లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి ఒక వారం రోజుల ముందు, గడ్‌చిరోలి జిల్లాలోని 1,450 గ్రామ సభలు కాంగ్రెస్ అభ్యర్థి డా. నామ్‌దేవ్ కిర్సన్‌కు తమ షరతులతో కూడిన మద్దతును ప్రకటించాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఏడు దశల్లోని మొదటి దశలో, ఈ ప్రాంతం వోటు వేయడానికి - ఏప్రిల్ 19న - ఏడు రోజుల ముందు, ఇలా జరగటం ఒక అపూర్వమైన చర్య.
ఎందుకు ఇది ఒక అపూర్వమైన చర్య అయిందంటే, ఆదివాసీ సముదాయాలు బాహాటంగా ఏ రాజకీయ పక్షం వైపూ మొగ్గుచూపని ఈ జిల్లాలో, 12 తహసీళ్ళకు చెందిన గ్రామ సభలు ఇలా మద్దతును ప్రకటించటం కాంగ్రెస్‌ను ఆశ్చర్యపరచింది, భారతీయ జనతా పార్టీ(బిజెపి)ని ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న బిజెపికి చెందిన పార్లమెంట్ సభ్యుడు అశోక్ నేతే వరుసగా మూడోసారి తిరిగి ఎన్నిక కావాలని ఆశిస్తున్నాడు.
గ్రామ సభలకు చెందిన వెయ్యిమందికి పైగా కార్యాలయ అధికారులు, ప్రతినిధులు ఏప్రిల్ 12న గడ్‌చిరోలి నగరంలోని సుప్రభాత్ మంగళ్ కార్యాలయ కల్యాణమండపంలో కాంగ్రెస్ అభ్యర్థి, నాయకులతో బహిరంగ సమావేశం కోసం ఓపికగా రోజంతా వేచి ఉన్నారు. సాయంత్రం వేళ, బలహీన ఆదివాసీ మాడియా సముదాయానికి చెందిన లాల్సూ నొగోటి అనే న్యాయవాది, తమ షరతులను నెమ్మదిగా చదివి వినిపించారు. ఈయన జిల్లాలోని ఆగ్నేయ బ్లాక్‌లోని భామ్రాగఢ్‌కు చెందినవారు. మద్దతు లేఖను స్వీకరించిన కిర్సన్, తాను పార్లమెంటుకు ఎన్నికైతే ఈ డిమాండ్లకు కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు.
జిల్లాలోని అటవీ ప్రాంతాలలో విచక్షణా రహితంగా, యథేచ్ఛగా కొనసాగిస్తోన్న గనుల తవ్వకాలను నిలిపివేయటం; అటవీ హక్కుల చట్టం నిబంధనలను సరళతరం చేయటం; హక్కులు అనిశ్చితంగా ఉన్న గ్రామాలకు సాముదాయక అటవీ హక్కులను (CFR) మంజూరు చేయటం; భారత రాజ్యాంగాన్ని కఠినంగా అమలుచేయటం - వంటి షరతులతో పాటు మరికొన్ని ఇతర షరతులు ఆ లేఖలో ఉన్నాయి.
"మా మద్దతు ఈ ఎన్నికల వరకూ మాత్రమే," అని ఆ లేఖ స్పష్టం చేసింది. "వాగ్దాన ద్రోహం జరిగితే, ప్రజలమైన మేము భవిష్యత్తులో భిన్నమైన వైఖరిని తీసుకుంటాం."
గ్రామ సభలు ఈ వైఖరిని ఎందుకు తీసుకున్నాయి?
"గనులు ఇచ్చేదాని కంటే ప్రభుత్వానికి మేం ఎక్కువ రాయల్టీని ఇస్తాం," అనుభవజ్ఞుడైన ఆదివాసీ కార్యకర్త, గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన సైను గోటా చెప్పారు. "ఈ ప్రాంతంలో అడవులను పడగొట్టటం, గనులు తవ్వడం చాలా తప్పవుతుంది."










