతుల ఇతర ప్రధాన సమస్యలు,  వాటి పరిష్కారాల గురించి కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తాము “, అని ఆమె చెప్పింది. మణి తల్లిదండ్రులు సింఘు వద్దకు రాలేకపోయారు. కానీ, “వారు కూడా ముఖ్యమైన పనులే  చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మేము ఇక్కడ ఉన్నందున, పశువులను  చూసుకోవడం, పొలం లో పని చేయడం వంటి పనులన్నీ పూర్తిగా వారిపైనే పడడం తో గ్రామంలో వారికి పని రెట్టింపవుతోంది.”

PHOTO • Shraddha Agarwal

సజాహ్మీత్ (కుడి) మరియు గుర్లీన్ (పూర్తి పేర్లు అందించబడలేదు) డిసెంబర్ 15 నుండి వివిధ రైతుల నిరసన ప్రదేశాలలో పాల్గొంటున్నారు.  “నిరసనల వద్ద ఎక్కువ మంది అవసరమని తెలిసిన తరువాత ఇంట్లో ఉండడం చాలా కష్టం,” అని 28 సంవత్సరాల సహజ్మీత్ చెప్పారు. ఈమె  పంజాబ్లోని పాటియాలా నగరం నుండి వివిధ కార్లు మరియు టెంపోలలో లిఫ్టులు తీసుకొని ఇక్కడి వరకు వచ్చారు. కొంతకాలం, ఆమె పశ్చిమ ఢిల్లీ లోని తిక్రీ నిరసన స్థలంలో, కమ్యూనిటీ కిచెన్లలో స్వచ్ఛందంగా పాల్గొంది. " ఎక్కడ సహాయం అవసరమనుకుంటే అక్కడకు మేము వెళ్తాము," అని ఆమె అంటుంది.

నిరసన  ప్రదేశాలలో లో మహిళలకు, మరుగుదొడ్లు సమస్య అని ఆమె అభిప్రాయపడ్డారు. “ఇక్కడ ఉన్న పోర్టబుల్ మరుగుదొడ్లు అలానే పెట్రోల్ స్టేషన్లలో ఉన్నవి చాలా మురికిగా ఉన్నాయి. పైగా అవి మహిళలు బస చేసే ప్రదేశానికి (టెంట్లు, ట్రాలీలకి) దూరంగా ఉన్నాయి. మేము చాలా తక్కువ సంఖ్యలో ఉన్నందున, మేము బస చేసే ప్రదేశానికి దగ్గరగా ఉన్న వాష్‌రూమ్‌లను ఉపయోగించడం సురక్షితం ”అని పాటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ఇంగ్లీష్ లిటరేచర్ విద్యార్థి సహజ్మీత్ చెప్పారు. “వాష్‌రూమ్‌ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, నాతొ ఒకపెద్దాయన, ‘మహిళలు ఇక్కడకు ఎందుకు వచ్చారు? ఈ నిరసన పురుషుల పని ’ అని అన్నాడు. ఈ ప్రదేశం కొన్ని సమయాల్లో ముఖ్యంగా రాత్రుళ్ళు  అసురక్షితంగా అనిపిస్తుంది, కాని ఇక్కడ ఇతర మహిళలు కలిసి ఉండడం  చాలా బలాన్నిస్తుంది . ”

తన స్నేహితురాలు, గురుదాస్‌పూర్ జిల్లాలోని బటాలా తహసీల్‌లోని మీకీ గ్రామానికి చెందిన 22 ఏళ్ల గుర్లీన్ వాళ్ల కుటుంబం రెండు ఎకరాల్లో గోధుమలని వరిని పండిస్తుంది, “నేను వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బుతోనే చదువుకున్నాను. నా ఇల్లు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. నా భవిష్యత్తు , నా ఏకైక బ్రతుకుతెరువు వ్యవసాయం మాత్రమే. ఇది నాకు ఆహారమూ భద్రత రెండింటినీ అందించగలదని నాకు తెలుసు. చదువుకోవడం వలన ఈ విభిన్న ప్రభుత్వ విధానాలు మమ్మల్ని, ముఖ్యంగా మహిళలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకున్నాను . ఇప్పుడు నిరసనలో పాల్గొనడమూ  సంఘీభావంతో ఒకే తాటిన నిలబడటమూ చాలా ముఖ్యం. ”

PHOTO • Shraddha Agarwal

20 ఏళ్ల హర్ష్ కౌర్ (కుడివైపు) పంజాబ్ యొక్క లుధియానా నగరం నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింఘు సరిహద్దుకు వచ్చారు. ఆమె తన సోదరితో కలిసి నిరసన స్థలంలో ఉన్న ఉచిత వైద్య శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొనమని  ఒక యువకుల సంస్థను సంప్రదించింది. వైద్య సహాయ గుడారంలో  ఉన్నవారు  ఔషధాల పంపిణి పై వలంటీర్ల కు సల్లహాలు ఇచ్చే నర్సులకు కూడా శిక్షణ ఇచ్చారు. బిఎ జర్నలిజం చేస్తున్న హర్ష్ ఇలా అంటాడు, “ఈ చట్టాలు రైతులకు మంచివన్నట్టు ప్రభుత్వం నటిస్తోంది, కానీ  రైతులు విత్తనాలు నాటేవారు. వారికి ఏ మొక్క ఎలా మొలుస్తుందో తెలుసు, చట్టాలు కార్పొరేట్‌లకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వం మమ్మల్ని దోపిడీ చేస్తోంది, లేకపోతే, వారు మాకు MSP [కనీస మద్దతు ధర] గురించి వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చేవారు. ఇటువంటి పరిస్థితిలో మేము ప్రభుత్వాన్ని నమ్మలేము. ”

PHOTO • Shraddha Agarwal

లైలా (పూర్తి పేరు అందుబాటులో లేదు) సింఘు వద్ద టూల్-సెట్లను విక్రయిస్తుంది, ఇందులో ప్లయర్, ఎలక్ట్రిక్ లైటర్ ఇంకారెండు రకాల స్క్రూడ్రైవర్లు ఉన్నాయి. ప్రతి సెట్ ధర రూ. 100. ఆమె మూడు జతల సాక్సులు కూడా అదే ధరకు అమ్ముతుంది. ఉత్తర ఢిల్లీలో సదర్ బజార్ నుండి వారానికి ఒకసారి లైలా ఈ వస్తువులను తెచ్చుకుంటుంది; ఆమె భర్త కూడా ఆమె లాగానే వివిధ వస్తువులు అమ్ముతుంటాడు. . ఆమె తన కుమారులు మైఖేల్ (పర్పుల్ జాకెట్), 9, మరియు విజయ్ (బ్లూ జాకెట్), 5 తో ఇక్కడ ఉంది . “మేము ఈ వస్తువులను అమ్మేందుకు ఈ సమావేశానికి వచ్చాము. ఈ [నిరసన] ప్రారంభమైనప్పటి నుండి ఇక్కడే ఉన్నాము.” అన్నది.

PHOTO • Shraddha Agarwal

“నా కుటుంబంలో రైతు లేడు.’ అని సింఘులో నివసించే వీధి వ్యాపారి, 35 ఏళ్ల గులాబియా,, చెప్పారు, ఇక్కడ నిరసన స్థలం అంతా వివిధ వస్తువులను వర్తకం చేసే వారితో నిండి ఉంది. గులాబియా (పూర్తి పేరు అందుబాటులో లేదు) చిన్న మ్యూజికల్ డ్రమ్స్‌ను అమ్ముతుంది ,. ఆమె ఇద్దరు కుమారులు కూలీలుగా పనిచేసి, మనిషికి రూ. 100 చొప్పున సంపాదిస్తారు. "నేను రోజుకు 100-200 రూపాయలు సంపాదిస్తాను" అని ఆమె చెప్పింది. "ఈ డ్రమ్స్‌ను 100 రూపాయలకు ఎవరూ కొనరు, అందరు  బేరం ఆడతారు.  కాబట్టి నేను 50 కో  లేక  కొన్నిసార్లు 40 రూపాయలకో అమ్మవలసి వస్తుంది."

PHOTO • Shraddha Agarwal

"నేను రోటీ తినడానికి ఇక్కడకు వచ్చాను" అని ఉత్తర ఢిల్లీ లోని నరేలా ప్రాంతానికి చెందిన వ్యర్థ కార్మికురాలు కవిత (పూర్తి పేరు అందుబాటులో లేదు) అంది. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను తీయటానికి ఆమె సింఘు సరిహద్దుకు వస్తోంది. 60 ఏళ్ళ వయసులో ఉన్న కవిత, నిరసన స్థలం నుండి సేకరించిన వ్యర్థ వస్తువులను ఆమె ప్రాంతంలోని స్క్రాప్ డీలర్‌కు అమ్మి రూ. 50-100 రూ సంపాదిస్తుంది . "కానీ ఇక్కడ కొంతమంది నన్ను అరుస్తారు," ఆమె చెప్పింది. "నేను ఎందుకు ఇక్కడకు వచ్చానని వారు నన్ను గద్దిస్తారు."

PHOTO • Shraddha Agarwal

"నిరసనలో పాల్గొనడం నాకు చాలా కష్టమైంది, ఎందుకంటే నా తల్లిదండ్రులు నేను  ఇక్కడకు రావడానికి అసలు అనుకూలంగా లేరు. రైతులకు యువత మద్దతు అవసరం కాబట్టి నేను వచ్చాను ”అని పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాలోని ఫరీద్‌కోట్ తహసీల్‌లోని కోట్ కపురా గ్రామానికి చెందిన 24 ఏళ్ల కోమల్‌ప్రీత్ (పూర్తి పేరు అందించబడలేదు) చెప్పారు. ఆమె డిసెంబర్ 24 న సింఘు సరిహద్దుకు వచ్చింది. ఈమె  సోషల్ మీడియాలో రైతుల సమస్యలపై అవగాహన పెంచడానికి యువత నడుపుతున్న వేదికలో  వాలంటీర్. "మేము ఇక్కడ చరిత్రను  మళ్లీ సృష్టిస్తున్నాము" అని చెప్తుంది కోమల్. "ప్రజలు వారి కులం, తరగతి మరియు సంస్కృతితో సంబంధం లేకుండా ఇక్కడ ఉన్నారు. మా గురువులు మాకు సరైన వాటి కోసం పోరాడటం, దోపిడీకి గురయ్యే వారితో నిలబడటం నేర్పించారు. ”

అనువాదం - అపర్ణ తోట

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Shraddha Agarwal

Shraddha Agarwal is a reporter and content editor at the People’s Archive of Rural India.

Other stories by Shraddha Agarwal