జాకిర్ హుస్సేన్, మహేశ్ కుమార్ చౌధరీలు చిన్ననాటి నుంచి స్నేహితులు. ప్రస్తుతం నలబయ్యవ వడిలో ఉన్న వాళ్ళిద్దరూ ఇప్పటికీ అంతే దగ్గర స్నేహితులు. ఆజనా గ్రామంలో నివసించే జాకిర్, పాకుర్‌లో భవననిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండగా మహేశ్ కూడా అదే పట్టణంలో ఒక చిన్న రెస్ట్రాంట్‌ను నడుపుతున్నారు.
"పాకుర్ [జిల్లా] చాలా ప్రశాంతంగా ఉండే ప్రదేశం; ఇక్కడి ప్రజల మధ్య మంచి సామరస్యం ఉంది," అన్నారు మహేశ్.
"హిమంత బిశ్వ శర్మ [అస్సామ్ ముఖ్యమంత్రి] వంటి బయటినుంచి వచ్చిన వ్యక్తులే తమ ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారు," తన స్నేహితుడి పక్కనే కూర్చుంటూ అన్నారు జాకిర్.
సంథాల్ పరగణా ప్రాంతంలో ఒక భాగమైన పాకుర్, ఝార్ఖండ్‌కు తూర్పువైపు మూలన ఉన్నది. ఇక్కడ 2024, నవంబర్ 20న మొత్తం 81 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకుముందు 2019లో జరిగిన ఎన్నికలలో, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎమ్ఎమ్) నాయకత్వంలోని కూటమి బిజెపిని మట్టికరిపించింది.
తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో, వోటర్లను ప్రలోభపెట్టేందుకు అస్సామ్ ముఖ్యమంత్రితో సహా ఇంకా కొంతమందిని బిజెపి ఇక్కడకు పంపించింది. ‘బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదార్లు’ అని ముస్లిమ్ వర్గాలపై ముద్ర వేసిన బిజెపి నేతలు, ప్రజల్లో వారిపట్ల ఆగ్రహాన్ని రెచ్చగొట్టారు.
"మా పక్కింట్లోనే హిందువులు నివసిస్తారు; వాళ్ళు మా ఇంటికి వస్తారు, నేను వాళ్ళింటికి వెళ్తాను," జాకీర్ కొనసాగించారు, "ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రమే హిందు-ముస్లిమ్ సమస్య ఎప్పుడూ ముందుకు వస్తుంది. లేకపోతే వాళ్ళెట్లా [బిజెపి] గెలుస్తారు?"
జంషెడ్‌పూర్‌లో 2024 సెప్టెంబరులో జరిగిన ర్యాలీలో, ప్రధాని నరేంద్ర మోదీ చొరబాటు సమస్యకు తన రాజకీయ ఊతాన్ని అద్దాడు. “సంథాల్ పరగణా [ప్రాంతం]లో ఆదివాసీ జనాభా వేగంగా తగ్గిపోతోంది. భూములను కబ్జా చేస్తున్నారు. చొరబాటుదారులు పంచాయతీలలో స్థానాలను ఆక్రమిస్తున్నారు," అని ఆయన ప్రజలనుద్దేశించి అన్నాడు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గృహ మంత్రి అమిత్ షాలు కూడా తమ ప్రసంగాలలో ఇదే మాట్లాడారు. "ఝార్ఖండ్‌లోకి బంగ్లాదేశీయుల చొరబాటును నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం, ఆదివాసీ తెగల హక్కులను కాపాడుతాం," అని బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది.












