మే నెలలో వేడిగా ఉమ్మదం తీస్తోన్న ఒక అపరాహ్ణం వేళ. కానీ మోహాఁ వద్దనున్న హజ్రత్ సయ్యద్ ఆల్వి (రెహమతుల్లా అలయ్) దర్గా (ప్రార్థనాస్థలం) మాత్రం జనంతో క్రిక్కిరిసిపోయివుంది. ముస్లిముల కంటే హిందువులే ఎక్కువగా ఉన్న నలభై కుటుంబాలవారు ఏటా నిర్వహించే పూజలతోనూ, కందూరి అనే విందుతోనూ తీరికలేకుండా ఉన్నారు. ధోబళే కుటుంబం వారిలో ఒకటి. ఉస్మానాబాద్ జిల్లాలోని కళంబ్ బ్లాక్‌లో ఉన్న ఈ 200 ఏళ్ల నాటి దర్గా వద్ద నేను, నా కుటుంబం వారి అతిథులం.
వ్యవసాయ కుటుంబాలకు కొంత ఖాళీ సమయం ఉండే వేసవి నెలల్లో, మరాఠ్వాడా ప్రాంతంలోని ఉస్మానాబాద్, లాతూర్, మరో ఆరు జిల్లాలైన బీడ్, జాల్నా, ఔరంగాబాద్, పర్‌బణీ, నాందేడ్, హింగోలీలలోని పీర్ల (పవిత్ర పురుషులు) దర్గాలు సాధారణంగా కార్యకలాపాలతో సందడిగా ఉంటాయి. గురు, ఆదివారాల్లో కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఈ దర్గాలకు వస్తుంటాయి. వాళ్ళు ఒక మగ మేకను బలి ఇచ్చి, వండిన మాంసాన్ని నివద్ (నైవేద్యం) సమర్పించి, ఆశీర్వాదం కోరుకుంటారు. అందరూ కలిసి భోజనం చేస్తారు, ఇతరులకు ఆహారాన్ని అందిస్తారు.
"మేం తరతరాలుగా దీన్ని (కందూరి) చేస్తున్నాం," అన్నారు ఉస్మానాబాద్‌లోని యెడ్షి (యెడ్సీ అని కూడా పిలుస్తారు)కి చెందిన మా బంధువు భాగీరథి కదమ్ (60). (224 సంవత్సరాల హైదరాబాద్ నిజామ్ పాలనతో సహా) మరాఠ్వాడా ప్రాంతం 600 సంవత్సరాలకు పైగా ఇస్లామిక్ పాలనలో ఉంది. ఈ ఇస్లామిక్ ప్రార్థనాస్థలాల పట్ల ఉండే విశ్వాసం, ఆరాధనలు ప్రజల విశ్వాసాలతో, ఆచారాలతో పెనవేసుకుపోయి - ఒక సమన్వయ జీవన విధానాన్ని సూచిస్తున్నాయి.
“మేం గడ్ దేవదరి వద్ద అర్చిస్తాం. తవరాజ్ ఖేడాకు చెందినవారు ఇక్కడికి మోహాఁకు వస్తారు; మీ గ్రామం (లాతూర్ జిల్లాలోని బోర్‌గావ్ బుద్రుక్) వారు షేరాను సందర్శించాలి," అని ప్రేమగా భాగా మావ్షీ అని పిలుచుకునే భాగీరథి, పూజల కోసం నిర్దిష్ట దర్గాలను కేటాయించే గ్రామాల శతాబ్దాల నాటి ఆచారాన్ని వివరించారు.
ఇక్కడ మోహాఁలోని రెహ్మతుల్లా దర్గా వద్ద ప్రతి చెట్టు క్రింద, తగరపు పైకప్పులు లేదా టార్పాలిన్ పట్టాల ఆశ్రయం కింద, ప్రజలు చుల్హాలు (తాత్కాలికంగా ఏర్పాటుచేసిన పొయ్యిలు) వెలిగించి, దర్గాలో పాటించే ఆచారాల సమయంలో అందించడానికి ఆహారాన్ని వండుతారు. పిల్లలు తమ మనసుకు నచ్చినట్లు ఆడుకుంటుంటే పురుషులు, మహిళలు కబుర్లు చెప్పుకుంటున్నారు. గాలి వేడిగా ఉంది, కానీ పశ్చిమ ఆకాశంలో ముసురుకుంటోన్న మేఘాలు కొంత నీడను తెస్తాయి. అలాగే ప్రవేశ ద్వారం వద్ద వరుసగా ఉన్న ముసలి చింతచెట్ల నీడలు పరిచిన పందిరి, వేడి నుండి కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. దర్గా లోని నీటి తావు అయిన 90 అడుగుల లోతుండే బారవ్ అని పిలిచే పాత రాతి బావి ఎండిపోయింది, కానీ "వర్షాకాలంలో నీటితో నిండిపోతుంది" అని ఒక భక్తుడు మాకు తెలియజేశారు.
డెబ్బై ఏళ్ళ వయసుకు చేరువవుతోన్న ఒక వ్యక్తి వృద్ధురాలైన తన తల్లిని వీపుపై మోసుకొని దర్గా లోకి ప్రవేశించారు. దాదాపు తొంభై ఏళ్ళ వయసున్న ఆ వృద్ధురాలు ఆ ప్రాంతంలోని హిందూ ముస్లిమ్ మహిళలంతా ధరించే ఇర్కల్ చీరను ధరించివున్నారు. తొమ్మిది గజాల ఆ చీర లేత ఆకుపచ్చ రంగులో వెలిసిపోయి ఉంది. ఆమె కొడుకు మౙర్ (సాధువు సమాధి)కున్న ఐదు మెట్లను ఎక్కుతుండగా, అతని తల్లి కళ్ళు చమరించాయి. ఆమె రెండు చేతులూ జోడించి నమ్రతతో ప్రార్థించారు.
మిగిలిన భక్తులు అనుసరించారు. నలబై ఏళ్ళు దాటి, అనారోగ్యంగా ఆందోళనగా కనిపిస్తోన్న ఒక మహిళ తన తల్లితో కలిసి లోపలికి వచ్చారు. ప్రధాన ద్వారం నుంచి సుమారు 500 మీటర్ల దూరాన ఉన్న మౙర్ ను వారిద్దరూ చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ చేరుకున్నారు. వాళ్ళు కొబ్బరికాయనూ, కొన్ని పూలనూ మౙర్ కు సమర్పించి ధూపం వెలిగించారు. ముౙావర్ (సంరక్షకుడు) పగులగొట్టిన కొబ్బరికాయనూ, అనారోగ్యంతో ఉన్న మహిళ మణికట్టుకు కట్టేందుకు ఒక దారాన్నీ తిరిగి ఇచ్చారు. తల్లి ధూపం నుంచి వచ్చిన బూడిదను ఒక చిటికెడు తీసి తన కూతురి నుదిటిపై పెట్టారు. ఇద్దరూ ఒక చింత చెట్టు కింద కొద్దిసేపు కూర్చొని, ఆ తర్వాత లేచి వెళ్ళిపోయారు.
మౙర్ వెనుక వున్న లోహపు కంచె నిండా నియోన్, లేతాకుపచ్చ రంగులలో ఉన్న అద్దపు గాజులు నిండివున్నాయి. అన్ని విశ్వాసాలకు చెందిన మహిళలు తమ కూతుళ్ళకు మంచి సంబంధాలు దొరకాలని కోరుకుంటూ వీటిని అక్కడ ఉంచుతారు. ఒక వైపున్న మూలన, ఒక పెద్ద కొయ్య గుర్రం, దాని ముందు కొన్ని మట్టి గుర్రాల బొమ్మలు నిలిపి ఉన్నాయి. "తమ జీవితకాలంలో గుర్రాలపై స్వారీ చేసిన పూజ్యులైన ముస్లిమ్ సాధువుల జ్ఞాపకార్థం ఈ బొమ్మలను అర్పిస్తారు." అంటూ భాగా మావ్షీ నాకు వివరించారు.
నాకు మా అత్తగారింట్లో పూజలు చేసే రెండు గుర్రాలు గుర్తుకొచ్చాయి. వాటికొక అర్థమున్నట్టుగా తటాలున తోచింది. అందులో ఒకటి హిందూ దేవత అయిన భైరోబాది, మరొకటి ఒక పీర్ , పూజ్యులైన ముస్లిమ్ ఫకీర్ (సన్యాసి)ది.
*****
మాంసం కూర, భక్రీ లతో ఉండే కందూరి విందును తయారుచేయడానికి చాలామంది మహిళలు అర్ధరాత్రినుంచే లేచివుంటారు. కానీ వారిలో కొంతమందికి గురువారాలు మాంసాహారం తినని రోజులు కాబట్టి వారు దీనిని తినరు. "తినటం అంత ముఖ్యం కాదు. హే దేవాచ్చ కామ్ ఆహె మాయ్ (మేం దీన్ని దేవుని కోసం చేస్తాం బిడ్డా)" అంటూ ఆ మహిళల్లో ఒకరు నాతో చెప్పారు.
ఇటువంటి విందులకు మహిళల శ్రమే వెన్నెముకవంటిది. కానీ ఈ ఆహారాన్ని తీసుకోనివాళ్ళలో చాలామంది కొంతమంది శాకాహారుల కోసం, ఉపవాసం ఉండేవాళ్ళ కోసం వండే ఉపవాస భోజనాన్ని సంతోషంగా తింటారు. ఈ భోజనాన్ని అదే చుల్హా (పొయ్యి) మీద వండి, అవే పళ్ళేలలో తింటారనే నిజం వారినేమీ ఇబ్బంది పెట్టదు: మనోభావాలు దెబ్బతినవు; సెంటిమెంట్లు రెచ్చిపోవు కూడానూ.
పుణేలో నివసించే లక్ష్మి కదమ్ ఈ విందుకు వచ్చారు. వందలాది భకిరీల ను చేయటంలో, కూర కోసం మసాలాలు నూరటంలో, కడుగుళ్ళూ శుభ్రం చేయటాలూ- వీటన్నిటితో ఆమె చిత్తుగా అలసిపోయారు. "నాకు ‘వారి’ (ముస్లిమ్) మహిళలను చూస్తే అసూయగా ఉంది. ఒక పెద్ద పాత్రకు బిర్యానీ చేస్తే చాలు, అయిపోతుంది. హా అసలా రాడా నకో నా కహీ నకో (మేం చేసినంత పని వాళ్ళు చేయనవసరం లేదు)." అలసటగా చెప్పారు లక్ష్మి.
"వారి బుగ్గలు చూడు, చక్కగా గులాబీ రంగులో ఉన్నాయి!" ఇప్పుడామె అసూయ ఆలోచనలకూ ఊహలకూ దారితీసింది. మా చుట్టూ ఉన్న అనేకమంది మహిళలలో - సంపన్న కుటుంబాల నుంచీ, ఉన్నత కులాలకు చెందిన కుటుంబాల నుంచీ వచ్చిన కొద్దిమందిని మినహాయిస్తే -ఎక్కువమంది సన్నగా, అధిక శ్రమ చేసినవారే ఉన్నారు. వారంతా లక్ష్మి ఊహించినట్టు "గులాబీ బుగ్గల" మహిళలేమీ కారు.
ఈ విందులలో మాంసాన్ని వండే పని మొత్తంగా పురుషులే చేస్తారు. నోరూరించే, సుగంధాలు వెదజల్లే బిర్యానీని ముస్లిమ్ భక్తులు వడ్డిస్తారు.
ఐదు భకిరీలు , ఎంపికచేసిన మాంస భాగాలతో ఒక కుండ నిండా మాంసం కూర, గోధుమపిండి చపాతీలు, నెయ్యి, పంచదార లేదా బెల్లంతో తయారుచేసిన తియ్యని మలీద ముద్ద- వీటిని దర్గా వద్ద ముజావర్ కు నివద్ గా అర్పిస్తారు. మౙర్ దగ్గరకు పురుషులు వెళ్ళి నివద్ (నైవేద్యం)ను అర్పిస్తారు. మహిళలు బయట మెట్లమీద కూర్చొని ఈ కార్యక్రమాన్నంతా చూస్తూ దీవెనల కోసం వేచి ఉంటారు. దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఉన్నట్టే ఇక్కడ కూడా వారు తలను చీర కొంగుతో కప్పుకుంటారు.
ప్రార్థనలన్నీ ముగిసి, కానుకలను ఇచ్చిపుచ్చుకున్న తర్వాత, విందు ప్రారంభమవుతుంది. స్త్రీలు, పురుషులు వేరు వేరు పంక్తులలో భోజనాలు చేస్తారు. ఉపవాసం చేస్తున్నవారు ఉపవాస భోజనం చేస్తారు. ఐదుగురు ఫకీర్ల (సన్యాసులు)కు, దర్గా లో పనిచేసే ఐదుగురు మహిళలకు భోజనాన్ని వడ్డించిన తర్వాత మాత్రమే ఈ విందు లాంఛనంగా ముగిసినట్టవుతుంది.
*****
కొన్ని వారాల తర్వాత మా అత్తగారైన 75 ఏళ్ళ గయాబాయ్ కాళే ఇంటికి సమీపంలోనే ఉన్న ఒక దర్గా లో ఒక విందును నిర్వహించారు. ఆమె కొంతకా లంగా దీని గురించి అనుకుంటూ ఉన్నారు. ఈ ఏడాది (2023), మహారాష్ట్ర, లాతూర్‌లోని రేణాపూర్ బ్లాక్‌లో ఉన్న షేరా నుంచి వచ్చిన ఆమె చిన్న కూతురు జుంబర్ కూడా ఆమెతో జత కలిశారు.
మోహాఁలో ఉన్న దర్గా కంటే ఈ దావల్ మాలిక్ దర్గా చిన్నది. వివిధ కులాలకు చెందిన 15 హిందూ కుటుంబాలను మేమిక్కడ కలిశాం. ఒక మహిళల బృందం మౙర్ ముందు కూర్చొని కొన్ని భజనలను , హిందూ దేవుళ్ళను పూజించే కీర్తనలను పాడుతుంటారు; మరికొంతమంది ఇంటిలోవున్న సమస్యల గురించి సలహాల కోసం ఒక వృద్ధుడైన ఫకీర్ తో మాట్లాడుతుంటారు. ప్రజలు నివద్ ను అందజేస్తున్నప్పుడు ఒక బాలుర బృందం, అందులో ఎక్కువ మంది ఇప్పటికీ చాలా దేవాలయాలలోకి ప్రవేశం దొరకని దళితులు, హల్గీ (డోలు)ని వాయిస్తుంటారు.
గయాబాయి పెద్ద కొడుకు బాలాసాహెబ్ కాళే వంటను పర్యవేక్షిస్తున్నారు. లాతూర్‌లోని బోరగావ్ బుద్రుక్ నుంచి వచ్చిన ఈ చిన్న రైతు గొర్రెలను వధించడంలో ఆమెకు సహాయం చేస్తున్నారు. ఈయన మంచి ఘాటైన రుచికరమైన కూర కూడా చేస్తారు. తల్లీకూతుళ్ళు నివద్ ను అర్పించాక, దర్గా లో ఉన్న ఇతరులతో కలిసి కుటుంబమంతా భోజనాలు చేశారు.
ఈ రెండు దర్గా లలో నేను కలిసిన మహిళలకు ప్రార్థనలను, విందులను అందించే ఈ ఆచారం తప్పక పాటించవలసిన ఒక వాగ్దానం లాంటిది. “ఇది ఎంపిక కాదు. వఝా ఆస్తో, ఉతరావా లగ్తో (ఇది దించుకోవలసిన ఒక భారం).” ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే ఏదైనా ఘోరం జరగవచ్చని వారు భయపడుతున్నారు
ఇక్కడికి రావటం, వంటలు చేయడం, విందులు చేయటం, ఒకరితో ఒకరు పంచుకోవడం - ఇవన్నీ వారు హిందువులుగా తమ గుర్తింపును నిలుపుకుంటూనే చేస్తారు. ఈ పుణ్యక్షేత్రాలను కూడా తమ స్వంత పూజనీయమైన ప్రార్థనాస్థలాలుగానే వారు చూస్తారు.
“ఇది ( పీరు ) నా దేవత, నేను దానిని ఆరాధిస్తూనే ఉంటాను. మా తాత ఇదే చేశాడు, మా నాన్న ఇదే చేశాడు, నేనూ దీన్ని కొనసాగిస్తాను,” అంటూ గయాబాయి నిశ్చయత నిండిన అచంచలమైన విశ్వాసంతో చెప్పారు.
*****
అదే నెల (మే 2023) గయాబాయి, భాగా మావ్షీ , ఇంకా ఇతరులు దర్గాలను సందర్శిస్తూ తమ వాగ్దానాలను నెరవేరుస్తుండగా; అక్కడికి 500 కిలోమీటర్ల దూరంలో, త్రింబకేశ్వర్‌లో నివాసముండే సలీమ్ సయ్యద్ నాసిక్ జిల్లాలోని త్ర్యంబకేశ్వర్ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద గంధ-ధూపాన్ని అర్పించడానికి వెళ్ళారు. వందేళ్ళకు పైగా కొనసాగుతోన్న ఈ ఆచారాన్ని పాటించేందుకు అరవయ్యేళ్ళు పైబడిన సయ్యద్‌తో పాటు అనేక మంది జతకలిశారు.
వారు తమ సొంత 'త్రయంబక్ రాజా'పై అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నవారు, అందుకే ప్రతి వార్షిక ఉరుసు సందర్భంగా చాదర్ ను అందజేస్తారు.
కానీ సయ్యద్‌నూ, ఆయంతో పాటు వచ్చిన ఇతరులనూ ప్రవేశ ద్వారం వద్ద మొరటుగా అడ్డుకున్నారు, ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించారని ఆరోపించారు. ఒక మతోన్మాద హిందూ నాయకుడు ముస్లిములను 'వారి పూజలను వారి స్వంత ప్రార్థనా స్థలాలకు పరిమితం చేయమని' చెప్పాడు. అక్కడ పూజలు చేసే హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్టుగా వారిపై అభియోగాలు కూడా మోపారు. ఈ 'ఉగ్రవాద చర్య' గురించి విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటయింది.
అఘాతానికి గురైన సయ్యద్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు ఈ శతాబ్దాల నాటి ఆచారాన్ని నిలిపివేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విచారకరమైన విషయం ఏమిటంటే ఈ హామీని ఎవరూ గుర్తించకపోవటం!
అనువాదం: సుధామయి సత్తెనపల్లి