"ఇక్కడివారిని పెళ్ళి చేసుకున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను."
కొత్త పెళ్ళికూతురిగా తన అనుభవాన్ని 29 ఏళ్ళ రోజీ ఇక్కడ పంచుకుంటున్నారు. ఇలా అనుకోవటంలో ఆమె ఒంటరిదేమీ కాదు. ఇక్కడ నివాసముండేవారిని పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలెవరూ ఇష్టపడటంలేదని శ్రీనగర్‌లోని డల్ సరస్సు ప్రాంతవాసులు చెప్పారు. "మేం ఇప్పటికే మూడుసార్లు తిరస్కరణను ఎదుర్కొన్నాం," తన చిన్న కొడుకుకు వధువు కోసం వెదుకుతోన్న గుల్షన్ నాజిర్ చెప్పారు. "చివరకు పెళ్ళి సంబంధాలు కుదిర్చేవారు కూడా ఇక్కడకు రావటం మానేశారు."
ఈ విడ్డూరానికి కారణం ఏమంటే, రాష్ట్రంలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకదానిపై ఆధారపడి జీవించే ఇక్కడి నివాసితులు ఎదుర్కొంటోన్న తీవ్రమైన నీటి కొరత, అని బరూ మొహల్లాకు చెందిన ఈ తల్లి చెప్పారు.
"తొమ్మిదేళ్ళ క్రితం వరకూ మేం మా పడవలను వేసుకొచ్చి డల్ సరస్సులోని వివిధ ప్రాంతాల నుండి నీటిని తీసుకువెళ్ళేవాళ్ళం," అని వడ్రంగిగా పనిచేసే ముస్తాక్ అహ్మద్ చెప్పారు. "అప్పట్లో నీటి ట్యాంకర్లు లేవు."
కానీ గత దశాబ్ద కాలానికి పైగా ముస్తాక్, రాష్ట్ర ప్రభుత్వ నీటి ట్యాంకుల రాక కోసం ఎదురుచూస్తూ ఠంచనుగా 9 గంటలకల్లా రహదారి పైకి వచ్చి నిలబడుతున్నారు. గుడూ మొహల్లాలో నివాసముండే పదిమంది సభ్యులు గల అతని కుటుంబం అతనిపైనే ఆధారపడివుంది. పరిస్థితులను సరళతరం చేసేందుకు ఆయన రూ. 20,000-25,000 ఖర్చు చేసి నీరు నిలవచేసే ట్యాంకులను కొని, పైపులైన్‌ను ఏర్పాటుచేసుకున్నారు. "ఈ ఏర్పాటంతా విద్యుత్ ఉన్నప్పుడే పనిచేస్తుంది. కశ్మీర్లో చలికాలాల్లో విద్యుత్ ఉండటం అనేది పెద్ద సమస్య," అన్నారతను. ఈ నెలలో (మార్చి), ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏదో లోపం వలన వాళ్ళు బక్కెట్లతో నీళ్ళు మోసుకుపోవలసివచ్చింది.
ముర్షిదాబాద్‌లోని బెగూన్‌బారీ గ్రామ పంచాయతీలోని హిజులీ పల్లె నివాసితులు కూడా నీటి ట్యాంకర్ల నుండి నీటిని సేకరిస్తారు. అయితే ఇక్కడ పశ్చిమ బెంగాల్‌లోని ఈ పల్లెలోని వారికి ప్రయివేటువాళ్ళు 20 లీటర్ల నీటిని రూ.10కి సరఫరా చేస్తున్నారు.
"మాకు ఇంకో అవకాశం లేదు. ఇదుగో చూడండి, ఈ నీళ్ళనే మేం కొనుక్కుంటాం. ఎప్పుడైనా కొనుక్కోకపోతే, అప్పుడు తాగటానికి ఏమీ ఉండవు," అంటారు లాల్‌బాను బీబీ.
కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ (జెజెఎమ్) ద్వారా ప్రయోజనం పొందనివారిలో రోజీ, ముస్తాక్, లాల్‌బాను కూడా ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. గ్రామీణ కుటుంబాలలో 75 శాతం (19 కోట్లు) కుటుంబాలకు సురక్షితమైన తాగు నీరు అందుబాటులో ఉందని జెజెఎమ్ వెబ్‌సైట్ చెపుతోంది. 2019లో 3.5 లక్షల కోట్ల వ్యయం, ఐదేళ్ళలో మూడు రెట్లు కుళాయిలు వేయటానికి దారితీసిందని, కాబట్టి నేడు 46 శాతం గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయని కూడా ఈ వెబ్‌సైట్ చెబుతోంది.
నిజానికి బిహార్ రాష్ట్ర ప్రభుత్వ సాత్ నిశ్చయ్ పథకం కింద 2017-18లో బిహార్‌లోని అక్బర్‌పూర్‌లోని చింతా దేవి, సుశీలా దేవిల గ్రామంలో కుళాయిలు ఏర్పాటయ్యాయి. “ నల్ [కుళాయి]ను ఆరేడు సంవత్సరాల క్రితమే బిగించారు. అలాగే ఒక ట్యాంక్ కూడా. కానీ ఇప్పటి వరకు ఈ కుళాయిల నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాలేదు," చింతాదేవి చెప్పారు.
ఇందుకు చింతా, సుశీలలిద్దరూ దళితులు కావటమే కారణం. ఇక్కడున్న 40 దళిత కుటుంబాలకు ఎప్పుడూ నీటి కనెక్షన్లు లేవు, అదేసమయంలో అగ్ర కులాలకు చెందిన కుటుంబాలకు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు రాని కుళాయి అంటే కులానికి ఒక గుర్తింపు.
వారు నివసిస్తోన్న అక్బర్‌పుర్‌లోని దళిత కాలనీలో ఎక్కువగా ముసహర్, చమార్ (రాష్ట్రంలో వరుసగా అత్యంత వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాలుగా జాబితా చేయబడినవి) సముదాయాలకు సేవలందించేందుకు ఒకే ఒక్క చేతి పంపు ఉంది.
ఆ చేతిపంపు చెడిపోయినప్పుడు, చాలా తరచుగా జరుగుతూనే ఉంటుంది, "మాలో మేమంతా డబ్బులు వేసుకొని దాన్ని మరమ్మత్తు చేయించుకుంటాం," నలందా జిల్లాలోని ఈ కాలనీలో నివాసముంటోన్న 60 ఏళ్ళ చింతా అంటారు. ఇదిగాకుండా ఉన్న మరో అవకాశం, అగ్రకుల యాదవులను అడగటం. కానీ వాళ్ళెప్పుడూ ఇవ్వటానికి ఒప్పుకోరని చెప్పారామె.
భారతదేశంలో దాదాపు సగం (48.4 శాతం) దళిత గ్రామాలకు నీటి వనరులు అందుబాటులో లేవనీ, వారిలో 20 శాతం కంటే ఎక్కువమందికి సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో లేదని దళితుల మానవ హక్కులపై జాతీయ ఉద్యమం (NCDHR) అధ్యయనం చెప్తోంది.
మహారాష్ట్ర, పాలఘర్‌లోని కె ఠాకూర్ ఆదివాసీ రాకూ నడగే చెప్పినట్టు, ఆదివాసీలది కూడా ఇదే పరిస్థితి. ఆమె గ్రామం, గొండే ఖుర్ద్‌కు "ట్యాంకర్లు ఎప్పుడూ రావు," అని ఆమె చెప్పారు. కాబట్టి 1,137 మందికి నీటి సౌకర్యాన్ని అందించే స్థానిక బావి వేసవికాలంలో ఎండిపోయినప్పుడు, “మేం రెండు కలశీల ను [నీటిని మోసుకుపోయే కుండలు] ఒకటి తలపై, మరొకటి చేతుల్లో మోసుకుని అడవిలో నడవాలి. రోడ్లు లేవు."
తన కుటుంబ అవసరాలకు సరిపడా నీటిని తీసుకురావడానికి రాకూ మూడుసార్లు అటూ ఇటూ - తొమ్మిది గంటల పాటు దాదాపు 30 కిలోమీటర్ల దూరం నడక- తిరగాల్సివస్తుంది.
*****
కాక్రంబా గ్రామానికి చెందిన శివమూర్తి సాఠే తన 6 దశాబ్దాల జీవితంలో ఐదు కరవులు చూశారు.
మహారాష్ట్రలోని తుల్జాపూర్ ప్రాంతంలో గత రెండు దశాబ్దాలలో ఒకప్పుడు సారవంతమైన భూములు ఇప్పుడు బంజరుగా మారాయని ఈ రైతు చెప్పారు; ఒక్క గడ్డి పరక కూడా పెరగడంలేదు. ట్రాక్టర్లను ఉపయోగించటమే ఇందుకు కారణమని ఆయన నిందిస్తున్నారు: “ ఔత్ [నాగలి], ఎద్దుల సాయంతో భూమిలోని గడ్డి వాసన్ [సహజమైన అడ్డుకట్టలను]ను సృష్టించింది. దీనివలన నీరు నెమ్మదిగా ప్రవహిస్తుంది. ట్రాక్టర్లు మట్టిని విచ్చుకునేలా చేయటంతో నీరు నేరుగా ఒక చివర నుండి మరొక చివరకి పారుతుంది.”
తనకు తొమ్మిదేళ్ల వయస్సున్నప్పుడు, 1972లో "మొదటిసారి అత్యంత ఘోరమైన కరవును చూశాను. నీరు ఉంది, కానీ ఆహారం మాత్రం లేదు. ఆ తర్వాత పరిస్థితులు ఎన్నడూ సాధారణ స్థితికి రాలేదు,” అని ఆయన గుర్తుచేసుకున్నారు. సాఠే కాకా తుల్జాపూర్ పట్టణంలోని ఆదివారం మార్కెట్‌లో కూరగాయలు , చికూ (సపోటా)లను విక్రయిస్తుంటారు. అతను 2014లో కరవు కారణంగా తన ఒక ఎకరం మామిడి తోటను నష్టపోయారు. “మేం భూగర్భ జలాలను అతిగా ఉపయోగించాం, అన్ని రకాల విష రసాయనాలను ఉపయోగించి మా భూములను సారహీనంగా మార్చాం."
ఇప్పుడు మార్చి నెల. "రుతుపవనాల రాకకు ముందే మే నెలలో కొన్ని వర్షాలు పడతాయని ఆశిస్తున్నాం, లేదంటే ఈ ఏడాది చాలా గడ్డుగా ఉండబోతోంది," అన్నారతను. తాగునీరు ఒక సంక్షోభం. "మేం వెయ్యి లీటర్ల నీటికి రూ. 300 చెల్లిస్తున్నాం. మా మనుషులకే కాదు, పశువులకు కూడా నీరు అవసరమే కదా."
పశువుల మరణానికి దారితీసే పశుగ్రాసం కొరత వలన రాబోయే పంటకాలంలో ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవడం సాగుదారులకు మరింత కష్టమవుతుందని స్వామినాథన్ కమిషన్ మొదటి నివేదిక పేర్కొంది. "ఈ విధంగా కరువు అనేది తాత్కాలిక ఉత్పాతంగా మిగిలిపోదు, కానీ అది శాశ్వతంగా అశక్తతను కలిగిస్తుంది," అని నివేదిక చెబుతోంది.
ధారాశివ్ (గతంలో ఉస్మానాబాద్) జిల్లాలోని తుల్జాపూర్ బ్లాక్‌లో 2023, జూన్ నుండి సెప్టెంబరు వరకు సాధారణంగా కురిసే 653 మి.మీ వార్షిక వర్షపాతానికి బదులుగా 570.3 మి.మీ వర్షపాతం నమోదైంది. సగానికి పైగా వర్షపాతం జూలైలో కేవలం 16 రోజుల్లోనే పడింది. జూన్, ఆగస్టు, అక్టోబరులలో 3-4 వారాల పాటు కొనసాగిన పొడి వాతావరణం వలన భూమి అవసరమైన తేమను కోల్పోయింది; నీటి వనరులు తిరిగి నిండలేదు.
దాంతో కక్రాంబా రైతులు ఇబ్బందులు పడుతున్నారు: “మాకు అవసరమైనదానిలో [ఇప్పుడు] కేవలం 5-10 శాతం మాత్రమే పొందుతున్నాం. గ్రామం అంతటా మీరు కుండలు, హండాల పొడవైన బారులను చూస్తారు,” అని ఆయన ఈ PARI రిపోర్టర్‌ని హెచ్చరించారు.
ఇదంతా [కరువు లాంటి పరిస్థితి] మానవ నిర్మితం," అని సాఠే కాకా చెప్పారు.
ఆర్సెనిక్‌తో భూగర్భ జలాలు కలుషితమయ్యే ముర్షిదాబాద్ జిల్లాలో కూడా ఇటువంటి సంక్షోభమే ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని విశాలమైన గంగా మైదానాలలో భాగీరథి నది ఒడ్డున ఉండే ఒకప్పటి తియ్యని మంచినీటి గొట్టపు బావులు ఇప్పుడు వేగంగా ఎండిపోతున్నాయి.
బెగూన్‌బారీ గ్రామ పంచాయతీకి కుళాయి నీరు లేకపోవడంతో ప్రజలు గొట్టపు బావులపై ఆధారపడతారు (జనాభా: 10,983, జనగణన 2011). "మేం గొట్టపు బావులను ఉపయోగిస్తాం, కానీ ఇప్పుడు [2023] అవన్నీ ఎండిపోయాయి," అని రోషనారా బీబీ చెప్పారు. “ఇక్కడ బేల్‌డాంగా Iవ బ్లాక్‌లో నీటి వనరుల్లాగా. చెరువులు కూడా వేగంగా ఎండిపోతున్నాయి." వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలను బయటకు తీయడానికి లోతు తక్కువ పంపులను హద్దుమీరి ఉపయోగించటం వలన ఇలా జరుగుతోందని ఆమె చెప్పారు.
భారతదేశంలో వ్యవసాయ, గృహ వినియోగాలకు భూగర్భజలం ప్రధాన వనరుగా ఉంది. ఇది గ్రామీణ నీటి సరఫరాకు 85 శాతం దోహదపడుతుందని ఈ 2017 నివేదిక పేర్కొంది.
వరుసగా రుతుపవనాల సమయంలో వర్షపాతం తక్కువగా పడటం, ఇక్కడ భూగర్భజలాల అధిక వినియోగానికి కారణమని జహనారా బీబీ వివరించారు. హిజులీ పల్లెలో నివాసముండే 45 ఏళ్ళ ఈమె, జనపనారను సాగుచేసే కుటుంబంలోని వ్యక్తిని వివాహం చేసుకున్నారు. “నానబెట్టే ప్రక్రియకు తగినంత నీరు ఉంటేనే ఈ పంటను కోయాల్సివుంటుంది. ఒకసారి కోసిన తర్వాత, జనపనార నిలవ ఉండదు, పాడైపోతుంది." ఆగస్ట్ 2023 చివరిలో కూడా బేల్‌డాంగా 1వ బ్లాక్‌లోని పొలాల్లో కోతకు వచ్చిన జనపనార పంట నీరు లేకపోవటంతో కోయకుండా అలానే మిగిలి ఉండటం, రుతుపవన వర్షాల తీవ్ర లోటుకు రుజువు.
అయితే, ఆర్సెనిక్ కాలుష్యం కారణంగా ఈ ప్రాంతాల్లోని గొట్టపు బావులను విశ్వసించాల్సిన అవసరం లేదని నివాసితులు PARIకి చెప్పారు. చర్మసంబంధమైన, నాడీ సంబంధిత, ప్రసూతి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే భూగర్భ జలాలలో ఆర్సెనిక్ విషయానికి వస్తే, అత్యంత ప్రభావితమైన జిల్లాలలో ముర్షిదాబాద్ ఒకటి.
కానీ ఆర్సెనిక్ కాలుష్యం గురించి పెరుగుతున్న అవగాహన వలన అది ఆగిపోయింది. వారిప్పుడు పూర్తిగా ప్రైవేట్ వాటర్ డీలర్లపై ఆధారపడుతున్నారు. అయితే, ఈ డీలర్ల నుంచి వారు కొనుగోలు చేస్తున్న నీరు సురక్షితమైనదో కాదో ఎవరికీ తెలియదు.
బెగూన్‌బారీ ఉన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న హిజులీ నివాసి రజ్జూ వంటి కొంతమంది పిల్లలు ఈ వాటర్ ట్యాంకర్ల వలన బడి మానేసి ఇంట్లో ఉండాల్సి వస్తోంది. చేతిపంపు దగ్గర నుంచి, వాటర్ ట్యాంకర్ నుండి ఇంటికి నీటిని తీసుకువెళ్ళడంలో రజ్జూ సహాయం చేస్తాడు. ఈ విలేఖరిని సూటిగా చూస్తూ, "ఇంట్లో చదువుకోవడం కంటే ఇదే మంచిది," అంటూ కన్ను గీటాడు రజ్జూ.
ఈ ప్రాంతంలో సంతోషంగా నీళ్ళు పట్టడంలో సాయం చేసేవాడు ఇతనొక్కడే కాదు. హిజులీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కాజీసాహాలో, (జనాభా 13,489, జనగణన 2011) కొంతమంది ఉత్సాహవంతులైన అబ్బాయిలు నీటి వ్యాపారుల మార్గనిర్దేశంలో తమ కుండలను, పాత్రలను నీటితో నింపడంలో పెద్దలకు సహాయం చేస్తున్నారు. "మేం వ్యాన్ వెనుక కూర్చొని ఊరంతా తిరుగుతూ ఉంటాం." కాబట్టి తాము దీనిని ఇష్టపడతామని ఆ అబ్బాయిలు చెప్పారు.
ముర్షిదాబాద్‌లో ఆర్సెనిక్, మహారాష్ట్రలోని పాలఘర్‌లో అతిసారం - వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ అదే సమస్య - క్షీణించిన నీటి నిల్వలు.
తన గోండే ఖుర్ద్ గ్రామంలోని బావిలో నీటి మట్టం వేగంగా పడిపోతోందని, 227 కుటుంబాలు ఈ ఒక్క బావిపైనే ఆధారపడతాయని రాకూ నడగే అన్నారు. "ఇది మాకు దగ్గరలో ఉన్న ఏకైక నీటి వనరు," అని ఆమె చెప్పారు. మొఖాడా తాలూకా లోని ఈ గ్రామంలో ఎక్కువమంది కె ఠాకూర్ తెగకు చెందినవారు.
రెండు సంవత్సరాల క్రితం, బహుశా వారు తాగడానికి ఉపయోగించిన నీటి వల్లనే కావచ్చు, ఆమె కుమారుడు దీపక్ అతిసారంతో బాధపడ్డాడు. 2018లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం పాలఘర్ జిల్లాలోని తొమ్మిది గ్రామాలకు చెందిన పిల్లలలో అతిసారం 33.4 శాతంగా ఉంది. తన కొడుకు అనారోగ్యంతో బాధపడినప్పటి నుండి రాకూ ప్రతిరోజూ వేడినీటినే తాగుతున్నారు.
కానీ నీటిని మరిగించడానికి ముందు రాకూ ఆ నీటిని తీసుకురావాలి. వేసవికాలంలో, బావిలోని నీరు ఎండిపోయినప్పుడు, గ్రామంలోని మహిళలు అక్కడికి దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న వాఘ్ నదికి వెళతారు. అక్కడికి వెళ్ళేందుకు వారికి మూడు గంటల సమయం పడుతుంది. ఆ విధంగా రోజుకు రెండు నుండి మూడు సార్లు వాళ్ళు - పొద్దున్నే కానీ, లేదా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గివుండే సాయంత్రం వేళ గానీ - ఆ ప్రయాణం చేస్తారు.
భారత ఉపఖండం అంతటా, నీటికి సంబంధించిన ఇంటి పనుల భారం అన్యాయంగా మహిళలపైనే పడిపోతుంది. ఒక UNICEF నివేదిక ప్రకారం, "54 శాతం మంది గ్రామీణ మహిళలు - అలాగే కొంతమంది యుక్తవయస్సులో ఉన్న బాలికలు కూడా - ప్రతిరోజూ 35 నిమిషాల సమయాన్ని నీరు తీసుకురావడానికి వెచ్చిస్తున్నారు." ఇది ఒక సంవత్సరంలో 27 రోజుల వేతనాన్ని కోల్పోవడానికి సమానం అని ఇదే నివేదిక తెలియజేస్తోంది.
“పురుషులు పని చేయడానికి [బయటికి] వెళ్ళాలి కాబట్టి వంట చేయడానికి మేం నీరు తీసుకురావాలి. ఉదయాన్నే చేతి పంపు దగ్గర చాలా రద్దీగా ఉంటుంది,” అని చింతా దేవి చెప్పారు. "మధ్యాహ్నం వేళ మాకు స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి, ఇంకా సాయంత్రం వంట చేయడానికి కూడా నీరు కావాలి," అని ఆమె అన్నారు.
ఈ దళిత కాలనీలో ఉన్న ఏకైక నీటి వనరు చాంపాకల్ (చేతి పంపు) వద్ద నీటి కోసం జనం బారులుతీరి నిలబడి ఉన్నారు. “ఇంత పెద్ద తోలా [సెటిల్‌మెంట్]లో ఒకే ఒక చేతి పంపు ఉంది. మేం టోక్నా-బాల్టీ [పాత్రలు]లను మోస్తూ నిలబడతాం," అని సుశీలా దేవి చెప్పారు.
ఎండాకాలంలో చేతిపంపు ఎండిపోవడంతో మహిళలు పొలాలకు వెళ్ళి పంటలకు సాగునీరు అందించే పంపుల దగ్గర నుంచి నీటిని తెస్తారు. "ఇది కొన్నిసార్లు ఒక కిలోమీటరు దూరంలో ఉంటుంది. నీటిని తీసుకురావడానికి చాలా సమయం వృధా అవుతుంది,” అని 45 ఏళ్ల సుశీలా దేవి చెప్పారు
" గర్మీ బడ్తా హై తో హమ్ లోగోఁ కో ప్యాసే మర్‌నే కా నౌబత్ ఆ జాతా హై (వేసవి కాలంలో ఉష్ణోగ్రత పెరిగిపోయినప్పుడు, మేం దాహంతో చచ్చిపోతుంటాం)." సాయంత్రం భోజనం తయారుచేసేందుకు ఉపక్రమిస్తూ కోపంగా చెప్పారామె.
కశ్మీర్ నుంచి ముజామిల్ భట్ , పశ్చిమ బెంగాల్ నుంచి స్మితా ఖటోర్, బిహార్ నుంచి ఉమేశ్ కె రే, మహారాష్ట్ర నుంచి మేధా కాళే, జ్యోతి శినోలి , ఛత్తీస్‌గఢ్ నుంచి పురుషోత్తమ్ ఠాకూర్ నివేదించిన PARI విభిన్న ప్రదేశాలకు చెందిన కథనం ఇది. PARIలో కొనసాగుతోన్న విసుర్రాయి పాటల ప్రాజెక్ట్, సాంగ్స్ ఆఫ్ ది రణ్ ప్రాజెక్ట్‌ల నుండి ఈ పాటలను అందించారు: కచ్ఛి జానపద పాటలు, వరుసగా నమితా వైకర్, ప్రతిష్ఠా పాండ్య లు నిర్వహించారు. సన్వితి అయ్యర్ గ్రాఫిక్స్‌ను రూపొందించారు.
ముఖచిత్రం: పురుషోత్తం ఠాకూర్
అనువాదం: సుధామయి సత్తెనపల్లి