అది వేడిగా, ఎండగా ఉన్న మార్చి నెల మధ్యాహ్న సమయం. ఔరాపానీ గ్రామానికి చెందిన వయోజనులు చిన్నగా, తెల్లగా కనిపిస్తోన్న చర్చి లోపల గుమిగూడారు. అయితే వారిని అక్కడికి తీసుకొచ్చింది నైతిక ఒత్తిడి కాదు.

నేల మీద గండ్రంగా కూర్చొనివున్న ఆ బృందానికి ఉమ్మడిగా ఒక ముఖ్యమైన సమస్య ఉంది - వారు దీర్ఘకాలిక రక్తపోటు సమస్యలతో - అది ఎక్కువగా కావచ్చు, తక్కువగా కూడా కావచ్చు - బాధపడుతున్నారు. దాంతో వారు తమ రక్తపోటును పరీక్ష చేయించుకోవడానికి నెలకు ఒకసారి అక్కడ కలుస్తారు. తమ మందుల కోసం ఎదురుచూస్తూ, వివిధ విషయాలపై ముచ్చటించుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారు.

"నాకు ఇలా అందర్నీ కలవడానికి రావడమంటే ఇష్టం, ఎందుకంటే నేనిక్కడ నా బాధలను పంచుకోవచ్చు," అందరూ ప్రేమగా రూపీ బాయి అని పిలుచుకునే రూపీ బఘేల్ చెప్పారు. 53 ఏళ్ళ రూపీ గత ఐదేళ్ళుగా ఇక్కడికి వస్తున్నారు. తన జీవనం కోసం రైతు పనిపై ఆధారపడే ఈ బైగా ఆదివాసీ, ఆ ఆదాయానికి తోడుగా అడవి నుండి సేకరించిన వంటచెరకు, మహువా వంటి కలపేతర అటవీ ఉత్పత్తులపై (NTFP) ఆధారపడతారు. బైగాలు ప్రత్యేకించి హానికి గురయ్యే ఆదివాసీ సమూహాలు (PVTG)గా జాబితా చేయబడ్డారు. అవురాపానీ అని కూడా పిలిచే ఔరాపానీ గ్రామంలో బైగా సముదాయానికి చెందిన జనాభా ఎక్కువగా ఉంది.

బిలాస్‌పూర్ జిల్లాలోని కోట బ్లాక్‌లో ఉన్న ఈ గ్రామం ఛత్తీస్‌గఢ్‌లోని అచానక్‌మార్-అమర్‌కంటక్ బయోస్ఫియర్ రిజర్వ్ (AABR)కు దగ్గరలో ఉంది. “నేను అమ్మడానికి తయారుచేసే ఝాడూల [చీపుర్లు] కోసం వెదురును సేకరించేందుకు అడవికి వెళ్ళేదాన్ని. కానీ నేనిపుడు ఎక్కువ దూరాలు నడవలేకపోతున్నా కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాను,” అధిక రక్తపోటు వలన వచ్చే అలసట తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఫూల్సోరి లక్డా వివరించారు. అరవైల వయసులో ఉన్న ఆమె ఇప్పుడు మేకలను చూసుకుంటూ, పగటిపూట ఆవు పేడను సేకరిస్తూ ఇంటిపట్టున ఉంటున్నారు. చాలామంది బైగాలు అడవులపై ఆధారపడి జీవిస్తున్నారు.

PHOTO • Sweta Daga
PHOTO • Sweta Daga

బిలాస్‌పూర్ జిల్లా, ఔరాపానీ గ్రామానికి చెందిన ఒక బృందానికి ఉమ్మడిగా ఒక ముఖ్యమైన సమస్య ఉంది. వారు దీర్ఘకాలిక రక్తపోటు సమస్యలతో - అది ఎక్కువగా కావచ్చు, తక్కువగా కావచ్చు - బాధపడుతున్నారు. వారు తమ రక్తపోటును పరీక్షించుకొని, దాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకోవడానికి నెలకు ఒకసారి సమావేశమవుతారు. (నల్ల దుపట్టా వేసుకున్నవారు, JSS క్లస్టర్ కోఆర్డినేటర్, బెన్ రత్నాకర్)

ఛత్తీస్‌గఢ్‌ గ్రామీణ జనాభాలో 14 శాతం మందికి రక్తపోటు ఉందని దేశీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5), 2019-2021 తెలిపింది. "ఒక వ్యక్తికి సిస్టోలిక్ (గుండె సంకోచించినపుడు) రక్తపోటు స్థాయి 140 mmHg కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటే, లేదా డయాస్టోలిక్ (గుండె వ్యాకోచించినపుడు) రక్తపోటు స్థాయి 90 mmHg కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటే ఆ వ్యక్తికి రక్తపోటు ఉన్నట్లు," అని ఈ సర్వే పేర్కొంది

సంక్రమణం కాని వ్యాధుల పెరుగుదలను అరికట్టడానికి రక్తపోటును ముందస్తుగా గుర్తించడం చాలా కీలకమని దేశీయ ఆరోగ్య మిషన్ పేర్కొంది. రక్తపోటును తగ్గించుకోవటానికి అవసరమైన జీవనశైలి మార్పుల సమాచారాన్ని సపోర్ట్ గ్రూప్ సమకూరుస్తుంది. “ మై మీటింగ్ మే ఆతీ హు, తో అలగ్ చీజ్ సీఖ్‌నే కే లియే మిల్తా హై, జైసే యోగా జో మేరే శరీర్ కో మజ్‌బూత్ రఖ్‌థా హై [ఈ సమావేశాల్లో నేను యోగా వంటి మంచి అలవాట్లను నేర్చుకుంటాను. అది నా శరీరాన్ని కొంచెం బలంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది]," అంటారు ఫూల్సోరి.

సీనియర్ ఆరోగ్య కార్యకర్త సూరజ్ బైగా ఇచ్చిన సమాచారాన్ని ఆమె ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. 31 ఏళ్ళ సూరజ్, దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న లాభాపేక్ష లేని జన స్వాస్థ్య సహయోగ్ (జెఎస్ఎస్)లో పనిచేస్తున్నారు. చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ రక్తపోటు ప్రభావాన్ని గురించి సూరజ్ సమూహానికి వివరిస్తారు. రక్తపోటును మెదడులోని మీటలతో పోలుస్తూ దానిని గురించి చెప్తారు: “మన మెదడులోని మీటలను రక్తపోటు బలహీనపరచగూడదనుకుంటే, మనం క్రమం తప్పకుండా మందులు తీసుకోవటం, వ్యాయామాలు చేయటం అవసరం.

మనోహర్ కాకా అని అందరూ ప్రేమగా పిలుచుకునే మనోహర్ ఉరావ్ వయస్సు 87 ఏళ్ళు. ఈయన గత 10 సంవత్సరాలుగా సహాయక బృంద సమావేశాలకు వస్తున్నారు. "నా బిపి ఇప్పుడు నియంత్రణలో ఉంది, కానీ నా కోపాన్ని నియంత్రించుకోవడానికి నాకు సమయం పట్టింది." ఆయనింకా ఇలా అంటారు, “నేను ఉద్రిక్తపడకుండా ఉండటాన్ని నేర్చుకున్నాను!”

జెఎస్ఎస్ కేవలం రక్తపోటుకు మాత్రమే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కొన్ని సహాయక బృందాలను నిర్వహిస్తోంది. అటువంటి 84 బృందాలు వెయ్యిమందికి పైగా ప్రజలు నివాసముండే 50 గ్రామాలలో పనిచేస్తాయి. శ్రామిక యువకులు కూడా వస్తారు, కానీ పెద్ద సంఖ్యలో తరలి వచ్చేది మాత్రం వయోజనులే.

PHOTO • Sweta Daga
PHOTO • Sweta Daga

ఎడమ: బృంద సభ్యురాలు మహారంగి ఎక్కా. కుడి: బృంద సభ్యుల రక్తపోటును పరీక్ష చేసే గ్రామ ఆరోగ్య కార్యకర్త బసంతి ఎక్కా

"ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవటం వలన వయోజనులను పట్టించుకోకుండా వదిలేస్తారు. వారి మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది, వారు ఒంటరిగా అయిపోతారు. చాలా సందర్భాలలో, వారి జీవిత చరమాంకంలో వారికి పెద్దగా గౌరవం ఉండదు,” అని జెఎస్ఎస్ కార్యక్రమ సమన్వయకర్త మీనల్ మడంకర్ చెప్పారు..

వైద్య సంరక్షణను, సహాయాన్ని కోరేవారు ఎక్కువగా ఈ వయస్సువారే; అలాగే తీసుకోవాల్సిన ఆహారం గురించిన సలహాలను కూడా. "అన్నం తినడం కంటే చిరుధాన్యాలు తినడం నాకు మేలు చేస్తుందనే విషయంతో పాటు నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవడంలో సహాయపడే అనేక విషయాలను మేమిక్కడ నేర్చుకుంటాం. అలాగే, నాకు మందులు కూడా ఇక్కడే ఇస్తారు," అని రూపా బఘేల్ చెప్పారు.

సమావేశం పూర్తయిన తర్వాత, అందులో పాల్గొన్నవారికి అరికెల పాయసంతో విందు చేస్తారు. ఆ చిరుధాన్యాల రుచి వారిని అన్నం నుంచి మారడానికి ప్రేరేపిస్తుందని, తిరిగి వచ్చే నెలలో వారిని ఇక్కడకు వచ్చేలా చేస్తుందని జెఎస్ఎస్ సిబ్బంది ఆశిస్తున్నారు. బిలాస్‌పూర్, ముంగేలీ జిల్లాల్లోని జెఎస్ఎస్ పనిచేసే గ్రామీణ సముదాయాలవారిలో ఎక్కువమంది లీన్ డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వారు తినే ఆహారాన్ని మార్చేయటం ద్వారా, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) అందించే తెల్ల బియ్యం వంటి శుద్ధి చేసిన పిండిపదార్థాలను జోడించటం ద్వారా అలా జరిగిందని వారు వివరించారు

“వ్యవసాయం, ఆహార పద్ధతుల్లో మార్పు వచ్చింది. ఇక్కడి సముదాయాలు ఒకప్పుడు వివిధ రకాల చిరుధాన్యాలను పండించేవి, తినేవి. ఇవి చాలా పోషకాలు కలిగినవి, ఆరోగ్యకరమైనవి. కానీ ఇప్పుడు వారు పాలిష్ పట్టిన తెల్ల బియ్యానికి మారిపోయారని మీనల్ చెప్పారు. పాల్గొన్నవారిలో చాలామంది తాము బియ్యం, గోధుమలను ఎక్కువగా తిన్నామని, చిరుధాన్యాలను పూర్తిగా వదిలేశామని చెప్పారు.

PHOTO • Sweta Daga
PHOTO • Sweta Daga

ఛత్తీస్‌గఢ్‌ గ్రామీణ జనాభాలో 14 శాతం మందికి రక్తపోటు ఉందని దేశీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5), 2019-2021 తెలిపింది. జీవనశైలి మార్పుల గురించి, బిపిని తగ్గించడానికి యోగా చేయటం గురించిన సమాచారం వారికి సహాయక బృందం ద్వారా అందుతుంది

ఇంతకుముందు సాగుచేసిన నమూనాలలో మార్పు వచ్చింది. వారు వివిధరకాల డాల్‌లు , తిల్‌హాన్‌లు (పప్పులు, చిక్కుళ్ళు, నూనె గింజలు) పండించేవారు. తాము తీసుకునే ఆహారంలో మాంసకృత్తులు, అవసరమైన విటమినులు ఉండేలా చూసుకునేవారు, కానీ ఇప్పుడలా లేదు. ఆవాలు, వేరుశెనగ, అవిసెలు, నువ్వుల వంటి పోషక నూనెలను కలిగి ఉన్న వివిధ విత్తనాలు కూడా వారి ఆహారం నుండి దాదాపు దూరమైపోయాయి.

ఆరోగ్యం గురించిన చర్చలు, రక్తపోటు పరీక్షల తర్వాత, సరదా ప్రారంభమవుతుంది - అనేక మూలుగులు, గొణుగుళ్ళతో పాటు ముసిముసి నవ్వులతో శరీరాన్ని సాగదీసే సెషన్‌లు, యోగా జరుగుతాయి.

“మనం ఒక యంత్రానికి నూనె వేసినప్పుడు, అది చక్కగా పనిచేస్తూనే ఉంటుంది. అలా మనం మన కండరాలకు నూనె రాసుకోవాలి. మోటర్‌బైక్ లాగా, మనం మన ఇంజిన్‌లకు ఆయిల్ వేయడం కొనసాగించాలి,” అంటూ సూరజ్ సమూహం విడిపోయి ఇంటికి తిరిగి వెళ్ళే ముందు మరింత నవ్వులు పూయించారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sweta Daga

ଶ୍ୱେତା ଡାଗା ବାଙ୍ଗାଲୋରର ଜଣେ ଲେଖିକା ଓ ଫଟୋଗ୍ରାଫର ଏବଂ ୨୦୧୫ର PARI ଫେଲୋ । ସେ ବିଭିନ୍ନ ମଲ୍‌ଟି ମିଡିଆ ପ୍ରକଳ୍ପରେ କାର୍ଯ୍ୟରତ ଏବଂ ଜଳବାୟୁ ପରିବର୍ତ୍ତନ, ଲିଙ୍ଗଗତ ସମସ୍ୟା ଏବଂ ସାମାଜିକ ଅସମାନତା ବିଷୟରେ ଲେଖନ୍ତି ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ସ୍ୱେତା ଦାଗା
Editor : PARI Desk

ପରୀ ସମ୍ପାଦକୀୟ ବିଭାଗ ଆମ ସମ୍ପାଦନା କାର୍ଯ୍ୟର ପ୍ରମୁଖ କେନ୍ଦ୍ର। ସାରା ଦେଶରେ ଥିବା ଖବରଦାତା, ଗବେଷକ, ଫଟୋଗ୍ରାଫର, ଚଳଚ୍ଚିତ୍ର ନିର୍ମାତା ଓ ଅନୁବାଦକଙ୍କ ସହିତ ସମ୍ପାଦକୀୟ ଦଳ କାର୍ଯ୍ୟ କରିଥାଏ। ସମ୍ପାଦକୀୟ ବିଭାଗ ପରୀ ଦ୍ୱାରା ପ୍ରକାଶିତ ଲେଖା, ଭିଡିଓ, ଅଡିଓ ଏବଂ ଗବେଷଣା ରିପୋର୍ଟର ପ୍ରଯୋଜନା ଓ ପ୍ରକାଶନକୁ ପରିଚାଳନା କରିଥାଏ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ PARI Desk
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Sudhamayi Sattenapalli