ఔచిత్ మాత్రేకు తన తరగతి గదిలో ఏకైక విద్యార్థిగా చదువుకోవడం అలవాటే. అయితే, బడి మొత్తానికి తానొక్కడే విద్యార్థిగా మిగిలిపోతానని మాత్రం ఎన్నడూ ఊహించలేదు.
కొవిడ్ వల్ల 18 నెలల పాటు మూతబడిన తన బడి తిరిగి తెరుచుకోవడంతో, గత ఏడాది అక్టోబరు 4వ తేదీన ఉదయం 11 గంటలకు తన తరగతి గదిలోకి 12 ఏళ్ల ఔచిత్ అడుగుపెట్టినప్పుడు సరిగ్గా ఈ పరిస్థితే ఎదురైంది. బడిలోని మూడు గదులు ఖాళీగా ఉన్నాయి. తన టీచర్ మాత్రమే తన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆయన పక్కన ఒక కుర్చీ మీద మహాత్మా గాంధీ ఫోటో ఫ్రేమ్ ఉంది.
2015లో దాదాపు ఆరేళ్ల వయసున్నఔచిత్ 1వ తరగతిలో చేరినప్పటి నుండీ కూడా అతనికి సహవిద్యార్థులెవ్వరూ లేరు. “ఫక్త్ మీచ్ హోతో [నేనొక్కడినే ఉండే వాడిని],” అని అతను చెప్పాడు. అప్పటికి దాదాపు 25 మంది విద్యార్థులున్న ఆ బడిలో చిట్టచివరన చేరిన విద్యార్థి కూడా అతనే. వారంతా ఘారాపురి శివార్లలోని మొరాబందర్, రాజ్‌బందర్, శేత్‌బందర్ అనే మూడు పల్లెలకు చెందినవారు. ఈ పల్లెలన్నింటికీ కలిపి దాదాపు 1,100 వరకు జనాభా ఉంటుంది. మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఉన్న ఘారాపురి దీవి, ప్రముఖ పర్యాటక స్థలమైన ఎలిఫెంటా గుహలకు ప్రసిద్ధి. ఈ దీవిని చేరుకోవాలంటే, దక్షిణ ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా నుండి పడవ మార్గంలో ఒక గంట సేపు ప్రయాణించాలి.
ఓ పదేళ్ళ ముందువరకు, ఔచిత్ వెళ్లే- 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఉన్న- జిల్లా పరిషత్ (ZP) పాఠశాలలో 55-60 మంది విద్యార్థులు చదివేవారు. ఒక్కో ఏడాదీ వారి సంఖ్య క్రమంగా క్షీణిస్తూ వచ్చి, చివరికి 2019లో కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారు. 2020 మార్చి నాటికి వారి సంఖ్య ఏడుకు చేరుకుంది. 2020-21 విద్యా సంవత్సరంలో ముగ్గురు విద్యార్థులు 7వ తరగతి పూర్తి చేశారు. మరో ఇద్దరు వేరే ప్రాంతానికి తరలిపోవడంతో ఇద్దరు మాత్రమే మిగిలారు. వారు- 6వ తరగతిలోని ఔచిత్, 7వ తరగతిలోని గౌరి మాత్రే. “ఇక్కడ చదువు సరిగ్గా సాగటంలేదు. అందుకే అందరూ వెళ్లిపోవడం మొదలుపెట్టారు,” అని గౌరి చెప్పింది.


















