ఎనభై రెండేళ్ల బాపూసుతార్ 1962 నాటి ఆ రోజును చాలా స్పష్టంగా గుర్తు పెట్టుకున్నారు. అతను తన చెక్క ట్రెడిల్ చేనేత మగ్గాలలో మరొకదాన్ని అమ్మేశారు. ఏడు అడుగుల పొడవుండే ఈ మగ్గాన్ని ఆయనే స్వయంగా తన స్వంత వర్క్‌షాప్‌లో తయారు చేశారు. ఇది కొల్హాపుర్‌లోని సాంగాఁవ్ కసబా గ్రామానికి చేందిన ఒక చేనేతకారుడి నుంచి 415 రూపాయలను ఆయనకు సంపాదించిపెట్టింది.
అదే ఆయన తయారుచేసిన చివరి చేనేతమగ్గం కాకపోయుంటే, అది ఆయనకు సంతోషకరమైన జ్ఞాపకంగానే మిగిలి ఉండేది. ఆ తర్వాత ఆర్డర్లు రావడం ఆగిపోయింది; ఆయన చేతి తయారీ చెక్క ట్రెడిల్ మగ్గాలను తీసుకునేవారు లేకపోయారు. "త్యావెలి సాగ్లా మోడ్లా (అంతా ముగిసిపోయింది)," అని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఆరు దశాబ్దాల తర్వాత ఈరోజు, మహారాష్ట్ర, కొల్హాపుర్ జిల్లాలోని రెండాల్‌లో- గ్రామంలో మిగిలివున్న చిట్టచివరి ట్రెడిల్ చేనేత మగ్గం తయారీదారు బాపు ఒక్కరే అని కొంతమందికి మాత్రమే తెలుసు; ఆయన ఒకప్పుడు అందరికీ చాలా అవసరమైన నిపుణత కలిగిన చేతిపనివాడు అని కూడా. "రెండాల్కూ, సమీప గ్రామాలకూ చెందిన ఇతర చేనేత మగ్గం తయారీదారులందరూ చనిపోయారు" అని గ్రామంలోని వృద్ధ నేతకారుడు వసంత్ తాంబే (85) చెప్పారు.
చెక్క నుంచి చేనేత మగ్గాలను రూపొందించడం రెండాల్కు ఒక కోల్పోయిన సంప్రదాయం. "ఆ (చివరి) చేమగ్గం కూడా ఇప్పుడు ఉనికిలో లేదు," అని బాపూ, నిరాడంబరమైన తన ఇంటి చుట్టూ ఉన్న వర్క్‌షాప్‌ల నుంచి వస్తోన్న మరమగ్గాల శబ్దాలను వినడానికి కష్టపడుతూ అన్నారు.
బాపూ ఇంటిలో ఉండే ఒంటి గది సంప్రదాయ వర్క్‌షాప్ ఒక యుగానికి సాక్ష్యంగా నిలిచింది. వర్క్‌షాప్‌లో ఉన్న మట్టిరంగుల సమ్మేళనం - డార్క్, సెపియా, రస్సెట్, శాడిల్, సియెన్నా, మహోగనీ, రూఫస్ వంటి మరెన్నో వర్ణాలు- నెమ్మదిగా వెలిసిపోయి, కాలం గడిచేకొద్దీ వాటి మెరుపు మసకబారుతోంది.

























