“ఝారియాలో గత 4-5 నెలలుగా మాకు కరెంటు లేదు. మా అక్క, తమ్ముడు, నేను కలిసి చదువుకోవడానికి టార్చిలైట్ వాడతాం కానీ అది 30-45 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది, మళ్ళీ రీఛార్జి  చేయాల్సి వస్తుంది.”

సంతాల్ ఆదివాసి సముదాయానికి చెందిన 13 ఏళ్ళ సోమ్‌వారీ బాస్కే భాటిన్ మాధ్యమిక పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని. ఆమె పాఠశాల విద్య పూర్తి చేయాలని దృఢంగా నిశ్చయించుకుంది. "నేను బాగా చదువుకోవాలి, ఇదే నాకున్న ఒకే ఒక కల," అని చెప్పింది బాస్కే.

జాదూగోరా బ్లాక్‌లోని ఝారియా గ్రామంలో 1000 మందికి పైగా జనాభా ఉంటారు. ఈ గ్రామం అక్షరాస్యత రేటు 59 శాతం, కానీ ఝార్ఖండ్ సగటు (66 శాతం) కన్నా ఇది తక్కువ. తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని ఈ ఝారియా గ్రామంలో ఒక్క ప్రాథమిక పాఠశాలే ఉన్నందున సోమ్‌వారీ తన ఇంటి నుండి 4 కి.మీ. దూరంలో గల మాధ్యమిక పాఠశాలకు వెళ్ళవలసి వస్తోంది.

ఈ విలేఖరి సమీపంలోని ఖరియా కోచా గ్రామానికి వెళ్ళినప్పుడు సబర్ భాషను హిందీలోకి అనువదించి చెప్పటానికి చిన్నారి సోమ్‌వారీ తానే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ విలేఖరికి సహాయకురాలిగా తూర్పు సింగ్‌భూమ్‌లోని సబర్ సముదాయపు ప్రజలతో మాట్లాడేందుకు తోడ్పాటునందించింది. తన మాతృభాష అయిన సంతాలీగాక సోమ్‌వారీ సబర్, హో, హిందీ, బంగ్లా భాషలు మాట్లాడగలదు.

The entrance of Bhatin Middle School
PHOTO • Rahul

భాటిన్ మాధ్యమిక పాఠశాల ప్రవేశ ద్వారం

తన గ్రామమైన ఝారియా నుండి దాదాపుగా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఖరియా కోచా గ్రామానికి ముందుకూ వెనక్కూ పరిగెత్తుతూ తన టార్చ్‌లైట్‌ను ఎలా రీఛార్జ్ చేసుకుంటుందో సోమ్‌వారీ హిందీలో మాట్లాడుతూ, వివరించింది.

*****

"మేం సరైన సమయానికి బిల్లు కట్టకపోవడంవల్ల మా కరెంటు కనెక్షన్ తీసేశారు. విద్యుచ్ఛక్తి విభాగంవారు మా తాతగారైన గురాయీ బాస్కే పేరు మీద రూ. 16,745 బిల్లు పంపించారు. ఇంత పెద్ద మొత్తం మేమెలా సమకూర్చగలం?"

"అందుకే మాకీ కరెంటు కోత."

“మా ఊర్లో చాలా కొద్దిమంది ఇళ్లలో మాత్రమే కరెంటు కనెక్షన్ ఉంది. మేం వారి ఇళ్ళకు వెళ్ళి మా టార్చ్‌లైట్, మొబైల్ ఫోను ఛార్జ్ చేసుకోవడం వారికి ఇష్టం ఉండదు. అందువల్ల నేను పక్క గ్రామమైన ఖరియా కోచాకు వెళ్లి నా టార్చ్‌లైట్ చార్జ్ చేసుకుంటాను. ఆ ఊర్లో ఏదైనా ఒక సబర్ ఆదివాసి ఇంట్లో నా ఫ్లాష్‌లైట్ చార్జికి పెట్టి మా ఇంటికి తిరిగి వచ్చేస్తాను."

Sombari standing with her parents, Diwaram and Malati Baske in front of their home in Jharia village in Purbi Singhbhum district of Jharkhand
PHOTO • Rahul

ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లా, ఝారియా గ్రామంలోని వారి ఇంటి ముందు తన తల్లితండ్రులు దివారామ్, మాలతి బాస్కేలతో సోమ్‌వారీ

'మా గ్రామంలో కొన్ని ఇళ్ళకు మాత్రమే విద్యుత్ కనెక్షన్ ఉంది. నేను మా టార్చ్‌లైట్‌ను ఛార్జ్ చేయడానికి దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న ఖరియా కోచా అనే మా పొరుగు గ్రామానికి వెళ్తాను. లేదంటే మేం చదువుకోలేం'

ఆ తరువాత నేను పప్పా(నాన్న) లేదా చాచా (బాబాయ్)ల సైకిల్ కోసం వారు మార్కెట్ నుండి తిరిగి వచ్చేవరకు వేచి చూస్తాను. టార్చ్‌లైట్ పూర్తిగా చార్జ్ అవ్వటానికి 3-4 గంటలు పడుతుంది ఆలోపు సైకిల్ నా చేతికి రాగానే వెంటనే వెళ్ళి దాన్ని తిరిగి తెచ్చుకుంటాను. నేను ప్రతిరోజూ ఉదయం ఏదోలా టార్చ్‌ని ఖచ్చితంగా చార్జ్ చేయాల్సిందే, లేకపోతే మేమిక ఆ రాత్రి చదువుకోలేం. మా అక్క రతనీ బాస్కే 10వ తరగతి, తమ్ముడు జీతూ బాస్కే 3వ తరగతి చదువుతున్నారు.

"చాలాసార్లు మాకు ఖరియా కోచాకు వెళ్లడం కుదరదు. అలాంటప్పుడు బ్యాటరీలో మిగిలివున్న ఛార్జిని పొదుపుగా వాడుకుంటాం, లేదంటే కొవ్వొత్తితో సరిపెట్టుకుంటాం."

*****

భాటిన్ మాధ్యమిక పాఠశాలకు విద్యార్థులు భాటిన్ నుండి, ఝారియా వంటి చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తారు. మొత్తం 232 మంది విద్యార్థుల్లో దాదాపుగా అందరూ ఆదివాసీ తెగలకు చెందినవారే. "మేం బడిలో మధ్యాహ్న భోజనం పెడతాం. గుడ్లు లేదా పళ్ళు పంచిపెట్టిన రోజున అత్యధిక సంఖ్యలో విద్యార్థులు హాజరవుతారు," అని సోమ్‌వారీ చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు దినేశ్ చంద్ర భగత్ తెలిపారు.

ఝార్ఖండ్ ప్రభుత్వం ఝార్ఖండ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ యూనిఫామ్‌లు అందజేస్తోంది. 1-5 తరగతుల విద్యార్థులు ఒక్కొక్కరికి ఒక జత స్కూలు యూనిఫామ్, బూట్లు, సాక్స్ కొనుక్కోవటానికి రూ. 600 కేటాయిస్తారు. 6-8 తరగతుల విద్యార్థులు ఒక్కొక్కరికి స్కూల్ యూనిఫామ్ కొరకు రూ. 400, స్వెటర్ కొరకు రూ. 200, ఒక జత బూట్లు, సాక్స్ కొరకు రూ.160 అందజేస్తారు.

Dinesh Chandra Bhagat, the headmaster of Bhatin Middle School in Jadugora block of Purbi Singhbhum district in Jharkhand.
PHOTO • Rahul
Sombari with her classmates in school
PHOTO • Rahul

ఎడమ: ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లా, జాదూగోరా బ్లాక్‌లోని భాటిన్ మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దినేశ్ చంద్ర భగత్. కుడి: బడిలోని తన సహవిద్యార్థులతో సోమ్‌వారీ

ఈ పథకం ద్వారా అందవలసిన డబ్బు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లకు నేరుగా చేరుతుంది. అయితే, మొత్తం విద్యార్థుల్లో 60 శాతం మంది విద్యార్థులకు మాత్రమే యూనిఫామ్ కొనుక్కోవడానికి డబ్బు అందిందని ప్రధానోపాధ్యాయులు భగత్ చెప్పారు.

ఝారియా జనాభాలో 94.39 శాతం మంది సంతాల్, ముండా, తాంతీ, లోహర్ మొదలైన ఆదివాసీ తెగలకు చెందినవారే; వీరిలో అత్యధికంగా 94 శాతం మంది సంతాలులే. వీరిలో ఎక్కువమంది వ్యవసాయ కూలీలు. కొందరికి మాత్రం కొంత పొలం (కొన్ని బిఘాలు) ఉంటుంది, అందులో వర్షాధార వ్యవసాయం చేసి వారి కుటుంబాలకు సరిపడా వడ్లు పండిస్తారు.

“రోజువారీ కూలీ అయిన మా నాన్న దివారామ్ బాస్కేకి సాధారణంగా భూమి లోపల కేబుల్ వేయటం కోసం గోతులు తవ్వే పని దొరుకుతుంది. పని దొరికిన రోజున ఆయన రు.300-350 వరకు సంపాదిస్తారు. మా కుటుంబం మొత్తం మా నాన్నకు వచ్చే కూలీ డబ్బుపై ఆధారపడింది. మా తాత (నాన్నకు నాన్న) గారికి ఏడు ఎకరాల పొలం ఉన్నా అదంతా రాళ్లతో నిండి ఉండి వ్యవసాయానికి పనికిరాదు.”

“మా అమ్మ మాలతీ బాస్కే ఇంటి పని, వంట పని చేసుకోవటమే కాకుండా పొయ్యిలోకి కర్రల కోసం వెతుకుతూ తరచూ అడవిలోకి వెళ్ళవలసి వస్తుంది. ఆమె అలా వెళ్ళినప్పుడు నేను బడికి వెళ్ళడం మానేసి ఇంటిపట్టున ఉండవలసి వస్తుంది. మా అమ్మ బబ్లూ చాచా నడుపుతోన్న టిఫిన్ సెంటర్‌లో కూడా వంట చేస్తుంది. అమ్మకాలను బట్టి ఆమె రోజుకు రూ. 50-60 వరకు సంపాదించవచ్చు. నాన్నకు కూలిపని దొరకనప్పుడల్లా బబ్లూ చాచా కు సహాయం చేస్తారు. బబ్లూ చాచా మా ఆదివాసీ సముదాయానికి చెందినవారు కాకపోయినప్పటికీ మా కుటుంబంలో ఒక వ్యక్తిగానే భావిస్తాం.”

Morning school assembly at Bhatin Middle School
PHOTO • Rahul

భాటిన్ మాధ్యమిక పాఠశాలలో ఉదయపు ప్రార్థనా సమయం

పాఠశాల విద్యపై ఈ నివేదిక: Gloom in the classroom: The schooling crisis in Jharkhand ప్రకారం కోవిడ్-19 సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 87 శాతం విద్యార్థినీ విద్యార్థులకు అసలు స్మార్ట్ ఫోన్లు అందుబాటులోనే లేవు. ఆర్థికవేత్త జాన్ డ్రేజ్ PARI తో మాట్లాడుతూ ఇలా అన్నారు, "కోవిడ్ సంక్షోభ సమయంలో వెనుకబడిన వర్గాలకు, ఆదివాసీ వర్గాలకు చెందిన విద్యార్థులను పాఠశాల విద్యా వ్యవస్థ పూర్తిగా నిస్సహాయులుగా వదిలివేసింది. మనం పూర్తిగా ఆన్‌లైన్ విద్యపై ఆధారపడటం వల్ల పేద విద్యార్థినీ విద్యార్థులకు అన్యాయం జరిగింది.”

*****

“డిసెంబర్ నెల ప్రారంభంలో మా పాఠశాలవారు ఏర్పాటు చేసిన క్రిస్మస్ పిక్నిక్‌కు వెళ్ళగలనో లేదో అనే ఆందోళన నాలో మొదలైంది. నా స్నేహితురాళ్ళతో కలిసి జంశెద్‌పూర్‌లోని డిమ్నా ఆనకట్ట చూడాలని చాలా ఆశగా ఉండింది. కానీ పిక్నిక్‌కు వెళ్ళేందుకు ఒక్కొక్కరూ రూ.200 కట్టాలి, అంత ఖర్చు మా కుటుంబం భరించలేదు. అందుకే నేను అమ్మానాన్నలను డబ్బు అడగలేదు. వేరొకరి పొలంలో వరి కోతలకు వెళ్లి నేను రోజుకు రూ.100 సంపాదించాను. ఇలా కష్టపడి కూడబెట్టిన రూ.200 పిక్నిక్ చార్జీలకు సొంతంగా కట్టుకున్నాను. అలా నా స్నేహితులతో కలిసి ఆనకట్ట చూడటానికి వెళ్ళి ఆనందంగా గడిపాను.”

“కరోనా వ్యాధి మూలాన మూసివేసిన మా పాఠశాలను మళ్ళీ పోయిన సంవత్సరమే తిరిగి తెరిచారు. లాక్‌డౌన్ సమయంలో నేను సరిగా చదవలేకపోవడంవల్ల పోయినసారి పరీక్షల్లో నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం నేను కష్టపడి చదివి ఎలాగైనా సరే మంచి మార్కులు తెచ్చుకుంటాను.”

“ఈ సంవత్సరం నా పరీక్షలు అయిపోయాక పై చదువుల కోసం నేను జాదూగోరాకు వెళ్ళవలసి ఉంటుంది. అది ఇక్కడి నుండి 7-8 కి.మీ. దూరంలో ఉంది. నేనక్కడ ఉన్నత పాఠశాలలో చేరతాను.”

“నేను పెద్దయ్యాక పోలీస్ అధికారిగా కానీ, న్యాయవాదిగా కానీ అవుతాను,” ధైర్యంగా చెప్పింది సోమ్‌వారీ బాస్కే.

అనువాదం: నీరజ పార్థసారథి

Rahul

রাহুল সিং ঝাড়খণ্ড-নিবাসী স্বতন্ত্র সাংবাদিক। তিনি পূর্বভারতের ঝাড়খণ্ড, বিহার ও পশ্চিমবঙ্গ থেকে পরিবেশ সংক্রান্ত খবরাখবর পরিবেশন করেন।

Other stories by Rahul
Editor : Devesh

দেবেশ একজন কবি, সাংবাদিক, চলচ্চিত্র-নির্মাতা ও অনুবাদক। তিনি পিপলস্ আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার হিন্দি সম্পাদক ও হিন্দি অনুবাদ-সম্পাদক।

Other stories by Devesh
Editor : Sanviti Iyer

সম্বিতি আইয়ার পিপল্‌স আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার কনটেন্ট কোঅর্ডিনেটর। স্কুলপড়ুয়াদের সঙ্গে কাজ করে তাদের ভারতের গ্রামসমাজ সম্পর্কে তথ্য নথিবদ্ধ করতে তথা নানা বিষয়ে খবর আহরণ করার প্রশিক্ষণেও সহায়কের ভূমিকা পালন করেন তিনি।

Other stories by Sanviti Iyer
Translator : Neeraja Parthasarathy

Neeraja Parthasarathy is a teacher, translator and eclectic reader in both English and Telugu.

Other stories by Neeraja Parthasarathy