మధ్యప్రదేశ్‌లోని పన్నాలో, ఆ చుట్టుపక్కల ఉన్న చట్టవిరుద్ధమైన ఓపెన్ కాస్ట్ గనులలో చిన్నా పెద్దా తేడా లేకుండా జనం తమ అదృష్టాన్ని మార్చగల రాయిని కనుక్కోవాలనే తమ కలను సాకారం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ గనులలో కొన్ని టైగర్ రిజర్వ్ ప్రాంతం, ఇంకా ఆ ప్రక్కనే ఉన్న అడవుల క్రిందకు వస్తాయి.
తల్లిదండ్రులు ఇక్కడి వజ్రాల గనులలో పనిచేస్తుండగా, ఇసుకనూ మట్టినీ తవ్వుతుండే ఈ పిల్లల్లో ఎక్కువమంది రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసివున్న గోండు ఆదివాసీ సమాజానికి చెందినవారు.
"నాకొక వజ్రం దొరికితే, దాన్ని నేను పై చదువులు చదువుకోడానికి ఉపయోగించుకోవచ్చు," అంటాడు వారిలో ఒక బాలుడు.
బాల కార్మిక వ్యవస్థ (నిషేధం, నియంత్రణ) సవరణ చట్టం ( 2016 ), చట్టరీత్యా ప్రమాదకర వృత్తిగా జాబితా చేసివున్న గని తవ్వకాల పరిశ్రమలో పిల్లలు (14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు), యుక్తవయస్కులు (18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) పనిచేయటాన్ని నిషేధిస్తుంది.
అక్కడికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో కూడా పిల్లలు తమ తల్లిదండ్రులతోపాటు పనికి వెళ్తారు. ఈ సందర్భంలో ఇది అక్రమంగా తవ్వే రాతి గనులలో పని. అట్టడుగు వర్గాలకు చెందిన ఈ కుటుంబాలలో చాలా వరకు గనుల సమీపంలో ప్రమాదకరమైన పరిస్థితులలో జీవిస్తున్నాయి.
"ఈ గనుల వెనుకనే మా ఇల్లు ఉంది," ఈ పిల్లల్లోని ఒక బాలిక చెప్పింది. "రోజుకు ఐదు పేలుళ్ళు జరుగుతాయి. [ఒక రోజు] ఒక పెద్ద రాయి పడిపోయి [ఇంటి] నాలుగు గోడలను పగులగొట్టేసింది."
ఈ చిత్రం పాఠశాలకు దూరమై, వారికున్న విద్యాహక్కును నిరాకరించిన గనుల తవ్వకంలో అసంఘటిత శ్రామికులుగా పనిచేస్తోన్న అసంఖ్యాకమైన పిల్లల కథను చెబుతోంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి