మరోసారి ఈరోజు పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI) ప్రపంచ అనువాద దినోత్సవం జరుపుకుంటోంది. అదే సందర్భంలో ఎక్కడెక్కడి జర్నలిజం వెబ్సైట్లతో పోల్చినా అగ్రస్థానాన నిలిచే తన అనువాదకుల బృందాన్ని సత్కరించుకుంటోంది. నాకు తెలిసినంతవరకూ - ఈ విషయంలో నన్ను ఎవరైనా సవరిస్తే అది నాకు సంతోషమే - ప్రపంచంలోని జర్నలిజం వెబ్సైట్లలోకెల్లా PARI భాషా వైవిధ్య పరంగా మొదటిస్థానంలో నిలుస్తుంది. మాతో పనిచేసే 170 మంది అద్భుతమైన అనువాదకుల కృషి వల్ల PARI 14 భాషల్లో తన ప్రచురణను సాగిస్తోంది. నిజమే, కొన్ని మీడియా సంస్థలు 40 భాషల్లో ప్రచురిస్తున్న మాట నిజమే. కానీ ఆ సంస్థల విషయంలో భాషలపరంగా బలమైన నిచ్చెనమెట్ల వ్యవస్థ ఉంది. కొన్ని భాషలు మిగిలిన భాషలకన్నా బాగా తక్కువ సమానంగా ఉంటాయి.
‘ప్రతి భారతీయభాష, మన భాష' అన్న భావనతో మేం ప్రచురణలు కొనసాగిస్తున్నాం. అన్ని భాషలూ సమానమే అన్నది ఇందులో ఇమిడి ఉన్న విలువ. ఒక భాషలో ఒక కథనం వచ్చిందంటే దాన్ని మిగిలిన 13 భాషల్లోనూ ప్రచురించాలన్నది మా ధ్యేయం. ఈ మధ్యే ఛత్తీస్‌గఢీ మా భాషా కుటుంబంలో చేరింది. భోజ్‌పురి చేరబోతోంది. ఇంకా ఎన్నో భాషలు వరుసతీరి ఉన్నాయి.
భారతీయ భాషలను నిలబెట్టడమన్నది సమాజానికి ఎంతో అవసరం అని మేం నమ్ముతాం. ఈ దేశం భాషాపరంగా ఎంత వైవిధ్యం కలదీ అంటే- మనం వినే మాట, 'ప్రతి మూడునాలుగు కిలోమీటర్లకూ ఇక్కడి నీటి రుచి విభిన్నంగా ఉంటుంది ' అనే మాటకు దీటుగా ఈ దేశంలో ప్రతి పది పదిహేను కిలోమీటర్లకూ సరికొత్త భాష వినపడుతుంది.
మన ఈ భాషా వైవిధ్యాన్ని చూసుకొని సంబరపడుతూ ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు. పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ఈ దేశంలోని దాదాపు 800 భాషల్లో 225 భాషలు గత ఏభై ఏళ్ళలో అంతరించిపోయాయి అని చెపుతున్నపుడు; మనమంతా లేచి నిలబడాల్సి వస్తోంది. యునైటెడ్ నేషన్స్‌వారు ఈ శతాబ్దాంతానికి ప్రపంచంలోని 90-95 శాతం మౌఖిక భాషలు అంతరించిపోబోతున్నాయి అని చెపుతున్నపుడు నిలబడి నడుము బిగించాల్సి వస్తోంది. ప్రపంచంలోని ఏదో ఒక దేశవాళీ భాష ప్రతి పదిహేను రోజులకూ తన మనుగడ చాలిస్తోంది అని తెలిసినపుడు నడుం బిగించి కార్యాచరణకు సిద్ధపడాలి.


