"నేను... నేను..." నేనడిగిన ప్రశ్నకు అందరికన్నా ముందే జవాబు చెప్పాలని అమన్ మహమ్మద్ ఆత్రపడిపోతున్నాడు. పన్నెండుమందికి పైగా ఉన్న ఆ పిల్లల బృందాన్ని, ఈ ఏడాది వినాయక చవితికి మీ పండాల్ ప్రధాన నిర్వాహకుడెవరని నేనడిగాను. "అమన్ ఒక్కడే సొంతంగా రెండువేల రూపాయల చందా వసూలు చేశాడు," అందర్లోకీ పెద్దపిల్ల టి. రాగిణి చెప్పింది. అందువలన బృందంలోని మరెవరూ అమన్ హక్కుగా చెప్పుకున్నదానికి అడ్డురాలేదు.
అవును. ఈ పండాల్ నిర్వాహకుల బృందం వసూలు చేసిన మొత్తం మూడువేల రూపాయలలో మూడింట రెండువంతులు అమన్ సేకరించిందే. ఆంధ్రప్రదేశ్ రాష్టం, అనంతపూర్ పట్టణంలో తాముండే సాయినగర్ వీధిలోకి వచ్చేపోయే వాహనాల నుంచి ఈ పిల్లల బృందం విరాళాలు సేకరించింది.
వినాయక చవితి తనకెంతో ఇష్టమైన పండుగని అమన్ అన్నపుడు నాకేం ఆశ్చర్యమనిపించలేదు.
2018లో సాయినగర్‌లో వినాయక చవితి వచ్చివెళ్ళిన కొన్ని వారాల తర్వాత ఓ ఆదివారంపూట నలుగురు పిల్లలు తామే కల్పించుకొన్న ఒక ఆటను ఆడుతూ కనిపించారు. దాన్ని నేను ఫోటోలు తీశాను. వాళ్ళంతా పిల్లలకెంతో ఇష్టమైన ' అవ్వ అప్పచ్చి ’ అన్న ఆటను తగుమాత్రంగా మార్చి ఆడుతున్నారు. ఆ పిల్లాడు గణేశుడన్నమాట - హిందూ దేవుడైన గణేశుడి పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. మరో ఇద్దరు పిల్లలు వాడ్ని ఊరేగింపుగా తిప్పి, చివరికి నేలను దించుతున్నారు - అంటే గణేశ్ నిమజ్జనమన్నమాట, దేవుని విగ్రహాన్ని నీళ్ళలో వదిలేయటం - అదే వాళ్ళు ఆడే ఆట.
అప్పుడలా ఊరేగిన ఆ బాలగణేశుడే అమన్ మొహమ్మద్. పైన ఉన్న కవర్ ఫోటోలో ముందు వరుసలో (ఎడమవైపు చివర) ఉన్న బాలుడే ప్రస్తుతం పదకొండేళ్ళ వయసున్న అమన్.
ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వినాయక చవితి సంబరాల కోసం అమన్, అతని మిత్ర బృందం ఒక 2x2 అడుగుల విస్తీర్ణం కలిగిన పండాల్ లో దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బహుశా మొత్తం అనంతపూర్ అంతటికీ అదే అతి చిన్న పండాల్ అయి ఉండాలి. నేను ఫోటో తీసేలోగానే ఆ పండాల్ అదృశ్యమయిపోయింది. వెయ్యి రూపాయలకు విగ్రహాన్ని కొన్నామనీ, మిగిలిన రెండు వేల రూపాయలతో పండాల్ కట్టి, దాన్ని అలంకరించామనీ ఆ పిల్లలు నాతో చెప్పారు. వీళ్ళ పండాల్ సాయినగర్ థర్ద్ క్రాస్‌లో ఉన్న దర్గా పక్కనే ఉంది.
చిన్నా చితకా పనులు చేసుకొని బతికే ఆ పేదలవాడకు చెందిన పిల్లలు వారికి గుర్తున్నప్పటినించీ ఈ వినాయక చవితి పండుగను జరుపుకుంటూనే ఉన్నారు. వాళ్ళ అమ్మానాన్నలంతా ఇళ్ళల్లో పాచిపనులూ, రోజువారీ కూలీ పనులూ, పట్నంలో ఇతర చెమటోడ్చి చేసే పనులూ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఈ పిల్లలు చేసుకునే వినాయక చవితి ఉత్సవాలకు విరాళం ఇస్తూ ఉంటారు. పండగ పండాల్ నిర్వహించే బృందంలో అందరికన్నా పెద్ద పిల్ల వయసు పద్నాలుగు, అందరికన్నా చిన్నవాడి వయసు ఐదేళ్ళు.
"మేం వినాయక చవితినీ, పీర్ల పం డుగనూ (రాయలసీమ ప్రాంతంలో మొహర్రం) కూడా జరుపుకొంటాం" పద్నాలుగేళ్ళ రాగిణి చెప్పింది. పిల్లల దృష్టిలో పీర్ల పండగా వినాయక చవితీ రెండూ సమానమే. రెండు పండగలకీ కేంద్ర బిందువు వాళ్ళు రూపకల్పన చేసే పండాలే . అందుకు చందాలు వసూలు చెయ్యడానికి వాళ్ళకు పెద్దవాళ్ళ నుంచి అనుమతి ఉంటుంది. ప్రతి ఏడాదీ వసూలు చేసిన విరాళాలతో వాళ్ళు పండాల్ కడతారు. "ఇళ్ళెలా కట్టాలో తెలుసుకునేందుకు మేం యూట్యూబ్ చూశాం," చెప్పింది పదకొండేళ్ళ ఎస్. సనా. "నేను మట్టి తీసుకొస్తాను. పురికొస, కర్రలు ఉపయోగించి పండాల్ కడతాం. పైన కప్పుగా ప్లాస్టిక్ షీటు వేస్తాం. ఆ తర్వాత మా వినాయకుడిని (విగ్రహం) అందులో కూర్చోబెడతాం." చెప్పింది సనా.
ఆ పిల్లల బృందంలో పెద్దవాళ్ళు రాగిణి, ఇమ్రాన్ (ఇతనికీ పద్నాలుగేళ్ళే) పండాల్ నిర్వహణ, సంరక్షణల బాధ్యతను వంతులవారీగా తీసుకున్నారు. "నేనూ చూసుకున్నాను,' అంటూ ముందుకొచ్చాడు ఏడేళ్ళ ఎస్. చాంద్ బాషా. "నేను బడికి రోజూ వెళ్ళను. ఒకోసారి వెళ్తాను ఒకోసారి వెళ్ళను. అంచేత నేనూ దాని (వినాయకుడి విగ్రహం) బాగోగులు చూశాను," వివరించాడా పిల్లాడు. పిల్లలు పండాల్ లో పూజలు చేస్తారు, పండాల్ కు వచ్చేవాళ్ళకు ప్రసాదం పంచుతారు. ఈ పిల్లల్లో ఒకరి తల్లి ఎప్పుడూ ప్రసాదం - పుల్లగా ఉండే చింతపండుతో చేసిన పులిహోర - తయారుచేసి ఇస్తుంటారు.
వినాయక చవితి అనంతపూర్‌లోని పేదవాళ్ళ వాడల్లో బాగా ఇష్టంగా జరుపుకొనే పండుగ కనుక, అసలు పండుగ అయిన తర్వాత కొన్ని వారాలవరకూ కూడా ఈ సంబరాలు కొనసాగుతుంటాయి. పిల్లలు బంకమట్టితో వినాయకుని విగ్రహం చేసి, చెక్కముక్కలూ వెదురుపుల్లలూ, ఇంట్లోంచి తెచ్చిన దుప్పట్లు, ఇంకా వాళ్ళకు దొరికిన పనికిరానివని వదిలేసిన వస్తువులన్నిటితో చిన్న చిన్న పండాల్లు కడతారు. పండుగ వెళ్ళాక వచ్చే సెలవల్లో కూడా తమకెంతో ప్రియమైన వినాయక చవితి పండుగ ఆటను మళ్ళీ మళ్ళీ ఆడుకుంటూ ఉంటారు.
పట్టణంలోని పేదలవాడల్లో ఇలాంటి స్వీయ కల్పనల ఆటలు చాలా ప్రసిద్ధి. ఈ పిల్లల ఈ ఊహాశక్తి వారికి వనరుల కొరతను అధిగమించడంలో సహాయపడుతుంది. ఓ పిల్లాడు చేతిలో కర్రముక్క పట్టుకొని ఏదైనా వాహనం వచ్చినప్పుడల్లా ఆ కర్రముక్కను పైకెత్తుతూ 'రైలు గేటు' ఆట ఆడటాన్ని ఓసారి నేను గమనించాను. వినాయక చవితి తర్వాతి రోజుల్లో ఈ ఏనుగు తల దేవుడు గణేశుడు కూడా ఈ పిల్లల ఆటల్లోకి అలా వచ్చి చేరిపోతుంటాడు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి