“జడలబర్రెల జనాభా క్రమేణా తగ్గిపోతూవుంది," గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జడలబర్రెలను మేపుతోన్న పద్మ థుమో అన్నారు. "ఈమధ్య దిగువ పీఠభూమి ప్రాంతంలో (దాదాపు 3000 మీటర్లు) జడలబర్రెలు చాల తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి,” అన్నారామె.
జాంస్కర్ బ్లాక్ లోని అబ్రాన్ గ్రామానికి చెందిన పద్మ, ఏడాదికి సుమారు 120 పశువులతో కలిసి, లదాఖ్‌లోని ఎత్తైన, శీతలమైన పర్వత శ్రేణుల్లో వాటిని మేపుతూ తిరుగుతుంటారు. ఇక్కడి ఉష్ణోగ్రతలు దాదాపుగా -15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంటాయి.
జడలబర్రెలు ( బోస్ గ్రునియెన్స్ ) ఇక్కడి శీతల ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి కానీ ఉష్ణోగ్రత 13 డిగ్రీల కంటే ఎక్కువ పెరిగితే తట్టుకుని జీవించలేవు.
గత కొన్ని దశాబ్దాలుగా జాంస్కర్ లోయ దిగువ పీఠభూమిలో సగటు వేసవి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు దాటుతున్నాయనీ, చివరకు 32 డిగ్రీల సెల్సియస్‌కు కూడా పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. “శీతాకాలం ఉష్ణోగ్రతలకూ, వేసవికాలం ఉష్ణోగ్రతలకూ మధ్య చాలా అంతరం ఉంటోంది,” అని స్థానికంగా లోయలో నివసిస్తూ డ్రైవర్‌గా పనిచేసే తెన్జిన్ ఎన్. అన్నారు.
ఈ అసాధారణ ఉష్ణోగ్రతలు, 2012 నుండి 2019 మధ్యకాలంలో జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని జడలబర్రెలపై ప్రభావం చూపించడంతో వాటి సంఖ్య సగానికి ( 20వ పశు గణన ఆధారంగా ) తగ్గిపోయింది.
జడలబర్రెల పశుపోషకులు పెద్ద సంఖ్యలో ఉండే చాంగ్తాంగ్ పీఠభూమిలా కాకుండా, జాంస్కర్ లోయలో ఈ పశుపోషకుల సంఖ్య సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. స్థానికంగా జాంస్కర్పాలు అని పిలిచే వీరి సంఖ్య కూడా బాగా తగ్గిపోయిందని స్థానికులు చెప్పారు. లదాఖ్‌లోని కర్గిల్ జిల్లాకి చెందిన అబ్రాన్, అక్షో, చాహ్ గ్రామాల్లోని కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే ఇప్పటికీ జడలబర్రెలను పెంచుతున్నారు.
ఒకప్పుడు పశుపోషకుడిగా ఉన్న నోర్ఫల్, 2017లో తన దగ్గరున్న జడలబర్రెలను అమ్మేసి అబ్రాన్ గ్రామంలో ఒక చిన్న కాలానుగుణమైన (సీజనల్) దుకాణాన్ని ప్రారంభించారు. కేవలం మే నుండి అక్టోబర్ మాసం వరకే తెరిచి ఉండే ఈ దుకాణంలో తేయాకు, బిస్కెట్లు, ప్యాక్ చేసిన ఆహారం, కిరోసిన్, పాత్రలు, సుగంధ ద్రవ్యాలు, వంట నూనె, ఎండు మాంసం వంటి వస్తువులు దొరుకుతాయి. తాను పశుపోషకుడిగా ఉన్న కాలంలో ఆ పని చాలా కష్టంగా ఉండేదనీ, లాభదాయకంగా ఉండేదికాదని ఆయన గుర్తుచేసుకున్నారు. “ఇంతకుముందు నా దగ్గర కూడా జడలబర్రెలు ఉండేవి, కానీ ఇప్పుడు నా దగ్గర ఆవులున్నాయి. నా సంపాదన ఎక్కువగా ఈ దుకాణం నుంచే వస్తోంది. కొన్నిసార్లు నెలలో మూడు నుండి నాలుగు వేల రూపాయలు సంపాదిస్తాను. అయితే ఈ సంపాదన జడలబర్రెలను పోషిస్తున్నప్పుడు వచ్చిన సంపాదన కంటే ఎక్కువే.”
అబ్రాన్కు చెందిన సోనమ్ మోటుప్, సెరింగ్ ఆంగ్మోలు గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు 120 జడలబర్రెలకు పశుపోషకులుగా ఉంటున్నారు. “ప్రతి సంవత్సరం వేసవికాలంలో [మే నుండి అక్టోబర్ వరకూ] మేం లోయ నుండి మరింత ఎత్తైన ప్రాంతాలకు (మరింత చల్లగా ఉండే ప్రాంతాలకు) వలస వెళ్ళి, దాదాపు నాలుగైదు నెలల పాటు డోక్సా లో నివసిస్తాం,” అని సెరింగ్ చెప్పారు.
వేసవికాలంలో వలస వచ్చే కుటుంబాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన స్థావరం డోక్సా . దీనిలో అనేక గదులతో పాటు వంట గది కూడా ఉంటుంది. స్థానికంగా గోఠ్, మానీ అని కూడా పిలిచే ఈ స్థావరాన్ని స్థానికంగా లభించే మట్టి, రాళ్ళతో నిర్మిస్తారు. సాధారణంగా, ఒకే గ్రామం నుండి వలస వచ్చిన పశుపోషక కుటుంబాలు వంతులవారీగా మందతో ఉండేలా ఒప్పందం చేసుకొని ఈ డోక్సా లో కలిసి ఉంటారు. “నేను పశువులను మేపుతూ, వాటిని సంరక్షిస్తుంటాను. ఇక్కడ జీవితం తీరిక లేకుండా ఉంటుంది," అంటారు సోనమ్.
ఈ మాసాలలో, ప్రతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు చుర్పీ (స్థానికంగా తయారుచేసే చీజ్) తయారుచేయటంతో సోనమ్, సెరింగ్ల రోజు ఆరంభమవుతుంది. “సూర్యోదయం కాగానే, పశువుల మందను మేతకు తీసుకువెళ్తాం, మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటాం,” అని 69 ఏళ్ళ సోనమ్ చెప్పారు.
“ఇక్కడి (జాంస్కర్ లోయలో) పశుపోషకులు ఎక్కువగా జోమో (dzomo-సంకరజాతి ఆడ పశువు)లపై ఆధారపడతారు” అని సెరింగ్ చెప్పారు. జో (dzo-సంకరజాతి మగ పశువు), జోమో (సంకరజాతి ఆడ పశువు)లు జడలబర్రె, కోట్ (స్థానిక గేదె)లకు జన్మించిన సంకర జాతి పశువులు; జో లకు పిల్లలు పుట్టరు. “ఇక్కడ మగ జడలబర్రెలను ప్రజననం(breeding) కోసం మాత్రమే పెంచుతాం. జోమోల నుండి పాలను తీసి, ఈ పాల నుండి నెయ్యినీ చుర్పీ నీ తయారుచేస్తాం,” అని ఈ 65 ఏళ్ళ వృద్ధురాలు చెప్పారు.
గడిచిన దశాబ్దంతో పోలిస్తే ప్రస్తుతం తమ ఆదాయం మూడో వంతుకు పడిపోయిందని ఈ దంపతులు తెలిపారు. వీరిలాగే చాలామంది వారి జీవనోపాధి కోసం ఈ వృత్తిపై ఆధారపడడాన్ని కష్టతరంగా భావిస్తున్నారు. ఆగస్ట్ 2023లో PARI వారిని కలిసినపుడు, శీతాకాలంలో తగినంత పశుగ్రాసం దొరకక పోవడం గురించి ఈ పశుపోషకులు ఆందోళన చెందారు. పశుగ్రాసం సరఫరా అనేది తగినంత నీటి వసతి మీద ఆధారపడి ఉంటుంది. అయితే లదాఖ్ వంటి ఎత్తయిన ఎడారి ప్రాంతంలో ఏకైక మూలాధార నీటి వనరులైన హిమపాతం, హిమానీనదాల తగ్గుదల కారణంగా ఇక్కడి వ్యవసాయం దెబ్బతింది.
అబ్రాన్ గ్రామంపై ఇంకా ఈ ప్రభావం పడనప్పటికీ, సోనమ్ చాలా కలత చెందుతున్నారు - “వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని, నా పశువులకు తగినంత నీరు, పశుగ్రాసం దొరకకపోతే ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటాను."
సోనమ్, సెరింగ్లకు ఐదుగురు - 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన - పిల్లలు ఉన్నారు. వీరెవ్వరూ తమ తల్లిదండ్రుల వృత్తిలో కొనసాగలేదు, రోజువారీ కూలిపనులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు.
“యువతరం ఈ సంప్రదాయ వృత్తిని కాదని పట్టణ ప్రాంతాల్లో స్థిరపడేందుకే ఇష్టపడుతోంది; చాలామంది సరిహద్దు రహదారుల సంస్థలో డ్రైవర్లుగా, కార్మికులుగా పనిచేయాలనుకుంటున్నారు,” అని సోనమ్ చెప్పారు.
“ఈ వ్యాపారం [జడలబర్రెల పెంపకం] ఇంక ఏ మాత్రం స్థిరమైనది కాదు,” అని పద్మ థుమో అంగీకరించారు.
అనువాదం
: వై.డి. ఇమ్రాన్ ఖాన్