'వారానికి ఆరు రోజులు పనిచేసి రోజుకు 150 రూపాయలు సంపాదించేదాన్ని. ఇప్పుడసలు చేయడానికి పనే లేకుండా పోయింది' అని చెప్పారు, తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన వేమూరి సుజాత (38) అనే మహిళ. భర్తను కోల్పోయిన ఈ దళిత మహిళ మాల సామాజికవర్గానికి చెందినవారు. తమకంటూ సొంత భూమి లేకపోయినా, వ్యవసాయ కూలీగా 2015 జనవరి వరకూ పనిచేశారు.
కొత్త ‘ప్రపంచస్థాయి రాజధాని అమరావతి నిర్మాణం’ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీస్థాయిలో భూముల్ని సేకరించడం ప్రారంభించగానే, రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో వ్యవసాయ పనులు దాదాపుగా ఆగిపోయాయి. 2014లో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలుగా విడిపోయిన తర్వాత, అమరావతి నిర్మాణం పూర్తయేవరకూ, హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
సుజాత భర్త 2008లో మరణించడంతో ఆమె కూలీపనులకు వెళ్తూ, తన పిల్లల్ని కష్టమ్మీద పోషించుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒక జీవనోపాధిని సంపాదించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె పెద్ద కొడుకు వేమూరి ప్రసాద్ (19) తుళ్లూరు జిల్లా పరిషత్ పాఠశాల నుంచి 2015లో పదవ తరగతి పూర్తయ్యాక చదువు ఆపేశాడు. ఒక ఏడాది తర్వాత అతని తమ్ముడు వేమూరి రాజా (17) కూడా అదే పాఠశాల నుంచి డ్రాపవుట్‌గా బయటికొచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలూ కృష్ణానది ఒడ్డున జరుగుతున్న ఇసుక క్వారీ పనుల్లో దినసరి కార్మికులుగా పనిచేస్తూ రోజుకు 200 నుంచి 250 రూపాయల దాకా సంపాదిస్తున్నారు. పని తక్కువగా వుండడం కారణంగా ప్రస్తుతం వారికి వారానికి మూడు రోజులు మాత్రమే పని దొరుకుతోంది.
సుజాత చిన్న కొడుకు రాజా మాట్లాడుతూ 'మేము చేసే పనికి మాకు చాలా శక్తి అవసరమవుతుంది. ఉదయం 6 గంటలకు క్వారీకి వెళ్లి, సాయంత్రం 6 గంటలకు ఇంటికి తిరిగొస్తాం' అని చెప్పాడు. క్వారీ పనుల్లో మహిళల్ని నియోగించకపోవడం, స్థానికంగా వ్యవసాయ పనులు లేకపోవడంతో సుజాత వంటి ఎంతోమంది మహిళా కూలీలు ఇంటికే పరిమితం కావల్సివస్తోంది.
రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం భూసేకరణ చేస్తున్న, కృష్ణానది ఉత్తర తీరాన వున్న 29 గ్రామాలలో ఉద్దండరాయునిపాలెం కూడా ఒకటి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలి దశలో 33,000 ఎకరాల భూసమీకరణ (ఎల్‌పిఎస్) జరుగుతుంది. ఇది 2050లో చివరి దశ నాటికి లక్ష ఎకరాలకు చేరుకోవాలని ఒక అంచనా. సుస్థిరమైన రాజధాని నిర్మాణానికి `ఆంధ్రప్రదేశ్ కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ` (ఏపీసీఆర్ డిఎ) సంస్థ ఏర్పాటైంది. భూసమీకరణకు ‘స్వచ్ఛందంగా’ భూములిచ్చేవారికి పరిహారంగా నగదు ఇవ్వడానికి బదులుగా, రాజధాని నిర్మాణం పూర్తి అయ్యాక, ‘అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో’ ఇందుకు సమానమైన భూమిని ఇవ్వాలని సీఆర్‌డిఎ నిర్ణయించింది. మిగిలిన భూములను రోడ్లు, ప్రజా సదుపాయాలు, పరిశ్రమలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం వినియోగిస్తారు. కానీ, ఈ ఎల్‌పిఎస్ భూయజమానుల సమ్మతినే తీసుకుంటుంది తప్ప ఆ భూమి మీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీల వంటివారిని మినహాయిస్తుంది.
1503 మంది జనాభా వున్న ఉద్ధండరాయునిపాలెం గ్రామాన్ని మూడు ప్రధాన కాలనీలుగా విభజించారు. ఒకటి ప్రధాన గ్రామం; రెండోది షెడ్యూల్ కులాలవారికి కేటాయించినది. మూడవది - కృష్ణానది ఒడ్డున ఏర్పాటైన లంక షెడ్యూల్ కులాల కాలనీ. ఎస్‌సి కాలనీలో సుమారు 150 దళిత కుటుంబాలు, లంక ఎస్‌సి కాలనీలో 75 కుటుంబాలు నివసిస్తున్నాయని గ్రామస్తుల అంచనా.
ప్రధాన గ్రామంలో అధికశాతం కమ్మ సామాజికవర్గానికి చెందిన భూస్వాములు కాగా, కొంతమంది సన్నకారు రైతులు కూడా వున్నారు. దళితుల జనాభా ఎక్కువ. వీరంతా భూస్వాముల వ్యవసాయ పొలాల్లో కూలిపనికి వెళ్తుంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఉద్ధండరాయునిపాలెంలో 169 మంది రైతులు, 556 మంది వ్యవసాయకూలీలు నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రికల్చర్ లాండ్‌సీలింగ్ చట్టం, 1973 ప్రకారం సేకరించిన భూములను భూమిలేని పేదదళితులకు పంచింది. ఈ రకంగా భూముల్ని పొందిన చాలా కొద్దిమంది కూడా ఈ గ్రామంలో నివసిస్తున్నారు.
మండ్ల సుబ్బారావు అనే 70 ఏళ్ల వయసున్న స్థానికుడు మాట్లాడుతూ ''భూసమీకరణలో భాగంగా చాలామంది భూస్వాములు వారి భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చేయడంతో గ్రామంలో వ్యవసాయపనులు పూర్తిగా ఆగిపోయాయి'' అని చెప్పారు. ఇదే సమయంలో కృష్ణ ఒడ్డున, ఉద్ధండరాయునిపాలెం, బోరుపాలెం, లింగాయపాలెం, వెంకటాయపాలెం వంటి గ్రామాలలో ఇసుక తవ్వకం ఊపందుకుంది. ఇలా తవ్వితీసిన ఇసుకను రాజధాని నిర్మాణ పనులకు వినియోగిస్తున్నారు.
ఇసుక తవ్వకాల మీద ఆధారపడిన యువ గ్రామీణ కార్మికులకు పని దొరుకుతుండగా, వృద్ధులకు మాత్రం అవకాశాల్లేకుండాపోయాయి. ''నేను కొన్నిరోజులు అక్కడ పనిచేయడానికి వెళ్లాను కానీ, అది చాలా శ్రమతో కూడుకున్న పని. నా వయసు అందుకు సహకరించదని అర్థమై వెళ్లడం మానేశాను'' అని చెప్పారు సుబ్బారావు. ఆయన తన భార్య మండ్ల వెంకాయమ్మ (60)తో కలిసి గ్రామంలో నివసిస్తున్నారు. ప్రస్తుతం వారి జీవనాధారం ప్రభుత్వం ప్రతినెలా అందించే కేవలం 2500 రూపాయల పింఛను మాత్రమే. భూసేకరణ చట్టం ప్రకారం, భూమి లేని నిరుపేద కార్మికులకు పదేళ్లపాటు ఫించను అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వారికి ఈ డబ్బు అందుతోంది. ఇది సెప్టెంబరు 2017 నాటి ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం ఇక్కడ భూమిలేని కార్మికుల సగటు నెలవారీ ఆదాయం రూ. 8476 కంటే చాలా తక్కువ.
''ఇంతకుముందు మగవారికి రోజుకు 500 రూపాయలు, మహిళలకు 150 నుంచి 200 రూపాయల కూలీ దొరికేది. 365 రోజులూ పనుండేది. ఒక భూమి లేని వ్యవసాయ కూలీ కూడా తన భార్యతో కలిసి పనిచేస్తే నెలకు 15,000 నుంచి 20,000 రూపాయలు సంపాదించుకునేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేకుండాపోయింది'' అన్నారు వెంకాయమ్మ. భర్త సుబ్బారావు ఆమెకు తోడు పలుకుతూ ''ప్రభుత్వమిచ్చే 2500 రూపాయలతో మేమెలా బతకాలి? 25 కేజీల బస్తా బియ్యం ధర 1500 రూపాయలుంది. మిగిలిన వెయ్యిరూపాయలతో నెల ఎలా గడవాలి?'' అని ప్రశ్నించారు. “మా ఆదాయం తగ్గిపోయినా, ఈ కొత్త రాజధాని వల్ల రవాణా చార్జీలు (పనికోసం ఇతర ప్రదేశాలకు వెళ్ళిరావడానికి), ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఇతర ఖర్చులు మాత్రం పెరిగిపోయాయి.” అన్నారాయన.
''అసలు మొదట ప్రభుత్వం మాకేమీ ఇవ్వలేదు. మంచి ప్యాకేజీలన్నీ భూస్వాములకే వెళ్లిపోయాయి. ప్రభుత్వం మాకు నెలకు 2500 రూపాయల ముష్టిపడేస్తోంది. అది కూడా మేమెన్నో ఆందోళనలు చేసిన తర్వాత సాధించుకున్నది. మా బతుకులు గడవాలంటే కుటుంబానికి పదివేల రూపాయలకు తగ్గకుండా పెన్షన్ అందించాలి'' అని డిమాండ్ చేశారు కంభంపాటి భూలక్ష్మి (42) అనే దళిత మహిళ. భర్తను కోల్పోయిన ఈమె స్థానిక ఎస్‌సి కాలనీలో నివసిస్తున్నారు. ''ఆ ఇచ్చే పెన్షన్ కూడా సమయానికి ఇవ్వరు. రెండునెలలకో మారు ఇస్తున్నారు. దానికోసం రెండుమూడుసార్లు తిరగాలి. ఇది కూడా మాకు నేరుగా అందదు. ఇక్కణ్ణుంచి నాలుగు కిలోమీటర్లు ఆటోలో మందడం గ్రామానికి వెళ్లి, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకోవాలి. ఇందుకోసం మాకు 40 రూపాయల ఆటో ఖర్చులు అదనం. మా వూరికి బస్సుల్లేవు కాబట్టి ఆటోల మీద ఆధారపడాల్సిందే'' అని మరికొంత సమాచారం అందించారామె.
భూలక్ష్మి తన మాటల్ని కొనసాగిస్తూ ''ఎంజిఎన్ఆర్ఇజిఎ పథకం కింద 29 గ్రామాల ప్రజలకు 365 రోజులూ పని చూపిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. 365 రోజులు అలా వుంచండి, గత నాలుగేళ్లలో మాకు కనీసం ఒక్కరోజు కూడా పని చూపలేదు. అమరావతి కోసం భూసమీకరణ ప్రారంభమై తరువాత (2015) కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది'' అని చెప్పారు.
భూలక్ష్మి కుమారుడు 18 ఏళ్ళ ఇర్మియా సంపాదనే ఐదుగురున్న ఆ ఇంటికిప్పుడు ఆధారం. భూలక్ష్మి చెల్లెలు కూడా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆ ఇంట్లోనే వుంటోంది. ఇర్మియా పదవ తరగతి చదువును 2015 లోనే ఆపేశాడు. వారానికి మూడురోజులు పనిచేస్తే రోజుకు 200 నుంచి 250 రూపాయల ఆదాయమొస్తోంది. ''మాకు ఆదాయం తక్కువ, మనుషులెక్కువ. అందుకే పనులను పంచుకుంటుంటాం. ఒకరోజు ఎస్సీ కాలనీ నుంచి, మరుసటిరోజు లంక ఎస్సీకాలనీ నుంచి మనుషులు ఇసుక పనికి వెళ్తుంటారు'' అని చెప్పాడు ఇర్మియా.
మబ్బులు పట్టివున్న ఒక మధ్యాహ్నం పూట ... ఇసుక క్వారీల్లో పనిచేసే కొందరు దళిత యువకులు ఒకచోట కూర్చుని పేకాట ఆడుకుంటున్నారు. వారిలో ఎంబిఎ డిగ్రీ చదువుకున్నవారూ వున్నారు. వీరిలో కొందరు హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసి విఫలులయ్యారు. అక్కడినుంచి తమ వూరికి తిరిగిరాగానే ఇక్కడ వారికి వ్యవసాయ పనులు అసలే లేవు. “ఇసుక తవ్వకాల పని కూడా ఏడాది ఏడాదికీ తగ్గిపోతోంది. బహుశా కృష్ణానదీ గర్భంలోని ఇసుక పూర్తిగా తగ్గిపోయుంటుంది.” అని చెప్పాడు అంకాళ మదన్ (23). ఏలూరు లోని ఒక ప్రయివేటు కాలేజీలో ఎంబీఏ పూర్తిచేశాడతను.
డ్రెడ్జ్‌లు, మరబోట్లు ఉపయోగించి నదీ గర్భంలోంచి ఇసుకను తవ్వి నది ఒడ్డున వేస్తారు. గుంటూరులో ఎంబీఏ చదివివచ్చిన పులి సుధీర్ (24) అనే యువకుడు కూడా ఇప్పుడు ఆ క్వారీల్లోనే పనిచేస్తున్నాడు. సుధీర్ మాట్లాడుతూ, “మేమిక్కడ ఇసుకను ట్రాక్టర్లకు ఎక్కించే పని చేస్తున్నాం. మేం చదువుకున్న ఎంబిఎ చివరికి ఇందుకు పనికొచ్చింది” అని ఆవేదన వ్యక్తం చేశాడు. అతని బంధువు భరత్ కుమార్ (25) మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు, ''ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేశాం. బహుశా అతని కుటుంబానికి మాత్రమే ఆ ఆఫర్ చెల్లుబాటు అవుతుందని మాకు తెలియలేదు.” అంటూ 2017లో రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి పొందిన చంద్రబాబునాయుడు కుమారుడు, నారా లోకేష్‌ని ఉద్దేశించి మాట్లాడాడు.
మెకనైజ్డ్ పడవల ద్వారా ఇసుక మైనింగ్ చేయరాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)ఇచ్చిన పలు తీర్పుల్ని కూడా ఏపీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ''నిజానికి ఇదంతా ప్రభుత్వం కనుసన్నల్లో జరుగుతున్న కుట్రే. అధికార తెలుగుదేశం పార్టీ స్థానిక ఎమ్మెల్యే, ఎం.పీ, కొందరు మంత్రులు కూడా ఈ కుట్రలో భాగమైవున్నారు'' అని చెప్పాడు ఆ క్వారీల్లో పనిచేస్తున్న ఒక యువకుడు. తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ యువకుడు కూడా ఎంబీఏ నేపథ్యం నుంచి వచ్చినవాడే. “ఇసుక మైనింగ్ ద్వారా వచ్చే డబ్బును వచ్చే సంవత్సరం రాబోతున్న ఎన్నికల్లో గెలుపుకోసం ఖర్చుపెట్టేస్తారు తప్ప, మా అవసరాల గురించి వారేం చేయరు.” అని చెప్పాడతను.
2017 మార్చిలో ఉద్ధండరాయునిపాలెంకి చెందిన మూడు దళిత కుటుంబాలు బ్యాంకుల నుంచి తీసుకున్న కొంత అప్పుతో సహా 12 లక్షల రూపాయల డబ్బును పోగుచేసి, ఒక డ్రెడ్జెర్‌ను కొని, తామూ మైనింగ్ కార్యకలాపాల్లో భాగం కావడానికి ముందుకొచ్చారు. కానీ, గ్రామమ్మీద మంచి పట్టు, పలుకుబడులున్న కమ్మ సామాజికవర్గానికి చెందిన సర్పంచ్ (తెలుగుదేశం కార్యకర్త) వారిని ఇసుక తవ్వకానికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. దాంతో వాళ్లు ఒక కమ్మ కంట్రాక్టరుతో కలిసి పనిచేయాల్సివచ్చింది. ఆ కంట్రాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినవాడే. ''మేము మైనింగ్ చేస్తే తప్పు. కానీ అధికారపార్టీవాళ్లు చేస్తే మాత్రం అది చట్టబద్ధమవుతుంది. పైగా అది మాకు జీవనోపాధిని కల్పిస్తోందనే సాకుతో సమర్థించుకోవడం కూడా'' అన్నాడా దళిత యువకుడు.
కాలం గడిచేకొద్దీ, కృష్ణ ఒడ్డునా, నదీగర్భంలోనూ జరిగిన ఇసుక తవ్వకాలు పర్యావరణానికి గణనీయంగా నష్టం కలిగించాయి. దీనిని నిశితంగా అధ్యయనం చేసిన న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, జామియా మిలియా ఇస్లామియాలలో గౌరవ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విక్రమ్ సోనీ, పలు వాస్తవాలను బయటపెట్టారు. ''నదిలో నీరు నిలవాలంటే ఇసుక చాలా అవసరం. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి నదుల్లో తగినంత ఇసుక ఉండటం చాలా ముఖ్యం. (కృష్ణానదిలో) ఇసుక మొత్తం లోతు నదీగర్భంలో 30 మీటర్ల నుండి బయటి ప్రాంతాలలో ఐదు మీటర్ల వరకు ఉంటుంది. ఇది అసాధారణమైనది. లక్షలాది సంవత్సరాలుగా ఉన్న ఈ సహజ నదీ వ్యవస్థ మొత్తాన్ని రాజకీయ నాయకులు డబ్బు కోసం నాశనం చేశారు.” అని ఆయన అన్నారు
ఎంబీఏలు చదివిన యువకులకుగానీ, ఇసుక తవ్వకం కార్మికుల పిల్లలైన రాజా, ప్రసాద్, ఇర్మియాలకు గానీ తాము ఎటువైపుకు వెళ్తున్నారో తెలియదు. "ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఉద్యోగాలు ఇవ్వమనండి, నదిని కాపాడేందుకు ఇసుక తవ్వకాలను ఆపండి." అని మదన్ అంటున్నాడు.
"ఏం చేయాలో మాకేం తెలియటంలేదు. ఇసుక అయిపోయిన తర్వాత మేం ఎలా జీవించాలి?" అంటాడు రాజా.
ఈ వరసలో ఇంకొన్ని శీర్షికలు:
‘This is not a people’s capital’
New capital city, old mechanisms of division
Soaring land prices, falling farm fortunes
Mega capital city, underpaid migrant workers
అనువాదం: సురేశ్ వెలుగూరి