పాలస్తీనాకు చెందిన మా తోటి అనువాదకుడు, కవి, రచయిత, విద్యావేత్త కాలమిస్ట్, కార్యకర్త రెఫాత్ అల్అరీర్, గాజాలో కొనసాగుతోన్న జాతి విధ్వంసంలో భాగంగా లక్ష్యంగా చేసుకుని చేసిన బాంబు దాడిలో డిసెంబర్ 7, 2023న మరణించారు. ఆయన గొంతును నొక్కవేసిన రోజునే, ఆయన రాసిన ఒక కవిత డజనుకు పైగా భాషల్లో ప్రపంచమంతటా ప్రతిధ్వనించింది.
ఇలాంటి ప్రపంచంలో, ఇటువంటి సమయంలో మేం PARIలోని భాషల ప్రపంచంలో మా పనినీ, మేం నిర్వహించిన పాత్రనూ తిరిగి చూసుకుంటాం! రెఫాత్ మాటలను గుర్తుకు తెచ్చుకోవడంతో ప్రారంభిస్తాం:
మన పోరాటాన్ని వినిపించడానికీ, తిరిగి పోరాడటానికీ మనకున్నది భాష ఒక్కటే. మనల్ని మనం చైతన్యపరచుకోవడానికీ, ఇతరులకు అవగాహన కల్పించడానికి మనం ఉపయోగించుకునే అత్యంత విలువైన నిధి మన పదాలే. ఈ పదాలను వీలైనన్ని ఎక్కువ భాషల్లో తెలియజేయాల్సివుంది. వీలైనంత ఎక్కువ మంది హృదయాలనూ మనస్సులనూ తాకే భాషని నేను నమ్ముతాను... మానవాళికి లభించిన గొప్ప వరం అనువాదం. అనువాదం అడ్డంకులను ఛేదిస్తుంది, వంతెనలను నిర్మిస్తుంది, అవగాహనను సృష్టిస్తుంది. అయితే ‘చెడు’ అనువాదాలు అపార్థాలను కూడా సృష్టించగలవు.
ప్రజలను ఒకచోటకు చేర్చి, కొత్త అవగాహనను పెంపొందించడంలో అనువాదానికి గల సామర్థ్యంపై ఈ నమ్మకమే PARIభాష చేసే పనిలో ఉంది
ఆ విధంగా మాకు 2023 చాలా విశిష్టమైన సంవత్సరం
ఛత్తీస్‌గఢీ, భోజ్‌పురి - ఈ రెండు కొత్త భాషలను చేర్చడంతో PARI ప్రచురితమయ్యే భాషల సంఖ్య 14కు చేరింది.
మాకు PARIభాష అనే పేరు వచ్చినందుకు కూడా ఈ సంవత్సరం మాకు ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆంగ్ల కంటెంట్‌ను అనువాదం చేయటానికి మించి, మేం చేసే ప్రతి పనిని కవర్ చేయడంలో మా పాత్ర ప్రాధాన్యాన్ని పెంచుకోవటం ద్వారా PARIని గ్రామీణ జర్నలిజానికి నిజమైన బహుభాషా వేదికగా మార్చాం.
మన దేశంలోని ప్రజల రోజువారీ జీవితాల్లో మాటల, భాషల పాత్రను అన్వేషించడాన్ని మేం కొనసాగించాం. అనువాదం, భాషల చుట్టూ అల్లిన కథనాలు, సంభాషణల ద్వారా మేం PARI చేసిన కృషిని ఇక్కడ ఉంచుతున్నాం




