అంధేరీలో, కదలామెదలకుండా నిల్చొని ఉన్న రైలుకూ, ఆ రైలు లోపలకు ఎక్కే ప్రయాణీకులు చేసే పెద్ద పెద్ద శబ్దాలకూ మధ్య ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తుంది. రైలు పెట్టెలోకి ప్రవేశించే హడావిడిలో, ప్రయాణీకులు తమ దారికి అడ్డంగా వచ్చే ప్రతిదాన్నీ పట్టుకోవాలని చూస్తారు - అది కంపార్ట్‌మెంట్ తలుపు హ్యాండిల్ కావచ్చు, లేదా మరొక ప్రయాణీకుడి చేయి కూడా కావచ్చు. పెట్టెలో ఉన్న జనమంతా ఖాళీగా ఉన్న సీట్లను ఆక్రమించుకోవడానికి తహతహలాడుతుంటారు. అప్పటికే కూర్చున్నవారిని అభ్యర్థించడం, వాదించడం, సీట్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులను నెట్టడానికి కూడా ప్రయత్నిస్తుంటారు.
ఆ ప్రయాణీకుల వెల్లువలో ఈదుతున్నవాళ్ళలో 31 ఏళ్ల కిషన్ జోగి, పదేళ్ళ వయసున్న అతని కుమార్తె భారతి కూడా ఉన్నారు. భారతి సముద్ర నీలపు రంగు రాజస్థానీ లంగా, జాకెట్టు ధరించివుంది. పశ్చిమ సబర్బ్ లైన్‌లో ప్రయాణించే ఈ 7 గంటల ముంబై లోకల్ రైలు, ఈ సాయంత్రం ఆ తండ్రీ కూతుళ్లు ఎక్కీ దిగిన ఐదవ రైలు.
ఆ రైలు కదిలి వేగంపుంజుకొని, ప్రయాణీకులంతా సర్దుకోగానే కిషన్ వాయిస్తోన్న సారంగి శ్రావ్యమైన ధ్వని అక్కడి గాలిని నింపేసింది.
“తేరీ ఆఁఖే భూల్ భులైయా… బాతే హై భూల్ భులైయా...”
అతని కుడి చేతిలో ఉన్న కమాను సారంగి ఫింగర్ బోర్డుకు గట్టిగా బిగించి ఉన్న మూడు తీగెలపై చకచకా కదులుతుండటంతో శ్రావ్యమైన చక్కని ధ్వని వినవస్తోంది. సారంగికి మరొక చివరన ఉన్న చిన్న అర, అతని ఎడమ చేతికీ, ఛాతీకీ మధ్య నిలిచి ఉంది. అతని వాయిద్యం నుండి వెలువడుతున్న 2022వ సంవత్సరం బాలీవుడ్ చిత్రం 'భూల్ భులయ్యా' లోని జనాదరణ పొందిన పాట, గాలిలో మరింతగా గిరికీలు కొడుతోంది.
రైలు పెట్టెలో కూర్చుని ఉన్న కొంతమంది ప్రయాణికులు ఆ మనోహరమైన రాగాలను వినడంకోసం తమ తమ ప్రపంచాల నుండి కాసేపు బయటికి వస్తుంటారు. మరికొందరు అతని వాదనంను రికార్డ్ చేయడానికి తమ ఫోన్‌లను సిద్ధంగా పట్టుకుంటారు. కొందరు పలుచగా నవ్వుతారు. కానీ చాలామంది చెవులలో ఇయర్‌ప్లగ్‌లు పెట్టుకుని తమ ఫోనులలో మునిగిపోయి ఉంటారు. చిన్నారి భారతి ఆ రైలు పెట్టె మొత్తం తిరుగుతూ అటువంటివారిని చేతితో తట్టి డబ్బు అడుగుతుంటుంది.










