బల్‌దేవ్ కౌర్ (70), తమ పొలంలో ఒకప్పుడు తమ కుటుంబం నిర్మించుకొన్న ఇంటి శిథిలాలగుండా నడక సాగించారు. ఇంకా నిలబడి ఉన్న ఆ గదుల గోడల మీద పైనుండి కింద వరకు పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడి కనిపిస్తున్నాయి.
"ఇంటి పైకప్పు మీద వాన, వడగళ్ళు విసిరికొడుతున్నప్పుడు, మేమందరం రాత్రంతా నిద్ర మేలుకునే గడిపాం. ఏం జరుగుతోందో మాకు అర్థంకాలేదు," నెరిసిన జుట్టు, కాటన్ సల్వార్ కమీజ్ వేసుకుని, దుపట్టా తో తలను కప్పుకుని ఉన్న బల్‌దేవ్ అన్నారు. "తెల్లవారాక, పైకప్పు నుండి నీరు కారడం మొదలవటంతో మేమంతా బైటకు పరుగులు తీశాం."
సూర్యుడు ఉదయించడంతోనే, ఇల్లు కూలడం మొదలయిందన్నారు బల్‌దేవ్ చిన్న కోడలు, అమన్‌దీప్ కౌర్ (26). " సారే పాస్సే ఘర్ హీ పాట్ గయా (మేమందరం చూస్తుండగానే ఇల్లు కూలిపోయింది)", అన్నారు బల్‌దేవ్ పెద్ద కొడుకు బల్జిందర్ సింగ్ (35).
ముగ్గురు పిల్లలతో సహా ఏడుమంది సభ్యులున్న బల్‌దేవ్ కౌర్ కుటుంబం, ఇంతకుమునుపు ఎన్నడూ ఇలాంటి విధ్వంసాన్ని చూడలేదు. 2023 మార్చ్ నెల చివరిలో కురిసిన వడగళ్ళతో కూడిన అకాల వర్షాలు, శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లా, గిద్దర్‌బాహా బ్లాక్‌లోని వారి స్వగ్రామం భలాయీఆణాలోని పంటపొలాలను, ఇళ్ళను నాశనం చేశాయి. నైరుతి పంజాబ్‌లోని ఈ ప్రదేశం దక్షిణాన రాజస్థాన్‌తోను, తూర్పున హర్యానాతోనూ సరిహద్దును పంచుకుంటుంది.
వర్షం, వడగళ్ళు మూడు రోజుల పాటు పడుతూనే ఉండడంతో, బల్జిందర్ దిగులుచెందారు. తమ కుటుంబానికి చెందిన 5 ఎకరాల పొలానికి జతగా మరో పది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకోవడం కోసం వారు ఒక ఆఢ్తియా (వ్యవసాయోత్పత్తుల కమీషన్ ఏజెంట్) నుండి రూ. 6.5 లక్షలు అప్పు చేశారు. ఇప్పుడు గోధుమ పంట రాకుంటే, కుటుంబ పోషణకు కష్టమవటమే కాక అప్పు తీర్చే దారి కూడా ఉండదు.
"అప్పుడే పండుతోన్న పంటను ముందుగా వడగళ్ళు దెబ్బతీశాయి. ఆ తర్వాత వానలు కురవగానే పొలమంతా రోజుల తరబడి నీళ్ళు నిలిచిపోయాయి. నీరు వెళ్ళే దారి లేకపోవటంతో, నిలిచివున్న నీటిలోనే పంట కుళ్ళిపోవడం మొదలైంది," అన్నారు బల్జిందర్. "ఇప్పుడు కూడా ఆ 15 ఎకరాలలోని పంట ఆలాగే పడి ఉంది," ఏప్రిల్ నెల సగం దాటిన సమయంలో చెప్పారు బల్జిందర్.
అక్టోబర్ నుండి డిసెంబర్ నెలల మధ్యకాలంలో నాట్లు వేసే గోధుమను ఈ ప్రదేశాల్లో రబీ పంటగా సాగుచేస్తారు. ఫిబ్రవరి, మార్చ్ నెలలు గింజ ఎదుగుదలకు కీలకమైనవి. ఈ సమయంలోనే గింజ పిండి పదార్థాన్నీ, మాంసకృత్తులనూ కూడబెట్టుకుంటుంది.
చండీగఢ్‌లోని భారత వాతావరణ శాఖ ప్రకారం, పంజాబ్‌లో మార్చ్ నెలలో సాధారణంగా కురిసే 22.2 మి.మీ. వర్షానికి బదులుగా మార్చ్ 24-30 తేదీల మధ్య 33.8 మి.మీ. వర్షాలు పడ్డాయి . లూథియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సేకరించిన సమాచారం ప్రకారం కేవలం మార్చ్ 24వ తేదీ ఒక్క రోజే సుమారు 30 మి.మీ. వర్షం కురిసింది..
అకాల వర్షాలు, వడగళ్ళు వారి పంటను దెబ్బతీస్తాయని బల్జిందర్‌కు తెలిసినప్పటికీ, ఆ కుటుంబం ఏళ్ళ తరబడి నిర్మించుకున్న ఇల్లు దెబ్బతినడం వారికి అదనపు విషాదాన్ని మిగిల్చింది.
"ఎప్పుడైనా బైటికెళ్ళి వచ్చేటప్పుడు, మా ఇంటి వైపు అలా చూస్తేనే అది నా మనసుని కలచివేస్తుంది. జీ గభ్రాందా హై (ఆందోళనగా ఉంటుంది)," బల్‌దేవ్ కౌర్ అన్నారు.
తమ పంట నష్టం రూ. 6 లక్షలకు పైగానే ఉంటుందని ఈ కుటుంబం అంచనా వేసింది. మామూలుగా ఒక ఎకరంలో 60 మణ్ ల (ఒక మణ్ కు 37 కిలోలు) గోధుమలు పండుతాయి, కానీ ఇప్పుడు ఎకరానికి 20 మణ్‌ల పంట మాత్రమే వారి చేతికివస్తుంది. పైగా ఇంటిని తిరిగి కట్టుకోవటం ఒక అదనపు ఖర్చు కాగా, వేసవికాలం వస్తుండడంతో అది అత్యవసరంగా మారింది.
" కుదరత్ కర్‌కే (ఇదంతా ప్రకృతి వల్లనే)," అంటారు బల్జిందర్.
అనూహ్యమైన ఈ వాతావరణ నమూనాలు రైతులకు భయకారణాలుగా మారాయని భలాయీఆణాకే చెందిన భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా - ఉగ్రహాఁ) కార్యకర్త 64 ఏళ్ళ గురుభక్త్ సింగ్ అన్నారు. "ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే ఇదంతా జరుగుతోంది. ఇతర పంటలకు కూడా ప్రభుత్వం నియమిత ధరను నిర్ణయిస్తే, నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి వంటి పంటలకు బదులుగా మేం వాటిని కూడా పండిస్తాం," అన్నారాయన.
అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్‌పి)ను హామీ ఇచ్చే చట్టాన్ని ప్రవేశపెట్టాలన్నది వివిధ రైతు సంఘాల ఆధిపత్య సంస్థ, సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రధాన డిమాండ్‌లలో ఒకటి. ఇటువంటి చట్టం కోసం ఒత్తిడి తెచ్చేందుకు పంజాబ్ లోని రైతు సంఘాలు 2023 మార్చిలో దిల్లీలో ఒక ప్రదర్శనను నిర్వహించాయి.
వారి పంటతో పాటు పశువుల కోసం గోధుమ దుబ్బుల నుండి తయారుచేసే తూరీ అని పిలిచే ఎండు మేత కూడా నాశనమైందని గురుభక్త్ చిన్న కొడుకు, లఖ్విందర్ సింగ్ అన్నారు. గురుభక్త్ కుటుంబం 6 నుండి 7 లక్షల రూపాయలు నష్టపోయింది. వారికి కూడా పంటకాలంలో ఆఢ్తియా వద్ద నూటికి 1.5 రూపాయల వడ్డీ చొప్పున చేసిన 7 లక్షల రూపాయల అప్పు ఉంది. అంతకుముందు, కుటుంబానికి చెందిన భూమిని బ్యాంకులో 9 శాతం వడ్డీకి తాకట్టు పెట్టి చేసిన 12 లక్షలు అప్పు కూడా ఉన్నది.
రబీ పంట ద్వారా వచ్చే ఆదాయంతో కొన్ని అప్పులను తీరుద్దాం అనుకున్నా, ఇప్పుడది అసాధ్యంగా మారింది. "వడగళ్ళు పెందు బేర్ (పెద్ద రేగుపండు) పరిమాణంలో ఉన్నాయి," అన్నారు గురుభక్త్.
*****
2023 ఏప్రిల్‌లో బుట్టర్ బఖువా గ్రామానికి చెందిన 28 ఏళ్ళ బూటా సింగ్‌ను PARI కలిసినప్పుడు, అకాలంగా కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నిద్రలేమితో అతను పోరాడుతున్నాడు.
శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లాలోని గిద్దర్‌బాహా బ్లాక్‌కు చెందిన ఈ రైతు, గోధుమను పండించేందుకు తన కుటుంబానికి చెందిన 7 ఎకరాల భూమితో పాటు మరో 38 ఎకరాల భూమిని గుత్తకు తీసుకున్నాడు. ఇప్పుడు గ్రామంలో మునిగిపోయిన కనీసం 200 ఎకరాల పల్లపుభూమితో పాటు అతని 45 ఎకరాల భూమి కూడా ముంపుకు గురయ్యింది. బూటా సింగ్‌కు ఆఢ్తియా వద్ద నూటికి 1.5 రూపాయల వడ్డీకి చేసిన రూ. 18 లక్షల అప్పు ఉంది.
అతని తల్లితండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు కలిపి మొత్తం ఆరుగురు ఉన్న ఆ కుటుంబం పూర్తిగా వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం పైనే ఆధారపడి ఉంది.
"రోజురోజుకూ వేడిమి పెరుగుతుండటంతో పొలం ఎండుతుందనీ, అప్పుడు కోత మొదలుపెట్టొచ్చనీ మేం అనుకున్నాం," అన్నాడతను. తడిసిన పొలంలో కోత యంత్రాన్ని వాడడం కుదరదు. దాంతో పొలాలు ఎండే సమయానికి, చాలవరకు పంట నాశనమైపోయింది.
వాలిపోయిన పంటను కోయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని - నిలిచి ఉన్న పంటను కోయడానికి ఎకరానికి 1300 రూపాయలు, వాలిన పంటను కోయడానికి ఎకరానికి 2000 రూపాయలను కోత యంత్రానికి అద్దెగా చెల్లించాలి.
ఈ ఒత్తిళ్ళే బూటాను రాత్రులు మేలుకునివుండేలా చేస్తున్నాయి. ఏప్రిల్ 17న అతను గిద్దర్‌బాహాలోని ఒక వైద్యుడ్ని కలవటంతో ఆయన అతనికి రక్తపోటు అధికంగా ఉందని మందులు రాశారు.
'టెన్షన్', 'డిప్రెషన్' వంటి పదాలు ఈ ప్రాంత రైతులకు మామూలు పదాలుగా మారిపోయాయి.
" డిప్రెషన్ తహ్ పైందా హీ హై. అప్సెట్‌వాలా కామ్ హుందా హై (నిరాశగానూ దిగులుగానూ ఉంటుంది)," బుట్టర్ బఖువా ఊరిలోని తన ఆరు ఎకరాల పంటభూమి నుండి వర్షపు నీటిని బయటికి తోడుతూ అంటారు గురుపాల్ సింగ్ (40). ఆరు నెలల పాటు వ్యవసాయం చేసిన తరువాత కూడా పొదుపు చేయలేకపోతే, మానసిక ఒత్తిళ్ళకు గురవ్వడం సహజమేనంటారు గురుపాల్.
కార్యకర్త, పంజాబ్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయపడే కిసాన్ మజ్దూర్ ఖుద్‌కుషి పీడిత్ పరివార్ కమిటీని స్థాపించిన కిరణ్‌జిత్ కౌర్ (27), అనేకమంది రైతులు తాము ఆందోళనకు గురవుతున్నట్టు తెలిపారని చెప్పింది. "ఐదెకరాల కంటే ఎక్కువ భూమి లేని చిన్న రైతులకు పంట పోతే అది పూర్తి నష్టం. చేసిన అప్పులను వడ్డీతో సహా కట్టవలసిరావటం అటువంటి రైతుల, వారి కుటుంబాల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. అందుకే మనం రైతుల ఆత్మహత్యలను చూడాల్సివస్తోంది." రైతులను, వారి కుటుంబాలను మాదకద్రవ్యాల వినియోగం, లేదా తీవ్రమైన చర్యలకు పాల్పడకుండా దూరంగా ఉంచడానికి మానసిక ఆరోగ్య మద్దతును కల్పించాల్సిన అవసరం ఉందని కిరణ్‌జిత్ అన్నారు.
ఇంతకుముందరి పంటలకాలం సమయంలో కూడా కొంతమంది రైతులు వాతావరణ అస్థిరతలను అనుభవించారు. సెప్టెంబర్ 2022లో కురిసిన అకాల వర్షాల వల్ల వరి పంటను కోయడం కష్టమైందని బూటా అన్నాడు. మునుపటి రబీ పంటకాలంలో అధికమైన వేడిమి వల్ల గోధుమ గింజలు కుంచించుకుపోయాయి.
ఇప్పటి పంటకాలం గురించి అతను మాట్లాడుతూ, " వాడీ ది ఆస్ ఘట్ హై (పంటను కోసే ఆశ చాలా తక్కువ). రాబోయే రోజుల్లో పంటను కోసినా కూడా, అప్పటికి గింజ నల్లబడిపోతుంది కనుక ఎవరూ కొనరు." అన్నాడు.
మంచి గోధుమ ఉత్పత్తికి ఫిబ్రవరి, మార్చి నెలలలో ఉండే సాధారణ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు అత్యంత అనుకూలమైనవని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రభజ్యోత్ కౌర్ సిద్ధు (వ్యవసాయ వాతావరణశాస్త్రం) తెలిపారు.
2022 రబీ పంట కాలంలో ఈ నెలల్లో ఉన్న అధిక ఉష్ణోగ్రతల వల్ల గోధుమ పంట దిగుబడి చాలా తక్కువగా వచ్చింది. మళ్ళీ 2023 మార్చ్, ఏప్రిల్ నెలలలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలితో కూడిన వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గింది. "అధిక వేగంతో వీచే గాలులతో కూడిన వానల వల్ల, గోధుమ మొక్కలు నేలవాలిపోతాయి, దీనిని లాడ్జింగ్ (గాలుల వలన పైరు పడిపోవటం) అంటారు. పెరిగే ఉష్ణోగ్రతతో మొక్క తిరిగి నిలబడుతుంది, కానీ ఏప్రిల్‌లో ఇలా జరగలేదు," అన్నారు డా. సిద్ధు. "ఇందుకే గింజలో ఎదుగుదల లేకుండాపోయింది, తద్వారా ఏప్రిల్‌లో కోత జరగలేదు. ఇది తిరిగి గోధుమ పంట దిగుబడిని తగ్గించేసింది. పంజాబ్‌లోని కొన్ని జిల్లాల్లో గాలి లేకుండా వర్షాలు పడిన చోట దిగుబడి కొద్దిగా మెరుగ్గా ఉంది.”
మార్చి నెల చివరలో కురిసే అకాల వర్షాలను తీవ్రమైన వాతావరణ మార్పుగానే గుర్తించాలని డా. సిద్ధు అంటారు.
మే నెల వచ్చేసరికి బూటా ఎకరానికి మామూలుగా రావలసిన దిగుబడి 20-25 క్వింటాళ్ళకు బదులుగా, 20 మణ్‌ల (7.4 క్వింటాళ్ళు) పంటను కోయగలిగాడు. గురుభక్త్ సింగ్‌కు వచ్చిన పంట దిగుబడి ఎకరానికి 20-40 మణ్‌లు కాగా బల్జిందర్ సింగ్‌కు ఎకరానికి 25-28 మణ్‌లు వచ్చింది.
ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కనీస మద్దతు ధరగా క్వింటాల్‌కు రూ. 2125 నిర్ణయించగా, గింజల నాణ్యతను బట్టి బూటాకు క్వింటాల్‌కు రూ. 1400 నుండి రూ. 2000 వరకూ వచ్చింది. గురుభక్త్, బల్జిందర్‌లు తమ గోధుమను కనీస మద్దతు ధరకే అమ్మారు.
వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ స్థిరపరచిన 'విలువ కోత'ను అనుసరించి ఇది జరిగింది. శుష్కించిన, విరిగిపోయిన ధాన్యానికి క్వింటాల్‌కు ఇది రూ. 5.31 నుండి రూ. 31.87 వరకు ఉంది. అదనంగా, మెరుపు కోల్పోయిన ధాన్యానికి క్వింటాల్‌కు 5.31 రూపాయల విలువ కోతను విధించారు..
కనీసం 75 శాతం పంట నాశనానికి గురైన రైతులకు పంజాబ్ ప్రభుత్వం ఎకరానికి 15000 రూపాయల సహాయాన్ని ప్రకటించింది. 33 శాతం నుండి 75 శాతం పంట నష్టానికి ఎకరానికి 6800 రూపాయలు ఇచ్చారు.
బూటాకు ప్రభుత్వం నుండి పరిహారంగా 2 లక్షల రూపాయలు అందాయి. "ఇది చాలా నెమ్మదిగా జరుగుతోంది. నేనింకా పూర్తి పరిహారాన్ని అందుకోవాల్సి ఉంది," అన్నాడతను. అతని లెక్క ప్రకారం తన అప్పు తీర్చుకోవడానికి, అతనికి 7 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాల్సివుంటుంది.
గురుభక్త్, బల్జిందర్‌లకు ఇంకా పరిహారం అందాల్సే ఉంది.
బుట్టర్ భఖువా గ్రామంలో 15 ఎకరాల స్వంత భూమి ఉన్న బల్‌దేవ్ సింగ్ (64) కూడా ఆఢ్తియా వద్ద రూ. 5 లక్షలు అప్పుచేసి 9 ఎకరాల భూమిని గుత్తకు తీసుకున్నారు. ప్రతిరోజూ 15 లీటర్ల డీజిల్‌ను వాడి, ఒక నెల రోజుల పాటు ఆయన తన పొలంలోని నీటిని బయటకు తోడారు.
దీర్ఘకాలం పాటు నీటిలో మునిగి ఉండటంతో, బల్‌దేవ్ సింగ్ పొలంలో కుళ్ళిపోయిన పంట వలన ఫంగస్ వచ్చి పొలమంతా నల్లగా, గోధుమ రంగులోకి మారింది. దానిని దున్నడం వల్ల జనాలను అనారోగ్యం పాలుచేసే దుర్వాసన వస్తుందని ఆయన అన్నారు.
" మాతమ్ వర్గా మాహౌల్ సీ (ఇంట్లో శోక వాతావరణం నిండుకొని ఉంది)," అన్నారు బల్‌దేవ్, 10 మంది సభ్యులున్న తన కుటుంబం గురించి మాట్లాడుతూ. కొత్త సంవత్సరాన్ని సూచించే కోతల పండుగ బైశాఖీ ఎటువంటి సంబరాలు లేకుండానే గడిచిపోయింది.
పంట నష్టంవలన తానే నేలకొరిగినట్లుగా బల్‌దేవ్‌కు అనిపించింది. "భూమిని ఈ స్థితిలో వదిలి వెళ్ళలేను," అన్నారాయన. "మా పిల్లలు చదువులు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పోవటం వంటిది కాదిది." ఈ పరిస్థితులే రైతులను ఆత్మహత్యలకు, దేశాన్ని వదిలి వెళ్ళాలనే ఆలోచనలకు పురికొల్పుతున్నాయని ఆయన అన్నారు.
ప్రస్తుతానికి, బల్‌దేవ్ సింగ్ తన కుటుంబంలోని ఇతర రైతులను సహాయం కోసం అడిగారు. వారి దగ్గర్నుండి తన పశువులను మేపడానికి తూరీ , కుటుంబం కోసం ధాన్యాన్ని తీసుకున్నారు.
"మేం పేరుకు మాత్రమే జమీన్‌దారులం ," అన్నారాయన.
అనువాదం: మైత్రి సుధాకర్