దేవత ఇక్కడికి ఏ నిముషమన్నా రావచ్చు. కానీ దానికి ముందు అతను అలంకరించుకోవాలి. రజత్ జూబిలీ గ్రామస్తులారా , మీ ఇళ్లలో ఉన్న దుప్పట్లు, చీరలు, బట్టలు ఇక్కడికి తీసుకురండి. పాల గాన్ - మానస ఎలా మోర్టే (దేవత భూమి మీదకు రావడం) మొదలవబోతోంది. సంగీత ప్రదర్శన కు ముందు గాలి ప్రతిధ్వనిస్తోంది, దక్షిణ 24 పరిగణ జిల్లాలో గోసబా బ్లాక్ లోని ఈ గ్రామాంలో ఒక సెప్టెంబర్ సాయంత్రం కళకళలాడుతున్నది.
గంటలో ఒక గ్రీన్ రూమ్ తయారయిపోయింది, అందులో కళాకారులు కాంతివంతంగా దుస్తులతో మేకప్ వేసుకుంటూ, ఆహార్యాలు ధరిస్తూ, రాతలో లేని తమ పంక్తులను గట్టిగా బట్టీ వేస్తూ. హడావిడిగా ఉన్నారు. నిత్యానంద సర్కార్, ఈ బృంద నాయకుడు, ఏ భావమూ లేకుండా ఉన్నాడు. నేను మొదటి సారి హిరణ్మయి, ప్రియాంకల పెళ్ళిలో అతనిని కలిసినప్పుడు ఇలా లేడు. ఈ రోజు అతను పాము దేవత మానసగా ప్రదర్శనని ఇస్తాడు. అతను నన్ను ఈ సాయంత్రం ప్రదర్శన ఇవ్వబోతున్న కళాకారులను పరిచయం చేశాడు.
పాల గాన్ అనేది ఒక ప్రముఖ దేవత లేదా దైవాన్ని స్తుతించే ఒక పురాణ కథనం అయిన మంగళ కావ్య ఆధారిత సంగీత నాటకం. ఈ కథన పద్యాలు తరచుగా శివుని వంటి దేశవ్యాప్తంగా ఆరాధించే వివిధ దేవుళ్లను ప్రశంసిస్తూ పాడినా, కానీ ఎక్కువగా స్థానిక బెంగాలీ దేవతలు అయిన ధర్మా ఠాకూర్, మా మానస-పాము దేవత, శీతల-మశూచి దేవత, బాన్ బీబీ- అడవి లేదా వన దేవత వంటి దేవతలను స్తుతిస్తారు. ఈ కళాకారుల బృందాలు ఏడాది పొడవునా సుందర్‌బన్ల ద్వీపాల చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులను రంజింపజేసే సంగీత నాటకాలను ప్రదర్శిస్తాయి.
పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు బీహార్ ప్రాంతాలలో ప్రదర్శించబడే మానస పాల గాన్ , మానస మంగళ కావ్యం ఆధారంగా రూపొందించబడింది, ఇది ఒక ముఖ్యమైన పురాణ పద్యం, ఇది ఒక అంచనాలో, 13 వ శతాబ్దం నాటిది. ఇది జానపద పురాణాల ఆధారంగా రూపొందించబడింది. బెంగాల్‌లో, దక్షిణ 24 పరగణాలతో పాటు బంకురా, బిర్భూమ్, పురులియా జిల్లాల్లోని దళితులలో మానస ఒక ప్రముఖ దేవత. ప్రతి సంవత్సరం, విశ్వకర్మ పూజ రోజున (ఈ సంవత్సరం సెప్టెంబర్ 17), సుందర్బన్ల లోని మారుమూల గ్రామాలలోని అనేక కుటుంబాలు పాము దేవతను పూజించి పాల గాన్ చేస్తారు.
మానస పరాక్రమానికి సంబంధించిన కథలను అందించే ఈ సంగీత-ఆచారం అసలైతే దీవిలోని విషసర్పాల నుండి సుందర్‌బన్ల ప్రజలను రక్షించడానికి ఒక ప్రార్థన. ఈ ప్రాంతాలలో కింగ్ కోబ్రా వంటి 30 కి పైగా అత్యంత విషపూరితమైన పాములు ఉన్నాయి - ఇక్కడ పాము కాటుతో చనిపోవడం సాధారమైన విషయం.
ఈ రోజు ప్రదర్శన ఒక సంపన్న శివభక్తుడు, చాంద్ సడగర్ కథ. మానస పదేపదే చాంద్ సడగర్ పై గెలిచినాగాని, ఆమెను ఒక అత్యున్నత దేవతగా అంగీకరించడానికి అతను నిరాకరించడం వలన జరిగే ప్రతీకార సంఘటనల వరుసలో, మానస చాంద్ సడగర్ నౌకలో సరుకును సముద్రంలో నాశనం చేయడమేగాక, పాము కాటుతో అతని ఏడుగురు కుమారులను చంపి, అతని మరో కుమారుడు లఖీందర్‌ను, అతని పెళ్లి జరిగిన రాత్రే చంపేస్తుంది. దుఃఖంతో పిచ్చిగా మారిన లఖీందర్ భార్య బెహులా తన భర్తని మాలి బ్రతికించమని అడగడానికి భర్త శరీరంతో పాటు స్వర్గానికి వెళుతుంది. అక్కడ ఆమెకు ఇంద్రుడు మానస దేవతను పూజించేందుకు చాంద్ సడగర్‌ను ఒప్పించమని సలహా ఇస్తాడు. కానీ చంద్ సడగర్ కు తన స్వంత షరతులున్నాయి. అతను తన ఎడమ చేతితో మాత్రమే మానసకు పూజా పువ్వులను సమర్పించేవాడు, శివుడిని పూజించడానికి తన పవిత్రమైన కుడి చేతిని వాడేవాడు. మానస దేవత ఈ పూజను అంగీకరించి, చాంద్ సడగర్ సంపదతో పాటు లఖిందర్‌ని తిరిగి బ్రతికిస్తుంది.
మానస పాత్ర పోషిస్తున్న నిత్యానంద, 53 ఏళ్ల రైతు మాత్రమేగాక ఒక అనుభవజ్ఞుడైన పాల గాన్ కళాకారుడు. ఈయన 25 సంవత్సరాలుగా ఈ కళారూపాన్ని అభ్యసిస్తున్నారు. అతను వివిధ పాల గాన్ల కోసం ఒకటి కంటే ఎక్కువ బృందాలతో కలిసి పని చేస్తారు. "2019 నుండి పరిస్థితి మరింత దిగజారుతోంది," అని ఆయన చెప్పారు. "ఈ సంవత్సరం కూడా, మహారోగం కారణంగా, మేము తక్కువ ప్రదర్శనలు చేశాము, బహుశా అతి తక్కువ ప్రదర్శనలు అనొచ్చేమో. మామూలుగా అయితే మాకు నెలకు 4 లేదా 5 ప్రదర్శనలు చేయగలిగవాళ్ళము, కానీ ఈ సంవత్సరం మాకు రెండు మాత్రమే లభించాయి. తక్కువ ప్రదర్శనలు అంటే తక్కువ ఆదాయం. ఇంతకుముందు, మేము ఒకొక్కరం 800-900 రూపాయిలు సంపాదించేవారిమి. ఇప్పుడు 400-500 కన్నా ఎక్కువ రావడం లేదు.”
నిత్యానంద పక్కన కూర్చున్న బృంద సభ్యుడు బనమాలి బ్యపారీ, గ్రీన్ రూమ్‌లు, సరైన వేదిక, సమర్థవంతమైన శబ్దం, సరైన లైట్ వ్యవస్థ, మరుగుదొడ్ల వంటి సదుపాయాలు లేకుండా గ్రామీణ నాటకం ఎంత కష్టం గా ఉంటుందో - వివరించడానికి ప్రయత్నించారు. "ప్రదర్శనలు 4-5 గంటలు కొనసాగుతాయి. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. మేము నాటకం పట్ల ఇష్టంతో ప్రదర్శిస్తాము, ఆర్థిక లాభం కోసం కాదు,” అని ఆయన చెప్పారు. నాటకంలో అతనికి రెండు పాత్రలు ఉన్నాయి: లఖీందర్‌ని చంపిన కల్నాగిని పాము, భర్ అనే హాస్య పాత్ర. ఇది తీవ్ర భావోద్వేగంతో నిండిన నాటకంలో కావలసిన వినోదాన్ని పంచి కాస్తా సాంత్వనని ఇస్తుంది.
సంగీతకారులు ప్రదర్శన ప్రారంభాన్ని సూచిస్తూ వారి వాయిద్యాలను వాయిస్తారు. నిత్యానంద అందంగా అలంకరించుకున్న అతని పురుషుల బృందం, నేరుగా వేదికపైకి వెళ్తారు. మానస దేవత, గ్రామ పెద్దల దీవెనలు కోరే ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. దైవిక నాటకం నుండి తమకు తెలిసిన వ్యక్తులు సుపరిచితమైన, విస్మయపరిచే పాత్రలను ప్రదర్శించడాన్ని ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూస్తున్నారు. నటీనటులు ఎవరూ ఇక్కడ నిపుణులు కాదు - వారందరూ రైతులు, వ్యవసాయ కూలీలు లేదా కాలానుగుణంగా వలస వచ్చిన కూలీలు.
నిత్యానంద ఆరుగురున్న తన కుటుంబాన్ని పోషించాలి. "ఈ సంవత్సరం, యాస్ తుఫాను కారణంగా వ్యవసాయంలో నా ఆదాయం సున్నాకి పడిపోయింది," అని ఆయన చెప్పారు. "నా భూమి ఉప్పునీటితో నిండిపోయింది. ఇప్పుడు విపరీతంగా వర్షం పడుతోంది. నాతో పాటున్నవారు , రైతులు, లేదా ఇతర ఉద్యోగాలలో పని చేసేవారు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నేను ప్రభుత్వం నుండి ప్రతి నెలా 1,000 రూపాయలు అందుకుంటాను, అది కాస్త నయం. [లోక్‌ప్రసర్ ప్రకల్ప, రాష్ట్ర పథకం కింద జానపద కళాకారులు, యువకులు, వృద్ధులు, రిటైనర్ ఫీజు లేదా నెలవారీ పెన్షన్ అందుకుంటారు].
నిత్యానంద సొంత కుమారుడు, అతని వయసులోనే ఉన్న యువ తరం కుర్రాళ్లు పాల గానం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. లాహిరిపూర్ పంచాయతీ గ్రామాల నుండి చాలా మంది ఇతర రాష్ట్రాలకు భవన నిర్మాణ కార్మికులు లేదా వ్యవసాయ కూలీలుగా ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్తున్నారు. "సంస్కృతి మారుతోంది. 3-5 సంవత్సరాల తరువాత, ఈ కళారూపం అంతరించిపోవచ్చు, ”అని నిత్యానంద చెప్పారు.
"ప్రేక్షకుల ప్రాధాన్యతలు కూడా మారాయి. మొబైల్ ఎంటర్‌టైన్‌మెంట్ సాంప్రదాయ ప్రదర్శనలను వెనక్కి తోస్తోంది,” అని 40ల మధ్య వయసులో ఉన్న మరొక ప్రదర్శనకారుడు బిశ్వజిత్ మండల్ అన్నాడు.
ప్రదర్శనను చూడటానికి మరియు కళాకారులతో మాట్లాడటానికి చాలా గంటలు గడిపిన తరువాత, నేను వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. నేను బయలుదేరడానికి సిద్ధమవుతున్నప్పుడు, నిత్యానంద నన్ను మళ్ళీ రమ్మని పిలిచారు: “దయచేసి శీతాకాలంలో తిరిగి రండి. మేము మా బోన్ బీబీ పాల గాన్ ప్రదర్శిస్తాము. మీరు దానిని కూడా డాక్యుమెంట్ చేయాలనుకోవచ్చు. భవిష్యత్తులో ప్రజలు ఈ కళ గురించి చరిత్ర పుస్తకాల్లో మాత్రమే చదువుతారని నా భయం. "
అనువాదం: అపర్ణ తోట