PARI చలనచిత్ర విభాగానికి - గ్రామీణ భారతదేశంలోని ప్రజలపై వీడియోలు, డాక్యుమెంటరీలు, షార్ట్ క్లిప్‌లు, చలనచిత్రాలు - 2023 సంవత్సరం అత్యంత ప్రతిఫలదాయకమైనది
ఒక ఆన్లైన్ జర్నల్గా, మన చుట్టూ ఉన్న వార్తలను, సంఘటనలను నిశితంగా పరిశీలించే చిత్రాలను మేం ప్రోత్సహిస్తాం. బిహార్‌లోని మదరసా అజీజియాపై మా చిత్రం, బిహార్‌లోని బిహార్షరీఫ్ పట్టణంలో 113 ఏళ్ళ నాటి గ్రంథాలయాన్ని మతపరమైన ప్రేరణతో తగులబెట్టిన తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలించింది. జైసల్మేర్ జిల్లాలో పునరుత్పాదక శక్తిపై తీసిన మా చిత్రం జైసల్మేర్ జిల్లాలోని పవిత్ర వనాలను - ఒరాణ్లు - బంజరు భూములు 'గా చూపడం ద్వారా ఈ చిట్టడవులను సౌర, పవన విద్యుత్ ప్లాంట్లకు అప్పగించే సమస్యను లేవనెత్తింది.
అస్సామ్‌లోని బ్రహ్మపుత్ర దీవులకు చెందిన ఆదివాసీ గేదెల కాపరి ఉల్లాసంగా పాడిన మధురమైన ప్రేమ గీతంతో మా సంవత్సరం ప్రారంభమైంది. సంవత్సరం పొడవునా మేం పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, రాజస్థాన్, ఇంకా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాటలను, నృత్యాలను జోడించడాన్ని కొనసాగించాం.
PARI విసుర్రాయి పాటల (గ్రైండ్‌మిల్ సాంగ్స్) ప్రాజెక్ట్‌పై - దశాబ్దాలుగా సాగిన ఈ అద్భుతమైన పని ప్రయాణాన్ని నమోదు చేస్తూ - తీసిన ఒక చిత్రంతో మేం ఈ సంవత్సరాన్ని ముగిస్తున్నాం.
ఈ సంవత్సరం మేం పుణేలో వ్యర్థాలను సేకరించే మహిళల గొంతుకలను వినిపించే ఒక ముఖ్యమైన చలనచిత్రాన్ని జోడించాం. "చెత్తను తయారుచేసేది మీరైనప్పుడు, మేం ఎలా ‘కచ్రేవాలీ' (చెత్తమహిళ) అవుతాం?" అని ఆ మహిళలు ప్రశ్నిస్తారు. మారుతున్న వాతావరణ ప్రభావం గురించి తీసిన చిత్రాలలో అస్తవ్యస్తంగా మారిన వాతావరణ పరిస్థితుల వలన బాధలుపడుతున్న అల్ఫోన్సో మామిడి సాగుదారుల గురించి ప్రచురించాం.
ఏడాది అంతా మేం వివిధ సామాజిక వర్గాలపై తీసిన చిత్రాలను మా ఆర్కైవ్కు జోడిస్తూనే ఉన్నాం: మేడాపురంలో మాదిగ సముదాయంవారు జరిపే ఉగాది ఉత్సవాలపై తీసిన ఈ చిత్రం, దళితుల ఈ కొత్త సంప్రదాయంలోని మనకు తెలియని విషయాలను కళ్ళముందుంచింది. మలబార్ ప్రాంతంలో ప్రస్తుతం కనుమరుగవుతోన్న వివిధ కులాలకూ సముదాయాలకూ చెందిన తోల్‌పావకూత్తు కళపై తీసిన ఈ చిత్రం తోలుబొమ్మలను ఉపయోగించి ప్రదర్శించే విభిన్న సాంస్కృతిక కథనాలను అందించింది. పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి, తుళునాడులో భూత పూజలో ముఖ్య భాగమైన నాదస్వరం వాద్యకారుడి జీవితాన్ని ఈ చిత్రం అందంగా చిత్రీకరిస్తుంది. పశ్చిమ బెంగాల్ నుండి, లోహపు ఆకృతులను తయారుచేయడంలో దాదాపు అంతరించిపోయిన మైనపు పోత సాంకేతికత అయిన డోక్రా గురించి ఈ చిత్రం చిత్రీకరించింది.
ఈ చిత్రాలను చూడండి!











