ఇరవై మూడేళ్ళ భారతి కస్తేకి కుటుంబమే లోకం. పదవ తరగతి పూర్తయ్యాక తన చెల్లెళ్ళు చదువు కొనసాగించడానికి తను చదువు మానేసింది. తన తండ్రికీ, అన్నయ్యకూ చేదోడుగా ఉంటూ ఒక కంపెనీలో రెక్కలు ముక్కలు చేసుకుంటూ పని చేసేది. ఎప్పుడూ తన కుటుంబానికి ఏ విధంగా సహాయపడగలనా అని ఆలోచించేది. అదంతా మే, 2021 వరకూ మాత్రమే.
ఆ తర్వాత ఆలోచించడానికి ఆమెకు కుటుంబమే లేకుండాపోయింది.
మధ్యప్రదేశ్, దేవాస్ జిల్లాలోని నెమావర్ గ్రామం నుంచి భారతి కుటుంబసభ్యులు ఐదుగురు - ఆమె తల్లి మమత (45), చెల్లెళ్ళు రూపాలి(17), దివ్య (12), బంధువులు పూజ (16), పవన్ (14) - మే 13, 2021 నుంచీ కనపడకుండాపోయారు. "నేను వారిలో ఎవరినీ కలవలేకపోయాను. ఒక రోజు గడిచినా వీరంతా ఇంటికి రాకపోయేసరికి మేం కంగారుపడిపోయాం," అంటుంది భారతి.
తన కుటుంబ సభ్యులు కనబడటం లేదని భారతి పోలీసులకి ఫిర్యాదు చేయటంతో, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఒక రోజు, రెండు రోజులయ్యాయి. రెండు, మూడు రోజులయింది. కుటుంబసభ్యులెవరూ తిరిగి రాలేదు. సమయం గడిచే కొద్దీ వారి గురించిన ఆందోళన పెరగసాగింది, భారతి కడుపులో ఉండ చుట్టుకున్న భయం పెద్దదిగా మారసాగింది. ఇంట్లో నిశ్శబ్దం చిక్కబడసాగింది.
ఆమె భయం మరింత తీవ్రమైంది.
వారు కనపడక 49 రోజులు గడిచాక, వారి మరణాల గురించిన విషాద వార్తను మోసుకొచ్చారు పోలీసులు. గ్రామంలో ధనికులూ, పరపతి గల రాజపుత్ వర్గానికి చెందిన సురేంద్ర చౌహాన్ అనే పెద్దమనిషి పొలంలో పాతిపెట్టిన ఐదు శవాలు బైటపడ్డాయి. స్థానిక బిజెపి, శాసన సభ్యుడైన ఆశిష్ శర్మకు సన్నిహితుడైన చౌహాన్‌కు హిందూ మత సంస్థలతో సంబంధాలున్నాయి.
“అంతరాలలో ఎక్కడో ఇలాంటిది జరిగి ఉంటుందేమో అన్న భయం ఉన్నా, ఈ వార్త విని కుప్ప కూలిపోయాను,” అంది గోండు జాతికి చెందిన భారతి. “ఒక్కరాత్రిలో కుటుంబంలో ఐదుగురిని పోగొట్టుకుంటే ఉండే బాధని వర్ణించలేను. అంతవరకు, ఏదో అద్భుతం జరిగి వారు తిరిగి వస్తారని ఆశ పడుతూ ఉన్నాను.”
ఒక్క రాత్రిలో నెమావర్‌లోని ఒక ఆదివాసీ కుటుంబం ఐదుగురు కుటుంబ సభ్యులను కోల్పోయింది. పోలీసులు ఈ సామూహిక వధకు కారణమైన సురేంద్రనూ, అతనికి సహకరించిన మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు .
*****
మధ్యప్రదేశ్ జనాభాలో 21 శాతం ఉన్న ఆదివాసులలో గోండు, భిల్, సహారియా తెగలకు చెందినవారు ఉన్నారు. సంఖ్యాపరంగా అధికులైనా, వీరికి రక్షణ లేదు: 2021లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రచురించిన క్రైమ్ ఇన్ ఇండియా ప్రకారం 2019- 2021 మధ్య షెడ్యూల్డ్ తెగలపై ఈ రాష్ట్రంలో అత్యధికంగా నేరాలు నమోదయ్యాయి.
2019లో రాష్ట్రంలోని ఎస్టీలపై 1,922 నేరాలు జరగగా రెండేళ్ళ తర్వాత వీటి సంఖ్య, 36 శాతం అధికంగా, 2,627కు పెరిగింది. ఇది జాతీయ స్థాయి సగటు 16 శాతం కంటే రెండు రెట్లకు పైగా అధికం.
భారతదేశంలో 2021లో ఎస్.టి.లపై జరిగిన నేరాలు 8,802 కాగా, వీటిలో 30 శాతం, అనగా 2,627 ఒక్క మధ్యప్రదేశ్‌లోనే జరిగాయి. అంటే రోజుకు ఏడు. వీటిలో అత్యంత భయానకమైనవి జాతీయ స్థాయిలో పత్రికలలో ముఖ్యాంశాలుగా ఉన్నప్పటికీ వారి రోజువారీ జీవితంలో వారు ఎదుర్కొనే బెదిరింపులూ, లొంగదీసుకోవడాలూ ఎక్కడా వెలుగు చూడవు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీ తెగలపై జరిగే అకృత్యాల సంఖ్య అధికం కావటంతో, సామాజిక కార్యకర్తలకు వాటి గురించి తెలుసుకోవటం ఎంతో కష్టం గా ఉంటుందంటారు, జాగృత్ ఆదివాసీ దళిత్ సంఘటన్ (JADS) నేత మాధురీ కృష్ణస్వామి. “వీటిలో అత్యంత హేయమైనవి పాలక భారతీయ జనతా పార్టీ నేతల ఆధీనంలోని ప్రాంతాలలోనే జరిగాయనేది గమనార్హం,” అంటారామె.
ఈ ఏడాది జూలైలో సిద్ధి జిల్లాలో ఒక జుగుప్సాకరమైన - తాగిన మైకంలో పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి, ఒక ఆదివాసీపై మూత్ర విసర్జన చేస్తున్న - వీడియో వైరల్ అయింది. సామాజిక మాధ్యమాలలో ఈ వీడియో కనిపించగానే, బిజెపి కార్యకర్త అయిన శుక్లాను అరెస్ట్ చేశారు.
అయితే, ఇటువంటి సంఘటనలలో వీడియోలు లేకపోతే, సంఘటన పట్ల ప్రజల వ్యతిరేకత బలంగా లేక చట్టం అంత వేగంగా పని చేయదు. “ఆదివాసీలు తరచూ నిర్వాసితులు కావటమో లేదా ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు సంచరిస్తూనో ఉంటారు. స్థానబలం లేక వారు తరచు మోసాలకు గురవుతుంటారు. పైగా చట్టాలు కూడా శక్తివంతులు, ఆధిపత్య వర్గాలు అమానవీయంగా మారడానికి, వీరిపై దాడి చేయడానికి అనుమతిస్తాయి. “ అంటారు మాధురి.
నెమావర్‌లో భారతి కుటుంబ సభ్యుల ఊచకోతకు కారణం, సురేంద్రకు భారతి చెల్లెలు రూపాలీతో ఉన్న అనుబంధమే కారణమన్న ఆరోపణలున్నాయి.
కొంతకాలంగా వారిద్దరూ కలుసుకుంటున్నారు, అయితే సురేంద్ర తనకు మరొక మహిళతో నిశ్చితార్థం ఏర్పాటయిందని చెప్పడంతో ఆ బంధం ఆకస్మికంగా ముగిసింది. దీనితో రూపాలీ నివ్వెరపోయింది. "రూపాలీకి 18 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసుకుంటానని అతను మాట ఇచ్చాడు. కానీ నిజానికి అతను ఆమెతో శారీరక సంబంధాన్నే కోరుకున్నాడు. ఆమెనలా వాడుకుని, మరో మహిళను పెళ్లాడదామని నిర్ణయించుకున్నాడు," అంటుంది భారతి.
మండిపడిన రూపాలీ అతని నిజ స్వరూపాన్ని సామాజిక మాధ్యమాలలో బైట పెడతానని సురేంద్రను బెదిరించింది. ఒక సాయంకాలం తన పొలంలో మాట్లాడుకుందాం రమ్మని సురేంద్ర రూపాలీకి కబురు పంపాడు. రూపాలీకి తోడుగా వచ్చిన పవన్‌ను సురేంద్ర స్నేహితుడు కొంత దూరంలోనే ఆపేశాడు. తన పొలంలోని ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న సురేంద్ర, రూపాలీ రాగానే ఆమెపై ఇనుప కడ్డీతో దాడిచేసి, అక్కడికక్కడే చంపేశాడు.
తర్వాత సురేంద్ర రూపాలీ ఆత్మహత్యా ప్రయత్నం చేసిందనీ, ఆమెను ఆసుపత్రికి తీసికెళ్ళాలనీ పవన్‌కి కబురంపాడు. ఇంటివద్ద ఉన్న రూపాలీ తల్లినీ, చెల్లినీ పిల్చుకురమ్మని అతను పవన్‌తో చెప్పాడు. నిజానికి సురేంద్ర తాను రూపాలీని కలవాలని కబురు పంపిన విషయం తెలిసిన కుటుంబంలోని అందరినీ చంపాలనుకున్నాడు. అలాగే ఒకరి తర్వాత ఒకరిని అందరినీ హతమార్చి తన పొలంలో పాతిపెట్టాడు. "ఒక కుటుంబం మొత్తాన్ని ఈ విధంగా చంపడానికి అసలు అదొక కారణమా?" ఆక్రోశించింది భారతి.
పోలీసులు రూపాలీ, పూజల శవాలను తవ్వి తీసినపుడు వారి శరీరాలపై దుస్తులు లేవు. "వాళ్ళను చంపడానికి ముందు అతను వారిపై అత్యాచారం చేసుంటాడని మేం అనుమానిస్తున్నాం," అంది భారతి. "ఈ సంఘటన మా జీవితాలను నాశనం చేసింది."
NCRB తాజా సమాచారం ప్రకారం 2021లో మధ్యప్రదేశ్‌లో 376 అత్యాచారాలకు సంబంధించిన కేసులు - రోజుకు సగటున ఒకటి కంటే ఎక్కువ - నమోదవగా, వీటిలో 154 కేసులు మైనర్ బాలికలకు సంబంధించినవి.
"అంతకుముందు మేం ధనిక జీవితాన్ని జీవించకపోయినా, మేం ఒకరికి ఒకరంగా ఉండేవాళ్ళం, ఒకరి కోసం ఒకరం కష్టపడి పనిచేసేవాళ్ళం," అంది భారతి
*****
అగ్రకులాలకు చెందినవారు ఆదివాసులపై దాడులను వివిధ కారణాల వల్ల చేస్తారు. ఆదివాసులపై చేసే దాడులకు ఎక్కువగా చెప్పే ప్రధాన సాకులలో ఒకటి, భూమి తగాదా. ప్రభుత్వం ఆదివాసులకు భూమిని కేటాయిస్తే, వారు తమ జీవనోపాధి కోసం భూస్వాములపై ఆధారపడటం తగ్గిపోతుంది. అది గ్రామంలోని ఆదివాసులపై భూస్వాములకు పారంపర్యంగా వస్తోన్న అధికారానికి ముప్పుగా పరిణమిస్తుంది.
2002లో దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా, 3.5 లక్షలమంది భూమిలేని దళితులకూ, ఆదివాసులకూ భూమిపై అధికారం ఇచ్చేందుకు భూ పట్టాలను ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఏళ్ళు గడిచేకొద్దీ వారిలో కొంతమందికి పత్రాలు అందాయి కూడా. కానీ వారిలో చాలామందికి సంబంధించిన భూమి మాత్రం అగ్రవర్ణాలవారి గుప్పిట్లోనే ఉంది.
అణగారిన వర్గాలు తమ హక్కుల కోసం పట్టుబట్టినప్పుడల్లా, అందుకు వాళ్ళు తమ ప్రాణాలనే మూల్యంగా చెల్లించాల్సివచ్చేది.
జూన్ 2002లో గునా జిల్లాలోని ధనోరియా గ్రామంలో, రామ్‌ప్యారీ సహరియాకు చెందిన భూమికి హద్దులను గుర్తించడానికి అధికారులు గ్రామం చేరుకున్నారు. చివరకు అధికారులు ఆమె భూమికి సరిహద్దులను ఏర్పరచిన రోజు, అది ఆమె కలలుగన్న రోజు. ఒక సహరియా ఆదివాసీ కుటుంబానికి భూ యాజమాన్యాన్ని సాధించడం కోసం రెండు దశాబ్దాల పాటు సాగించిన సుదీర్ఘ పోరాటానికి ఇది పరిసమాప్తి.
అయితే ఆ భూమి బలవంతులైన ధాకడ్, బ్రాహ్మణ వర్గాలకు చెందిన రెండు కుటుంబాల అధీనంలో ఉంది.
2022 జూలై 2న, తన మూడెకరాల పొలాన్ని చూసుకుందామని ఆనందంగా పొలం వెళ్ళిన రామ్‌ప్యారీకి ఆ రెండు పెత్తందారీ కుటుంబాలవారు ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతూ కనిపించారు. రామ్‌ప్యారీ కల్పించుకొని, భూమిని వదిలివెళ్ళాలని అడగటంతో అది వాగ్వివాదానికి దారితీసింది. చివరకు వారు ఆమెను కొట్టి, ఆమెకు నిప్పంటించేశారు.
"జరిగిందేమిటో మేం వినగానే ఆమె భర్త అర్జున్ పొలానికి పరుగెత్తివెళ్ళి కాలిపోయిన స్థితిలో ఉన్న తన భార్యను చూశాడు," అర్జున్ మేనమామ జమ్నాలాల్(70) అన్నారు. "మేం ఆమెను వెంటనే గునాలోని జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్ళాం, కానీ ఆమె పరిస్థితి విషమించటంతో భోపాల్ తీసుకెళ్ళమని చెప్పారు."
ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడి రామ్‌ప్యారీ ప్రాణాలు విడిచారు. ఆమె వయసు 46 సంవత్సరాలు మాత్రమే. ఆమెకు భర్త, నలుగురు పిల్లలు ఉన్నారు. పిల్లలందరికీ పెళ్ళిళ్ళయినాయి. సహరియా తెగకు చెందిన ఈ కుటుంబం కూలీ నాలీ చేసుకుని జీవించేది. "మాకు వేరే ఆదాయ వనరు లేదు," అంటారు ధనోరియా గ్రామంలో సోయా చిక్కుళ్ళను కోస్తోన్న జమ్నాలాల్. “చివరికి ఆ భూమి మాకు దక్కినప్పుడు, కనీసం మా అవసరాలకు సరిపడా పంట పండించుకోవచ్చు అనుకున్నాం.”
ఈ సంఘటన తర్వాత, రామ్‌ప్యారీ కుటుంబం భయంతో ధనోరియా గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. గ్రామంలోనే ఉంటోన్న జమ్నాలాల్ మాత్రం వాళ్ళు ఎక్కడ ఉంటున్నదీ బయటపెట్టరు. "మేమందరం ఇదే ఊళ్ళో పుట్టాం, ఇక్కడే పెరిగాం. కానీ నేను మాత్రమే మా ఊరి మట్టిలో కలిసిపోతా. అర్జున్, అతని తండ్రి మళ్ళీ ఇక్కడకు తిరిగివస్తారని నాకు అనిపించటంలేదు," అంటారు జమ్నాలాల్.
రామ్‌ప్యారీ హత్యకు సంబంధించి ఐదుగురు అరెస్టయ్యారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిందితులను పట్టుకున్నారు.
*****
ప్రజలు అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు, బాధితులు న్యాయం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆశ్రయిస్తారు. కానీ చైన్ సింగ్ విషయంలో మాత్రం ప్రభుత్వ యంత్రాంగమే అతడిని చంపేసింది.
ఆగస్ట్ 2022లో మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా రాయ్‌పురా గ్రామానికి చెందిన చైన్ సింగ్, తన తమ్ముడు మహేంద్ర సింగ్‌తో కలిసి తమ గ్రామానికి సమీపంలోని అడవి నుంచి బైక్‌పై తిరిగి వస్తున్నారు. “మా ఇంటికోసం కలప అవసరమైంది,” 20 సంవత్సరాల మహేంద్ర అన్నాడు. “మా అన్న బైక్ నడుపుతుంటే, మేం ఏరుకున్న కర్రలను పడిపోకుండా పట్టుకుని నేను వెనకాల కూర్చున్నాను."
విదిశ ప్రాంతంలో అల్లుకున్న దట్టమైన అటవీప్రాంతానికి సమీపంలో రాయ్‌పురా ఉంది. సూర్యాస్తమయం తర్వాత అక్కడ కన్ను పొడుచుకున్నా కనిపించనంతటి చీకటిగా ఉంటుంది. వీధి దీపాలు లేవు. గతుకులుగా ఉన్న దారిలో ప్రయాణిస్తున్న అన్నదమ్ములకు వారి బైక్ హెడ్‌లైట్ల కాంతి మాత్రమే దారి చూపుతోంది.
అడవిలోని గతుకుల దారులను జాగ్రత్తగా దాటుకొని మెయిన్ రోడ్ చేరుకున్న భిల్లు యువకులైన చైన్ సింగ్, మహేంద్రలకు రెండు జీపుల నిండుగా ఉన్న ఫారెస్ట్ గార్డులు ఎదురయ్యారు. బైక్ హెడ్ లైట్ల కాంతి నేరుగా వారి జీప్ మీద పడింది.
“మా అన్న వెంటనే బండి ఆపాడు,” అంటాడు మహేంద్ర. “కానీ వారిలో ఒక గార్డ్ మాకు గురిపెట్టి తుపాకీ పేల్చాడు. మా వైపు నుంచి ఎటువంటి దూకుడుతనం లేదు. మేం కేవలం కర్రలను తీసుకెళ్తున్నామంతే."
30 సంవత్సరాల చైన్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌పై కంట్రోల్ కోల్పోయి కుప్పకూలిపోయాడు. వెనుకనే కూర్చొని ఉన్న మహేంద్రకు కూడా దెబ్బతాకింది. వాళ్ళు ఏరుకున్న కర్రలు అతని చేతి నించి కింద పడిపోయాయి. బైక్‌తో పాటు తానూ కిందపడి చైన్ సింగ్ కన్నుమూశాడు. "నేను కూడా చనిపోతానేమో అనుకున్నాను," అంటాడు మహేంద్ర. “స్వర్గంలో తేలిపోతున్నానేమో అనిపించింది." ఆ తర్వాత అతనికి ఆసుపత్రిలో మెలుకువ రావడం మాత్రమే గుర్తుంది.
ఈ సంఘటన గురించి న్యాయ విచారణ జరుగుతోందని విదిశ జిల్లా అటవీ అధికారి ఓంకార్ మాస్కోలే చెప్పారు. “నిందితుడిని సస్పెండ్ చేశాం, కానీ అతను మళ్ళీ ఇప్పుడు సర్వీస్‌లో చేరాడు," అన్నారాయన. "న్యాయ విచారణ అనంతరం నివేదిక వచ్చిన తర్వాత, మేం తగిన చర్య తీసుకుంటాం."
తన అన్నను కాల్చిచంపిన ఫారెస్ట్ గార్డుకు శిక్ష పడుతుందన్న నమ్మకం మహేంద్రకు లేదు. “అయితే అతను చేసిన నేరానికి కొన్ని పర్యవసానాలు ఉంటాయని ఆశిస్తున్నాను," అంటాడతను. “లేకపోతే మీరేం సందేశాన్ని పంపుతున్నారు? ఒక ఆదివాసీయువకుడిని చంపటం మామూలు విషయమే అనా? మా జీవితాలు అంత విలువ లేనివా?"
కుటుంబంలో సంపాదించే వ్యక్తులిద్దరిలో ఒకరైన చైన్ సింగ్ మరణంతో ఆ కుటుంబ పరిస్థితి తల్లకిందులైపోయింది. సంపాదించే మరో వ్యక్తి అయిన మహేంద్ర, సంఘటన జరిగిన సంవత్సరం తర్వాత కూడా కాలి గాయం వల్ల సరిగా నడవలేకపోతున్నాడు. “మా అన్న చనిపోయాడు, గాయం వల్ల నేను సరిగా కూలి పనులు చేయలేకపోతున్నాను," అంటాడు మహేంద్ర. “అతని నలుగురు చిన్నపిల్లల్నీ ఎవరు చూస్తారు? మాకు ఒక ఎకరం పొలం ఉంది, అందులో మా ఇంటి వాడకం కోసం సెనగలు పండించుకుంటాం. కానీ ఒక ఏడాదిగా చేతిలో డబ్బు ఆడటమే లేదు."
*****
ఈ సంఘటన జరిగిన నాటి నుంచి భారతికి కూడా ఎటువంటి సంపాదనా లేదు. నెమావర్‌లో తన కుటుంబం ఊచకోతకు గురయిన తర్వాత ఆమె తన తండ్రి మోహన్ లాల్, అన్న సంతోష్‌లతో కలిసి తన గ్రామాన్ని వదిలివేసింది. “మాకు అక్కడ పొలం ఏమీ లేదు, ఉన్నది మా కుటుంబమే. అదే లేనప్పుడు మేమక్కడ ఉండటానికి నాకే కారణమూ కనిపించటంలేదు. అది మాకెన్నో జ్ఞాపకాలను తీసుకువస్తుంది, పైగా ఆ గ్రామంలో మాకు రక్షణ లేదనిపించింది," అంటోంది భారతి.
అప్పటి నుంచి భారతికి మోహన్‌లాల్, సంతోష్‌లతో అభిప్రాయబేధాలు మొదలయ్యాయి. ఇప్పుడు వారు కలిసి ఉండటంలేదు. “నేను మా బంధువుల దగ్గర ఇండోర్‌లో ఉంటున్నాను. వాళ్ళు పీథమ్‌పుర్‌లో ఉంటారు. "మా నాన్న, అన్న కేసును వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. బహుశా వాళ్ళు భయపడినట్లున్నారు. కానీ నా కుటుంబ సభ్యుల్ని చంపినవారికి తప్పనిసరిగా తగిన శిక్ష పడేలా చేయాలన్న పట్టుదలతో ఉన్నాను. ఆ ముగింపు లేనిదే నేను కొత్త జీవితాన్ని ఎలా మొదలుపెట్టగలను?" అంటోంది భారతి.
రూపాలీ డాక్టర్ కావాలనుకునేది. పవన్ సైన్యంలో చేరాలని ఆశపడేవాడు. తన తోబుట్టువుల కడుపు నింపడానికి చివరికి రోడ్లపై భిక్షాటన చేయడానికి కూడా వెనుకాడని భారతికి న్యాయం జరగాలని తప్ప మరో ఆలోచన లేదు.
జనవరి 2022లో భారతి నెమావర్ నుంచి భోపాల్‌కు కాలినడకన ‘ న్యాయ యాత్ర ‘ చేసింది. వారం పాటు సాగిన ఈ 150 కిలోమీటర్ల యాత్రకు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. మోహన్‌లాల్ గానీ, సంతోష్ గానీ ఈ యాత్రలో పాల్గొనలేదు. "వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడరు. నేనెలా ఉన్నానో అని కూడా అడగరు," విచారంగా చెప్పింది భారతి.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 41 లక్షలు నష్టపరిహారంగా ప్రకటించింది. ఆ డబ్బును మూడు భాగాలుగా - భారతి, మోహన్ లాల్, సంతోష్‌లకు, ఆమె పినతండ్రి కుటుంబానికి - విభజించి, పంచారు. ప్రస్తుతం అదే ఆమెకు జీవనాధారం. ఉద్యోగంపై దృష్టి నిలపలేకపోవటంతో భారతి ఉద్యోగాన్ని కోల్పోయింది. తన కుటుంబాన్ని చూసుకోవటానికి మధ్యలో వదిలేసిన చదువును తిరిగి బడిలో చేరి కొనసాగించాలని భారతి అనుకుంటోంది. అయితే, అది కూడా ఈ కేసు సంగతి తేలాకే.
సురేంద్రకి ఉన్న రాజకీయ పలుకుబడి వలన అతనిపై ఉన్న కేసు నీరుగారిపోతుందేమోనని భయపడుతోంది భారతి. సమర్థులైన, తన స్థోమతకు తగిన న్యాయవాదులను కలిసి, అలా జరగకుండా పోరాటం కొనసాగిస్తోంది భారతి. గత రెండు సంవత్సరాలలో భారతి జీవితంలో ప్రతిదీ మారిపోయింది, కానీ ఒక్కటి మాత్రం మారలేదు: అది కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమ!
అనువాదం: వందన