మేం ఆమెను కలిసేటప్పటికి ఆమె వయసు 104 సంవత్సరాలు. తనకు సహాయం చేయటం కోసం అన్నట్టు ముందుకు వస్తోన్న చేతులను అసహనంగా తోసివేస్తూ ఆమె తన గదిలోంచి బయటకు వచ్చారు. తన చేతికర్రను ఆసరాగా తీసుకోవటం మినహా, భవానీ మహతో ఎవరి సహాయాన్నీ కోరటం గానీ, తీసుకోవటం గానీ చేయలేదు. ఆ వయసులో కూడా ఆమె సొంతంగా నడుస్తున్నారు, నిలబడుతున్నారు, కూర్చుంటున్నారు. ఏదైనా ఉందీ అంటే, పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లా, చెపువా గ్రామంలో నివసించే ఆమె విస్తారమైన ఉమ్మడి కుటుంబంలోని తరతరాలు తమ జీవితాలకు, భవిష్యత్తుకు కేంద్రంగా ఉన్న రైతు, గృహిణి అయిన ఆమె పైనే ఎక్కువగా ఆధారపడ్డాయి.
స్వాతంత్ర్య సమరయోధురాలు భవానీ మహతో 2024, ఆగస్టు 29-30 అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలోనే ప్రశాంతంగా కనుమూశారు. ఆమె వయసు 106 సంవత్సరాలు. ఆమె కూడా వెళ్ళిపోవడంతో, నా పుస్తకం ది లాస్ట్ హీరోస్: ఫుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ (నవంబర్ 2022, పెంగ్విన్ ప్రచురణ) లోని 16 మంది స్వాతంత్ర్య సమరయోధులలో కేవలం నలుగురు మాత్రమే ప్రస్తుతం జీవించివున్నట్టయింది. ఒక విధంగా చెప్పాలంటే, అనేకమంది అసాధారణ స్వాతంత్ర్య సమరయోధులలో కూడా భవానీ మరింత విశిష్టమైనవారు. వీరందరి ఇంటర్వ్యూలు PARI స్వాతంత్ర్య సమరయోధుల గ్యాలరీలో ఉన్నాయి. ఆమె ఒక్కరే, కొన్ని గంటల పాటు సాగిన మా సంభాషణలో, ఆ వీరోచిత పోరాటంలో తన పాత్ర లేనేలేదని గట్టిగా ఖండించినవారు. "అసలా పోరాటంలో గానీ, అలాంటి మరేదానిలోనైనా నేనేం చేశాను?" మార్చి 2022లో మేం మొదటిసారి ఆమెను కలిసినప్పుడు ఆమె మమ్మల్ని ప్రశ్నించారు. చదవండి: భవానీ మహాతో విప్లవాన్ని పోషించిన వేళ








