"నా విద్యార్థుల పట్ల ఎలాంటి షరతులు లేని ప్రేమ, వారిని సంపూర్ణంగా స్వీకరించడం. ఇవే నేనొక అధ్యాపకురాలిగా నేర్చుకున్నది!"
మేధా తెంగ్షె మృదువుగా, కానీ చాలా దృఢంగా తన అభిప్రాయాన్ని చెప్పారు. ప్రత్యేక అధ్యాపకురాలైన ఈమె, సాధన గ్రామం వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఇక్కడ వయసు రీత్యా, మేధో సామర్థ్యం రీత్యా వివిధ స్థాయిలలో ఉండే 30 మందికి కళ, సంగీతం, నాట్యంతో సహా ప్రాథమిక జీవన నైపుణ్యాలను నేర్పిస్తుంటారు.
సాధన గ్రామం పుణే జిల్లాలోని ముల్షి బ్లాక్‌లో ఉంది. ఇది మేధోపరమైన వైకల్యాలున్న ఎదిగిన వయసు వ్యక్తులు నివాసముండే ఒక సంస్థ. ఇక్కడి విద్యార్థులను 'ప్రత్యేక మిత్రులు' గా వ్యవహరిస్తారు. శిక్షణ పొందిన జర్నలిస్టు అయిన మేధా తాయి , ఇక్కడ నివాసముండే పదిమందికి తనను తాను గృహ మాత గా, తాను నిర్వహిస్తోన్న పాత్రను "ఒక తల్లిగా, బోధకురాలిగా" నిర్వచించుకుంటారు.
పుణేలోని వినికిడి లోపం ఉన్నవారికోసం నడిచే ధాయరీ పాఠశాలకు చెందిన ప్రత్యేక అధ్యాపకురాలు సత్యభామ అల్హాట్ కూడా ఈ భావంతో ఏకీభవిస్తున్నారు. "మా పాఠశాల వంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఆ పిల్లలకు తల్లిదండ్రులవంటివారు కూడా. మేం మా పిల్లలను ఇంటిపై బెంగపడేలా చేయాలనుకోం," ఆరోజు నాగపంచమి కావటంతో కొంతమంది బాలికలకు ఫుగడి ఎలా ఆడాలో బోధించేందుకు వారివైపుకు తిరుగుతూ PARIతో చెప్పారామె. ఫుగడి శ్రావణ మాసంలో ఐదవ రోజైన నాగపంచమి పండుగ రోజున సంప్రదాయంగా ఆడే ఒక ఆట. ప్రాథమిక పాఠశాల అయిన ధాయరీలో 40 మంది విద్యార్థులు పాఠశాలలోనే నివాసముంటుండగా, 12 మంది బయటి నుంచి రోజూ వచ్చే విద్యార్థులు. వీరంతా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకూ, కర్ణాటక, దిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి ఇతర ప్రదేశాలకూ చెందినవారు.
ఈ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను గురించీ, ఇక్కడ చదివి వెళ్ళిన విద్యార్థులనుంచీ విన్న మంచి మాటల వలనా తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించడానికి ఇష్టపడతారని సత్యభామ PARIతో చెప్పారు. ఇందులో చేరడానికి ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేకపోవడం, ఇక్కడే నివాసముండే అవకాశం ఉండటం వలన కూడా ఈ పాఠశాల అందరినీ ఆకట్టుకుంటోంది. నాలుగున్నరేళ్ళ వయసున్న పిల్లలు కూడా ఇందులో చేరుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, కేవలం వినికిడి లోపం ఉన్న పిల్లల గురించే వాకబులు సాగటంలేదు, "వినికిడి లోపం లేని పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడకు వచ్చి తమ పిల్లలను చేర్చుకోమని అడుగుతుంటారు. ఎందుకంటే ఈ పాఠశాలను వారు చాలా ఇష్టపడతారు. మేం వాళ్ళను వెనక్కు పంపించేయాల్సివస్తోంది," అంటారు సత్యభామ.
వైకల్యం ఉన్నవారికి బోధించే ఉపాధ్యాయులను 'ప్రత్యేక అధ్యాపకులు ' అని పిలుస్తారు. వారు విద్యార్థుల వ్యక్తిగత వ్యత్యాసాలు, వైకల్యాలు, ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా విద్యను బోధిస్తారు, వారు స్వయంసమృద్ధిగా ఉండేలా చూస్తారు. సాంకేతికతల కంటే, పద్ధతుల కంటే ఈ ప్రత్యేక విద్య చాలా మించినదని ఈ ఉపాధ్యాయులు, అధ్యాపకులలో చాలామంది నమ్ముతారు. ఇది అధ్యాపకులకూ, పిల్లలకూ మధ్య ఏర్పడే ఒక నమ్మకం, బంధం.
2018-19లో మహారాష్ట్రలో 1-12వ తరగతి వరకూ 3,00,467 మంది ప్రత్యేక అవసరాలున్న పిల్లలు (children with special needs-CWSN) బడులలో చేరారు. మహారాష్ట్రలో ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం 1600 బడులున్నాయి. వైకల్యం కలిగిన వ్యక్తుల కోసం 2018 నాటి రాష్ట్ర విధానం , ప్రత్యేక పిల్లలు విద్యను పొందడంలో సహాయం చేయడానికి ప్రతి పాఠశాలలో కనీసం ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ మేధా తాయి చెప్పిన ప్రకారం, 2018లో మొత్తం 96 గ్రామాలున్న ముల్షి బ్లాక్‌లో కేవలం తొమ్మిది మంది ప్రత్యేక అధ్యాపకులను మాత్రమే నియమించారు.
వైకల్యం ఉన్నవారికి బోధించే ఉపాధ్యాయులు విద్యార్థుల వ్యక్తిగత వ్యత్యాసాలు, వైకల్యాలు, ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా విద్యను బోధిస్తూ, వారు స్వయంసమృద్ధిగా ఉండేలా చూస్తారు
*****
ప్రత్యేక అధ్యాపకులకు ప్రత్యేక బోధనా నైపుణ్యాలుండాలి. "మరీ ముఖ్యంగా, ఆ విద్యార్థులు మీ తల్లిదండ్రుల వయసువారైనప్పుడు," అంటాడు వార్ధాకు చెందిన 26 ఏళ్ళ సామాజిక కార్యకర్త రాహుల్ వాంఖడే. గత ఏడాదిగా ఈయన ఇక్కడ ఉన్నాడు. అతని సీనియర్ సహోద్యోగి, వార్ధాకే చెందిన కంచన్ యెసాంకర్ (27) ఐదేళ్ళపాటు విద్యార్థులకు బోధించింది. తాను మరింత సంతోషంగా ఉండే వ్యక్తిగా మారటానికి ఈ విద్యార్థులకిలా చదువు చెప్పటమే తనకు నేర్పించిందని ఆమె చెప్పింది.
ఇరవై ఏళ్ళ కునాల్ గుజర్‌కు సాధారణం కంటే కొంత తక్కువ తెలివితేటలు (borderline intelligence) ఉన్నాయి, ఇంకా అతని ఎడమచేతిలో బలహీనత కూడా ఉంది. సాముదాయిక కార్యకర్తగా పనిచేసే 34 ఏళ్ళ మయూరి గైక్వాడ్, ఆమె సహచరులు కునాల్‌తో పాటు మరో ఏడుమంది ప్రత్యేక పిల్లలకు తరగతులు నిర్వహించారు. "ఆమె నాకు పాటలు, ఎక్కాలు, వ్యాయామం చేయటం నేర్పించింది. హాత్ అసే కరాయ్చే, మగ్ అసే, మగ్ తసే (మీ చేతులను ఇలా కదిలించండి, ఆపైన అలా చేయండి),” అంటూ కునాల్, దేవ్‌రాయ్ కేంద్రంలోని తన ఉపాధ్యాయుల గురించి చెబుతాడు. ఈ కేంద్రం పుణే సమీపంలో ఉండే హడ్షిలోని కాలేకర్ వాడీలో ఉంది.
ఈ పాత్రను నిర్వహించాలంటే ఈ పిల్లలపై ప్రేమ, వారితో మమేకత తప్పనిసరి అని కాట్‌కరీ ఆదివాసీ పిల్లలతో కలిసి పనిచేస్తూ, గ్రంథాలయాలను నడుపుతోన్న మయూరి చెప్పారు. ఆమె ఒక రైతు, సాముదాయక కార్యకర్త కూడా. వైకల్యాలతో ఉన్న పిల్లల పట్ల ఆమెకు ఉన్న అనురాగం, సాంత్వన ఆమెను దేవ్‌రాయ్ కేంద్రంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేలా చేసింది.
సంగీత కాలేకర్ కుమారుడు సోహమ్ మూర్ఛలతో బాధపడుతున్నాడు. సోహమ్‌కు కూర్చోవడం నుండి మాట్లాడటం వరకు ప్రతిదీ నేర్పే ఏకైక ఉపాధ్యాయురాలు ఆమే. "అతనిప్పుడు 'ఆయ్, ఆయ్' అని చెప్పగలుగుతున్నాడు," అని సంగీత చెప్పారు. పదేళ్ళ వయసున్న సోహమ్ తాళం చెవితో ఆడుకుంటూ, అది నేలమీద పడిపోవడాన్ని చూస్తూ శబ్దాలు చేస్తున్నాడు.
పుణేలో వినికిడి లోపం ఉన్నవారి కోసం ఉన్న మరో ఆశ్రమ సంస్థ, ధాయరీలోని ఉపాధ్యాయులు, తమ తరగతిలోని పిల్లవాడు ఏదో ఒక శబ్దం చేసిన ప్రతిసారీ అది మాట్లాడటానికి ఒక ముందడుగుగానే భావిస్తారు. ఈ శబ్దాలు, హావభావాలు తప్ప "వారు తమ వయస్సులోని 'సాధారణ' పిల్లలకు ఏమాత్రం భిన్నం కారు," అని గత 24 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తోన్న సత్యభామ అల్హాట్ అభిప్రాయపడ్డారు.
వినికిడి లోపం ఉన్నవారి కోసం పుణేకు చెందిన సుహృద్ మండల్ అనే సంస్థ ప్రారంభించిన 38 పాఠశాలల్లో ఈ పాఠశాల కూడా ఒకటి. ఈ సంస్థ గత 50 సంవత్సరాలుగా ప్రత్యేక అధ్యాపకులకు శిక్షణ ఇస్తోంది. బి.ఎడ్.(వినికిడి లోపం) లేదా డిప్లొమా కోర్సులు చేసిన ఈ ఉపాధ్యాయులు ప్రత్యేక అధ్యాపకులుగా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నవారు.
నాలుగవ తరగతి విద్యార్థులకు చెందిన తరగతి గదిలోని నల్లబల్ల నిండా ఒక భవనం, ఒక కుక్క, ఒక నీటి కొలను వంటి అందమైన బొమ్మలు గీసివున్నాయి- ఇవన్నీ మోహన్ కానేకర్ తన విద్యార్థులకు మాటల్లో నేర్పించడానికి గీసినవే. 21 సంవత్సరాల అనుభవం ఉన్న శిక్షణ పొందిన ఉపాధ్యాయుడైన 54 ఏళ్ళ మోహన్, టోటల్ కమ్యూనికేషన్ పద్ధతిని - వినికిడి లోపం ఉన్నవారికి బోధించేటప్పుడు మాట్లాడటం, లిప్ రీడింగ్ (పెదవుల కదలికను చూస్తూ చదవడం), సంకేతాలు, రాయడం వంటివాటిని మిళితం చేసే పద్ధతి - అనుసరిస్తారు. అతని విద్యార్థులు ప్రతి సంకేతానికి ప్రతిస్పందిస్తారు, ఆ పదాలను వేర్వేరు పద్ధతులలో, స్వరాలలో పలికేందుకు ప్రయత్నిస్తారు. వారు చేసే శబ్దాలు కానేకర్ ముఖంలోకి ఆనందంతో నిండిన చిరునవ్వును తెస్తాయి. ప్రతి బిడ్డ ఉచ్చారణను ఆయన సరిచేస్తారు.
మరో చోట, 'స్టెప్ 3' తరగతిలోని ఏడుగురు విద్యార్థులకు బోధించడానికి అదితి సాఠే మాట్లాడలేనితనం అడ్డేమీ కాదు. ఆమె 1999 నుండి ఈ పాఠశాలలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు
ఆమె గానీ, ఆమె విద్యార్థులు గానీ అదే హాలులో జరుగుతోన్న మరో తరగతి చేస్తోన్న 'సందడి'ని గురించి ఏమాత్రం ఇబ్బంది పడటంలేదు. అదే హాలులో సునీత జినే ఆ బడిలోనే చదివే చిట్టి చిట్టి పిల్లలకు బోధిస్తూవున్నారు. 47 ఏళ్ళ వయసున్న ఈ హాస్టల్ సూపరింటెండెంట్ రంగుల గురించి బోధిస్తోంటే, ఆ రంగులను వెతుక్కోవడానికి బుజ్జి బుజ్జి పిల్లలు హాలంతా పరుగులు తీస్తున్నారు. ఒక నీలిరంగు సంచీ, ఒక ఎర్ర చీర, నల్లని జుత్తు, పసుసు రంగు పూలు... కొంతమంది శబ్దాలు చేస్తూనూ, మరికొంతమంది తమ చేతుల్ని ఉపయోగించీ పిల్లలు ఉల్లాసంగా అరుస్తున్నారు. శిక్షణ పొందిన అధ్యాపకురాలైన సునీత భావాలను పలికించే ముఖం తన చిన్నారి విద్యార్థులతో మట్లాడుతుంది.
“సమాజంలోనూ పాఠశాలల్లోనూ హింస, దూకుడుతనం పెరుగిపోతున్న ఈ కాలంలో మేధస్సు గురించీ, విజయం గురించీ మనకున్న ఆలోచనలను మనం ప్రశ్నించుకోవాలి. క్రమశిక్షణ గురించీ, శిక్షించడం గురించీ కూడా,” అంటారు మేధా తాయి. "మృదువైన మాటల ద్వారా ఏమి సాధించవచ్చో" చూడడానికి ప్రత్యేకమైన పిల్లల కోసం ఉన్న బడులలో కనీసం ఒక బడినైనా సందర్శించాలని ఆమె ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ కథనాన్ని నివేదించేటపుడు సహకరించిన సుహృద్ మండల్‌కు చెందిన డాక్టర్ అనూరాధ ఫతర్‌ఫోడ్‌కు ఈ రిపోర్టర్లు ధన్యవాదాలు తెలియచేస్తున్నారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి