అబ్దుల్ వహాబ్ థోకర్ ఉత్సాహవంతులైన ప్రయాణీకులను తన స్లెడ్జ్‌పై గుల్మార్గ్ మంచువాలులకు తీసుకువెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే జనవరి 14, 2024న నిరుత్సాహానికి గురైన థోకర్ తన వాహనం పైన కూర్చుని కనుచూపు మేరా కలతపెట్టే గోధుమ రంగులోని వట్టిపోయిన నేలను చూస్తున్నారు.
"ఇది చిలై కలాన్ (ముమ్మరమైన శీతాకాలం), కానీ గుల్మార్గ్లో మంచు అనేదే లేదు," విచారంగా అన్నారు 43 ఏళ్ళ థోకర్. గత 25 ఏళ్ళుగా స్లెడ్జిలు లాగుతోన్న థోకర్, ఇలాంటిదెప్పుడూ తాను చూడలేదని చెప్తూ భయపడ్డారు: "పరిస్థితులు ఇలాగే కొనసాగితే మేం తొందరలోనే అప్పుల పాలవుతాం."
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో మంచు కప్పివుండే పర్వత ప్రాంతమైన గుల్మార్గ్ చాలా ప్రసిద్ధి చెందిన హిల్‌స్టేషన్. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇక్కడకు వస్తారు. స్థానికంగా సుమారు 2000 మంది (2011 జనగణన) ప్రజలకే కాక, పని కోసం ఇక్కడకు ప్రయాణమై వచ్చే థోకర్ వంటి ఇతరుల ఆర్థిక వ్యవస్థకు కూడా దన్నుగా నిలవటంలో ఈ పర్యాటకమే కీలక పాత్ర పోషిస్తుంది.
బారాముల్లాలోని కలాన్తారా గ్రామంలో నివసించే ఈయన పని దొరుకుతుందనే ఆశతో ప్రతి రోజూ 30 కిలోమీటర్ల దూరం స్థానిక రవాణా సౌకర్యం ద్వారా ప్రయాణంచేసి గుల్మార్గ్కు వస్తుంటారు. "ఇప్పుడు నాకెవరైనా కస్టమర్ ఉన్నా కూడా, సవారీ చేయడానికి ఇక్కడ మంచు లేకపోవటం వలన నేను కేవలం 150-200 రూపాయలు మాత్రమే సంపాదించగలను," అన్నారాయన. "మేమిప్పుడు చేయగలిగినదల్లా (గతంలో కరిగిన మంచు నుండి) గడ్డ కట్టిన నీటి మీదుగా కస్టమర్లను తీసుకురావటమే."
జమ్మూ కశ్మీర్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, "శీతాకాలంలో గుల్మార్గ్ ఒక 'అద్భుతమైన అనుభవం.' పూర్తిగా తెల్లటి మంచు దుప్పటి కప్పుకుని, మంచులో విన్యాసాలు చేసేవారికి (స్కీయర్స్) ఇది ఒక స్వర్గంలా భాసిస్తుంది. ఇక్కడ సహజంగా ఏర్పడిన వాలు ప్రదేశాలు చెక్కుచెదరనివి, సమర్థులైన స్కీయర్లకు ఒక సవాలుగా ఉంటాయి!"
గుల్మార్గ్ మైదానాలలో కూడా పైన పేర్కొన్న పరిస్థితే ఉంది. ఈ శీతాకాల వాతావరణ మార్పు హిమాలయాల వాలు ప్రదేశాలపై ఆధారపడినవారి జీవనోపాధిని దెబ్బతీసింది. పచ్చిక బయళ్ళ పునరుజ్జీవనం మంచుపై ఆధారపడి ఉంటుంది కనుక హిమపాతం లేకపోవటం పశుపోషణ జీవనాధారంగా ఉన్న ప్రజలపై పర్యావరణపరంగా, ఆర్థికంగా చాలా ప్రభావాన్ని చూపుతుంది. "ప్రపంచవ్యాప్తంగా మారిపోతోన్న వాతావరణం కశ్మీర్ ప్రాంతంపై కూడా తన ప్రభావాన్ని చూపుతోంది," అని కశ్మీర్ విశ్వవిద్యాలయంలోని పర్యావరణ, విజ్ఞాన విభాగానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ మహమ్మద్ ముస్లిమ్ చెప్పారు.
థోకర్ సంపాదననే తీసుకుంటే: రోజులు సరిగ్గా ఉన్నప్పుడు తాను రోజుకు రూ. 1200 సంపాదించే వాడినని ఆయన అంటారు. ప్రయాణపు ఖర్చులు, కుటుంబ సంబంధమైన బాధ్యతలు ప్రస్తుతం ఆయన సంపాదనను మించిపోయాయి. "ఇప్పుడు నేనిక్కడ 200 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాను, కానీ 300 (రూపాయలు) ఖర్చుపెట్టాల్సివస్తోంది," విచారంగా చెప్పారాయన. థోకర్, ఆయన భార్య, వారి టీనేజ్ పిల్లలిద్దరు ఇప్పుడు తమ తిండి కోసం వారు పొదుపు చేసుకున్న కొద్దిపాటి సొమ్ముపై ఆధారపడుతున్నారు.
ఈ సంవత్సరం మంచు కురవకపోవడానికి ‘పడమటి అవాంతరాల’లో వచ్చిన మార్పులే కారణమని డాక్టర్ ముస్లిమ్ చెప్పారు. ఇది ఒక వాతావరణ సంబంధిత ఉత్పాతం. ఇది మధ్యధరా ప్రాంతంలో ఉపఉష్ణమండల తుఫానులుగా ప్రారంభమై, పైకి ఎగసే ప్రవాహాల (బలమైన గాలి బంధనాలు) ద్వారా తూర్పు వైపుకు కదులుతూ, చివరకు పాకిస్తాన్, ఉత్తర భారతదేశాలలో మంచుగా, వర్షపాతంగా మారుతుంది. ఈ ప్రాంతంలో నీటి భద్రత, వ్యవసాయం, పర్యాటకానికి ఈ పడమటి అవాంతరాలు చాలా కీలకమైనవి.
రాజధానీ నగరమైన శ్రీనగర్ జనవరి 13న 15 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ఇది గత రెండు దశాబ్దాలలోనే అత్యధిక ఉష్ణోగ్రత. అదే సమయంలో మిగిలిన ఉత్తర భారతదేశమంతటా చాలా ఎక్కువ శీతల వాతావరణం ఉంది.
"ఇప్పటివరకూ కశ్మీర్లో ఎక్కడా పెద్దగా హిమపాతం అయితే లేదు, పైగా వాతావరణం మరింత వేడెక్కుతూ ఉంది. జనవరి 15న పహల్గామ్లో ఎప్పటికంటే అత్యధిక ఉష్ణోగ్రత 14.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గతంలో 2018లో మాత్రమే అక్కడ అత్యధిక ఉష్ణోగ్రత 13.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది," అని శ్రీనగర్ వాతావరణ కేంద్ర సంచాలకులు డి. ముఖ్తార్ అహ్మద్ చెప్పారు.
సోన్మార్గ్, పహల్గామ్లలో కూడా చెప్పుకోదగ్గ హిమపాతం లేదు. ఆ ప్రాంతమంతా ఉష్ణోగ్రతలు పెరిగిపోతోన్న ఫలితంగా చలికాలాలు వేడిగా ఉంటున్నాయి. గత దశాబ్దంలో, హిమాలయాలు వేడెక్కడం ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉందని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. తద్వారా ప్రపంచంలోనే ఇది వాతావరణ మార్పులకు అత్యంత హానికి లోనయ్యే ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది
స్థానికులు ఇప్పుడు ఈ శీతాకాలపు భూతల ప్రకృతి దృశ్యాన్ని 'ఎడారి' అని పిలుస్తున్నారు. ఇది పర్యాటక పరిశ్రమపై దారుణమైన ప్రభావాన్ని చూపింది. హోటల్ యజమానులు, గైడ్లు, స్లెడ్జిలు లాగేవారు, స్కీయింగ్ శిక్షకులు, ఎటివి (ఆల్-టెర్రైన్ వెహికల్స్ - అన్నిరకాల భూభాగాలలో నడిచే వాహనాలు) డ్రైవర్లు, ఇంకా అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు.
"ఒక్క జనవరిలోనే 150 బుకింగులు రద్దయ్యాయి. పరిస్థితి ఇలాగే ఉంటే, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది," అని గుల్మార్గ్లోని హోటల్ ఖలీల్ ప్యాలెస్ మేనేజర్ ముదసిర్ అహ్మద్ చెప్పాడు. "నా మొత్తం జీవితంలో ఇంతటి చెడ్డ వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదు," అని 29 ఏళ్ళ ఈ యువకుడు చెప్పాడు. ఈ సీజన్లో తనకు వచ్చిన నష్టం ఇప్పటికే దాదాపు రూ. 15 లక్షలకు చేరినట్టు అహ్మద్ అంచనా.
సందర్శకులు ముందుగానే గదులు ఖాళీచేసి పోవటాన్ని హిల్‌టాప్ హోటల్ సిబ్బంది కూడా గమనించారు. మంచును చూడటానికి ఇక్కడకు వచ్చిన అతిథులు నిరాశపడ్డారు. "ప్రతిరోజూ ఇలాగే అవుతోంది, వారు ఉండాలనుకున్న దానికంటే ముందే వెళ్ళిపోతున్నారు," 90 మంది ఉద్యోగులు పనిచేసే హిల్‌టాప్ మేనేజర్ ఇజాజ్ భట్ (35) అన్నారు. గుల్మార్గ్లోని చాలా హోటళ్ళది ఇదే పరిస్థితి అని ఆయన అన్నారు. "పోయిన సంవత్సరం ఈ సమయంలో మాకు సుమారు 5-6 అడుగుల మంచు పడింది, కానీ ఈ ఏడాది కేవలం కొన్ని అంగుళాల మంచును మాత్రమే చూశాం."
జావైద్ అహ్మద్ రేషి అనే స్కీ గైడ్, ఈ అవాంఛనీయ పర్యావరణ మార్పులకు కారణంగా స్థానికులనే వేలెత్తి చూపిస్తారు. "గుల్మార్గ్కు ఒక పర్యాటకుడు వచ్చి దానిని నాశనం చేశాడని నేను నిందించలేను," అని 41 ఏళ్ళ జావైద్ చెప్పారు. "మన చేతులతో మనమే గుల్మార్గ్ని నాశనం చేశాం."
ఎటివి డ్రైవర్ ముష్తాక్ అహ్మద్ భట్, దశాబ్ద కాలంగా ఆఫ్-రోడ్ వాహనాలను నడుపుతున్నారు. శీతాకాలంలో, హిమపాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఎటివిలు మాత్రమే రవాణా సాధనాలు. గంట నుంచి గంటన్నర వరకూ ఉండే సవారీకి డ్రైవర్లు రూ. 1,500 వసూలు చేస్తుంటారు.
వాహనాల పెరుగుదల కూడా ఈ ప్రాంతంలోని సూక్ష్మ వాతావరణాన్ని మరింత తీవ్రంగా దెబ్బతీస్తోందని ముష్తాక్ అభిప్రాయపడ్డారు. "గుల్మార్గ్ బౌల్ (ఆకాశంలోంచి చూస్తే గిన్నె ఆకారంలో ఉంటుంది)లోకి వాహనాలను అనుమతించడాన్ని అధికారులు నిలిపివేయాలి. ఇది ఇక్కడి పచ్చదనాన్ని నాశనం చేస్తోంది, ఇక్కడ మంచు కురవకపోవడానికి కూడా ఇదే కారణం. ఇది మా ఆదాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది," అని 40 ఏళ్ళ ముష్తాక్ అన్నారు.
ఇప్పటికి మూడు రోజులుగా కస్టమర్లెవరూ రాకపోవటంతో ముష్తాక్ కలవరపడుతున్నారు. ఆయన రూ. 10 లక్షలు అప్పుచేసి తన ఎటివిని కొన్నారు. దానిని కొనుగోలు చేసేటప్పుడు రాబోయే సంవత్సరాల్లో మంచి వ్యాపారం ఉండబోతుందనీ తాను త్వరలోనే అప్పు తీర్చేయగలుగుతాననీ ముష్తాక్ భావించారు. "నేనింక ఆ అప్పుని తీర్చలేనని నాకు అనిపిస్తోంది. ఈ వేసవిలో నా ఎటివిని అమ్మేయాల్సి వస్తుందేమో కూడా."
బట్టలను అద్దెకు ఇచ్చే దుకాణాలు కూడా ఖాళీగా ఉన్నాయి, కేవలం అందులో పనిచేసే ఉద్యోగులు మాత్రమే కనిపిస్తున్నారు. "గుల్మార్గ్ని సందర్శించే పర్యాటకులకు మేం కోట్లు, స్నో బూట్లు అద్దెకిస్తుంటాం కాబట్టి మా వ్యాపారం పూర్తిగా హిమపాతంపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో మేం 500-1000 రూపాయలు కూడా సంపాదించడం లేదు," అని స్థానిక బట్టల అద్దె దుకాణంలో పనిచేస్తోన్న 30 ఏళ్ళ ఫయాజ్ అహ్మద్ దేదడ్ చెప్పారు. గుల్మార్గ్ నుండి అరగంట దూరంలో ఉన్న తన్మార్గ్లో ఉన్న వీరి దుకాణం, కోట్ అండ్ బూట్ స్టోర్స్ అని పేరుపొందింది.
దేదే, ఇంకా 11 మంది ఇతర ఉద్యోగులు హిమపాతం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు, మంచుపడితే వారు మంచి రోజుల్లో సంపాదించినట్లు - 200 కోట్లు, జాకెట్లు ఒక్కొక్కటి రూ. 200కు అద్దెకు ఇవ్వడం ద్వారా రోజుకు 40,000 - సంపాదించగలరు. ప్రస్తుతం పర్యాటకులకు భారీ శీతాకాలపు రక్షణ సామగ్రి అవసరంలేదు.
మంచు పడకపోవడం వల్ల ప్రభావితమయ్యేది ఒక్క పర్యాటక కాలం మాత్రమే కాదు, ఆ తర్వాతి కాలం కూడా. "లోయ మొత్తం మంచు కొరతను అనుభవిస్తుంది. తాగటానికి, వ్యవసాయానికి నీరు ఉండదు. టంగ్మార్గ్లోని గ్రామాలు ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి," అని స్కీ గైడ్ రేషి చెప్పారు.
శీతాకాలపు హిమపాతం సాధారణంగా హిమానీనదాలు, సముద్రపు మంచు వంటి (భూమిపై ఉండే అతిపెద్ద మంచినీటి నిల్వలుగా పరిగణిస్తారు) హిమగోళపు నిల్వలను తిరిగి పెంపొందేలా చేస్తుంది. ఆ నిల్వలు ఆ ప్రాంతం నీటి భద్రతను నియంత్రిస్తాయి. "హిమానీనదాల మంచులో ఏదైనా లోటు ఏర్పడితే అది మా సాగునీటి వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాలలో వేసవిలో కరిగిపోయే మంచే ప్రధానమైన నీటి వనరు," అని ముస్లిమ్ అంటారు. "కానీ ఈరోజు మాకు పర్వతాలలో మంచు లేదు. లోయలోని ప్రజలు ఇబ్బందులు పడతారు."
తిరిగి తన్మార్గ్లోని బట్టల దుకాణానికి వస్తే దేదెడ్, అతని సహచరులు తమ ఆందోళనలను తగ్గించుకోలేకపోతున్నారు. "ఇక్కడ పన్నెండుమంది పనిచేస్తున్నారు, మా అందరికీ 3-4 మంది సభ్యులున్న కుటుంబాలున్నాయి." ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు రోజుకు రూ. 1000 సంపాదిస్తున్నారు, మళ్ళీ ఆ డబ్బును వారంతా సమానంగా పంచుకోవాలి. "మేం మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి?" అని ఆ సేల్స్‌మాన్ అడుగుతున్నారు. "ఈ వాతావరణం మమ్మల్ని చంపేస్తోంది."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి