తన గేదెలను మేపేందుకు పచ్చికబయళ్ళ కోసం వెతుకుతూ సత్యజిత్ మోరాంగ్ బ్రహ్మపుత్రా నదిలో ఏర్పడిన ద్వీపాలలో ప్రయాణాలు చేస్తుంటారు. "గేదెలు దాదాపు ఒక ఏనుగు తిన్నంత ఆహారాన్నీ తింటాయి," అంటారు సత్యజిత్. అందువలన సత్యజిత్ వంటి గేదెల కాపరులు గడ్డిభూముల కోసం వెతుక్కుంటూ నిరంతరం తిరుగుతూనే ఉంటారు.

అతనికీ, అతని పశువులకూ తోడుగా అతని పాట కూడా ఉంది

“నేను గేదెలను మేపడానికి ఎందుకు వెళ్తాను నా ప్రియా
నిన్ను నేను చూడలేకపోతే?"

కరంగ్ సపోరి గ్రామంలో ఉండే ఇంటికీ, కుటుంబానికీ దూరంగా ఉన్నప్పుడు, సంప్రదాయ ఐనితమ్ సంగీత శైలిలో తన స్వంత సాహిత్యాన్ని పాడుతూ ఆయన, ప్రేమా లాలసల చిత్రాలను రూపొందిస్తారు. "గడ్డి ఎక్కడ ఉంటుందో మేం ఖచ్చితంగా చెప్పలేం, దాంతో మేం మా గేదెలను నడిపిస్తూనే ఉంటాం," అని అతను ఈ వీడియోలో చెప్పారు. “మాటవరసకు మేం వంద గేదెలను ఒక 10 రోజుల పాటు ఇక్కడ మేపితే, ఆ 10 రోజుల తర్వాత వాటికిక ఇక్కడ గడ్డి మిగలదు. ఇక మేమందరం మళ్లీ కొత్త పచ్చిక బయళ్లకోసం వెతుక్కుంటూ ముందుకు సాగాల్సిందే."

ఈ ఐనితమ్ శైలి జానపద సంగీతం అస్సామ్‌లోని మిసింగ్ సముదాయం నుంచి వచ్చింది. అస్సామ్ రాజ్య పత్రాలలో మిసింగ్ సముదాయాన్ని 'మిరి'గా సూచిస్తూ షెడ్యూల్డ్ తెగగా జాబితా చేశారు. ఈ ‘మిరి‘ అనే పదాన్ని చాలా అవమానకరమైనదిగా సమాజంలోని అనేకమంది భావిస్తారు.

సత్యజిత్ గ్రామం అస్సామ్‌లోని జోర్‌హాట్ జిల్లా వాయవ్య ప్రాంతంలోని జోర్‌హాట్ బ్లాక్‌లో ఉంది. బాల్యం నుండి ఆయన పశువుల కాపరిగా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో 1,94,413 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఆక్రమించిన బ్రహ్మపుత్రా నది, దాని ఉప నదులు ఏర్పరచే ఇసుక దిబ్బలు, ద్వీపాల మధ్య అయన తన పశువుల మందలతో తిరుగుతుంటారు. ఈ ద్వీపాలు, ఇసుక దిబ్బలు ఏర్పడుతూవుంటాయి, అదృశ్యమవుతూవుంటాయి కూడా.

తన జీవితాన్ని గురించి మాట్లాడుతూ పాడుతున్న సత్యజిత్‌ను ఈ వీడియోలో చూడండి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Himanshu Chutia Saikia

Himanshu Chutia Saikia is an independent documentary filmmaker, music producer, photographer and student activist based in Jorhat, Assam. He is a 2021 PARI Fellow.

Other stories by Himanshu Chutia Saikia
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli