“ ఎయ్ గాచ్, ఎయ్ ఘర్, ఎయ్ మాటిర్ జే మాయా, షెయ్ మాయా లియే అమ్రా కుథాయ్ జాబో? (ఈ చెట్టు... ఈ ఇల్లు... ఈ నేల మెత్తదనం... ఈ ప్రేమనంతా ఎక్కడికని తీసుకువెళ్తాం?)”
అపున్కురి హేంబ్రమ్కు విచారంగానూ కోపంగా కూడా ఉంది. "ఇదంతా నాది," కళ్ళు తిప్పి చుట్టుపక్కలంతా చూస్తూ అన్నారామె. "నాకు నా సొంత భూమి ఉంది," భూమి మీద ఒక చోటి నుండి మరో చోటుకు గుర్తులు చూపిస్తూ అన్నారు 40 ఏళ్ళ వయసున్న అపన్‌కురి. 5-6 బిఘాలు న్న (సుమారు ఒకటిన్నర ఎకరం) ఆమె పొలంలో వరి పండిస్తారు.
"ఇన్నేళ్ళుగా నేను కష్టపడి కట్టుకున్నదాన్నంతా ఈ ప్రభుత్వం తిరిగి ఇవ్వగలుగుతుందా?" పశ్చిమ బెంగాల్, బీర్భూమ్ జిల్లాలోని దేవ్చా పచామి (దీవ్చా పచ్మీ అని కూడా పలుకుతారు) రాష్ట్ర బొగ్గు గనుల ప్రాజెక్టు అపన్‌కురి స్వగ్రామమైన హరిణ్సింగాతో సహా 10 గ్రామాలను తుడిచిపెట్టబోతోంది.
"ఇదంతా వదిలేసి మేమెక్కడికి వెళ్ళాలి? మేం ఎక్కడికీ వెళ్ళేది లేదు," దృఢంగా చెప్పారు అపన్‌కురి. బొగ్గు గనికి వ్యతిరేకంగా ముందు నిలిచి పోరాడుతున్నవారిలో ఈమె కూడా ఒకరు. ఆమెవంటి మహిళలు సభలనూ ఊరేగింపులనూ నిర్వహిస్తూ కర్రలు, చీపుర్లు, కొడవళ్ళు, కటారులు (ఒక రకమైన కత్తి) వంటి వంటింటి, వ్యవసాయ పరికరాలనే ఆయుధాలుగా పోలీసుల, పాలక పార్టీల ఉమ్మడి బలాన్ని ఎదుర్కొంటున్నారు.
శీతాకాలపు మధ్యాహ్నపు సూర్యుడు హరిణ్‌సింగా గ్రామంపై తళతళా మెరుస్తున్నాడు. గ్రామం మొదట్లోనే ఇటుకలతో నిర్మించిన గదులూ, పలకల పైకప్పుతో ఉన్న తన పొరుగువారైన లబసా ఇంటి ప్రాంగణంలో నిల్చొని, అపన్‌కురి మాతో మాట్లాడుతున్నారు.
"మా భూమి కోసం వాళ్ళు మా ప్రాణాలనే తీయాల్సుంటుంది," మాటల్లోకి వస్తూ అన్నారు లబసా హెంబ్రమ్. గత రాత్రి వండిన మిగిలిపోయిన కూరగాయలను అన్నం, నీళ్ళతో కలిపి మధ్యాహ్న భోజనంగా తీసుకుంటూ ఆమె ఈ చర్చలో పాల్గొన్నారు. 40 ఏళ్ళ లబసా రాళ్ళను పగలగొట్టే క్రషర్లో పనిచేస్తున్నారు. క్రషర్లో రోజువారీ వేతనం రూ. 200 నుండి 500 వరకూ ఉంటుంది.
హరిణ్‌సింగా గ్రామ జనాభాలో ఎక్కువమంది ఆదివాసులు. ఇంకా అక్కడ దళిత హిందువులు, చాలా ఏళ్ళ క్రితమే ఒడిశా నుండి వచ్చిన అగ్రకులాలకు చెందిన వలస కూలీలు కూడా ఉన్నారు.
అపన్‌కురి, లబసా తదితరులకు చెందిన భూమి భారీ దేవ్చా-పచామి-దీవాన్‌గంజ్-హరిణ్‌సింగా బొగ్గు గనుల సముదాయానికి ఎగువన ఉంది. పశ్చిమ బెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, త్వరలోనే ప్రారంభం కానున్న ఈ ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఆసియాలోనే అతిపెద్దది, ప్రపంచంలో రెండవ అతిపెద్దది. ఇది 12.31 చదరపు కిలోమీటర్లు లేదా 3,400 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉందని జిల్లా యంత్రాంగం తెలిపింది.
ఈ మైనింగ్ ప్రాజెక్ట్, బీర్భూమ్ జిల్లా, మొహమ్మద్ బజార్ బ్లాక్‌లోని హాట్గచ్చా. మక్దూమ్నగర్, బహదూర్గంజా, హరిణ్‌సింగా, చాందా, సలుకా, దీవాన్‌గంజ్, అలీనగర్, కబిల్నగర్, నిశ్చింతాపుర్ మౌసాల భూమిని మింగివేస్తుంది.
ఈ మహిళలంతా దేవ్చా పచామి మైనింగ్ వ్యతిరేక ప్రజా ఉద్యమంలో భాగం. "ఈసారి మేమంతా (గ్రామమంతా) ఐక్యంగా ఉన్నాం," అన్నారు లబసా. "ఈ భూమి ఎవరో బయటి నుంచి వచ్చినవాళ్ళకు పోవటానికి వీల్లేదు. మేం మా గుండెను ఎదురొడ్డి దీన్ని రక్షించుకొంటాం."
ఈ ప్రాజెక్ట్ వీరిలాంటి వేలాదిమంది నివాసితులను ఆశ్రయంలేనివారిగా, భూమిలేనివారిగా చేస్తుంది. అంతే తప్ప అధికారులు చెప్పుకుంటున్నట్లుగా, “పశ్చిమ బెంగాల్‌ను రాబోయే 100 సంవత్సరాల పాటు అభివృద్ధి ‘కాంతి’లో స్నానం చేయించదు."
ఈ ‘వెలుగు’ కింద దట్టమైన చీకట్లు కమ్ముకుంటున్నాయి. అది బహుశా బొగ్గు వంటి ఘనీభవించిన చీకటి. ఈ ప్రాజెక్టు పర్యావరణంపై తీవ్ర వినాశకర ప్రభావాన్ని చూపనుంది.
గనిని నిరసిస్తూ డిసెంబర్ 2021లో ప్రచురించిన ఒక ప్రకటనలో, పర్యావరణవేత్తలు, పర్యావరణ కార్యకర్తలతో సహా పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖులు ఈ ఆందోళనను లేవనెత్తారు. “ఓపెన్-పిట్ బొగ్గు గనులలో, మిలియన్ల సంవత్సరాలుగా సృష్టించబడిన పై పొరలలోని మట్టి శాశ్వతంగా పనికిరాకుండాపోయి, వ్యర్థాల దిబ్బలుగా మారుతుంది. కొండచరియలు విరిగిపడడమే కాకుండా భూ, జల జీవావరణ వ్యవస్థలు భారీ నష్టాన్ని చవిచూస్తాయి. వర్షాకాలంలో ఆ చెత్తకుప్పలు కొట్టుకుపోయి ఆ ప్రాంతంలోని నదుల గర్భంలో పేరుకుపోవడంతో అనుకోని వరదలు వస్తున్నాయి. […] ఈ ప్రాంతంలోని భూగర్భజలాల ప్రవాహానికి అంతరాయం కలిగించడమే కాకుండా, వ్యవసాయ-అటవీ ఉత్పత్తిని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది; మొత్తం ప్రాంతంలోని పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుంది." అని ఈ ప్రకటన పేర్కొంది.
నిరసన తెలుపుతున్న మహిళలు కూడా ధంసా, మాదల్ లపైనే ఆధారపడుతున్నారు. ధంసా, మాదల్ లు కేవలం సంగీత వాయిద్యాలే కాదు, ఆదివాసీ సమాజ పోరాటాలతో ఇవి అంతర్గతంగా ముడిపడి ఉన్నాయి. వారి జీవితం, ప్రతిఘటనల చిహ్నాలైన ఈ దరువు (బీట్)తో వారి నినాదపు స్వరం - “ అబువా దిసొమ్, అబువా రాజ్ (మా భూమి, మా పాలన)” - మిళితమైపోతుంది.
మహిళలకు, పోరాడుతున్న ఇతరులకు సంఘీభావంగా నేను దేవ్చా పచామిని సందర్శించి ఈ చిత్రాలను రూపొందించాను. అందరికీ ఇళ్ళు, పునరావాస కాలనీలో మెటల్ రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, ఆరోగ్య కేంద్రం, పాఠశాల, రవాణా సౌకర్యాలు, ఇంకా మరెన్నింటినో కల్పిస్తామని ప్రభుత్వం చేసిన వాగ్దానాల గురించి నేను వారి మాటల ద్వారా విన్నాను.
స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రాథమిక హక్కులు కావాల్సినవి ఇప్పుడు బేరసారాలకు సాధనంగా మారడమే విడ్డూరం.
తమ భూమిని వదులుకోకూడదని నిశ్చయించుకున్న ప్రజలు బీర్భూమ్ జమీన్-జీబొన్-జీబికా-ప్రకృతి బచావో (భూమి, జీవితం, జీవనోపాధి, ప్రకృతిలను రక్షించండి) మహాసభ గొడుగు కింద సమైక్యమయ్యారు. భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలతో నిలబడటానికి పట్టణ ప్రాంతాల నుండి అనేకమంది వ్యక్తులే కాకుండా సిపిఐ (ఎల్), జై కిసాన్ ఆందోళన్, మానవ హక్కుల సంస్థ ఎకుషేర్ డాక్ వంటి సంస్థలు కూడా దేవ్చాను సందర్శిస్తున్నారు.
"వెళ్లి ఈ బొమ్మని మీ ప్రభుత్వానికి చూపించండి," అని హరిణ్‌సింగా నివాసి సుశీల రౌత్, చిరిగిన టార్పాలిన్ పట్టాలతో ఏర్పాటుచేసుకున్న తన తాత్కాలిక మరుగుదొడ్డి వైపు చూపిస్తూ చెప్పారు
ఇక్కడి నుండి ఒక గంట నడక దూరంలో దీవాన్‌గంజ్ గ్రామం ఉంది, అక్కడ మేం 8వ తరగతి చదువుతున్న హుస్నహారాను కలిశాం. “ఇన్ని రోజులుగా ప్రభుత్వం మా గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మా ఇళ్ళ కింద చాలా బొగ్గు ఉందని అంటున్నారు. వీటన్నింటిని వదిలి మేం ఎక్కడికి వెళ్తాం?" అని ఈ దేవ్చా గౌరాంగిని హైస్కూల్ విద్యార్థిని అడుగుతోంది.
ఆమె బడికి వెళ్ళి, తిరిగి రావడానికి మొత్తం మూడు గంటల సమయం పడుతుంది. తమ గ్రామంలో ఒక్క ఉన్నత పాఠశాలను నిర్మించడాన్ని అటుంచి, ఒక్క ప్రాథమిక పాఠశాలను నిర్మించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆమె ఎత్తిచూపింది. "నేను బడికి వెళ్ళినప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది, కానీ నేను చదువును విడిచిపెట్టలేను," అని ఆమె చెప్పింది. లాక్డౌన్ సమయంలో ఆమె స్నేహితులు చాలామంది బడి మానేశారు. "ఇప్పుడు వీధుల్లో బయటి వ్యక్తులు, పోలీసులు తిరుగుతుండటంతో నా కుటుంబ సభ్యులు భయపడుతున్నారు, నేను బడికి వెళ్ళలేకపోతున్నాను."
హుస్నహారా అమ్మమ్మ లాల్‌బాను బీబీ, ఆమె తల్లి మినా బీబీ తమ పెరట్లో అంతుమా బీబీతోనూ, ఇంకా ఇరుగుపొరుగు స్త్రీలతోనూ కలిసి బియ్యాన్ని దంచుతున్నారు. చలికాలాలలో గ్రామంలోని మహిళలు ఈ బియ్యాన్ని పిండికొట్టి అమ్ముతుంటారు.“మా దీవాన్గంజ్లో మంచి రోడ్లు గానీ, బడి గానీ, ఆసుపత్రి గానీ లేవు. ఎవరైనా అనారోగ్యం పాలైతే, మేం దేవ్చాకు పరుగెత్తాలి. గర్భిణీలకు ఇక్కడ ఎంత కష్టమో మీకేమైనా తెలుసా? ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడుతోంది. ఏం అభివృద్ధి?" అంతుమా బీబీ అన్నారు.
దీవాన్‌గంజ్ నుండి దేవ్చా ఆసుపత్రికి చేరుకోవడానికి ఒక గంట సమయం పడుతుందని అంతుమా బీబీ మాకు చెప్పారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పచామిలో ఉంది. లేదంటే మహమ్మద్ బజార్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి. ఆ ఆసుపత్రికి చేరుకోవడానికి కూడా గంట సమయం పడుతుంది. సమస్య తీవ్రమైతే సివురిలోని ఆసుపత్రికి వెళ్లాల్సిందే.
ఈ మహిళల భర్తలందరూ రాతి క్వారీలలో పనిచేస్తూ రోజుకు సుమారు రూ. 500 నుండి 600 వరకూ సంపాదిస్తారు. ఈ ఆదాయంతోనే కుటుంబం జీవిస్తుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, గనిని తవ్వే ప్రాంతంలో నివాసముండే సుమారు 3,000 మంది క్వారీ, క్రషర్ కార్మికులకు వారి భూమిని కోల్పోయినందుకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
తాము గ్రామాన్ని ఖాళీ చేయాల్సివస్తే రాళ్ళు కొట్టే పని వంటి ఆదాయ వనరు కూడా నిలిచిపోతుందని ఆ గ్రామ మహిళలు ఆవేదన చెందుతున్నారు.ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ఇస్తున్న హామీపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు చాలామంది ఉన్నారు.
ధాన్యాన్ని ఆరబెడుతోన్న తాంజిలా బీబీ చేతిలో అక్కడికి తొంగి చూసే మేకలను తరిమికొట్టడానికి ఒక కర్ర ఉంది. మమ్మల్ని చూడగానే చేతిలో ఉన్న కర్రతో ఆమె మా వైపు పరుగెత్తుకుంటూ వచ్చారు. “మీరు ఒకటి వింటారు, మరొకటి రాస్తారు. మాతో ఇలాంటి ఆటలాడటానికి ఎందుకొచ్చారు? మీతో ఒకటే చెప్తున్నాను, నేను నా ఇంటిని వదిలి వెళ్ళను. ఇక ఇదే నా చివరి మాట. మా జీవితాలను నరకం చేయడానికి వాళ్ళు పోలీసులను పంపుతున్నారు. ఇప్పుడేమో రోజూ జర్నలిస్టులను పంపుతున్నారు," అంటూ తన గొంతు పెంచి, "మేం చెప్పేది ఒక్కటే, మా భూమిని వదులుకునేది లేదు." అని చెప్పారు.
2021 నుండి 2022 వరకు, నా పర్యటనలో నేను కలుసుకున్న అనేకమంది మహిళలు భూమి హక్కుల కోసం జరుగుతోన్న పోరాటంలో పాల్గొంటున్నారు. అప్పటి నుండి ఉద్యమం దాని ఊపును చాలావరకు కోల్పోయినా, ఈ ప్రతిఘటనా స్వరాలు మాత్రం బలంగానే ఉన్నాయి. ఈ మహిళలు, బాలికలు అణచివేతకూ దోపిడీకీ వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. న్యాయం కోసం వారు చేసే గర్జన జల్ జంగల్ జమీన్ (నీరు, అడవి, భూమి) కోసం ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుంటుంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి