పటచిత్ర ను తయారు చేయటంలో మొదటి అడుగు ఒక పాటను అంటే పటార్‌గాన్‌ను స్వర పరచటం. " పటచిత్ర ను గీయటానికి ముందు మేము పాటలలోని చరణాలను సృష్టించాలి... అందులోని లయ రంగులువేసే ప్రక్రియకు ఒక రూపాన్ని ఇస్తుంది," అన్నారు మామొని చిత్రకర్. వారి ఇంట్లో కూర్చుని, ఈ ఎనిమిదవ తరం చిత్రకారిణి పశ్చిమ బెంగాల్లోని తూర్పు కొల్‌కతా చిత్తడి నేలలను వర్ణిస్తూ ఒక పటచిత్రా న్ని రూపొందిస్తున్నారు.
ఈ కళారూపానికి ఈ పేరు సంస్కృత పదాలయిన ' పట్ట ' లేదా వస్త్రపు ముక్క, ' చిత్ర' లేదా వర్ణచిత్రం (పెయింటింగ్) నుంచి వచ్చింది. చిత్తడి నేలలచే పోషింపబడిన ఈ సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థను చిత్రించేటప్పుడు మామొని పటచిత్ర ప్రదర్శనతో పాటుగా ‘ పటార్‌గాన్’ ను ఆలపిస్తారు. మామొని స్వయంగా రాసి, స్వరపరచిన ఈ పాట ఇలా ఆహ్వానంతో మొదలవుతుంది: "వినండి, అందరూ వినండి, శ్రద్ధగా వినండి".
‘అనేక మందికి జీవనాధారం'గా ఉండే తూర్పు కొల్‌కతా చిత్తడి నేలల ప్రాముఖ్యాన్ని వర్ణిస్తూ ఈ పాట సాగుతుంది. మత్స్యకారులను, రైతులను, పచ్చని పొలాలను కాగితపు చుట్టలు అతికించిన పట (వస్త్రం)పై చిత్రిస్తారు. ఇలా పూర్తయిన పట ను ప్రదర్శన సమయంలో నెమ్మదిగా తెరిచినప్పుడు పాటలోని చరణాలకనుగుణంగా చిత్రంలోని భాగాలు బహిర్గతమవుతాయి. ఈ విధంగా చిత్రాల రూపంలోనూ, సంగీతం ద్వారానూ మామొని కళ, చిత్తడి నేలల కథను చెబుతుంది.
పశ్చిమ మేదినీపూర్‌లోని పింగ్లా తాలుకా, నయా గ్రామంలో నివాసముంటోన్న మామొని అంచనా ప్రకారం దాదాపు 400 మంది హస్తకళాకారులు ఆ గ్రామంలో ఉంటున్నారు. ఈ తాలూకాలోని మరే గ్రామంలోనూ ఇంత భారీ ఎత్తున పటచిత్రాలు తయారుచేసే కళాకారులు లేరు. "గ్రామంలోని దాదాపు అన్ని(85) ఇళ్ళ గోడలపై కుడ్యచిత్రాలు (murals) ఉన్నాయి," అంటూ అందమైన రంగులలో చిత్రించిన ఆకులు, అడవి జంతువులు, పువ్వుల చిత్రాలను ప్రస్తావిస్తూ ఇక్కడే నివసించే 32 ఏళ్ల కళాకారిణి మామొని చెప్పారు. "మా గ్రామం మొత్తం అందంగా కనిపిస్తుంది," అని ఆమె అన్నారు.
ఈ గ్రామం రాష్ట్రంలోని ఒక పర్యాటక ఆకర్షణగా జాబితాలో చేరినది. భారతదేశం నలుమూలల నుంచి, విదేశాల నుండి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. "మాతో మాట్లాడటానికి, మా హస్తకళను నేర్చుకోవడానికి, మా జీవితాల గురించి, నైపుణ్యాల గురించి మమ్మల్ని అడగడానికి వచ్చిన విద్యార్థులను కూడా మేము స్వాగతిస్తాం," అని మామొని చెప్పారు. "మేం వారికి పటార్‌గాన్ , పటచిత్ర చిత్రీకర్ణ శైలిని నేర్పిస్తాం. ఇంకా, సహజంగా దొరికే పదార్థాలతో రంగులను తయారు చేయడంపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తాం."
"ఈ పటచిత్ర కళ గుహచిత్ర లేదా పురాతనకాలం నాటి గుహచిత్రాల నుండి ఉద్భవించింది," అని మామొని చెప్పారు. శతాబ్దాల వయసున్న ఈ కళకు అసలు చిత్రీకరణకు ముందు, తర్వాత కూడా చాలా గంటల శ్రమ అవసరమవుతుంది.
పటార్ గాన్ ను చక్కగా స్వరపరచిన తర్వాత, అసలు చిత్రీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని మామొని వివరించారు. "మన సంప్రదాయం ప్రకారం నేను ఉపయోగించే అన్ని రంగులు సహజంగా అందుబాటులో ఉండే పదార్థాల నుంచి వచ్చినవే." పచ్చి పసుపు, కాల్చిన మట్టి, బంతి పువ్వుల నుండి రంగును సేకరిస్తారు. “నేను చిక్కటి నలుపు రంగు కోసం బియ్యాన్ని మాడుస్తాను; నీలిరంగు కోసం అపరాజిత (శంఖు పువ్వులు) పువ్వులను నూరి అందులోంచి స్వేదన పద్ధతిలో రంగును తీస్తాను. అలాగే మిగతా రంగులూనూ."
వెలికితీసిన రంగులను కొబ్బరి చిప్పల్లో నిల్వ చేసి ఎండలో ఆరబెడతారు. కొన్ని పదార్థాలు అన్నివేళలా లభ్యం కావు కాబట్టి ఈ క్యూరింగ్ ప్రక్రియ ఒక సంవత్సరం వరకు పట్టవచ్చు. ఈ ప్రక్రియలు కష్టతరమైనవైనప్పటికీ, "ఇందులోని దశలు ముఖ్యమైనవి, వాటిని జాగ్రత్తగా చేయాలి" అని మామొని చెప్పారు.
చిత్రరచనకు ముందు బేల్ (వెలగ) చెట్టు నుండి సేకరించిన సహజమైన జిగురుతో రంగులను కలుపుతారు. తాజాగా చిత్రీకరించిన కాగితపు చుట్టలను గుడ్డ పై అతికించడానికి ముందు, ఆ రంగులు ఎక్కువ కాలం నిలిచేలా ఉండటం కోసం వాటిని పొడిగా ఎండిపోయేలా చూడాలి. ఇలా తయారైనవాటి తుది రూపమే పటచిత్రం .
తన గ్రామంలోని ఇతరుల మాదిరిగానే, మామొని చిన్నతనం నుండే పటచిత్ర కళను నేర్చుకోవడం ప్రారంభించారు. “నేను ఏడేళ్ల వయస్సు నుండి చిత్రాలు వేసేదాన్ని, పాటలు పాడేదాన్ని. పటచిత్ర నా పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వచ్చిన కళ, నేను దానిని మా అమ్మ స్వర్ణ చిత్రకర్ నుండి నేర్చుకున్నాను." మామొని తండ్రి, 58 ఏళ్ల శంభు చిత్రకర్ కూడా పటువా గా పనిచేస్తున్నారు. కుటుంబంలోని ఇతరులు - ఆమె భర్త సమీర్, ఆమె సోదరి సోనాలి కూడా ఈ పని చేస్తున్నారు. మామొని పిల్లలు, 8వ తరగతి చదువుతున్న ఆమె కొడుకు, 6వ తరగతి చదువుతున్న ఆమె కూతురు ఆమె దగ్గర ఈ కళను నేర్చుకుంటున్నారు.
సంప్రదాయకంగా, పటచిత్ర స్థానిక జానపద కథల నుండి, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలలోని సాధారణ దృశ్యాలనుండి రూపొందించినది. ముందు తరం పటువాలు - మామొని తాతలు, వారి పూర్వీకులతో సహా పటచిత్ర శైలి చిత్రరచన చేసేవారు - పటచిత్ర లో చిత్రీకరించిన కథలను ప్రదర్శిస్తూ గ్రామ గ్రామాలకు తిరిగేవారు. అలాంటి ప్రదర్శనలు ఇస్తూ, ప్రతిఫలంగా వచ్చే డబ్బు లేదా ఆహారంతో వారు మనుగడ సాగించేవారు.
"వాటిని ( పటచిత్రాలు ) అమ్మకపు వస్తువులుగా తయారుచేయటంలేదు," అని మామొని వివరించారు. పటచిత్రం ఒక్క చిత్రలేఖన శైలి మాత్రమే కాదు, శ్రవ్య, దృశ్య మాధ్యమాలు రెండింటినీ ఉపయోగించి కథ చెప్పే విధానం.
కాలక్రమేణా మామొని వంటి పటువాలు పటచిత్ర శైలి సంప్రదాయ సిద్ధాంతాలను సమకాలీన ఇతివృత్తాలతో కలిపివేశారు. "నేను కొత్త విషయాలపై, అంశాలపై పని చేయడానికి ఇష్టపడతాను," అని ఆమె చెప్పారు. “నా చిత్రాలు కొన్ని సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాల ఆధారంగా రూపొందించినవి. లైంగిక హింస, అక్రమ రవాణా వంటి సామాజిక సంబంధిత సమస్యలను ప్రతిబింబించడానికి కూడా నేను నా చిత్రాలను ఉపయోగిస్తాను."
కోవిడ్-19 ప్రభావం, దాని లక్షణాల గురించి ఆమె ఇటీవల చిత్రించిన చిత్రం, ఆ వ్యాధిపై అవగాహనను వ్యాపింపజేసింది. మరికొందరు కళాకారులతో కలిసి మామొని ఆసుపత్రులలో, హాట్ (సంతలు)లలో, నయా గ్రామం చుట్టుపక్కల గ్రామాలలో ఈ పటచిత్రాన్ని ప్రదర్శించారు.
పట-మాయా అనేది ప్రతి నవంబర్‌లో నయాలో నిర్వహించే ఒక మేళా . "ఇది దేశం నుంచే కాక విదేశాల నుండి కూడా వచ్చి చిత్రపటాలను కొనుగోలు చేసే పర్యాటకులకు, కళాప్రియులకు ప్రధాన ఆకర్షణ" అని మామొని చెప్పారు. నయా గ్రామం చుట్టుపక్కల విక్రయించే టీ-షర్టులు, ఫర్నిచర్, పాత్రలు, చీరలు, ఇతర దుస్తులు, గృహోపకరణాలపై కూడా పటచిత్ర శైలి కనిపిస్తుంటుంది. ఇది ఈ చిత్రకళపై ఆసక్తిని పెంచటమే కాకుండా కోవిడ్-19 సమయంలో దెబ్బతిన్న అమ్మకాలను కూడా మెరుగుపరిచింది. మామొని తన చిత్రాలను సోషల్ మీడియాలో, ఎక్కువగా ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తుంటారు. ఇది ఆమెకు ఏడాది పొడవునా తన చిత్రాలను అమ్ముకోవడంలో సహాయపడుతుంది.
మామొని తన చిత్రాలతో ఇటలీ, బహ్రెయిన్, ఫ్రాన్స్, అమెరికాలను సందర్శించారు. "మన కళ, పాటల ద్వారా మనం చాలామందిని చేరుకోగలం" అని ఈ కళ ఇలాగే కొనసాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ చెప్పారామె.
డిసప్పియరింగ్ డైలాగ్స్ కలెక్టివ్ ( Disappearing Dialogues Collective ) సంస్థ అంతరాలను తగ్గించడానికి, సంభాషణలను ప్రారంభించడానికి, కొత్త కథనాలను రూపొందించడానికి కళనూ సంస్కృతినీ మాధ్యమంగా ఉపయోగించే సంఘాలతో కలిసి, ఆ సముదాయాలతో పాటుగా పనిచేస్తుంది. ప్రస్తుత వారసత్వం, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణలో విలువను జోడించడం, సహాయం చేయడం వారి ముఖ్య ఉద్దేశం .
ఈ కథనం పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా సహకారంతో ఇండియా ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ వారి ఆర్కైవ్స్ అండ్ మ్యూజియమ్స్ ప్రోగ్రా మ్ కింద అమలు చేయబడిన ప్రాజెక్ట్, జొల్-ఎ-భూమిర్ గొల్పో ఓ కథ | స్టోరీస్ ఆఫ్ ది వెట్‌ల్యాండ్ కోసం సంకలనం చేసినవి. గోట-ఇన్‌స్టిటూట్/మ్యాక్స్ ముల్లర్ భవన్, న్యూ ఢిల్లీ వారి పాక్షిక మద్దతుతో ఇది సాధ్యమైంది .
అనువాదం: నీరజ పార్థసారథి