కొన్నిసార్లు దేవుళ్ళు తమ భక్తులతో పాటు ప్రయాణం చేస్తుంటారు. కనీసం మా అంగార్‌మొతి విషయంలో మాత్రం ఇది నిజం.
సుమారు 45 ఏళ్ళ క్రితం ఈ దేవత ధాయ్-చాఁవర్ గ్రామంలో నివసించేది. "మా అంగార్‌మొతి మహానది, సుఖా నది మధ్యన ఇక్కడ (ఈ ప్రదేశంలో) నివసించేది," 50 ఏళ్ళ వయసున్న గోండు ఆదివాసీ ఈశ్వర్ నెతామ్ అన్నారు. ఆయన ఈ ఆదివాసీ దేవతకు బైగా లేదా ప్రధాన పూజారి.
అక్కడినుంచి తరలిపోయినా, మా అంగార్మొతికి ప్రజాదరణ తగ్గిపోలేదు - ప్రతి రోజూ ఆ గ్రామం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుండి 500 నుంచి 1000 మంది వరకూ భక్తులు ఆమె దేవాలయ ప్రాంతంలో గుమిగూడుతుంటారు. ఆమె తన స్నేహితులను కూడా పోగొట్టుకోలేదు. ప్రతి ఏడాది, దీపావళి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం రోజున, మా అంగార్‌మొతి వార్షిక సంబరాల కోసం పొరుగు గ్రామాల నుంచి దేవతలను ఆహ్వానిస్తుంది. దేవత పేరుమీదే జరిగే ఈ ఉత్సవాన్ని ఆ గ్రామం పేరు మీద, అక్కడికి దగ్గరలో ఉన్న ఆనకట్ట పేరు మీద గంగ్రెల్ మడయ్ అని పిలుస్తారు.
"మా పూర్వీకుల కాలం నుండి దాదాపు ప్రతి ఆదివాసీ గ్రామంలో మేం ఈ మడయ్ [జాతర] జరుపుకుంటున్నాం," అని గోండు ఆదివాసీ నాయకుడు విష్ణు నెతామ్ చెప్పారు. ఈయన గంగ్రెల్ గ్రామంలో ప్రతి సంవత్సరం ఇదేసమయంలో ఈ జాతరను నిర్వహించే బృందంలో సభ్యుడు.
" మడయ్ మా సంప్రదాయ ఆదివాసీ సంస్కృతిలో భాగం," అని ఆయన చెప్పారు. స్థానిక వాసులు, ఆ గ్రామం వెలుపలి ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఈ జాతరకు వస్తారు. మంచి పంట పండినందుకు కృతజ్ఞతగానూ, రాబోయే సంవత్సరం కోసం ఆశీర్వాదాలు కోరుతూ దేవతలకు పువ్వులు సమర్పిస్తారు. జిల్లాలో ప్రతి సంవత్సరం నిర్వహించే దాదాపు 50 జాతరలలో ఈ మడయ్ ఒకటి. మధ్య భారతదేశ రాష్ట్రంలోని ఈ జిల్లాలో జరిగే మడయ్ల శ్రేణిలో ఇదే మొదటిది.
స్థానిక వాసులతో పాటు ఆ గ్రామం వెలుపలి ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఈ జాతరకు వస్తారు. మంచి పంట పండినందుకు కృతజ్ఞతగానూ, రాబోయే సంవత్సరం కోసం ఆశీర్వాదాలు కోరుతూ దేవతలకు పువ్వులు సమర్పిస్తారు
1978లో నీటిపారుదల సౌకర్యం కోసం, భిలాయి స్టీల్ ప్లాంట్‌కు నీటిని సరఫరా చేసేందుకు మహానదిపై ఒక ఆనకట్టను నిర్మించారు. అయితే, అధికారికంగా పండిట్ రవిశంకర్ ఆనకట్ట అని పిలిచే ఈ ఆనకట్ట దేవతకూ, ఆమెను కొలిచేవారికీ ఇబ్బందులు కలిగించింది.
ఈ ఆనకట్ట నిర్మాణ సమయంలో వచ్చిన వరదల కారణంగా చాఁవర్ గ్రామవాసులు తమ ఇళ్ళను వదిలి వేరే ప్రాంతానికి తరలివెళ్ళవలసి వచ్చింది. "సుమారు 52-54 గ్రామాలు నీట మునిగాయి, ప్రజలు నిరాశ్రయులయ్యారు," అని ఈశ్వర్ చెప్పారు.
దాంతో వారు తమ దేవతతో సహా అక్కడినుండి బయలుదేరి, ఆనకట్టకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధమ్తరీలోని గంగ్రెల్లో స్థిరపడ్డారు.
దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత, ఈ ఆనకట్ట ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది. అయితే నిర్వాసితులైన అనేకమంది గ్రామస్తులు ప్రభుత్వం నుండి రావలసిన పరిహారం కోసం ఇంకా ఎదురుచూస్తూనేవున్నారు.
మడయ్ లో రోజంతా జరిగే ఉత్సవాలు మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతాయి. దేవతను ఆనకట్టకు దగ్గరగా ఉంచారు. ఉదయం నుండి భక్తులు రావడం ప్రారంభిస్తారు. వారిలో కొందరు ఫోటో షూట్ కోసమో, త్వరత్వరగా తీసుకునే ఒక సెల్ఫీ కోసమో ఆనకట్ట పక్కదారిని పడతారు.
మడయ్ జరిగే ప్రదేశానికి వెళ్ళే దారిలో మిఠాయిలు, చిరుతిళ్ళు అమ్మే దుకాణాలు బారులుతీరి ఉన్నాయి. వీటిలో కొన్ని దుకాణాలు పాతవి కాగా మరికొన్ని పండుగ కోసమే వచ్చినవి.
మడయ్ అధికారికంగా ప్రారంభమయ్యే సమయానికి, దాదాపు ఐదు నుండి ఆరు వేల మంది ప్రజలు సమీప గ్రామాల నుండి, దూరప్రాంతాల నుండి కూడా వచ్చారు. ధమ్తరీ పట్టణానికి చెందిన నీలేశ్ రాయ్చురా రాష్ట్రవ్యాప్తంగా పలు జాతరలను సందర్శించారు. "నేను కాఁకేర్, నర్హర్‌పూర్, నగ్రి-సిహావా, చరామా, పఖన్జూర్ వంటి మరెన్నో ప్రదేశాలలో మడయ్ లను చూశారు. కానీ గంగేల్ మడయ్ లో ఏదో ప్రత్యేకత ఉంది," అని అతను చెప్పారు.
ఇక్కడ మడయ్ లో పూజలు చేసేవారిలో గర్భం దాల్చని స్త్రీలు కూడా ఉన్నారు. “పిల్లలు లేని మహిళలు మా అంగార్‌మొతి నుండి ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తారు. వారిలో చాలామంది కోరికలు నెరవేరాయి,” అని ఆదివాసీ నాయకుడు, కార్యకర్త ఈశ్వర్ మండావి చెప్పారు.
రాయ్‌పూర్ (85 కి.మీలు) నుంచి జాంజ్‌గిర్ (265 కి.మీలు), ఇంకా బెమెతరా (130 కిమీలు) వంటి దగ్గరా దూర ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రయాణించివచ్చిన మహిళలను మేం కలిశాం. వారంతా తమ వంతు ఆశీర్వాదం కోసం వరుసలో నిలబడి ఉన్నారు.
“నాకు పెళ్ళయి అయిదు సంవత్సరాలయింది, కానీ నాకు పిల్లలు లేరు. అందుకే ఆశీస్సులు పొందేందుకు ఇక్కడకు వచ్చాను,” అని ఆ మహిళలలో ఒకరు అన్నారు. తన గుర్తింపు చెప్పడానికి ఇష్టపడని ఆ మహిళ, ఆ జాతరలో ఉదయం నుండి ఉపవాసం ఉన్న మూడు నాలుగు వందల మంది మహిళలలో ఒకరు.
దేవనాచ్ (దేవనృత్యం)లో పాల్గొనడానికి ఇతర గ్రామాల నుండి వచ్చే ఆరాధకులు తమ డంగుల తో (దేవతలను సూచించే జెండాలున్న వెదురు స్తంభాలు), అంగాల తో (దేవతలు) వస్తారు. వారు ఈ స్తంభాలను, చెక్క పల్లకీలను తీసుకుని ఆ ప్రాంతమంతా తిరుగుతారు; భక్తులు దేవతల ఆశీర్వాదాలను కోరతారు.
"ఈ మడయ్ లలో నేను ఆదివాసీ సంస్కృతిని, ఆదివాసీ జీవితాన్ని చాలా దగ్గరగా చూడగలను," అన్నారు నీలేశ్.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి